– ప్రత్యర్ధులతో సైతం రాజీలు
– ఇళ్లకు వెళ్లి మరీ బుజ్జగింపులు, హామీలు
– నా కంటే పార్టీనే ప్రధానమని స్పష్టీకరణ
– తగ్గిన సొంత పబ్లిసిటీతో నేతల సంతృప్తి
– పార్టీ కోసం ఒక అడుగు వెనక్కి
– అధికారంలోకి రావడమే అసలు లక్ష్యం
– అందుకే తనను వ్యతిరేకించే వారితోనూ రాజీలు
– రేవంత్‌ను వ్యతిరేకించిన వారే ఇప్పుడు బాసట
– రాహుల్ ఆదేశాలతో దారికొచ్చిన సీనియర్లు
– సోనియా నిర్ణయమని సీనియర్లకు స్పష్టం చేసిన రాహుల్
– ప్రత్యర్ధుల నుంచి సైతం రేవ ంత్కు ప్రశంసలు
– గతంలో వైఎస్‌కు సోనియా భరోసా
– ఇప్పుడు రేవంత్‌కు రాహుల్ దన్ను
– వైఎస్ ఫార్ములానే రేవంత్ పాటిస్తున్నారా?
– సీనియర్లకు తత్వం బోధపడినట్లేనా?
– ఉత్తమ్ తీరుతోనే కాంగ్రెస్ నేతల అసంతృప్తి
– రెండు నియోజకవర్గాలపై పెత్తనం చేస్తున్నారన్న ఫిర్యాదులు
( మార్తి సుబ్రహ్మణ్యం)
రేవంత్‌రెడ్డి. టీపీసీసీ దళపతి-మల్కాజిగిరి ఎంపి. తెలుగు రాజకీయాల్లో ఓ ఫైర్‌బ్రాండ్. రెండు రాష్ర్టాల్లో ఆయన అభిమానులకు లెక్కలేదు. సంచలన కెరటం. మాటల పుట్ట, మాటల మరాఠా. ప్రజల్లో ఆయనకున్న ఇమేజ్, గ్లామర్ అనంతం. రేవంత్ బహిరంగసభకు జనం పోటెత్తుతారు. సోషల్‌మీడియాలో ఆయన వీడియోలకు పిచ్చ ఫాలోయింగ్. ఏం మాట్లాడినా లక్షల్లో లైకులు, వేలల్లో షేరింగులు. వ్యక్తిగతంగా మస్తుమంది అభిమానులు. ఒక్కమాటలో చెప్పాలంటే.. సీఎం కేసీఆర్‌తో సరిసమానమైన ఇమేజ్ ఆయనది.
ప్రత్యర్ధులపై విరుచుకుపడటంలో ఆయన స్టైలే సెపరేటు. చేతిలో డాక్యుమెంట్లు పట్టుకుని, రాజకీయ ప్రత్యర్ధులను ఉక్కిరిబిక్కిరి చేయడంలో దిట్ట. సమాచారహక్కు చట్టాన్ని.. బీభత్సంగా వినియోగించుకునే, అతికొద్ది మంది రాజకీయ నేతల్లో రేవంత్ ఒకరు. ఈలక్షణాలన్నీ ఒకప్పుడు దివంగత నేత వైఎస్‌లో పుష్కలంగా కనిపించేవి. ఇప్పుడు అవి రేవంత్‌రెడ్డిలో స్పష్టంగా కనిపిస్తున్నాయి.
కేవలం ఇమేజ్‌లోనే కాదు. అడుగుల్లోనూ వైఎస్‌ను ఫాలో అవుతున్నట్లు రేవంత్ తీరు స్పష్టం చేస్తోంది. మరణించేవరకూ కాంగ్రెస్‌వాదిగా ఉన్న వైఎస్.. కాంగ్రెస్‌లో గ్లామర్, మాస్ ఫాలోయింగ్ ఉన్న ఏకైక నేత. ఓ ప్రభజనం. ఎలాంటి ప్రచారం లేకపోయినా ఆయన సభలకు జనం పోటెత్తేవారు. హేమాహేమీలు ఉన్నప్పటికీ, వైఎస్‌ది ప్రత్యేక శైలి.
రాష్ట్రవ్యాప్తంగా ఆయనకో ప్రత్యేక వర్గం. అదే సమయంలో ఎంతమంది అభిమానులున్నారో, అంతేమంది ప్రత్యర్థులు. ఆయనను ఫాలో అయ్యే నేతలు ఎంతమంది ఉండేవారో, ఆయనను వ్యతిరేకించే ప్రముఖులూ ఉండేవారు. అయితే వారికెవరికీ జనబలం లేదు. కేవలం నాయకత్వ ప్రోత్సాహంతో వచ్చిన వెలుగు మాత్రమే. కానీ వైఎస్‌ది స్వయంకృషితో వెలిగిన ప్రభ.
కాంగ్రెస్‌లో ప్రత్యేక గుర్తింపు ఉన్నప్పటికీ, కొన్ని దశాబ్దాల వరకూ ఆయనకు సీఎం పదవి దక్కలేదు. దానితో అటో ఇటో తేల్చుకునేందుకు ఆయన పాదయాత్ర ప్రారంభించారు. నాయకత్వం నుంచి గ్రీన్‌సిగ్నల్ తెచ్చుకున్నారు. రాష్ట్రంలో సొంత పార్టీలో ఎంతోమందిని ఢీకొన్నప్పటికీ, ఢిల్లీలో మాత్రం ఒదిగే ఉండేవారు. అదే ఆయనను హిమాలయమంత ఎత్తుకు చేర్చింది. అది వేరే విషయం.
పాదయాత్ర ప్రారంభానికి ముందు.. పార్టీలో తనను వ్యతిరేకించే వారి ఇళ్లకు వెళ్లి, వారి మద్దతు కూడగట్టారు. వారిని బుజ్జగించారు. తనతో జరిగిన తప్పులు మనసులో పెట్టుకోవద్దన్నారు. పార్టీని అధికారంలోకి తీసుకురావడమే, అందరి లక్ష్యం కావాలన్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత న్యాయం చేస్తానని హామీ ఇచ్చారు. తనకు కోపం అనే నరం తెగిపోయిందని ఆ సమయంలోనే మీడియాతో వ్యాఖ్యానించారు.
అలా తనను వ్యతిరేకించే మాజీ సీఎం నేదురుమల్లి జనార్దన్‌రెడ్డి, కోట్ల సూర్యప్రకాష్‌రెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, జెసి దివాకర్‌రెడ్డి, పిన్నమనేని కోటేశ్వరరావు వంటి పెద్ద తలకాయలతో రాజీ కుదుర్చుని,
జనక్షేత్రంలో కాలుపెట్టారు. పాదయాత్ర వల్ల అధికారం సిద్ధించడంతో, హామీ ఇచ్చినట్లుగానే తనతో కలసి నడిచిన వారందరికీ న్యాయం చేశారు. నేదురుమల్లి జనార్దన్‌రెడ్డి భార్య, పిన్నమనేని కొడుకు, జెసి, పెద్దిరెడ్డికి మంత్రి పదవులిచ్చి, రుణం తీర్చుకున్నారు.
ఇప్పుడు టీపీసీసీ దళపతి రేవంత్‌రెడ్డి కూడా, వైఎస్ బాటలోనే పయనిస్తున్నట్లు ఆయన అడుగులు స్పష్టం చేస్తున్నాయి. తనను వ్యతిరేకించే సీనియర్ల ఇళ్లకు వెళ్లి మరీ, వారి ఆశీర్వాదం తీసుకున్నారు. తనకు మద్దుతునీయాలని అభ్యర్ధించారు. పార్టీనే సుప్రీం అని, పార్టీ తర్వాతనే తాను అని వారికి స్పష్టం చేశారు. మీతో తనకు వ్యక్తిగత శత్రుత్వం లేదని స్పష్టం చేశారు. స్థానికంగా మీ ప్రయోజనాలకు వ్యతిరేకంగా, ఎలాంటి నిర్ణయాలు తీసుకోనని హామీ ఇచ్చారు.
మీ అభిప్రాయాలను గౌరవిస్తానని భరోసా ఇచ్చారు. అందరం కలసి పార్టీని అధికారంలోకి తీసుకువద్దామని బుజ్జగించారు. ఈసారి అధికారంలోకి రాకపోతే, పార్టీ మనుగడ కష్టమని హితవు చెప్పారు. అధికారంలోకి రావడం మనందరి అవసరం అని స్పష్టం చేశారు. దానితో ఒకరిద్దరు మినహా, మెజారిటీ సీనియర్ నేతలంతా రేవంత్‌కు బాసటగా నిలిచారు.
తొలుత రేవంత్‌ను చాలామంది సీనియర్లు బహిరంగంగానే వ్యతిరేకించారు. టీడీపీలో ఉండి, పార్టీలో చేరిన వెంటనే పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, పీసీసీ ప్రెసిడెంట్ పదవులు రావడమే వారి వ్యతిరేకతకు కారణం. తాము దశాబ్దాల నుంచి పనిచేస్తున్నా, తమకు కాకుండా టీడీపీ నుంచి వచ్చిన రేవంత్‌కు అధ్యక్ష పదవి ఇవ్వడమే సీనియర్ల అసంతృప్తికి అసలు కారణం.
చాలాకాలం ఆయనను బాహాటంగానే వ్యతిరేకించిన ఎంపి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఇప్పుడు రేవంత్‌తో కలసి పనిచేస్తున్నారు. ఇటీవల కాంగ్రెస్‌లో చేరిన పొంగులేటి, జూపల్లితో రేవంత్ జరిపిన చర్చల్లో
కోమటిరెడ్డి కూడా భాగస్వామి కావడం విశేషం. రేవంత్‌కు పీసీసీ అధ్యక్ష పదవి ఇచ్చిన వెంటనే, వ్యతిరేక వ్యాఖ్యలు చేసిన వి.హన్మంతరావు కూడా, ఇప్పుడు రేవంత్‌కు దన్నుగా నిలిచారు.
అదేవిధంగా రేవంత్‌ను వ్యతిరేకించిన ఎమ్మెల్యే దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, మాజీ ఎమ్మెల్సీ ప్రేంసాగర్‌రావు, ఆయనతో అధ్యక్ష పదవికి పోటీ పడ్డ గీతారెడ్డి,దామోదర రాజన ర్శింహ, పొన్నాల లక్ష్మయ్య, మధుయాష్కీ, మహేష్‌గౌడ్, అంజన్‌కుమార్‌యాదవ్‌తో రేవంత్ వ్యక్తిగతంగా భేటీ అయి, వారితో రాజీ కుదుర్చుకున్నారు. ఇప్పుడు వీరంతా రేవంత్‌తో.. రేవంత్ వీరితో కలసి పనిచేస్తున్నారు.
నిజానికి రాహుల్‌గాంధీ తెలంగాణ నేతలతో భేటీ నిర్వహించిన తర్వాతనే, వారంతా దారిలోకి వచ్చినట్లు
తెలుస్తోంది. రేవంత్‌ను వ్యతిరేకించడానికి కారణాలు వెల్లడించిన నేతలకు, రాహుల్ క్లాసు తీసుకున్నారు. మేడమ్ నిర్ణయానికి అంతా మద్దతునివ్వాల్సిందేనని స్పష్టం చేశారు. ఆ సందర్భంలో రేవంత్‌పై ఫిర్యాదు
చేసేందుకు వెళ్లిన ఎమ్మెల్యే జగ్గారెడ్డి.. యువనేత రాహుల్‌కు ఫిదా అయి, తాను ఫిర్యాదు చేసేందుకు వచ్చిన విషయాన్ని కూడా మర్చిపోయి, రాహుల్‌ను పొగడ్తలతో ముంచెత్తినట్లు పార్టీ వర్గాల్లో ప్రచారం జరిగింది.
ఆవిధంగా ఎమ్మెల్యే జగ్గారెడ్డికి రాహుల్ దిశానిర్దేశం చేయడంతో, ఆయన రేవంత్‌ను విమర్శించడం
మానేశారు. సీఎస్పీ నేత భట్టి విక్రమార్క పాదయాత్రలో స్వయంగా పాల్గొన్నారు. ఎంపి ఉత్తమ్ కుమార్ రెడ్డితోనూ సఖ్యతగా ఉంటున్నారని పార్టీ వర్గాలు చెబుతున్నప్పటికీ.. ఉత్తమ్ వైఖరిలో ఇంకా మార్పు రాలేదని సీనియర్లు చెబుతున్నారు.
ఆయన రెండు నియోజకవర్గాలపై పెత్తనం చేయడాన్ని, అక్కడి నేతలు వ్యతిరేకిస్తున్నారు. ఆ రెండు నియోజకవర్గాల నుంచి.. ఆయన ఎవరినీ ఎదగనీయడం లేదని, పీసీసీ నాయకత్వం కూడా ఉత్తమ్‌పై
ఉన్న మొహమాటంతో, ధైర్యంగా ఎలాంటి నిర్ణయాలు తీసుకోలేకపోతోందన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఇప్పటి పరిణామాల్లో ఉత్తమ్ ఒక్కరే, రేవంత్ పట్ల పాత వైఖరి ప్రదర్శిస్తున్నారని, ఆయనలో మాత్రం మార్పు రాలేదని పార్టీ సీనియర్లు చెబుతున్నారు.
ఈవిధంగా రేవంత్, తన పాత వైఖరిని విడిచిపెట్టి.. అందరినీ సమన్వయం చేసుకుంటున్నట్లు కనిపిస్తోంది. ప్రధానంగా రేవంత్, పార్టీ కోసం కాకుండా.. తన వ్యక్తిగత ప్రచారానికే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తారని, సీనియర్ల వ్యతిరేకతకు అదే కారణమన్నది పార్టీ వర్గాల విశ్లేషణ. సొంత ప్రచారం కోసం ఆయన ఒక బృందాన్ని ఏర్పాటుచేసుకున్నారని, సోషల్‌మీడియా టీముతో.. ఆయనొక్కరే పనిచేస్తున్నారన్న ప్రచారం పొందుతున్నారన్నది సీనియర్ల ఆగ్రహానికి అసలు కారణం. ఆ శైలిని వదిలించుకుంటేనే, పార్టీలో ఎదుగుదల ఉంటుందని చాలామంది సీనియర్లు, రేవంత్‌కు సూచించారన్నది పార్టీ వర్గాల కథనం.