Suryaa.co.in

Editorial

ఐప్యాక్‌పై వైసీపీ నేతల తిరుగుబాటు?

– ఐప్యాక్ బృందాలు అమ్ముడుపోతున్నాయా?
– నేతలకు కావలసినట్లు నివేదికలిస్తున్నారా?
– నియోజకవర్గ ఇన్చార్జిలు వారికి సకల సౌకర్యాలు కల్పిస్తున్నారా?
– ఆ నివేదికలను వైసీపీ నేతలు నమ్మడం లేదా?
– వారిని సంతృప్తి పరిస్తే అనుకూల నివేదికలు ఇచ్చేస్తున్నారా?
– కొండపిలో ఐప్యాక్ టీంపై వైసీపీ నేతల తిరుగుబాటు
– పరిశీలకుల ఎదుటే ఐప్యాక్ బృందాలపై ఆరోపణలు
– అశోక్‌బాబుకు ఐప్యాక్ అమ్ముడుపోయిందని బహిరంగ ధ్వజం
– నేతల ఇళ్లకు వెళ్లి నివేదికలిస్తున్నారని ఆరోపణ
– మండల రిపోర్టర్లు ఇచ్చే సమాచారం ప్రకారం నివేదికలు ఇస్తున్నారని ధ్వజం
– ఐప్యాక్ ప్రతినిధుల కదలికలపై అసమ్మతి నేతల నిఘా
– రాష్ట్రమంతా ఇదే పరిస్థితి అంటున్న వైసీపీ అసమ్మతి నేతలు
( మార్తి సుబ్రహ్మణ్యం)

వైఎస్సార్‌సీపీకి కళ్లు చెవులయిన ఐ ప్యాక్.. ఇప్పుడు అదే పార్టీ శ్రేణులు-నేతలకు విలన్‌గా మారింది. ఐ ప్యాక్ నివేదికలపై ఆధారపడి నిర్ణయాలు తీసుకుంటున్న వైసీపీ తీరుపై, నేతలు అసంతృప్తితో రగలిపోతున్నారు. స్థానిక ఇన్చార్జి-ఎమ్మెల్యేలకు అమ్ముడుపోతున్న ఐ ప్యాక్ బృందం ఇచ్చే నివేదికలను.. ఏవిధంగా ప్రాతిపదికగా తీసుకుంటారని, నియోజకవర్గాల్లో వైసీపీ అసమ్మతి నేతలు పరిశీలకులపైనే అగ్గిరాముళ్లలవుతున్నారు.

ప్రకాశం జిల్లా కొండేపి నియోజకవర్గంలో అసమ్మతినేతలు.. ఐ ప్యాక్ ప్రతినిధుల ఏకపక్ష తీరుపై బహిరంగంగానే విరుచుకుపడ్డారు. వారంతా ఇన్చార్జి అశోక్‌బాబుకు అమ్ముడుపోయారని ఆరోపణలు గుప్పించిన వైనం. మిగిలిన నియోజకవర్గాల్లోనూ ఐ ప్యాక్ బృందాల పనితీరుపై మండిపడుతున్న పరిస్థితి. డాక్టర్ మాదాసి వెంకయ్య-ఇన్చార్జి అశోక్ వర్గాల మధ్య అధిపత్య పోరాటం కాస్తా, దాడుల వైపు మళ్లడం ఆ పార్టీ నాయకత్వానికి శిరోభారంగా పరిణమించింది.

వచ్చే ఎన్నికల్లో దాదాపు 70 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలను మారుస్తారన్న ప్రచారం, వైసీపీ వర్గాల్లో చాలాకాలం నుంచి జరుగుతోంది. అదేవిధంగా ఇన్చార్జిలలో కొంతమందికి టికెట్లు ఇస్తారన్న చర్చ కూడా జరుగుతోంది. ఆ క్రమంలో వైసీపీ ఆస్ధాన సర్వే కంపెనీ, ఐప్యాక్‌తో అభ్యర్ధులపై సర్వే చేయిస్తోంది. ఆ బృందం ఇచ్చే నివేదికల ఆధారంగానే టికెట్లు ఇస్తారన్నది, వైసీపీలో బలమైన భావన. ఇప్పుడు అదే ఆ పార్టీ కొంప ముంచబోతోంది.

ఐ ప్యాక్ బృందాలను ఎమ్మెల్యేలు, ఇన్చార్జిలు మహరాజపోషకుల్లా మేపుతున్నారన్న వ్యాఖ్యలు, వైసీపీలోని ద్వితీయ శ్రేణి నేతల్లో బాహాటంగానే వినిపిస్తున్నాయి. టికెట్లు ఆశిస్తున్న ఎమ్మెల్యేలు- ఇన్చార్జిలు.. ఐప్యాక్ బృందాన్ని మేనేజ్ చేసి, నాయకత్వానికి తప్పుడు నివేదికలు పంపిస్తున్నారన్నది, వారిని వ్యతిరేకించే నేతల ఫిర్యాదు.

ఐ ప్యాక్ బృందానికి నియోజకవర్గాల్లో హోటళ్లు, కార్లు, ఇతర విలాసాలు వారు సమకూరుస్తున్నారన్నది, అసమ్మతి నేతల మరో ఆరోపణ. మెజారిటీ ఐ ప్యాక్ ప్రతినిధులు క్షేత్రస్థాయి సర్వే నిర్వహించకుండా, మండల స్థాయి విలేకరులతో వివరాలు సేకరిస్తున్నారని వైసీపీ నేతలు చెబుతున్నారు.

తొలి, గత ఎన్నికల్లో అయితే పీకే బృందం హవాకు ఎదురులేదని గుర్తు చేస్తున్నారు. ఏయే స్థాయి నాయకులను సమావేశాలకు ఆహ్వానించాలి? ఎవరిని పిలవాలన్న అంశాలను కూడా, వారే ఖరారు చేసేవారని చెబుతున్నారు. ఎమ్మెల్యే టికెట్ల కోసం నియోజకవర్గ స్థాయి నేతలు, పీకే బృందాన్ని ‘అన్ని విధాలా’ ప్రసన్నం చేసుకున్న విషయాలను గుర్తు చేసుకుంటున్నారు.

తాజాగా ప్రకాశం జిల్లా కొండేపి నియోజకవర్గంలో.. ఇన్చార్జి అశోక్‌బాబుకు వ్యతిరేకంగా, నియోజకవర్గంలోని నేతలంతా ఒక్కతాటిపైకి వచ్చిన వైనం సంచలనం సృష్టించింది. అశోక్‌ను వ్యతిరేకిస్తున్న కమ్మ కార్పొరేషన్ డైరక్టర్‌పై ఆయన అనుచరుల దాడి, సీనియర్ నేత డాక్టర్ అశోక్‌కుమార్‌రెడ్డిపై ఇన్చార్జి అశోక్ మద్దతుదారుల దాడితో వైసీపీ రెండు వర్గాలుగా చీలిపోయింది. నియోకవర్గంలోని మెజారిటీ నేతలు ఇన్చార్జి అశోక్‌ను తొలగించాలని డిమాండ్ చేస్తున్న పరిస్థితి.

దానితో వారిని సమావేశానికి పిలిచి, సమస్య పరిష్కరించేందుకు ఎంపి బీద మస్తాన్‌రావు, ఎమ్మెల్యే భూమన చేసిన రాజీ ప్రయత్నాలు బెడిసికొట్టడం చర్చనీయాంశమయింది. తాజాగా నిర్వహించిన ఈ సమావేశంలో గళం విప్పిన వైసీపీ మండల, నియోజకవర్గ స్థాయి నేతలు.. ఐప్యాక్ ప్రతినిధులపై తీవ్రమైన ఆరోపణలు చేయడంతో, పరిశీలకులు ఖంగుతినాల్సి వచ్చింది.

ఇన్చార్జి అశోక్‌బాబుకు ఐ ప్యాక్ బృందం అమ్ముడుపోయిందని.. నేతలు మూకుమ్మడిగా ఆరోపించడంతో, పరిశీలకులు నోరెళ్లబెట్టాల్సి వచ్చింది. జగన్ చెప్పినా సరే తామంతా అశోక్‌బాబును సమర్థించే ప్రశ్నే లేదని, వారంతా ఖరాఖండిగా చెప్పడం విశేషం. ‘వాస్తవాలు తెలుసుకోకుండా డబ్బులకు అమ్ముడుపోయిన.. ఐ ప్యాక్ ప్రతినిధులు ఇచ్చే రిపోర్టులకు ప్రాధాన్యం ఇస్తే , సహించే ప్రసక్తి లేదని’ వైసీపీ నేతలు మొహం మీదనే చెప్పడంతో, పరిశీలకులు అవాక్కవాల్సిన పరిస్థితి ఏర్పడింది.

నిజానికి రాష్ట్ర వ్యాప్తంగా ఐ ప్యాక్ ప్రతినిధి బృందాలపై, దాదాపు ఇలాంటి వ్యతిరేక భావన ఉందని వైసీపీ నేతలు చెబుతున్నారు. వారు ఖరీదైన హోటళ్లు, కార్లలో తిరగడం, విలాసవంతంగా గడపడమే వైసీపీ అసమ్మతి నేతల అనుమానానికి కారణంగా కనిపిస్తోంది. దానితో ఐ ప్యాక్ ప్రతినిధుల వెంట అసమ్మతి నేతలు షాడో టీములు ఏర్పాటుచేసి, వారి కదలికలను గమనిస్తున్న విచిత్ర పరిస్థితి ఏర్పడింది.

ఐప్యాక్ ప్రతినిధులు ఏ నేత ఇళ్లకు వెళుతున్నారు? అక్కడ ఎంత సేపు గడుపుతున్నారు? గ్రామాల్లో ఎంతసేపు కేటాయిస్తున్నారు? అక్కడ ఎవరి ఇంట్లో ఉంటున్నారు అనే విషయాలపై, అసమ్మతి నేతలు కూపీ లాగుతున్న వైచిత్రి కనిపిస్తోంది. మొత్తంగా ఐ ప్యాక్ బృందాలు ఇచ్చే నివేదికలను, వైసీపీ వర్గాలు విశ్వసించే పరిస్థితి లేకుండా పోయిందన్నది ఆ పార్టీ సీనియర్ల ఉవాచ.

LEAVE A RESPONSE