Suryaa.co.in

Andhra Pradesh

పారిశ్రామికవేత్తలకు ఆన్లైన్ సేవలు పునః ప్రారంభం

-కార్యాలయందాకా రాకుండానే ఆన్ లైన్ లో దరఖాస్తు సౌకర్యం
-సవరించిన ధరలతో అనుమతులు, భూ కేటాయింపులు

అమరావతి, ఏప్రిల్, 27 : ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక, మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ పారిశ్రామికవేత్తలకు ఆన్ లైన్ సేవలను తిరిగి ప్రారంభించింది. గత నెల రోజులుగా నిలిచిన వెబ్ పోర్టల్ ని సవరించిన ధరలతో అందుబాటులోకి తీసుకువచ్చింది. ఏపీలో పరిశ్రమ పెట్టాలని వచ్చే ఏ పారిశ్రామికవేత్తకైనా ఒకే విధమైన నిర్దిష్ట వ్యవస్థ ఏర్పాటు దిశగా ఆన్ లైన్ దరఖాస్తు వెసులుబాటు కల్పించింది. ఇటీవల ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నాయకత్వంలో జరిగిన జిల్లాల విభజన నేపథ్యంలో పారిశ్రామిక వేత్తలకు వ్యయ ప్రయాసాలు తావు లేకుండా తగు చర్యలు చేపడుతూ పెట్టుబడిదారులకు వెసులుబాటు మరలా పునరుద్ధరించింది. భూ కేటాయింపులు, ప్లాట్ల అనుమతుల కోసం తిరిగే పనే లేకుండా ఆన్ లైన్ లో దరఖాస్తుతో అన్ని అనుమతులు పొందడం కోసం పారిశ్రామికవేత్తలు ఈ సౌకర్యాన్ని వినియోగించుకోవాలని ఎప్పటికప్పుడు దరఖాస్తు స్థితిని తెలుసుకునే వీలుగా ట్రాకింగ్ సదుపాయం కూడా కలదని ఏపీఐఐసీ స్పష్టం చేసింది. మరిన్ని వివరాలకు www.apiic.in ఏపీఐఐసీ అధికారిక వెబ్ పోర్టల్ ని సంప్రదించవచ్చుని వెల్లడించింది.

ఇప్పటికే ఏపీఐఐసీ 14 రకాల సేవలను ఒకే దరఖాస్తుతో అందించే కార్యక్రమానికి ఇటీవల శ్రీకారం చుట్టింది. వెబ్ సైట్ లో ఎంటర్ ప్రినల్ లాగిన్ లోకి వచ్చి కంపెనీ ఐడీ, ఫైల్ నంబర్ వంటి వివరాలను జతచేసి సేవలను పొందే విధానానికి ఇది అదనం. పరిశ్రమల పేర్లను మార్చుకోవడం, కేటాయింపులలో మార్పు, కేటాయింపుల బదిలీ, లైన్ ఆఫ్ యాక్టివిటీ మాన్పు, పరిశ్రమకు చెందిన నియోజకవర్గ మార్పు, 5 ఎకరాలలోపు సేల్ డీడ్ ఎగ్జిక్యూషన్, 5 ఎకరాలపైన కూడా, కేటాయించిన ప్లాటుకు సంబంధించిన ఎన్ఓసీ , ప్రాజెక్టు అమలుకు నిర్దేశించిన గడువు పెంపు, ముందస్తు చెల్లింపులకు గడువు పెంపు ఇలాంటి సేవలను కూడా ఏపీఐఐసీ పారిశ్రామికవేత్తలకు ఇబ్బంది లేని విధంగా తీర్చిదిద్దింది.

LEAVE A RESPONSE