అసెంబ్లీలో అడిగిన మరుసటి రోజే రెండు హత్యలా?
ఇలాగైతే పెట్టుబడులు ఎలా వస్తాయి?
ఎక్స్ లో రేవంత్ సర్కారుపై మాజీ మంత్రి హరీష్ ఫైర్
హైదరాబాద్ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక శాంతిభద్రతలు పూర్తిగా గాడి తప్పాయి. 8 నెలల్లో 500 హత్యలు జరిగాయని నేను అసెంబ్లీలో ప్రభుత్వాన్ని ప్రశ్నించిన మర్నాడే హైదరాబాద్‌లో రెండు హత్యలు జరగడం తీవ్ర దిగ్భ్రాంతి కలిగిస్తున్నది.
హోం మంత్రిత్వ శాఖను కూడా నిర్వహిస్తున్న ముఖ్యమంత్రి, రాష్ట్రంలో జరుగుతున్న నేరాలపై ఇంతవరకు పోలీసులతో సమీక్ష నిర్వహించలేదు. హత్యలు, అత్యాచారాలు యథేచ్ఛగా జరుగుతున్నా ప్రభుత్వానికి, పోలీసులకు చీమ కుట్టినట్టయినా లేదు.
ప్రజల మానప్రాణాలను రక్షించాల్సిన బాధ్యతను పూర్తిగా విస్మరించారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రాధాన్యాల్లో లా అండ్ ఆర్డర్ లేకపోవడం బాధాకరం. శాంతి భద్రతల నిర్వహణలో సీఎం, పోలీసులు పూర్తిగా విఫలయ్యారని చెప్పడానికి రోజురోజుకూ పెరుగుతున్న నేరాలే నిదర్శం. ప్రభుత్వం ఇప్పటికైనా నిద్ర మేల్కొని వెంటనే శాంతిభద్రతలను పునరుద్ధరించాలి.
గత పదేళ్లలో హైదరాబాద్ సహా ,తెలంగాణ నెలకొల్పిన శాంతి భద్రతల కారణంగా వేల కోట్ల పెట్టుబడులు రాష్ట్రానికి వచ్చాయి. ఈరోజు ఇలాంటి పరిస్థితులు చూస్తే రాష్ట్ర ప్రతిష్టతో పాటు హైదరాబాద్ ప్రతిష్ట కూడా దెబ్బతినే అవకాశం ఉంది. ఫలితంగా రాష్ట్రానికి వచ్చే పెట్టుబడులపై ప్రభావం పడుతుందని ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాను.
సంఘ విద్రోహశక్తులపై ఉక్కుపాదం మోపాల్సిన ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం ఏమాత్రం సరికాదు. సీఎం రాజకీయాలకు అతీతంగా స్పందించి, రాష్ట్రంలో ప్రశాంత వాతావరణాన్ని నెలకొల్పడంపై దృష్టి సారించాలని కోరుతున్నాను