తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిగారికి బహిరంగ లేఖ
మీరు తెలంగాణ ముఖ్యమంత్రిగా అధికార పగ్గాలు చేబట్టిన సందర్భంగా అభినందనలు.
తెలుగు గంగ, హంద్రీ – నీవా, గాలేరు – నగరి, వెలిగొండ ప్రాజెక్టుల నిర్మాణాలను అడ్డుకోవాలని కృష్ణా నది యాజమాన్య బోర్డు ఛైర్మన్ కు, తెలంగాణ నీటి పారుదల శాఖ ఇంజనీర్ ఇన్ చీఫ్ మురళీధర్ డిసెంబరు 15న ఉత్తరం వ్రాశారన్న వార్త ప్రసార మాధ్యమాల్లో వచ్చింది. దానిపై స్పందించి, ఈ బహిరంగ లేఖ వ్రాస్తున్నాను.
రెండు తెలుగు రాష్ట్రాలకు, ప్రత్యేకించి కరవు పీడిత ప్రాంతాలకు జీవన్మరణ సమస్య అయిన, నదీ జలాల సమస్య సున్నితమైనది, సంక్లిష్టమైనదన్న విషయం మీకు విదితమే. ఈ సమస్యను ప్రస్తుతం అమలులో ఉన్న బచావత్ ట్రిబ్యునల్ తీర్పు మరియు ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం పరిధిలోనే పరిష్కరించుకోవాలి తప్ప , మరో మార్గం లేదన్నది నాకున్న అవగాహన. కరవు పీడిత రాయలసీమ ప్రాంతంలో మూడున్నర దశాబ్దాలుగా నిర్మాణంలో కొనసాగుతున్న తెలుగు గంగ(చాలా వరకు పూర్తయ్యింది), హంద్రీ – నీవా, గాలేరు – నగరి, వెలిగొండ పెండింగ్ ప్రాజెక్టులపై కృష్ణా నది యాజమాన్య బోర్డుకు, అసంబద్ధమైన ఫిర్యాదుల పరంపరను కొనసాగించి, రెండు తెలుగు రాష్ట్రాల మధ్య అగాధాన్ని సృష్టించడానికి కేసీఆర్ ప్రభుత్వం శతవిధాలా ప్రయత్నించింది.
మీ నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ ఇటీవల జరిగిన ఎన్నికల్లో విజయం సాధించి, మీరు ముఖ్యమంత్రిగా అధికారంలోకి వచ్చారు. ఈ మార్పు, రెండు తెలుగు రాష్ట్రాల మధ్య నలుగుతున్న, కృష్ణా నదీ జలాల సమస్య మరింత సంక్లిష్టంగా మారకుండా, సామరస్యంగా పరిష్కరించుకోవడానికి మార్గం సుగమం అవుతుందని ఆశిస్తున్నా. తెలంగాణ నీటి పారుదల శాఖ ఇంజనీర్ ఇన్ చీఫ్ మురళీధర్ వ్రాసిన ఉత్తరం కాస్తా ఆశ్చర్యం కలిగించింది. మీ అనుమతితో ఉత్తరం వ్రాశారో! లేదా, గత ప్రభుత్వంలో చేసిన అలవాటైన పనిలో భాగంగా వ్రాశారో! తెలియదు. ఈ అంశంపై వెంటనే మీరు దృష్టి సారించాలని విజ్ఞప్తి చేస్తున్నాను.
మా ఆవేదనంతా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం.. రాయలసీమ ప్రాంతంలోని పెండింగ్ ప్రాజెక్టులతో పాటు, ఉత్తరాంధ్ర ప్రాజెక్టుల నిర్మాణం పట్ల అలసత్వం ప్రదర్శిస్తూ తీరని అన్యాయం చేస్తున్నది. గాలేరు – నగరి సుజల స్రవంతి రెండవ దశ నిర్మాణాన్ని పూర్తిగా అటకెక్కించింది. జాతీయ ప్రాజెక్టు అయిన పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని సంక్షోభంలోకి నెట్టింది. ఈ దుస్థితిలో ఆంధ్రప్రదేశ్ నీటి పారుదల ప్రాజెక్టుల నిర్మాణం ఉంటే.. గోరు చుట్టపై రోకటి పోటన్నట్లు ,తెలంగాణ నీటి పారుదల శాఖ ఇంజనీర్ ఇన్ చీఫ్ మురళీధర్ ఫిర్యాదు ఉన్నది.
తెలుగు గంగ, హంద్రీ – నీవా, గాలేరు – నగరి, వెలిగొండ ప్రాజెక్టులను కల్వకుర్తి, నెట్టెంపాడులతో పాటే, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్మాణం చేపట్టింది. వాటన్నింటినీ ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టంలో పొందుపరిచారు. సత్వరం నిర్మాణ పనులను పూర్తి చేయాలని పేర్కొన్నారు. తద్వారా వాటికి చట్టబద్ధత వచ్చింది. అలాగే, నదీ జలాల సమస్యల పరిష్కారానికి అపెక్స్ కౌన్సిల్ ను చట్టబద్దంగా ఏర్పాటు చేశారు. ఏ రాష్ట్రమైనా ఉల్లంఘిస్తే అపెక్స్ కౌన్సిల్ సమావేశాన్ని ఏర్పాటు చేయించి, చర్చించి, పరిష్కరించుకొనే ప్రక్రియ ఉత్తమమైనది.
ఈ విషయాలపై మీరు సత్వరం దృష్టి సారిస్తారని ఆశిస్తున్నాను.
అభివందనాలతో
– టి.లక్ష్మీనారాయణ
ఆంధ్రప్రదేశ్ సమగ్రాభివృద్ధి అధ్యయన వేదిక
తేదీ: 16 -12-2023