Suryaa.co.in

Andhra Pradesh

మంత్రి రోజాను తప్పించి మంత్రివర్గం పరువు నిలబెట్టుకోండి!

సీఎంకు బహుజన ఐకాస అధ్యక్షుడు బాలకోటయ్య లేఖ

ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ మంత్రి ఆర్కే రోజాను మంత్రి పదవి నుంచి వెంటనే తొలగించాలని, తద్వారా రాష్ట్ర మంత్రివర్గం పరువును కొంతైనా కాపాడుకోవాలని అమరావతి బహుజన ఐకాస అధ్యక్షుడు పోతుల బాలకోటయ్య ముఖ్యమంత్రిని కోరారు. మంగళవారం ఈమేరకు ఆయన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి బహిరంగ లేఖ రాశారు. ఆంధ్రప్రదేశ్ చరిత్రలో రోజా లాంటి మంత్రిని తెలుగు ప్రజలు ఎన్నడూ చూడలేదని, చూడబోరని చెప్పారు.

మెడలో బంగారు నగలు, హారాలు ధరించి వీడియోలు చేస్తూ, చేతులు ఊపుతూ, చిందులేస్తూ, జబర్దస్త్ డాన్సులు వేస్తూ మంత్రివర్గం పరువును రోడ్డు కీడుస్తున్నారని చెప్పారు. ఆఖరికి నూతన సంవత్సర వేడుకల్లో బెంగళూరు పబ్బుల్లో కూడా ఒళ్ళు మరచిపోయి నాట్యాలు చేస్తూ ప్రజాస్వామ్యంలో మంత్రి వర్గంతోపాటు రాష్ట్ర పరువును తీస్తున్నారని పేర్కొన్నారు. మంత్రిగా ఆమె బాధ్యతలు స్వీకరించాక, ఆమె స్వీయ పర్యటనలు, ప్రభుత్వ ఖర్చులు తప్ప, ఏపీ పర్యాటక రంగానికి ఒరిగింది ఏమీ లేదన్నారు.

2019 ఎన్నికల్లోనూ చావు తప్పి, కన్ను లొట్టబోయినట్లు బొటాబొటి ఓట్లతో గెలిచిన రోజా నగర నియోజకవర్గానికి చేసింది సున్నా అని, ఎపీ కి చేసిందీ శూన్యం అని తెలిపారు. ఇలాంటి మంత్రులు మంత్రివర్గంలో ఉండటం ద్వారా ప్రజాస్వామ్యానికే మాయని మచ్చ అని హెచ్చరించారు. ఒకపక్క విశాఖపట్నం వంటి నగరాలలో మహిళలపై గ్యాంగ్ రేప్ లు జరుగుతున్నా, ఆమె ఖండించిన దాఖలాలు లేవన్నారు. మంత్రివర్గానికి రోజా భారమే తప్ప, మేలు కాదని స్పష్టం చేశారు. వెంటనే ఆమెను పదవి నుంచి తొలగించి, ఎపీ పరువు కాపాడాలని బాలకోటయ్య ముఖ్యమంత్రికి సూచించారు.

LEAVE A RESPONSE