Suryaa.co.in

Editorial

విదేశాల్లోనూ తగ్గని ‘రాజ’సం

– పరాయి దేశాల్లోనూ అదే ఇమేజ్
– ఫారిన్ వెళ్లినా అదే ఫాలోయింగ్
– రఘురామరాజుకు విదేశాల్లో ప్రవాసాంధ్రుల రెడ్‌కార్పెట్
– రాజు కోసమే తెలుగువారు నిర్వహిస్తున్న గెట్ టు గెదర్లు
-పరిచయం లేకపోయినా తమ ఇళ్లకు ఆహ్వానిస్తున్న తెలుగు ప్రముఖులు
– అన్ని కార్యక్రమాల్లోనూ ఆయనదే మెరుపు
– తెలుగు రాజకీయాలపై ప్రవాసాంధ్రులతో ఆరా
– ప్రవాసాంధ్రులతో రాజు ‘మినీ రచ్చబండ’
– అమెరికా పర్యటనలో రఘురామరాజు హల్‌చల్
( మార్తి సుబ్రహ్మణ్యం)

రాజు ఎక్కడున్నా రాజే. ఎక్కడకు వెళ్లినా అదే ‘రాజ’సం. సొంత గడ్డమీదే కాదు. పరాయి గడ్డమీదా అదే అభిమానం, ఆదరణ. చుట్టూ మూగే అభిమానులు. ఫొటోలు, సెల్ఫీలు! ఆయనతో పెద్దగా పరిచయం లేకపోయినా, టీవీల్లో చూసిన వారు పిలిచే బ్రేక్‌ఫాస్ట్, లంచ్, డిన్నర్ ఆహ్వానాలు. పాలకుల బెదిరింపుల పుణ్యాన సొంత నియోజకవర్గానికి దూరమైనప్పటికీ.. రాజధాని హస్తినలో బైఠాయించి, రచ్చబండతో రగడ సృష్టిస్తున్న నర్సాపురం వైసీపీ రెబెల్ ఎంపి రఘురామకృష్ణంరాజుకు, పరాయి గడ్డపై అందుతున్న గౌరవమిది!

కనుమూరి రఘురామకృష్ణంరాజు. ఇప్పుడు తెలుగువారికి పరిచయం అవసరం లేని పేరిది. ఏ చానెల్ తిప్పినా, ఏ పత్రిక తిరగేసినా, సోషల్‌మీడియాలో ఏ గ్రూపును మీటినా కనిపించి-వినిపించే పేరు అది. నర్సాపురం ఎంపి అయినప్పటికీ అక్కడకు వెళ్లలేని విషాదం. కారణం పాలకుల అక్రమ కేసులు, బెదిరింపులు, ఆంక్షలు. అయినా నిరుత్సాహపడని రాజు, ఢిల్లీలోనే ప్రతిరోజూ ‘రచ్చబండ’ నిర్వహించి వైసీపీ సర్కారుకు చాకిరేవు పెడుతున్నారు.

జగనన్న సర్కారు తీసుకునే నిర్ణయాల వెనుక చీకటి కోణాన్ని అన్వేషించి, దానిని నిరంతరం కేంద్రానికి ఫిర్యాదు చేసే పనిలో ఉన్నారు. డజన్ల కొద్దీ లేఖలు రాస్తున్నారు. మరోవైపు ఢిల్లీ నుంచే న్యాయపోరాటం. రాష్ట్రపతి, ప్రధాని, కేంద్రమంత్రులను ఎప్పుడ ంటే అప్పుడు సులభంగా కలుస్తున్నారు. ఒక్కముక్కలో చెప్పాలంటే.. జగనన్న సర్కారుకు, పంటిలో రాయి-కంట్లో నలుసులా మారారు. నిజంగా రాజు పార్టీలోనే ఉండి ఉంటే, ఇంత స్వేచ్ఛ అనుభవించేవారు కాదేమోనన్నది ఆయన అభిమానుల అభిప్రాయం.

రఘురామకృష్ణంరాజుది ఒంటరి పోరాటమే అయినప్పటికీ, సోషల్‌మీడియా ద్వారా సంపాదించుకున్న అభిమానులు, మాత్రం లక్షల్లోనే ఉండటం విశేషం. సోషల్‌మీడియాను ఆయన.. ఆయనను సోషల్‌మీడియా వాడుకున్నంతగా మరెవరూ, ఇంకెవరినీ వాడుకుని ఉండరు. మామలుగానే మాటకారి. నోటినిండా వ్యంగ్యం. పదినిమిషాలకో పంచ్ డైలాగులు.

సోషల్‌మీడియాకు కావల్సింది ఇవే కదా?! ప్రధాన చానెల్స్‌కు అనుబంధంగా ఉండే యూట్యూబ్‌లో.. రాజుకు వచ్చే లైక్స్, షేర్, కామెంట్లు ఏ తెలుగు నాయకుడికీ రావు. అవి లక్షల సంఖ్యలోనే ఉంటాయి మరి. అంటే రఘురామరాజుకు ఫాలోయింగ్, ఫ్యాన్స్ ఏ స్థాయిలో ఉన్నారన్నది ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు.

ఇప్పుడు ఆ ఇమేజే రఘురామరాజు విదేశీ పర్యటనలో, గ్లామర్ తెచ్చిపెట్టింది. ప్రస్తుతం రఘురామరాజు అమెరికా పర్యటనలో ఉన్నారు. అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో పర్యటిస్తున్నారు. ఆయనతో పాటు టీడీపీ ఎంపీ, ప్రముఖ న్యాయవాది కనకమేడల రవీంద్ర కుమార్ కూడా ఉన్నారు. ప్రవాసాంధ్రులు నిర్వహించే కార్యక్రమాలకు, తెలుగు సంఘాలు-గోదావరి జిల్లా ఎన్నారైలు రఘురామరాజును ఆహానిస్తున్నారు.

రాజు గారు వస్తున్నారన్న సోషల్‌మీడియా మెసేజ్‌లతో.. అక్కడి ప్రవాసాంధ్రులు, ఆ కార్యక్రమానికి కుటుంబసమేతంగా తరలివస్తున్నారు. ఇక అక్కడ ఉండే క్షత్రియుల సంగతి చెప్పనక్కర్లేదు. గోదావరి జిల్లా వాళ్ల ఆహ్వానాలు సరే సరి! తెలుగు ప్రముఖులు, వ్యాపారులు, ప్రొఫెషనల్స్.. రాజు కోసమే గెట్ టు గెదర్ నిర్వహిస్తుండటం విశేషం. మరికొందరు ప్రముఖులయితే.. ఆయనతో పరిచయం లేకపోయనా.. ఫోన్ చేసి తమ ఇళ్లకు భోజనాలకు ఆహ్వానిస్తుండటం మామూలు విషయం కాదు. అది అందరికీ అందే గౌరవం కాదు. కొందరికే దక్కే అరుదైన గౌరవం. అదే సోషపల్‌మీడియా మహత్యం. అమరికాలో ఉన్నా వారంతా రఘురామరాజు రచ్చబండ, సాయంత్రం చానెల్స్ నిర్వహించే డిబేట్లను క్రమం తప్పకుండా చూసి, ఆస్వాదించి-ఆయనను అభిమానించే ప్రేక్షకులు మరి. రాజును కలుస్తున్న వారంతా.. అదే మాట చెబితే, రాజు గారు పరమానందపడి, మహా సిగ్గుపడుతున్నారట.

ఇక తెలుగు వారు నిర్వహించే కార్యక్రమాలు, ప్రముఖులతో జరిగే గెట్ టు గెదర్‌లో పాల్గొనే ప్రవాసాంధ్రులతో.. రాజు అక్కడ కూడా మినీ ‘రచ్చబండ’ నిర్వహిస్తున్నారు. తెలుగు రాష్ట్ర రాజకీయాలపై వారి అభిప్రాయాలు.. ప్రధానంగా ఏపీలో జగన్ పాలనపై వారి మనోగతం.. గతంలో చంద్రబాబు-ఇప్పుడు జగన్ పాలన మధ్య తేడా.. ఆగిపోయిన అమరావతి నిర్మాణం.. నాసికరం మద్యం అమ్మకాలు.. పడిపోయిన రియల్ ఎస్టేట్ వ్యాపారం.. ఇలా అనేక అంశాలను వారి వద్ద ప్రస్తావిస్తున్న రాజు.. వారి పల్స్ కనిపెట్టే పనిలో ఉన్నారట.

పాలకుల వేధింపులతో, సొంత గడ్డకు దూరమైనప్పటికీ.. పరాయి గడ్డపై తెలుగువారు మాత్రం నండుమనుసుతో, రాజుకు రెడ్‌కార్పెట్ వేయడమే అబ్బురం. ఇప్పుడు అమెరికాలోని తెలుగువారు ఉండే సోషల్‌మీడియా వేదికలన్నింటిపైనా, రఘురాముడి ఫొటోలు, వీడియోలు దర్శనమిస్తుండటమే విశేషం!

LEAVE A RESPONSE