– లండన్ పర్యటనలో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్
తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాలకు ప్రపంచ దేశాలలో ఎంతో గౌరవం, ప్రత్యేక గుర్తింపు ఉందని తెలంగాణ రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ చెప్పారు. కుటుంబ సభ్యులతో కలిసి లండన్ పర్యటనలో ఉన్న మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అక్కడి తెలుగు ప్రజలు ఏర్పాటు చేసిన మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిర్వహకులు మంత్రికి ఘనంగా స్వాగతం పలికి సన్మానించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ సంస్కృతికి ప్రతీకగా నిలిచే బోనాలు, ప్రకృతిని పూజించే బతుకమ్మ పండుగలను నేడు అనేక దేశాలలో నిర్వహించడం తెలుగు ప్రజలుగా మనకెంతో గర్వకారణం అన్నారు. ఈ సందర్భంగా బోనాల పండుగకు సంబంధించిన బ్రోచర్ ను మంత్రి ఆవిష్కరించారు. సంస్కృతి, సాంప్రదాయాలు మన పూర్వీకులు ఇచ్చిన ఆస్తి అని, దానిని పరిరక్షించుకోవాల్సిన బాద్యత మనందరిపై ఉందన్నారు. మనం ఎక్కడ ఉన్నా మన మూలాలను మరువద్దని పిలుపునిచ్చారు. తెలుగువారిని అందరిని ఇలా ఒకేచోట చూస్తుంటే నాకు ఎంతో సంతోషంగా ఉందని మంత్రి తన ఆనందాన్ని వ్యక్తం చేశారు.
దేశంలోనే గొప్ప పాలనను అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం అని ఆయన పేర్కొన్నారు. ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఒక గొప్ప విజన్ ఉన్న నాయకుడని, ఆయన నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన 8 సంవత్సరాల లో అనేక అద్బుతాలు చోటుచేసుకున్నాయని చెప్పారు. దేశంలోనే అతి పెద్ద ఎత్తిపోతల పథకం కాళేశ్వరం ప్రాజెక్ట్ అని అన్నారు. తెలంగాణ రాకముందు రాష్ట్రంలో 24 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం ఉత్పత్తి జరిగేదని, కాళేశ్వరం వంటి పెద్ద ప్రాజెక్ట్ నిర్మాణం తర్వాత 3 కోట్ల మెట్రిక్ టన్నులకు ధాన్యం ఉత్పత్తి పెరిగిందని, దేశానికే అన్నం పెట్టే అన్నపూర్ణగా తెలంగాణా రాష్ట్రం నిలిచిందని వివరించారు.
రాష్ట్ర ఆవిర్బావానికి ముందు త్రాగునీటి కోసం గ్రామాలలో మహిళలు కిలోమీటర్ల దూరం వెళ్ళి బిందెలతో నీళ్ళు తెచ్చుకోనేవారని, నేడు మిషన్ భాగీరధ ద్వారా ఇంటింటికి నల్లా ద్వారా త్రాగునీరు సరఫరా జరుగుతుందని అన్నారు. ఎన్నో సంవత్సరాల పాటు నల్లగొండ జిల్లా ప్రజలను వేదించిన ప్లోరిన్ భూతం మిషన్ భాగీరధ నీటిలో పారిపోయిందని, జిల్లా ప్రజలకు ప్లోరిన్ నుండి విముక్తి లభించిందని పేర్కొన్నారు. అనేకమంది తల్లిదండ్రులు తమ పిల్లలకు మంచి విద్యను అందించాలని తాపత్రయ పడతారని, కానీ వేలాది రూపాయల ఫీజులు చెల్లించలేక అనేక ఇబ్బందులు పడతారని అన్నారు.
పేద, మద్య తరగతి విద్యార్ధులకు కార్పోరేట్ స్థాయిలో అన్ని వసతులతో ఉచితంగా విద్యను అందించాలనే ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఆదేశాల మేరకు మన బస్తీ మన బడి కార్యక్రమం చేపట్టి అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్ధులకు అవసరమైన అన్ని రకాల సౌకర్యాలు, వసతులు కల్పిస్తూ ఆహ్లాదకరమైన వాతావరణం ఉండే విధంగా తీర్చిదిద్దుతున్నట్లు చెప్పారు. అదే విధంగా ప్రభుత్వ వైద్య రంగంలో కూడా ఎన్నో మార్పులు వచ్చాయని తెలిపారు. ప్రభుత్వ హాస్పిటల్స్ కు వైద్యం కోసం వచ్చే వారి సంఖ్య పెరగడమే ఇందుకు నిదర్శనంగా ఆయన తెలిపారు.
ప్రైవేట్ లో వేలాది రూపాయల విలువైన MRI సిటీ స్కాన్, యాంజియో గ్రామ్ తదితర పరీక్షలు ప్రభుత్వ హాస్పిటల్స్ లో ఉచితంగా చేస్తున్నట్లు చెప్పారు. అంతేకాకుండా ప్రభుత్వం ఆధ్వర్యంలో మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ నిర్మాణానికి శంఖుస్థాపన చేయడం జరిగిందని, ఏడాదిన్నర లో ఇవి అందుబాటులోకి రానున్నాయని అన్నారు. పెట్టుబడులు పెట్టేందుకు తెలంగాణ రాష్ట్రం సురక్షితమని భావించి అనేక సంస్థలు, కంపెనీలు పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొస్తున్నాయని అన్నారు. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా 90 వేల ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం సిద్దమైందని, ఇప్పటికే గ్రూప్ 1, పోలీస్ కానిస్టేబుల్ తదితర ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ లు జారీ చేయడం జరిగిందని, మిగిలిన ఖాళీలకు సంబంధించిన నోటిఫికేషన్ లను కూడా దశల వారిగా జారీ చేయడం జరుగుతుందని తెలిపారు.
భవిష్యత్ తరాలకు మనం ఇవ్వాల్సింది ఆస్తులు కాదని, స్వచ్చమైన గాలి, వాతావరణం కానుకగా ఇవ్వాలనేది ముఖ్యమంత్రి KCR సంకల్పం అని, అందుకోసమే హరితహారం అనే గొప్ప కార్యక్రమాన్ని చేపట్టి కోట్లాది మొక్కలను నాటడం జరుగుతుందని వివరించారు. మంత్రితో పాటు ఈ కార్యక్రమంలో యువనేత, సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ TRS పార్టీ ఇంచార్జి తలసాని సాయికిరణ్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.