– లగచర్ల గిరిజన రైతుల విడుదలకు వెంటనే చర్యలు తీసుకోవాలి
హైదరాబాద్: ఖైరతాబాద్ బీఆర్ఎస్ శ్రేణులు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రం సమర్పించి, లాగచర్ల గిరిజన రైతుల అక్రమ నిర్బంధాన్ని తీవ్రంగా ఖండించారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ నేత డాక్టర్ దాసోజు శ్రవణ్ మాట్లాడుతూ, “లగచర్ల గిరిజన రైతులను అక్రమంగా జైలులో నిర్బంధించి, థర్డ్ డిగ్రీలు ప్రయోగించి రాక్షస ఆనందం పొందుతున్న రేవంత్ రెడ్డి ప్రభుత్వ తీరును తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇది ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధం. అంబేద్కర్ రాజ్యాంగ స్ఫూర్తిని అవమానించే చర్య” అని తీవ్రస్థాయిలో విమర్శించారు.
“రేవంత్ రెడ్డి ప్రభుత్వం కోర్టులను కూడా తప్పుదోవ పట్టిస్తూ గిరిజన రైతులకు అవసరమైన బెయిల్ రాకుండా అవరోధాలు సృష్టిస్తోంది. రైతులను జైళ్లలో ఉంచి అన్యాయంగా ఇబ్బందులు పడేలా చేస్తున్న రేవంత్ రెడ్డి ప్రభుత్వ తీరును తాము తీవ్రంగా ఖండిస్తున్నాం. అంతేకాక, ఈ అత్యంత కీలకమైన అంశంపై అసెంబ్లీలో చర్చకు కూడా అనుమతించకపోవడం దురభిమానం” అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి సహా లగచర్ల రైతులపై పెట్టిన అక్రమ కేసులు వెంటనే ఎత్తివేయాలని, వారి విడుదల కోసం తక్షణ చర్యలు చేపట్టాలని” డిమాండ్ చేశారు. “రైతన్నల హక్కులను రక్షించడం ప్రభుత్వ బాధ్యత, రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విలువలతో ప్రభుత్వాలు ముందుకు సాగాలి. లాగచర్ల ఘటనలో నిరంకుశ విధానాలకు పాల్పడుతున్న రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని బీఆర్ఎస్ పార్టీ నిలదీస్తుంది” అని స్పష్టం చేశారు.
“బీఆర్ఎస్ పార్టీ రైతన్నల పక్షాన ఎల్లప్పుడూ నిలబడి పోరాటం చేస్తుంది. కాంగ్రెస్ ప్రభుత్వ నిరంకుశ వైఖరిని బహిరంగంగా ఎండగడుతూ, ప్రజల హక్కులను కాపాడేందుకు ఎప్పుడూ ముందుంటుంది” అని డాక్టర్ దాసోజు శ్రవణ్ స్పష్టం చేశారు.
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు, ఖైరతాబాద్ బీఆర్ఎస్ శ్రేణులు ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ వినతిపత్ర సమర్పణ కార్యక్రమంలో దాసోజు శ్రవణ్ , మన్నే కవిత , మన్నే గోవర్ధన్ రెడ్డి , శ్రీధర్ రెడ్డి , విప్లవ్ తదితర నేతలు పాల్గొన్నారు.