Suryaa.co.in

Andhra Pradesh

ఇది లీక్‌ల ప్రభుత్వం

ప్రశ్నపత్రాల లీక్‌తో విద్యార్థులకు నష్టం
అందుకు ప్రభుత్వానిదే పూర్తి బాధ్యత
విద్యా శాఖ మంత్రి లోకేశ్‌ అసమర్థతే అందుకు కారణం
– వైయస్సార్‌సీపీ విద్యార్థి విభాగం ప్రెసిడెంట్‌ రవిచంద్ర ధ్వజం

తాడేపల్లి: హాఫ్‌ ఇయర్లీ పరీక్షలు కూడా సమర్థవంతంగా నిర్వహించలేని దుస్థితిలో కూటమి ప్రభుత్వం ఉందని, పరీక్ష ప్రారంభమైన గంటలో గణిత ప్రశ్నాపత్రం ఆన్‌లైన్‌లో ప్రత్యక్షమైన ఘటన విద్యార్థుల భవిష్యత్తు పట్ల కూటమి ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదనే విషయాన్ని తేటతెల్లం చేస్తోందని వైయస్సార్‌సీపీ విద్యార్థి విభాగం రాష్ట్ర వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ ఎ.రవిచంద్ర ఆక్షేపించారు.

సీల్డ్‌ కవర్‌లో రావాల్సిన ప్రశ్నాపత్రాలు లీకై యూట్యూబ్‌లో దర్శనమిచ్చాయంటే రాష్ట్రంలో విద్యా విధానం ఎంత లోపభూయిస్టంగా ఉందో అర్థం చేసుకోవచ్చని పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన రవిచంద్ర స్పష్టం చేశారు. సాధారణ పరీక్షలను కూడా పాఠశాల విద్యాశాఖ సమర్థవంతంగా నిర్వహించలేకపోతున్న నేపథ్యంలో పబ్లిక్‌ పరీక్షల్లో ఇలాంటి లోపాలు తలెత్తితే విద్యార్థుల భవిష్యత్తుకు ఎవరు భరోసా ఇస్తారు?.

సంబంధిత శాఖను నిర్వహిస్తున్న మంత్రి లోకేశ్‌కి విద్యాశాఖ పట్ల అవగాహన, నియంత్రణ లేదనే విషయాన్ని ఈ ఘటన స్పష్టంగా తెలియజేస్తోంది. విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్‌.. సకల శాఖల మంత్రిగా మారి చివరికి తాను నిర్వహించే విద్యాశాఖనే సరిగ్గా నిర్వహించకుండా గాలికొదిలేశారు. అలా విద్యార్థుల భవిష్యత్తును అంధకారంలోకి నెడుతున్నారు.

విద్యార్థుల భవిష్యత్తుపై ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు కాబట్టే లీకేజీ ఘటనపై కాలయాపన చేయడానికి కమిటీలు వేశారు. నిజానికి చంద్రబాబు ప్రభుత్వం అంటేనే లీకేజీలకు పెట్టింది పేరు. ప్రశ్నాపత్రాల లీకేజీ ఘటనలకు చంద్రబాబు ఆద్యుడు. గతంలో 1997లో కూడా ఇంటర్‌ ప్రశ్నాపత్రం లీకైంది. ఎంసెట్‌ పరీక్ష పత్రాలు కూడా ఆయన సీఎంగా ఉండగానే లీకయ్యాయి. ఇప్పుడు ఆయన కుమారుడు నారా లోకేశ్‌ తండ్రి వారసత్వాన్ని పుచ్చుకున్నట్టుగా సాధారణ హాఫ్‌ ఇయర్లీ పరీక్షలను కూడా సక్రమంగా నిర్వహించలేక చేతులెత్తేశారు.

నాడు వైస్‌ జగన్‌ పాలనలో నాడు–నేడు మనబడి కార్యక్రమంతో ప్రభుత్వ స్కూళ్లను కార్పొరేట్‌ స్థాయికి తీర్చిదిద్దితే నేడు కూటమి పాలనలో పాఠశాల విద్య తీసికట్టుగా మారింది. మొన్న ప్రభుత్వం నిర్వహించిన పేరెంట్‌ టీచర్‌ మీటింగ్‌లో వైఎస్‌ జగన్‌ పాలన ఫలితంగా రూపుదిద్దుకున్న పాఠశాలల అభివృద్ధిని కూటమి నాయకులంతా కళ్లారా చూశారు.

కూటమి ప్రభుత్వంలో ఆరు నెలల పాలనలోనే విద్యావ్యవస్థను భ్రష్టు పట్టించారు. విద్యా దీవెన, వసతి దీవెన, తల్లికి వందనం పథకాలకు మంగళం పాడేశారు. టోఫెల్‌ విద్యాబోధన, ఇంగ్లిష్‌ మీడియం తీసేశారు.

ఇంకా ఉన్నత విద్యామండలికి ఛైర్మన్‌ను కూడా నియమించలేని దుస్థితిలో ప్రభుత్వం ఉంది. రాష్ట్రంలోని 17 యూనివర్సిటీల్లో వీసీ పోస్టులు ఖాళీగా ఉన్నా, సమీక్షల పేరుతో కాలయాపన చేస్తున్నారు. ఈ ప్రభుత్వానికి విద్యారంగంపై, విద్యార్థులపై చిత్తశుద్ధి ఉంటే వెంటనే మొద్దునిద్ర వీడి లీకేజీ ఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలని, పిల్లల పథకాలన్నీ అమలు చేయాలని రవిచంద్ర చెప్పారు.

LEAVE A RESPONSE