Suryaa.co.in

Features

అ..అంటే అజ్ఞానం.. ఊ..అంటే ఊహాలోకం!

ఇమ్రాన్ ఖాన్ ఇండియాని పొగిడాడని..
ఇంకో దేశంలో
భగవద్గీత చదివారని..
మరో దేశంలో సైనికులు శ్రీకృష్ణుడిని కొలిచారని..
అదేదో దేశంలో చట్టసభలో
మన భక్తి గీతం ఆలపించారని..
ఓహ్ రొమ్ము విరుచుకుంటూ
ఉప్పొంగిపోవడం..
అందుకు సంబంధించిన వార్తలు..వీడియోలు.. క్లిప్పింగులు..రైటప్పులు
తెగ ఫార్వార్డ్ చేసెయ్యడం..
అందులో సగం చదవకుండానే..
చూడకుండానే..!?
ఇదేనా దేశభక్తి..అదేనా భారతీయ ఉన్నతి..
భరతజాతి పురోగతి..
నిజానికి మనం ఎలా ఉంటున్నాం..మన పిల్లల్ని ఎలా పెంచుతున్నాం.. వారికి ఏం నేర్పిస్తున్నాం..మనం ఉత్తమ పౌరులుగా మనగలుగుతూ
రేపటి పౌరులైన మన పిల్లల్ని
బాధ్యతాయుతమైన వారిగా
తీర్చి దిద్దేందుకు కనీస ప్రయత్నం చేస్తున్నామా..!?
వేసుకుంటూ పోతే ఇలాంటి ప్రశ్నలు ఓ లక్ష..??
ఇప్పుడు అరవై..డెబ్బై ఏళ్ల వయసులో ఉన్న చాలా మందికే మన సంస్కృతీసంప్రదాయాలపై పూర్తిగా అవగాహన లేని పరిస్థితి..ఇంక వారు పిల్లలకు చెప్పేది ఏంటి..అయితే వారిలో కనీసం ఆ విషయంలో ప్రయత్నం చెయ్యాలన్న తపన..పిల్లలకు అవసరమైన పరిజ్ఞానాన్ని అందించలేకపోతున్నామనే ఆవేదన కనిపిస్థాయి.ఉమ్మడి కుటుంబాలు ఉన్న రోజుల్లో ఆ వెలితి అంతగా తెలిసేది కాదు. తాతయ్యలు.. బామ్మలు..పెదనాన్నలు.. పెద్దమ్మలు పిల్లల్ని ఒళ్ళో కూర్చోపెట్టుకుని రామాయణ,మహాభారత, భాగవతాలు చెప్పే ప్రయత్నం చేసేవారు.పనిలో పనిగా కుటుంబ బంధాలు..
చుట్టరికాల విలువ..
పెళ్ళిళ్ళు..పేరంటాలు..
పండగల ప్రాశస్త్యం..ఇత్యాది అవసరమైన సంగతులు వివరించే వారు..ఇప్పుడు ఆధునికత..ఆ”ధనికత”‘
పెరిగిపోయి ఆ ముచ్చట కూడా కరవైపోయింది.
కుటుంబాలు చిన్నవై పోయి
అనవసర వ్యాపకాలు పెరిగిపోయి పిల్లలు సరైన పెంపకానికి నోచుకోవడం లేదు.తల్లిదండ్రులు ఎవరికి వారే బిజీ..ఇద్దరూ ఉద్యోగాలు చేయడం..
ఎవరికి వారు సొంత సర్కిల్స్ ఏర్పాటు చేసుకోవడం.. టివీలు..పరాకాష్టగా మొబైల్స్..ఇవన్నీ వాతావరణాన్ని మరింతగా పాడు చేశాయి.పిల్లలకు మంచి విద్య..సౌకర్యాలతో కూడిన జీవితం ఇవ్వాలనే తాపత్రయం తల్లిదండ్రులకు ఎక్కువైపోయి పిల్లలను తాముగానే పెడత్రోవ పట్టించేస్తున్నారు..
కడుపులో బిడ్డ వుండగానే తన తరపున తల్లిదండ్రులే డాలర్ డ్రీమ్స్ లో మునిగిపోతూ పిల్లాడో..పిల్లో పుట్టినప్పటి నుంచి అమెరికా వెళ్ళడమే నీ జీవితాశయం..
నువ్వు మమ్మల్ని చూడకపోయినా పర్లేదు..బోలెడు డబ్బు సంపాదించి పెద్దోడివైపోవాలి
సుమా అని నూరిపోస్తూ చివరికి తమకు తాముగా వృద్ధాప్యంలో అనాధలుగా మిగిలిపోయే దుస్థితి కొనితెచ్చుకుంటున్నారు..
అవసరమా ఇదంతా..

నిన్ను చూసి నేర్చుకోవాలి తరాలు..
పెంచాలి నీ బిడ్డల్ని
తెలియజేస్తూ అంతరాలు..
వారిని దాటిస్తూ
కష్టాల తీరాలు
తగ్గిస్తూ దూరాలు..
లేదంటే అయిపోతారు సుమా నువ్వూ..నీ బిడ్డలే
ఎప్పటికీ కలవని సమాంతరాలు..!

ఎలిశెట్టి సురేష్ కుమార్
9948546286

LEAVE A RESPONSE