– ఎస్సీ ఎస్టీల రక్షణ కోసం ప్రత్యేక ఫోర్స్,పోలీస్ స్టేషన్లు ఏర్పాటు చేయాలి
– కుటుంబానికి కోటి రూపాయల ఎక్స్ గ్రేషియా ఇవ్వాలి
– బిఆర్ఎస్. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, డా.ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
ఫరూఖ్ నగర్,షాద్ నగర్: ఎర్ర రాజశేఖర్ అనే దళిత యువకుని దారుణ హత్య పోలీసుల నిర్లక్ష్యం వల్లనే జరిగిందని,ఈ హత్యకు పోలీసులే బాధ్యత వహించాలని,హోం శాఖ మంత్రిగా బాధ్యతల నిర్వహణలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విఫలం చెందారని బి ఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్మి డా.ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆరోపించారు.
ఈ రోజు ఎర్ర రాజశేఖర్ కుటుంబాన్ని షాద్ నగర్ బిఆర్ఎస్ నాయకులతో కలిసి పరామర్శించారు.అనంతరం మీడియా సమావేశంలో మాట్లాడుతూ, రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏర్పడ్డాక దళితులపై దాడులు పెరుగుతున్నాయన్నారు.చేవెళ్ల సాక్షిగా దళితులను మోసం చేసి అధికారంలోకి వచ్చాక,దళితులనే చంపుతున్నారన్నారు. ఎర్ర రాజశేఖర్ హత్య ప్రణాళిక బద్దంగా,పోలీసుల సహకారంతో జరిగిందని ఆరోపించారు.రాజశేఖర్ కుటుంబ సభ్యులు,పోలీస్ స్టేషన్ లో జరిగిన ఒప్పంద పత్రంలో నిందితుల కుటుంబం నుండి ప్రమాదం ఉందని చెప్పినా పట్టించుకోలేదన్నారు.
నిందితులు రాజశేఖర్ ఇంటికి వచ్చి బలవంతంగా ఎత్తుకెళ్లారని,అడ్డుగా వచ్చిన భార్యను కూడా తీసుకెళ్లే ప్రయత్నం చేశారన్నారు. గన్ పెట్టి బెదిరించిన రోహిన్ రెడ్డికి ఒక న్యాయం,రాజశేఖర్ కుటుంబానికి ఒక న్యాయం ఉంటుందా? రోహిన్ రెడ్డిని అరెస్ట్ నుండి తప్పించిన టాస్క్ ఫోర్స్ పోలీసులు,పేద వర్గాలకు చెందిన రాజశేఖర్ ప్రాణాన్ని ఎందుకు కాపాడలేదని మండిపడ్డారు. మూడు రోజుల పాటు పోలీసులు బాధిత కుటుంబం ఎక్కడికి వెళ్లినా, నిందితులకు ఎలా తెలిసిందని ప్రశ్నించారు.
100 కి డయల్ చేసినా,పోలీస్ స్టేషన్ కి వెళ్లి ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.ఎర్ర రాజశేఖర్ హత్యకు కారణమైన పోలీసు అధికారులపై కూడా అట్రాసిటీ చట్టం ప్రకారం కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. ఎస్సీ ఎస్టీలపై జరుగుతున్న దాడులను నిలుపుదల చేసేందుకు గ్రే హౌండ్స్ తరహాలో ప్రత్యేక ఫోర్స్ ఏర్పాటు చేయాలని,ఎస్సీ ఎస్టీ లపై నమోదయ్యే కేసుల్లో దర్యాప్తు వేగంగా జరిపేందుకు అన్ని జిల్లాల్లో ప్రత్యేక పోలీస్ స్టేషన్లు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.
అంతేకాకుండా ఎస్సీ,ఎస్టిలపై జరిగిన దాడుల్లో సముచిత న్యాయం జరగడంలేదన్నారు. దిశ,నిర్భయ వంటి చట్టాల వలే, ఎస్సీ ఎస్టీల కోసం కూడా ప్రత్యేక చట్టం రావాలన్నారు. కులాంతర వివాహం చేసుకున్న వారికి రక్షణ కల్పించే చట్టం కూడా తీసుకురావాలని డిమాండ్ చేశారు. దిశ కేసులో ఎన్ కౌంటర్ చేసినట్లు,ఎస్సి ఎస్టీ కేసుల్లో ఎన్ కౌంటర్లు ఎందుకు చేయడంలేదన్నారు. ఎర్ర రాజశేఖర్ కుటుంబానికి కోటి రూపాయల ఎక్స్ గ్రేషియా,డబుల్ బెడ్ రూం ఇల్లు,భార్యకు ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేశారు.
బాధితుడు తండ్రి 103 డిగ్రీల జ్వరంతో బాధపడుతూ న్యాయం కోసం పోరాడుతుంటే కాంగ్రెస్ పార్టీకి చెందిన మంత్రులు అడ్లూరి లక్ష్మణ్ కుమార్,దామోదర రాజనర్సింహ, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, వివేక్ వంటి వారు ఎందుకు రావడం లేదని నిలదీశారు. ఎన్నికల ముందు మల్లిఖార్జున ఖర్గేను తీసుకొచ్చి చేవెళ్ల వేదికగా అబద్దాలు చెప్పించి మోసం చేశారన్నారు. రాజశేఖర్ తో పాటు కోదాడలో కర్ల రాజేష్ అనే యువకుడు కూడా పోలీసులు పెట్టిన టార్చర్ వల్ల మరణించారని గుర్తుచేశారు.
ఇన్ని జరిగినా ఎస్సీ ఎస్టీ ఎమ్మెల్యేలు, మంత్రులు ముఖ్యమంత్రిని ఎందుకు కలిసి ప్రశ్నించడంలేదని విమర్శించారు. కేసిఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నపుడు మరియమ్మ లాకప్ డెత్ కు గురైతే,సంబంధిత అధికారులను డిస్మిస్ చేసినట్లు ఈ అధికారులను డిస్మిస్ చేయాలని డిమాండ్ చేశారు. జైల్లలో,లాకప్ లల్లో అన్ని నేరాల్లో పేద వర్గాలే ఎందుకుంటున్నారని అడిగారు. రాజశేఖర్ హత్య కేసులో నిర్లక్ష్యం వహించిన ఏఎస్సై రాములు,ఎస్సై శ్రీకాంత్ మరియు ఇతర ఇన్సిపెక్టర్ అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు.