– గత ప్రభుత్వం రూ.20,637 కోట్ల బకాయిలు పెట్టేసింది
– ఉద్యోగులు కూడా ప్రభుత్వంలో భాగమే
– అందుకే ఇబ్బందులున్నా వారి బకాయిలు విడుదల చేశాం
– సౌలభ్యాన్ని బట్టి మిగిలిన బకాయిలు విడుదల చేస్తాం
– కలెక్టర్ల సదస్సులో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వెల్లడి
– పీ4లో ఉద్యోగ కుటుంబాలు భాగస్వామ్యం కావాలని పిలుపు
– ప్రతి కుటుంబానికి ఇంటి స్థలం ఉండేలా చూడాలని ఆదేశం
అమరావతి: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు గత ప్రభుత్వం చెల్లించకుండా ఎగ్గొట్టిన బకాయిల్లో రూ.7230 కోట్లు బకాయిలు ప్రస్తుతం విడుదల చేశామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వెల్లడించారు. ఇప్పటికే రూ.1,030 కోట్లు విడుదల చేశామని, తాజాగా ఇప్పుడు మరో రూ.6200 కోట్లు విడుదల చేశామని ఆయన గుర్తు చేశారు.
సచివాలయంలో జరుగుతున్న జిల్లా కలెక్టర్ల సదస్సులో భాగంగా ఆయన పీ4 కార్యక్రమం గురించి జరిగిన సమీక్ష సందర్భంగా సీఎం ఈ విషయాలు వెల్లడించారు. ఉద్యోగులు ప్రభుత్వంలో భాగమని, వారికి న్యాయంగా అందాల్సిన అలవెన్సులు అందించకుండా గత ప్రభుత్వం ఏకంగా రూ.20,637 కోట్లు ఎగ్గొట్టి బకాయిలు పెట్టిందన్నారు. తమ ప్రభుత్వం ఇప్పుడు ఉద్యోగులకు ఆ బకాయిల్లో కొంత చెల్లించామన్నారు. ఆర్థిక ఇబ్బందులున్నా ఉద్యోగులకు వారి బకాయిలు విడుదల చేస్తున్నామని చెప్పారు.
మిగిలిన బకాయిలు కూడా వెసులుబాటును బట్టి విడుదల చేస్తామన్నారు. ప్రభుత్వ ఉద్యోగులు కూడా ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లడానికి చొరవ తీసుకోవాలన్నారు. పీ4 కార్యక్రమంలో ప్రభుత్వ ఉద్యోగులు కూడా భాగస్వామ్యం కావాలని కోరారు. ఉద్యోగుల కుటుంబాలు కూడా తమకు చేతనైనంతలో ఒక పేద కుటుంబాన్ని పైకి తీసుకురావడానికి కృషి చేయాలని కోరారు. ఈ ప్రభుత్వం అందరిదీ అందరి సంక్షేమం కొరకు పనిచేస్తుందని సీఎం స్పష్టం చేశారు.
సమాజంలో 10 శాతం ఉన్నతంగా ఉన్న సంపన్నవర్గాలు సమాజంలో అట్టడుగున ఉన్న 20 శాతం నిరుపేద కుటుంబాలను స్వచ్ఛందంగా దత్తత తీసుకుని వారి అభ్యున్నతికి తోడ్పాటు అందించాలన్నారు. దీనికోసం ఉగాది రోజులు ప్రత్యేక కార్యక్రమం ప్రారంభిస్తున్నామని, దీన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేలా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. ఒక కుటుంబానికి ఒక పారిశ్రామిక వేత్త ఉండేలా చేయాలన్నదే తమ ఆశయమన్నారు ఇందులో భాగంగా వన్ ఫ్యామిలీ ఒన్ ఎంటర్‌ప్రెన్యూర్ కార్యక్రమం చేపడుతున్నట్లు చెప్పారు.
ప్రతి కుటుంబానికి ఇంటి స్థలం
రాష్ట్రంలో ప్రతి పేద కుటుంబానికి ఇంటి స్థలం ఉండేలా చూడాలన్నదే ప్రభుత్వ లక్ష్యమన్ని సీఎం చంద్రబాబు అన్నారు. ప్రతి కుటుంబానికి రెండు లేదా మూడు సెంట్ల స్థలం ఇవ్వాలని నిర్దేశించామన్ని దీన్ని సాధించే దిశగా జిల్లా కలెక్టర్లు కృషి చేయాలన్నారు. ఇప్పటికే దీనికి సంబంధించిన డేటా అందుబాటులో ఉందని, ఒక కుటుంబాన్ని ఒక యూనిట్‌గా తీసుకుని జిల్లా కలెక్టర్లు నిజంగా ఇల్లు, ఇంటి స్థలం లేని కుటుంబాలు ఏవి అనేవి గుర్తించి నిజమైన అర్హులకు ఇంటి స్థలం కేటాయించేలా చర్యలు తీసుకోవాలన్నారు.
రాబోయే నాలుగు సంవత్సరాల్లో ఎవ్వరికీ కూడా ఇల్లు లేదనే సమస్యే లేకుండా ఇళ్ల నిర్మాణాలు చేపట్టాలన్నారు. ఇప్పటికే పురపాలక శాఖ పట్టణాల్లో ఇంటింటికి కుళాయి ద్వారా మంచినీరు అందించే లక్ష్యాన్ని నిర్దేశించుకుందని, గ్రామాల్లో కూడా ఐదు దశల్లో ఈ కార్యక్రమం పూర్తి చేయాలని సంకల్పించామన్నారు. దీనికోసం రూ.55వేల కోట్లు అవసరమని అది సాధించేలా కూడా 64 ప్రాజెక్టుఉ రూపొందించామన్నారు. జిల్లాల్లో జరుగుతున్న అన్ని ప్రాజెక్టుల పనులను పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్లను సీఎం ఆదేశించారు. అది ఎలాంటి ప్రాజెక్టు అయినా సరే అది పెండింగులో పడకుండా పూర్తి చేయాలన్నారు.
ప్రతి ఇంటికీ ఇంటర్నెట్
రాష్ట్రంలోని ప్రతి కుటుంబానికి ఇంటర్నెట్ సదుపాయం కల్పించే దిశగా చర్యలు తీసుకోవాలని సీఎం సూచించారు. ఫైబర్‌నెట్ ద్వారా రాష్ట్రంలోని ప్రతి కుటుంబానికి కనెక్టివిటీ సదుపాయం ఉండేలా చూడాలన్నారు. ప్రతి గ్రామానికి పల్లెకు కూడా రహదారి సదుపాయం, కనెక్టివిటీ తీసుకురావడం పెద్ద కష్టమేమీ కాదని ఈ దిశగా అధికారులు దృష్టి సారించాలన్నారు.
వడ్డెరలకు క్వారీలు
రాష్ట్రంలో వడ్డెర సామాజిక వర్గాలకు క్వారీలు ఇవ్వాలని సంకల్పించామని సీఎం తెలిపారు. అది వాళ్ల కుల వృత్తి కాబట్టి ఆ సామాజిక వర్గానికి క్వారీలు ఇస్తే వారి జీవన ప్రమాణాలు పెరుగుతాయన్నారు. ఇప్పటికే గీత కార్మికులకు 10 శాతం మద్యం దుకాణాలు కేటాయించామని, అవి సక్రమంగా అమలవుతున్నాయో లేదో అధికారులు పర్యవేక్షించాలన్నారు. అలాగే మత్స్య కారులకు చెరువుల్లో చేపలు పెంచుకునే సదుపాయం కల్పించేలా చర్యలు తీసుకుని వారి జీవన ప్రమాణాలు పెరిగేందుకు దోహదపడతామన్నారు.
చేనేతలకు 500 యూనిట్ల ఉచిత విద్యుత్తు ఇచ్చామని అది వారికి ఎంతో ఉపయోగకరంగా ఉందన్నారు. మైనార్టీల సంక్షేమానికి కూడా ప్రత్యేక చర్యలు చేపడుతున్నామని చెప్పారు. చేతివృత్తులు, హస్తకళలను ప్రోత్సహిస్తున్నామన్నారు. ప్రకృతి వ్యవసాయాన్ని పెద్ద ఎత్తున ప్రోత్సహించాలన్నారు.
జనాభా పెరగాలి
రాష్ట్రంలో జనాభా పెరగాల్సిన అవసరముందన్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 1.5శాతం ఫెర్టిలిటీ రేట్ ఉందని, రాబోయే ఏడెనిమిదేల్లలో పాపులేషన్ తిరోగమనం పట్టనుందని, ఇది అందరూ గుర్తుంచుకోవాలన్నారు. ఉత్తరాది రాష్ట్రంలో జనాభా పెరుగుతుండగా దక్షిణాది రాష్ట్రాల్లో జనాభా తగ్గుముఖం పట్టనుందని చెప్పారు. జనాభా నిర్వహణ కూడా చాలా కీలకాంశమన్నారు. అన్ని వర్క్ ప్లేసుల్లో చైల్డ్ కేర్‌సెంటర్లు ఏర్పాటు చేయాలన్నారు.
బర్త్ అండ్ డెత్ సర్టిఫికెట్లు రియల్ టైమ్‌లో జారీ చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. పీ4 అనేది గేమ్ ఛేంజర్‌గా మారనుందన్నారు. 77 శాతం పెట్టుబడులు ప్రైవేటు రంగం నుంచే రాబోతోందని, ప్రవైటు రంగం పెట్టుబడుల ద్వారా సంపద సృష్టించడమే కాకుండా సంక్షేమాన్ని కూడా చేపట్టబోతున్నామన్నారు. సమాజం మనకు ఎంతో ఇచ్చిందని సమాజానికి మనం కూడా ఎంతో కొంత తిరిగివ్వాలన్నారు. ఇది మనందరి బాధ్యతని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు.