– బిడ్డ పెళ్లికి కూడా వెళ్లకుండా చేసినా వాళ్లపై చర్యలు తీసుకోవడం లేదంటే ఆయనకు చేతగావడం లేదు
– కేసీఆర్ ఫ్యామిలీని టచ్ చేసే దమ్ము కాంగ్రెస్ కు లేనేలేదు
– ముడుపులు దండుకునేందుకు విచారణ పేరుతో సాగదీతలు
– ఫోన్ ట్యాపింగ్ జరిగిందనడానికి ఆధారాలన్నీ ఉన్నాయి
– పోలీసులే విచారణ సందర్భంగా నాకు ఆధారాలు, సాక్షాలు చూపారు
– అయినా కేసీఆర్ కుటుంబాన్ని ఎందుకు అరెస్ట్ చేయడం లేదు?
– మంది కొంపలు ముంచిన కేటీఆర్ వ్యక్తిత్వ హననం గురించి మాట్లాడటమా?
– నాడు కేటీఆర్ చేసిన అరాచకాలు గుర్తుకొస్తే మా రక్తం మరుగుతోంది
– కేటీఆర్ ఫోన్ ట్యాపింగ్ చేయించినందుకు పిలిచారా?
– లేక ఆయన ఫోన్ కూడా ట్యాప్ అయ్యిందని చెప్పడానికి పిలిచారా?
– కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ సంచలన వ్యాఖ్యలు
కరీంనగర్: ఫోన్ ట్యాపింగ్ తో పాటు అనేక అవినీతి, అక్రమాలు, అరాచకాలకు పాల్పడినప్పటికీ కేసీఆర్ కుటుంబాన్ని టచ్ చేసే దమ్ము కాంగ్రెస్ ప్రభుత్వానికి లేనేలేదని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి పౌరుషం లేదని, చేతులు ముడుచుకుని కూర్చున్న అసమర్ధ ప్రభుత్వమని మండిపడ్డారు. ఢిల్లీకి ముడుపులు కోసమే ఫోన్ ట్యాపింగ్ విచారణ పేరుతో సాగదీస్తున్నారని అన్నారు.
విచారణ పేరుతో హడావుడి చేసినప్పుడల్లా ఫాంహౌజ్ నుండి ఏఐసీసీకి ముడుపులు వెళుతున్నాయని చెప్పారు. ఫోన్ ట్యాపింగ్ జరిగిందనడానికి అన్ని ఆధారాలు, సాక్షాలు పోలీసుల వద్ద ఉన్నాయని, తనను విచారణకు పిలిచిన సమయంలో ఆ ఆధారాలను, సాక్షాలను సైతం చూపించారని తెలిపారు. జడ్జీల ఫోన్లను కూడా ట్యాప్ చేసినట్లు తేలిందన్నారు.
అయినా కేసీఆర్ కుటుంబాన్ని ఎందుకు అరెస్ట్ చేయడం లేదని ప్రశ్నించారు. కరీంనగర్ లో మీడియాతో మాట్లాడిన బండి సంజయ్ ఫోన్ ట్యాపింగ్ పై ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుతోపాటు కేటీఆర్ అరాచకాలను వివరిస్తూ తీవ్రస్థాయిలో స్పందించారు. ఏమన్నారంటే…
ఫోన్ ట్యాపింగ్ పై సిట్ విచారణ టీవీ సీరియల్ ను మించి ఆది అంతం లేకుండా కొనసాగుతూనే ఉంది. కొండను తవ్వి ఎలుకను కూడా పట్టలేకపోతున్నారు. సిట్ అధికారులకు స్వేచ్ఛ ఇవ్వడం లేదు. ప్రభుత్వంలో కొందరు పెద్దలు ఆదేశాలకు అనుగుణంగానే విచారణ చేస్తున్నారు. నిజానికి సిట్ అధికారులు సమర్ధులు, నిజాయితీపరులు. కానీ వాళ్లపై ప్రభుత్వం జులుం ప్రదర్శిస్తోంది. ఆ పెద్దలు ఎవరిని పిలవమని అడిగితే వాళ్లనే పిలిచి విచారణ చేస్తున్నారు.
నేనడుగుతున్నా.. కేటీఆర్ ను ఎందుకు విచారణకు పిలిచారు? ఆయన ఫోన్ ట్యాపింగ్ చేయించినందుకు పిలిచారా? లేక ఆయన ఫోన్ కూడా ట్యాప్ అయ్యిందని చెప్పడానికి పిలిచారా? సిరిసిల్ల కేంద్రంగా వార్ రూంను ఏర్పాటు చేసి ఫోన్ ట్యాపింగ్ చేశారని నేను చాలా సార్లు చెప్పిన. యువరాజు కేటీఆర్ ఆడిందే ఆటగా ఫోన్ ట్యాపింగ్ చేయించి పాలనను కొనసాగించారు.
బ్రిటీష్ పాలన తరహాలో పాలన చేశారు. ఫోన్ ట్యాపింగ్ ద్వారా రూ.వేల కోట్ల లావాదేవీలు జరిగాయి. రియల్ ఎస్టేట్ బిల్డర్లు, వ్యాపారులను, సినీ నటులను బెదిరించి కోట్లు దండుకున్నారు. బెదిరించి బీఆర్ఎస్ పార్టీకి ఎలక్ట్రోరల్ బాండ్స్ కొనుగోలు చేయించారు. నా ఫోన్లను, ప్రస్తుత సీఎం, మంత్రుల ఫోన్లతోపాటు జడ్జీల ఫోన్లను కూడా ట్యాప్ చేశారు. కేసీఆర్ కుటుంబమే ఇదంతా చేసింది. అసలు కారకులైన వాళ్లను సాక్షిగా పిలిచి విచారణ పేరుతో వాంగ్మూలం నమోదు చేయడమేంటి?
రెండేళ్ల విచారణలో సిట్ సాధించిందేమిటి? ఒక్క రాజకీయ నాయకుడినైనా అరెస్ట్ చేశారా? ఎన్ని ఆస్తులు జప్తు చేశారు? ఎంత మందిపై చర్యలు తీసుకున్నారు?… స్వయంగా కేసీఆర్ కూతురే తన ఫోన్ ట్యాప్ చేశారని చెప్పారు. మాజీమంత్రి హరీష్ రావు ఆ టైంలో ఏడాదిపాటు ఫోన్ కూడా వాడలేదు. ఇన్ని సాక్షాలు, ఆధారాలున్నా ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు?
ఎందుకు అరెస్ట్ చేయడం లేదు? కేసీఆర్ పాలనలో సామాన్యులు మొదలు భిక్షాటన చేసే వ్యక్తులు కూడా ఫోన్ ఉన్నా వాట్సప్ కాల్ లో తప్ప నార్మల్ కాల్ మాట్లాడలేని పరిస్థితి తీసుకొచ్చారు. ఇంత దారుణానికి దొంగలను పిలిచి ‘మీ ఫోన్ ట్యాప్ చేశారా?’అని విచారణకు పిలవడం ఏంది?
అసలు కేసీఆర్ కుటుంబాన్ని అరెస్ట్ చేసే దమ్ము ఈ ప్రభుత్వానికి లేదు. ఫోన్ ట్యాపింగ్ పేరుతో టైం పాస్ విచారణ చేస్తున్నారు. సిట్ అధికారులు మంచి అధికారులు. వాళ్లకు స్వేచ్ఛనిచ్చి విచారణ జరిగేలా చూడాలి. అట్లా కాకుండా ప్రభుత్వ వ్యవహారశైలికి విసిగిపోయి సిట్ నుండి తప్పుకునే ప్రమాదముంది.
నన్ను సిట్ విచారణకు పిలిచి 6 నెలలైంది. మావోయిస్టు జాబితాలో నా నెంబర్ ఉంచి ఫోన్ ట్యాప్ చేశారని పోలీసులే చెప్పారు. ఆధారాలు కూడా నాకు చూపించారు. అంతెందుకు సాక్షాత్తు సీఎం రేవంత్ రెడ్డి ఫోన్లను కూడా ట్యాప్ చేశారని ఆయనే చెప్పారు కదా? సీఎం స్థాయి వ్యక్తి ఆధారాల్లేకుండా మాట్లాడరు కదా? అయినా ఇంతవరకు చర్యలు తీసుకోలేదు? ఇదంతా డ్రామా.
విచారణకు పిలిచినప్పుడల్లా ఏఐసీసీకి ఎక్కువ ముడుపులు అందుతున్నాయోమో. ఏఐసీసీకి, ఫాంహౌజ్ కు మధ్య పూర్తి డీల్ కుదరకపోవడంతోనే విచారణ పేరుతో డ్రామాలాడుతున్నారు. జడ్జీల ఫోన్లను కూడా ట్యాప్ చేస్తే చర్యలు తీసుకోకపోతే ఇక సామాన్యుల పరిస్థితి ఏంది? వాళ్లు ఎవరికి చెప్పుకోవాలి?
ఇకనైనా కాంగ్రెస్ కు చిత్తశుద్ధి ఉంటే అరెస్టుల పర్వం కొనసాగించండి. తప్పు చేసిన రాజకీయ నాయకులను, అధికారులను అరెస్ట్ చేయండి. అప్పుడే కాంగ్రెస్ ప్రభుత్వంపట్ల ప్రజలకు నమ్మకం ఏర్పడతది. లోపాయికారీ ఒప్పందాలతో డ్రామాలు చేస్తే నమ్మేంతటి పిచ్చోళ్లు ఎవరూ లేరు.
మళ్లీ చెబుతున్నా…కేసీఆర్ కుటుంబ అవినీతి, అరాచకాలపై చర్యలు తీసుకునే దమ్ము కాంగ్రెస్ ప్రభుత్వానికి లేదు. ఇయాళ కేటీఆర్ ఫోన్ ట్యాపింగ్ దొంగ. సిరిసిల్ల కేంద్రంగా ఫోన్ ట్యాపింగ్ చేయించింది కేటీఆరే. ఆ దొంగే నీతులు చెబితే నమ్మే పరిస్థితుల్లో నేను లేను.
మంది కొంపలు ముంచి వ్యక్తిత్వ హననం గురించి మాట్లాడతారా? కేటీఆర్ చేసిన అరాచకాలు ఇంకా మా కళ్ల ముందు కన్పిస్తున్నాయి. ఈ సర్కార్ కు చేతగాదు. బీజేపీని ఆశీర్వదించి అధికారం అప్పగిస్తే కేసీఆర్ కుటుంబానికి చుక్కలు చూపేవాళ్లం. దారుణాలు, అక్రుత్యాలు చేసే వాళ్లకు సొసైటీలో ఏ విధమైన గుణపాఠం చెప్పేవాళ్లమో చూపేవాళ్లం. ఈ ముఖ్యమంత్రికి దమ్ము లేదు. చేతగాదు.
కేసీఆర్ కుటుంబాన్ని అరెస్ట్ చేసే ఆలోచనే లేదు. కాంప్రమైజ్ పొలిటిక్స్ మాత్రమే చేస్తున్నరు. అసలు రేవంత్ రెడ్డికి పౌరుషమే లేదు. డ్రోన్ ఎగరేశారని అరెస్ట్ చేసి, బిడ్డ పెళ్లికి కూడా వెళ్లకుండా చేసినా వాళ్లపై చర్యలు తీసుకోవడం లేదంటే, ఆయనకు చేతగావడం లేదు. మా రక్తం మరుగుతోంది. మా కార్యకర్తలపై అడుగడుగునా లాఠీఛార్జ్ చేసి కేసులు వేధించిన ద్రుశ్యాలు మా కళ్లముందు కన్పిస్తున్నాయి. మేం అధికారంలోకి వచ్చి ఉంటే ఒక్కో లాఠీ దెబ్బకు ఒక్కో గుణపాఠం చెప్పేవాళ్లం.
ఫోన్ ట్యాపింగ్ చేసి దేశ భద్రత కోసమేనని చెప్పడానికి సిగ్గు లేదా? మావోయిస్టు జాబితాలో రేవంత్ రెడ్డితోపాటు నా పేరు, జడ్జీల పేర్లు పెట్టారు. మీ అక్రమ దందా కోసం సినిమా నటులను, వ్యాపారుల, రియల్ ఎస్టేట్ వ్యాపారుల పేర్లు పెడతారా? దేశంలో ఎక్కడా లేనివిధంగా తెలంగాణలోనే ఫోన్ ట్యాపింగ్ పేరుతో జడ్జీల పోన్లను కూడా ట్యాప్ చేసి ఇంకా సిగ్గు లేకుండా దేశ భద్రత అని తప్పించుకోవాలని చూస్తున్నారా? కేటీఆర్ ఇచ్చిన స్టేట్ మెంట్ ను వాంగ్మూలం గా భావించి పూర్తిస్థాయి విచారణ జరిపి చర్యలు తీసుకోవాలి.
కేసీఆర్ కుటుంబాన్ని టచ్ చేసే దమ్ము రేవంత్ రెడ్డి సర్కార్ కు లేదు. సాక్షాత్తు సీఎంను పట్టుకుని ఎడమ చేతి చెప్పుతో కొట్టాలని ఉందని అంటున్నా, కాంగ్రెసోళ్లకు పౌరుషం లేదు. అధికారం ఉంది కదా..అని కోట్లు దండుకోవడంపై దృష్టి పెట్టారు.
ఫోన్ ట్యాపింగ్ సహా కేసీఆర్ పాలనలో జరిగిన అవినీతి, అక్రమాలపై విచారణ జరిపి చర్యలు తీసుకోవడం మాకు చేతగాదని, అసమర్ధులమని, చేవ చచ్చినోళ్లమని కాంగ్రెస్ ప్రభుత్వం ఒప్పుకుని సీబీఐ విచారణ జరపాలని కేంద్రానికి లేఖ రాస్తే అప్పుడు కేంద్రం చర్యలు తీసుకునేందుకు సిద్దం.