– ఉప రాష్ట్రపతి అభ్యర్ధిగా జస్టిస్ సుదర్శన్‌రెడ్డి ఎంపికపై కాంగ్రెస్‌లో విస్మయం
– బీసీ జపం చేస్తున్న కాంగ్రెస్‌కు బీసీ నేతలే కరవయ్యారా?
– మరి కాంగ్రెస్ బీసీ ఎమ్మెల్యే, ఎంపీలు రెడ్డిగారికి ఓటేస్తారా?
– మన హైదరాబాద్ హన్మన్న, సికింద్రాబాద్ అంజన్న యాదికి రాలేదా?
– రాహుల్ లక్ష్యాలను ఉప రాష్ట్రపతి ఎలా నెరువేరుస్తారు?
– నినాదం బీసీ.. విధానం ఓసీనా?
– కాంగ్రెస్ మార్కు సామాజిక న్యాయం
( మార్తి సుబ్రహ్మణ్యం)
ఉప రాష్ట్రపతి ఎన్నిక నేపథ్యంలో కాంగ్రెస్ నేతృత్వంలోని యుపిఏ తీసుకున్న ‘ విభ్రాంతికర అద్భుత నిర్ణయం’ కాంగ్రెస్ వారినే నోరెళ్లబెట్టేలా చేసింది. అది ఎలాగూ ఓడిపోయే సీటే. ఎందుకంటే గెలిచేందుకు కావలసిన బలం యుపిఏ దళానికి లేదు. ఇక ఎన్నిక నాటికి యుపిఏకు ఎంతమంది ఝలక్ ఇస్తారో తెలియదు. ఎందుకంటే బీజేపీ పోల్ మేనేజ్మెంట్ అలాగే ఉంటుంది కాబట్టి.
నిన్నటి మేధోమథనంలో తల్లీకొడుకుతో చాయ్ తాగిన ప్రాంతీయ/జాతీయపార్టీ ఆసాములే.. బీసీని నిలబెట్టని కారణంగా తాము ఎన్డీఏ అభ్యర్ధిని సమర్ధిస్తున్నామనో, లేక అసలు ఎన్నికనే బహిష్కరిస్తున్నామో సెలవిచ్చినా ఆశ్చర్యం లేదు. అలాంటప్పుడయినా ఈ ప్రమాదం పసిగట్టి యుపిఏ కూటమి తెలివైన నిర్ణయం తీసుకుంటుందని తెలివి ఉన్న ఎవరైనా భావిస్తారు. అంటే రాజకీయాల్లో అందరికీ తెలిసిన వ్యక్తిని, అందునా ఓబీసీ అభ్యర్థిని ఎన్డీఏకు పోటీగా దింపుతుందని, మెడ మీద తల ఉన్న ఎవరైనా ఆశిస్తారు. కానీ అందుకు భిన్నంగా, రిటైరయిన జడ్డి సుదర్శన్‌రెడ్డిని తెరపైకి తీసుకురావడం ఏమిటో, ఎందుకో సొంత పార్టీ వారికే తెలియని అంతుచిక్కని రహస్యం.
బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ గవ ర్నర్ రాధాకృష్ణన్‌ను ఉప రాష్ట్రపతి అభ్యర్ధిగా ఎంపిక చేసింది. అందుకు చాలా పెద్ద కసరత్తే చేసింది. చివరకు దక్షిణాదికి చె ందిన రాధాకృష్ణన్‌ను ఎంపిక చేసింది. ఎంబీసీ కులానికి చెందిన ఆయన ఎంపిక వ్యూహాత్మకమే. బీసీల్లో కూడా మోస్ట్ బ్యాక్వర్డ్క్లాసుకు చెందిన రాధాకృష్ణన్ ఎంపిక సహజంగా బీసీలనే కాదు. హక్కులకు నోచుకోని అత్యంత వెనకబడిన కులాలవారి పెదవులపై చిరునవ్వులు పూయించేదే.
నిజానికి ఎన్డీఏ నద్దా, రాజ్‌నాధ్‌సింగ్, తెలుగుమీడియా హడావిడి చేసినట్లు పురందేశ్వరి లాంటి అగ్రకులాలను ఆ పదవికి ఎంపిక చేసినా అడిగేవారు ఉండరు. ఎందుకంటే ఎన్డీఏకు మెజారిటీ ఉంది కాబట్టి! కానీ అందుకు భిన్నంగా ఒక అత్యంత వెనకబడిన కులానికి చెందిన వ్యక్తికి ఉపరాష్ట్రపతి పీఠం అప్పగించే ప్రయత్నం చేసింది.
ఆ ప్రకారంగా కాంగ్రెస్ నేతృత్వంలోని యుపిఏ కూడా.. అంతకుమించిన తెలివైన నిర్ణయం తీసుకుని, ఎన్డీఏను ఆత్మరక్షణలో పడేస్తుందేమోనని పాపం చాలామంది ఆశ పడ్డారు. అయితే ‘యువ మేధావి’ రాహుల్.. ఉప రాష్ట్రపతి అభ్యర్ధిగా సుదర్శన్‌రెడ్డిని ఎంపిక చేసి, ఈసారి కూడా అలవాటు
ప్రకారం తన పార్టీని విజయంవంతంగా ఆత్మరక్షణలోకి నెట్టేశారు. బహుశా కర్నాటక, తెలంగాణలో ఉన్న తన పార్టీ బలాన్ని అంచనా వేసుకుని.. అధికారంలో ఉన్న మూడు రాష్ట్రాల ఎంపి, ఎమ్మెల్యేలు ఓటేస్తే రెడ్డిగారు గెలిచేస్తారన్న ‘తిరుగులేని వ్యూహం’తో ఈ నిర్ణయం తీసుకుని ఉండవచ్చు.
లేదా చంద్రబాబునాయుడు మాదిరిగా.. తానూ జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలన్న ఉత్సాహంతో, ఆయన శిష్యుడైన రేవంత్‌రెడ్డి.. అత్యుత్సాహంతో రాహుల్‌తో తీసుకునేలా చేసిన నిర్ణయమూ కావచ్చన్నది కాంగీయుల ఉవాచ. అంటే రాహుల్ శంఖంలో తీర్ధం పోయించారన్న మాట. లేకపోతే నిన్నటి వరకూ డిఎంకె అభ్యర్ధిని తెరపైకి తెచ్చిన కాంగ్రెస్, ఇప్పుడు హటాత్తుగా రెడ్డిగారిని తీసుకురావడం ఆశ్చర్యం కాక మరేమిటన్నది వారి ప్రశ్న.
సరే.. ఉప రాష్ట్రపతి అభ్యర్ధిగా రెడ్డిగారిని ఎంపిక చేసి, సొంత పార్టీనే ఆశ్చర్యపరిచిన కాంగ్రెస్.. మరి ఇప్పటివరకూ చేస్తున్న బీసీ/ఎంబీసీ నినాదానికి ‘అధికారికంగా నీళ్లు వదులుకున్నట్లే’నా అన్నది ప్రశ్న. బిసి రిజర్వేషన్ల వ్యవహారాన్ని ఢిల్లీ దాకా తీసుకువెళ్లి, ఈ దేశంలో బీసీలపై తమకు మాత్రమే పేటెంట్ హక్కులున్నాయంత హడావిడి చేసిన కాంగ్రెస్ పార్టీకి.. తన పార్టీలో ఉప రాష్ట్రపతి అభ్యర్ధికి అర్హుడైన ఒక్క బీసీ కూడా కనిపించకపోవడమే విషాదం.
‘మీరెంతో మీకంత’ అని గంభీరమైన నినాదం అందిపుచ్చుకున్న ‘బీసీ ఆశాకిరణం’ రాహుల్‌కు.. తన పార్టీ జెండాను దశాబ్దాల నుంచి భుజం పుండ్లు పట్టేలా మోస్తున్న ఏ ఒక్క బీసీ నాయకుడూ, ఉప రాష్ట్రపతి అభ్యర్థిత్వానికి అర్హుడనిపించలేదా? అసలు బీసీలకు ఉప రాష్ర్టపతి అయ్యే యోగం లేదన్నది రాహుల్ అభిప్రాయమా అన్నదే ప్రశ్న.
సరే..రాహుల్‌కంటే ఆధునిక రాజకీయాలు, లౌక్యం, స్థితప్రజ్ఞతతో కూడిన ప్రాప్తకాలజ్ఞత, వ్యూహాలు తెలియవనుకోవచ్చు. మరి ఆ లక్షణాలన్నీ పదుష్కలంగా ఉండి.. అందరికీ మార్గదర్శి, జర్నలిస్టులతో సహా ఎవరెలా ఉండాలో బహు బాగా తెలిసిన మేధావి రేవంత్‌రెడ్డి కూడా, ఉప రాష్ట్రపతి అభ్యర్ధి ఎంపికలో తప్పులో కాలేయడమే విచిత్రం. అసలు బీసీల రిజర్వేషన్లకు జాతీయ స్థాయి ప్రచారం తెచ్చిందే ఆయన.
రాముడికి ఆంజనేయస్వామి మాదిరిగా.. రాహుల్ చెప్పిన వెంటనే కులగణన, బీసీ రిజర్వేషన్లకు ప్రాణం పోసిన రేవంత్, తెలంగాణలో ఏ ఒక్క సీనియర్ బీసీ నేత పేరూ, ఉపరాష్ట్రపతి అభ్యర్థిత్వానికి సిఫార్సు చేయకపోవడమే ఆశ్చర్యం.
పోనీ అలాంటి అర్హులు తెలంగాణ కాంగ్రెస్‌లో లేరా? రాజీవ్ నుంచి రాహుల్ వరకూ ఆ కుటుంబానికి వీర విధేయుడయిన వి.హన్మంతరావు నిఖార్సయిన బీసీ కాదా? పార్టీ అధికారంలో ఉన్నా లేకపోయినా, చాలామందిలా పార్టీలు మారకుండా పార్టీ జెండాను ఓపికగా మోస్తున్న హన్మన్న కంటే నిజమైన బీసీ, సీనియర్ ఎవరైనా ఉన్నారా? మరి ఆయన పేరు ఎందుకు సిఫార్సు చేయలేదు? పోనీ అంజన్‌కుమార్‌యాదవ్ కూడా సీనియర్ నాయకుడే. ఆయన కూడా బీసీనే కదా?
ఇలా చెప్పుకుంటూపోతే చాలామంది బీసీ నాయకులున్నా, ఎవరి పేరూ సిఫార్సు చేయకుండా, సుదర్శన్‌రెడ్డి పేరు సిఫార్సు చేయడం ఏ సామాజిక న్యాయమన్నది కాంగ్రెస్ పెద్ద తలల ప్రశ్న. ఇప్పటికే తెలంగాణలో సామాజిక న్యాయం చచ్చిపోయిందని, పెద్ద పదవులన్నీ రెడ్లకే ఇస్తున్నారని, రేవంత్ ప్రవచిత బిసి రిజర్వేషన్ల ప్రకారం సీఎం సహా 8 మంత్రి పదవులు బీసీలకు ఇవ్వాలన్న వ్యాఖ్యలు ఇంటా బయటా వినిపిస్తూనే ఉన్నాయి.
అందువల్ల తనపై వస్తున్న ఈ విమర్శలకు తెరదించేందుకయినా ఆయన, తెలంగాణ బీసీని ఉప రాష్ట్రపతి అభ్యర్ధిత్వానికి సిఫార్సు చేస్తారేమోనని బీసీ వర్గాలు భావించాయి. కానీ అందుకు భిన్నంగా ఆ ఎంపికలోనూ ‘రెడ్డికార్పెట్’ వేయడంతో, వారికి మిగిలింది ఖేదమే. మరిప్పుడు తెలంగాణ కాంగ్రెస్‌లోని నాన్ రెడ్డి ఎమ్మెల్యే-ఎంపిలు, పార్టీ నిలబెట్టిన రెడ్డిగారికి ఓటేస్తారా? లేక ఎన్డీఏ నిలబెట్టిన ఎంబీసీ అభ్యర్ధి రాధాకృష్ణన్‌కు కులాభిమానంతో జై కొడతారా అన్నదే ఆసక్తికర అంశం.
ఎందుకంటే రెడ్డి వర్గానికి చెందిన ప్రజాప్రతినిధులంతా కులాభిమానంతో రెడ్డిగారికి ఓటేస్తే, నాన్ రెడ్డి ప్రజాప్రతినిధులు కూడా అదే కులాభిమానం ప్రదర్శిస్తే ఎలా అన్నదే పాయింటు. భారత రాజకీయాలన్నీ కులం చుట్టూ పరిభ్రమిస్తున్నాయి కాబట్టి, ఏదైనా సాధ్యమే కదా?
ఎలక్టోరల్ కాలేజీలో ఎన్డీయేకే బలం ఉంది కాబట్టి, ఉప రాష్ట్రపతి ఎవరు అవుతారని ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు. కానీ చిక్కంతా తెలంగాణలో, కాంగ్రెస్ ఉధృతంగా విసిపిస్తున్న బీసీ నినాదం పైనే. కొద్దినెలల నుంచి బీసీ నినాదాన్ని హోరెత్తిస్తున్న కాంగ్రెస్, తీరా ఉప రాష్ట్రపతి వంటి అభ్యర్థిత్వాన్ని ఓసీకి కట్టబెట్టిన ఫలితంగా.. దాని పాతివ్రత్యమేమిటన్నది అర్ధం చేసుకోలేనంత అమాయకులెవరూ బీసీలలో ఉండరు.
ఇది ఒకరకంగా కాంగ్రెస్ నాయకత్వం, తన ప్రత్యర్ధులకు అందించిన ఉచిత అస్త్రం. పేరుకు బీసీ నినాదం-తీరులో ఓసీ విధానమన్న విమర్శను.. కాంగ్రెస్ ప్రత్యర్ధులు క్షేత్రస్థాయికి తీసుకువెళితే, నష్టపోయేది కాంగ్రెస్ పార్టీనే. ఇది కాంగ్రెస్‌లోని బీసీ నాయకులలో నెలకొన్న అసంతృప్తిని మరింత పెద్దది చేసేదే.
అంతా బాగానే ఉంది. రాజ్యాంగ రక్షణ కోసమే జస్టిస్ సుదర్శన్‌రెడ్డిని ఎంపిక చేశామన్న కాంగ్రెస్ వాదనే ఆశ్చర్యం. ఒకవేళ రాహుల్-రేవంత్ ఆశలు జమిలిగా ఫలించి, గుర్రం ఎగిరి, జస్టిస్ సుదర్శన్‌రెడ్డి ఉప రాష్ట్రపతిగా ఎన్నిక అయ్యారే అనుకోండి. అప్పుడు ఆయన సహజంగా రాజ్యసభ చైర్మన్ అవుతారే తప్ప, రాజ్యాంగ రక్షకుడు కాలేరు కదా? ఉభయ సభల్లో మెజారిటీ ఉన్న పార్టీ తీసుకునే నిర్ణయాలే రాజ్యాంగాన్ని రక్షిస్తాయి. మరి అలాంటప్పుడు కేవలం రాజ్యసభ చైర్మన్‌గా, రాజ్యసభకే పరిమితమయ్యే జస్టిస్ సుదర్శన్‌రెడ్డి.. రాహుల్-రేవంత్ చెప్పినట్లు రాజ్యాంగ రక్షకుడు ఎలా అవుతారు చెప్మా?!