Suryaa.co.in

Editorial

వైసీపీకి ‘రెడ్డి’ సిగ్నల్?

– జగన్‌కు ఇక ‘రెడ్డి’ కార్పెట్ ఉండదా?
– జగన్‌కు దూరమవుతున్న రెడ్డి నేతలు
– ‘అనంత’లో వైసీపీపై అసంతృప్తితో రోడ్డెక్కిన రెడ్లు
– కడప జిల్లాకు చెందిన 13 మంది వైసీపీ సర్పంచులు పార్టీకి రాజీనామా
– వాలంటీర్ల రాకతో గ్రామాల్లో తగ్గిన గౌరవం
– వాలంటీర్ల హవాతో పోయిన రెడ్ల పెద్దరికం
– పెత్తనం పోవడంతో రగులుతున్న రెడ్డి వర్గం
– వాలంటీర్లు రాకముందు గ్రామాల్లో రెడ్డి నేతలదే హవా
– గ్రామాల్లో రెడ్డి నేతల ఇళ్లు జనంతో కళకళ
– వాలంటీర్ల రాకతో రెడ్డినేతల ఇళ్లు వెలవెల
– దశాబ్దాల గౌరవాన్ని జగన్ దూరం చేశారన్న ఆగ్రహం
– గౌరవం-పెత్తనం కోరుకునే రెడ్లపై జగన్ వాలంటీర్ల అవమాన అస్త్రం
– గ్రామాల్లో అందరితో సఖ్యతగా ఉండే రెడ్డినేతలు
– సొంత ఖర్చుతో సాయం చేయడమే రెడ్ల నైజం
– వైసీపీ సర్పంచుల్లో సగానికిపైగా రెడ్డివర్గమే
– పెండింగ్ బిల్లులు రాక సర్కారుపై రెడ్డి సర్పంచుల కన్నెర్ర
– సొంత ఖర్చుతో గ్రామాభివృద్ధి పనులు చేసిన రెడ్డి సర్పంచులు
– బిల్లులు రాక బికారులవుతున్న రెడ్డి సర్పంచులు
– పరువుకోసం తెలంగాణకు పారిపోతున్న దయనీయం
– కార్పొరేట్ రెడ్లకే పెద్దపీట వేస్తున్నారన్న ఆగ్రహం
– ఎమ్మెల్యే, మంత్రులకు చెప్పినా దిక్కులేదు
– అదే ఆగ్రహంతో వైసీపీకి సర్పంచుల సంక్షేమ సంఘం నేతల రాజీనామా
– వచ్చే ఎన్నికల్లో పార్టీకి పనిచేసేది లేదని తెగేసి చెబుతున్న రెడ్డి సర్పంచులు
– తాజాగా జగన్ త మకు చేసిందేమీలేదని రోడ్డెక్కిన అనంతపురం రెడ్లు
-చెన్నేకొత్తపల్లిలో బాబుకు మద్దతుగా రెడ్ల దీక్ష
– జగన్ పాలనలో రెడ్లే ఎక్కువగా నష్టపోయారన్న ఆవేదన
– పెద్ద రెడ్లకే పనులు జరుగుతున్నాయన్న ఆగ్రహం
( మార్తి సుబ్రహ్మణ్యం)

ఏపీలో అధికార వైసీపీకి ఇక ‘రెడ్డి’ సిగ్నల్ పడినట్లేనా? కులాభిమానంతో గత ఎన్నికల్లో, సొంత డబ్బు ఖర్చుపెట్టుకుని, జగనన్నను అందలమెక్కించిన రెడ్లు..మళ్లీ వైసీపీని పల్లకీ ఎక్కించేందుకు సిద్ధంగా లేరా? గత ఎన్నికల్లో తమది అత్యుత్సాహమేనని ఆలస్యంగా గ్రహించారా? గ్రామాల్లో తమ పరువు-పెత్తనాన్ని వాలంటీర్లతో సమాధి చేయించిన జగనన్నపై, రెడ్లు ఆగ్రహంతో ఉన్నారా? శతాబ్దాల నుంచి గ్రామాలపై కొనసాగుతున్న పట్టును, వాలంటీర్లతో పతనం చేయించిన జగనన్న పార్టీకి ఇక దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నారా? బిల్లులు రాక బికారులవుతున్న తమను పట్టించుకోని జగనన్న.. కార్పొరేట్ కంపెనీల రెడ్లకు వందలకోట్ల బిల్లులు చెల్లిస్తున్న తీరుపై భగ్గుమంటున్నారా? వైసీపీకి ‘రెడ్డి’ సిగ్నల్ వేయడానికి అసలు కారణం అదేనా?.. ఇటీవలి కాలంలో రెడ్డి సామాజికవర్గ కేంద్రంగా జరుగుతున్న ఘటనలు పరిశీలిస్తే ..వీటిని అవుననే సమాధానాలు వస్తున్నాయి.

‘‘ దశాబ్దాల నుంచి ఆస్తులు-ప్రాణాలు కోల్పోయినా, గ్రామాలపై పట్టు-పెత్తనం దక్కించుకున్న మమ్మల్ని కదిలించడం ఎన్టీఆర్-చంద్రబాబు వల్ల సాధ్యం కాదు. మా పరువును పక్కకు జరపడం కమ్మవారితో కాలేదు. కానీ వారితో కాని పని మా జగన్మోహన్‌రెడ్డితో అయింది. దశాబ్దాల నుంచి ప్రత్యర్ధులతో పోరాడి, ప్రతిష్ఠను కాపాడుకుంటున్న మాకు, ఇప్పుడు గ్రామాల్లో మాకు విలువ లేదు. వాలంటీర్లు వచ్చిన తర్వాత మా దగ్గరికి వచ్చేవారే లేరు. కమ్మవారితో కాని పని మా రెడ్లతో అయింది. అదే మా బాధ’’
– ఇదీ గ్రామాల్లో రెడ్డి వర్గానికి సంబంధించి సర్పంచుల ఆవేదన.

వైసీపీ- జగన్‌కు మానసికబలం.. రెడ్డి సామాజికవర్గమే అన్నది మనం మనుషులం అన్నంత నిజం. టీడీపీ హయాంలో గ్రామాలను కబళించిన జన్మభూమి కమిటీల ఆదాయం చూసిన వైసీపీ రెడ్డి నేతలు, ఆ స్ఫూర్తితో సొంత ఖర్చు పెట్టుకుని జగన్‌ కోసం పనిచేశారు. వైఎస్‌ అభిమానులు కూడా జగన్‌కోసం శ్రమదానం చేశారు. ఫలితంగా జగన్‌ 151 ఎమ్లెల్యేలతో అధికారపగ్గాలు అందుకున్నారు.

కానీ రెడ్డి వర్గం ఆశలు ఆవిరయేందుకు ఎక్కువ కాలం పట్టలేదు. తాము మోసపోయామని గ్రహించడతానికి ఎక్కువ సమయం పట్టలేదు. జన్మభూమి కమిటీల మాదిరిగా దోచుకోవచ్చని ఆశించిన, నేతల ఆశలకు జగన్‌ గండికొట్టారు. వాలంటీర్లు, గ్రామ సచివాలయ వ్యవస్థ రాకతో.. గ్రామాలపై పట్టున్న రెడ్ల పలుకుబడి పలచబడింది. దశాబ్దాల తరబడి గ్రామాలపై పట్టు కొనసాగిస్తూ, తమ మనుగడ కోసం సొంత డబ్బులు ఖర్చు చేసే లక్షణం ఉన్న రెడ్ల అహం.. వాలంటీర్లు, సచివాలయ వ్యవస్థ రాకతో దెబ్బతింది.

సహజంగా గ్రామాల్లో ప్రజలు, చిన్న పెద్ద పనుల కోసం రెడ్డి నేతల వద్దకు వెళతుంటారు. సదరు రెడ్డి నేతలు కూడా ఎమ్మెల్యే, ఎంపీలపై ఒత్తిడి తెచ్చి వారి సమస్యలు పరిష్కరించేవారు. గ్రామాల్లో, రెడ్లకు విరీతమైన పలుకుబడి-పట్టు ఉండటానికి అదే ప్రధాన కారణం. ఎన్టీఆర్‌-చంద్రబాబు హయాంలో సైతం గ్రామాల్లో, రెడ్లు తమ పలుకుబడి కొనసాగించారంటే.. గ్రామాలపై రె డ్డి నేతల ప్రభావం ఏ స్థాయిలో ఉందో స్పష్టమవుతోంది.

అయితే తాము అభిమానించి, ఆరాటపడి గెలిపించిన జగన్‌ హయాంలోనే.. తమ పరువుపోవడాన్ని, రెడ్డి నేతలు జీర్ణించుకోలేకపోతున్నారు. ఎన్నికల తర్వాత గ్రామాల్లో రెడ్డి సర్పంచులు- భూస్వాములు సొంత ఖర్చులతో, అభివృద్ధి పనులు చేశారు. మరో ఏడునెలల్లో ఎన్నికలు వస్తున్నా ఇప్పటిదాకా బిల్లులు మంజూరుకాకపోవడంతో, రెడ్డి నేతల ఆగ్రహం కట్టలు తెంచుకుంటోంది.

దీనితో నియోజకవర్గ ఎమ్మెల్యేలు-రెడ్ల సర్పంచులకు దూరం పెరిగింది. పార్టీ కార్యక్రమాల్లోనూ, వారి భాగస్వామ్యం కనిపించడం లేదు. బిల్లులు రాక ఒకవైపు.. అప్పులవారి బాధ మరోవైపు.. సొంత పార్టీ నాయకత్వం ఇంకోవైపు. ఇవిచాలదన్నట్లు.. తమ నెత్తిన వాలంటీర్ల వ్యవస్థ తీసుకురావటంతో, ఇక వైసీపీలో పనిచేసి ప్రయోజనం లేదన్న నిర్ణయానికి వచ్చేందుకు కారణమయింది.

గతంలో వారు విపక్షంలో ఉన్నప్పటికీ ప్రజలు రెడ్ల నేతలనే ఆశ్రయించేవారు. దానితో వారి ఇళ్లు కళకళలాడేవి. ఇప్పుడు వాలంటీర్లు రావడంతో, గ్రామాల్లోని రెడ్డి నేతల ఇళ్లు వెలవెల పోతున్నాయి. ఒకరకంగా దీనిని వారు అవమానంగా భావిస్తున్న పరిస్థితి. తాము దశాబ్దాల నుంచి వారసత్వంగా కొనసాగిస్తున్న పెత్తనానికి, తమ పార్టీనే సమాధి చేసిందని ఉడికిపోతున్న వైనం. దానితో నిగ్రహం కోల్పోయి మీడియా వద్ద, తమ దుస్థితి వెళ్లబోసుకుంటున్నారు. ఇది మిగిలిన రెడ్డి సర్పంచులలో తిరుగుబాటుకు కారణమవుతోంది.

‘ప్రభుత్వం దొంగల ప్రభుత్వంలా మారింది. దీనికి మోదీ అడ్డుకట్ట వేయాలి. పంచాయతీలకు కేంద్రం ఇస్తున్న నిధులను కూడా జగన్‌ లాక్కుంటుంటే ఇక అభివృద్ధి ఎక్కడ జరుగుతుంది’ అని శ్రీ సత్యసాయి జిల్లా గార్లపెంట మండలం కురుమామిడి సర్పంచ్‌ సుధాకర్‌, మీడియా సమక్షంలో చేసిన వ్యాఖ్య అప్పట్లో వైసీపీలో కలకలం రేపింది. సొంత డబ్బుతో బోర్లు-రోడ్లు వేయిస్తే, ఇప్పటిదాకా తనకు బిల్లులు రాలేదని ఆ వైసీపీ సర్పంచ్‌ వాపోయారు.

ఇక సీఎం జగన్‌ సొంత కడప జిల్లాలో అయితే పరిస్థితి మరీ దారుణం.తమ నిధులు పక్కదారి మళ్లించిన జగన్‌ సర్కారుపై ఆగ్రహంతో.. కడప జిల్లాకు చెందిన 13 మంది వైసీపీ సర్పంచులు పార్టీకి రాజీనామా చేయటం కలకలం సృష్టించింది. కడప జిల్లా సర్పంచుల సంఘం అధ్యక్షుడు శివచంద్రారెడ్డి, జాతీయ ప్రధాన కార్యదర్శి మునిరెడ్డి సహా 70 మంది సర్పంచులు, కలెక్టర్‌ను కలిసి వినతిపత్రం ఇవ్వడం చర్చనీయాంశమయింది. కేంద్రం ఇచ్చిన నిధులను వాడుకోవడం అన్యాయమన్నారు. గ్రామాల్లో బల్బులు, బ్లీచింగ్‌ పౌడర్‌కు నిధులు చెల్లించలేని దుస్థితి. మేమంతా ఉత్సవవిగ్రహాలుగా మిగిలిపోయాం. వాలంటీర్లు, సచివాలయ వ్యవస్థ వచ్చిన తర్వాత మమ్మల్ని పట్టించుకు దిక్కు లేద’ని వాపోయారు. ఇదంతా మీడియాలో రావడంతో, సొంత పార్టీలోనే సర్పంచుల తిరుగుబాటు మొదలయిందన్న సంకేతాలు వెళ్లేందుకు కారణమయ్యాయి.

ఇక విజయవాడలో వైసీపీ సర్పంచులు నిర్వహించిన సమావేశం పార్టీ నాయకత్వాన్ని ఆత్మరక్షణలో పడేసింది. అందులో మాట్లాడిన సర్పంచులు గ్రామాల్లో తమ దుస్థితిని బట్టబయలు చేశాయి. ‘వాలంటీర్లు-సచివాలయ వ్యవస్థతో మేం డమ్మీలయిపోయాం. అధికారంలో ఉన్నందున గట్టిగా మాట్లాడలేకపోతున్నాం. సరైన సమయంలో మా సత్తా చూపిస్తాం’అని వైసీపీ సర్పంచులు ప్రెస్‌మీట్‌లో స్పష్టం చేశారు.

ఇటీవల వైసీపీకి చెందిన సర్పంచుల సంక్షేమ సంఘం గంపగుత్తగా పార్టీకి రాజీనామా చేయడం వైసీపీ నాయకత్వానికి షాక్‌ నిచ్చింది. తమ బిల్లులే ఇప్పించని వారి వద్ద ఏం పనిచేయాలని, మీడియా సమక్షంలోనే ప్రశ్నాస్ర్తాలు సంధించారు. వాలంటీర్ల వ్యవస్థతో తమను మరగుజ్జును చేశారని ఆవేదన చెందారు. వచ్చే ఎన్నికల్లో వాలంటీర్లతోనే పనిచేయించుకోమని విస్పష్టంగా చెప్ప డం చూస్తే.. వైసీపీకి రానున్న ఎన్నికల్లో గ్రామాల్లో ‘రెడ్డిసిగ్నల్‌’ పడటం ఖాయంగా కనిపిస్తోంది.

కేంద్రం తమకు ఇచ్చిన నిధులు కూడా జగన్‌ సర్కారు లాక్కోవడం.. బిల్లులు చెల్లించకపోవడం.. వాలంటీర్ల రాకతో గ్రామాలపై పెత్తనం తగ్గిపోవడం.. పనుల కోసం చేసిన అప్పుల వడ్డీల భారం పెరగటం వంటి కారణాలు.. వైసీపీ సర్పంచులు పార్టీకి దూరమయేందుకు ప్రధాన కారణం.

అయితే వచ్చే ఎన్నికల్లో గతంలో మాదిరిగా తమ మీద భారం వేసుకునేది లేదని, తమ ఓటు తాము వేసుకుని ఇళ్లలో కూర్చుంటామని నిర్మొహమాటంగా చెబుతున్నారు. ‘ఎన్నికల్లో ఈసారి వాలంటీర్లతో పనిచేయించుకోమనండి. మేఃం ఎందుకు? కాకపోతే మేం పార్టీకే ఓటేస్తాం. గతంలో మాదిరిగా వైసీపీకి ఓట్లు వేయమని అడిగే సమస్యే లేదు’ అని వైసీపీ నేతలు తెగేసి చెబుతున్నారు.

విచిత్రంగా.. ఇలాంటి పరిస్థితి గత ఎన్నికల ముందు టీడీపీలో కనిపించింది. పార్టీ నేతలు పనిచేసిన దాదాపు 7 వేల కోట్ల రూపాయల బిల్లులు, టీడీపీ ప్రభుత్వం చెల్లించకుండా పెండింగ్‌లో పెట్టింది. ఫలితంగా గత ఎన్నికల్లో కమ్మ వర్గం ఎన్నికల్లో పార్టీకి సహకరించలేదు. గ్రామాల్లో కమ్మ నేతలు తమ ఓటు వేసుకుని, ఇళ్లలో కూర్చుకున్నారు. గతంలో మాదిరిగా ఓట్లు వేయించలేదు. ఫలితంగా టీడీపీ ఓడిపోయింది.

ఇప్పుడు అచ్చం అలాంటి అసంతృప్తి వాతావరణమే, వైసీపీలో కనిపిస్తోంది. అంటే… పార్టీల పేర్లే వేర్లు. మిగిలినదంతా సేమ్‌ టు సేమ్‌.

LEAVE A RESPONSE