– గోదావరి బనకచర్లకు అత్యంత కీలకమైన అనుమతి వచ్చింది
– 200 టీఎంసీలు తీసుకుపోయే వెసులుబాటు ఉందని క్లియర్ గా చెప్పింది
– ఢిల్లీ మీటింగ్ అయిన 15 రోజులకే బనకచర్లకు అనుమతి
– ఈ లెటర్ వచ్చింది మీకు తెలుసా? తెల్వదా?
– గోదావరి నల్లమలసాగర్ కు వ్యతిరేకం అని తీర్మానం చెయ్యి.
– ఢిల్లీకి కదులు.. సిడబ్లుసి ఆఫీస్ ముందు ధర్నా చేద్దాం పద
– తెలంగాణ మీద ప్రేమ ఉన్నోడయితే కేంద్రం మీద యుద్దం చేయాలె
– ఈ ప్రభుత్వం వద్ద ఈ డాక్యుమెంట్ కూడా లేదు.. నేను విడుదల చేస్తున్నా
– నల్లమల సాగర్ అక్రమ నిర్మాణానికి సూత్రధారి చంద్రబాబు, పాత్రధారి రేవంత్ రెడ్డి
– కత్తి చంద్రబాబుది అయినా, పొడిచే వాడు రేవంత్ రెడ్డి
– నీటి హక్కులకు అడ్డంపడ్డ సైంధవుడు ఆదిత్యానాథ్ దాస్
– తెలంగాణ భవన్ లో మాజీ మంత్రి హరీశ్ రావు
హైదరాబాద్: గోదావరి బనకచర్లతో జల దోపిడికి ప్రయత్నం చేసిన ఏపీ నష్టాన్ని తగ్గించడం కోసం బనకచర్ల నుంచి నల్లమల సాగర్ కు మార్చుకోవడం జరిగింది. అది బనకచర్ల అయినా నల్లమల సాగర్ అయినా జరిగేది తెలంగాణ జల దోపిడీ. నల్లమల సాగర్ అక్రమ నిర్మాణానికి సూత్రధారి చంద్రబాబు, పాత్రధారి రేవంత్ రెడ్డి. కత్తి చంద్రబాబుది అయినా, పొడిచే వాడు రేవంత్ రెడ్డి.
రేవంత్ రెడ్డి జల ద్రోహానికి పాల్పడుతున్నాడు
ముఖ్యమంత్రినా లేక చంద్రబాబుకు గురుదక్షిణ చెల్లిస్తున్నడా? బనకచర్ల ముప్పును ముందుగా పసిగట్టి రణభేరి మోగించిందే బిఆర్ఎస్. నేను ముల్లుకర్ర కాదు బల్లెం పెట్టి పొడిస్తే గాని ఈ ప్రభుత్వం మొద్దు నిద్ర లేవలేదు. ఎన్నో ప్రెస్ మీట్లు పెట్టి, ఎప్పటికప్పుడు హెచ్చరించినా ప్రభుత్వం తగిన స్థాయిలో స్పందించలేదు. బనకచర్ల విషయంలో బీఆర్ఎస్ పోరాటం చేసింది. పాత డేట్లు వేసి లెటర్లు విడుదల చేసిండు ఉత్తం కుమార్ రెడ్డి.
మేం పోరాటం చేస్తున్న సమయంలో కేంద్రం, ఢిల్లీలో కేంద్ర ప్రభుత్వం ఏపీ, తెలంగాణతో మీటింగ్ పెట్టింది. పోను పోను అనుకుంటూనే బనకచర్ల మీటింగ్ ఉరికిండు. అపెక్స్ మీటింగ్ కు కాకుండా వేరే ఏ రకమైన సమావేశానికి హాజరు కావొద్దని మేం ఆనాడు గట్టిగా హెచ్చరించినం.
పోను అనుకుంటూనే పోయి కూసున్నడు. పెట్ట పెట్ట అనుకుంటనే సంతకం పెట్టిండు.
మేం నిలదీస్తే, నిలబెట్టి కడిగేస్తే బనకచర్ల మీటింగ్ ఎజెండాలోనే లేదని, కనుక చర్చ జరిగే ప్రసక్తే లేదని డైలాగులు దంచిండు. మేం ఎజెండా బయట పెట్టి బట్టలిప్పినం. బట్టబయలు చేసినం.
ఏపీ ఇరిగేషన్ మంత్రి నిమ్మల రామానాయుడు కూడా బండారం బయట పెట్టిండు. బనకచర్లపై చర్చ జరిగిందని, బనకచర్ల ప్రాజెక్టు నిర్మాణాన్ని సుసాధ్యం చేసేందుకు కమిటీ ఏర్పాటు అయ్యిందని మీడియా ముఖంగా చెప్పిండు. బనకచర్లను బంద్ పెడుతున్నం అని పేరుకు ఏపీ ప్రకటించింది. అంతే, అది కూడా తన ప్రతాపం అని డబ్బా కొట్టుకున్నడు. ఈ సీఎం, నీళ్ల మంత్రి.
రేవంత్ రెడ్డి ఉద్యమకారుల మీద రైఫిల్ ఎక్కు పెట్టి ఉద్యమకారున్ని అంటడు. సోనియా గాంధీని బలిదేవత అని తిట్టి వీర కాంగ్రెస్ వాదిని అంటడు. కేసీఆర్ ఇచ్చిన నోటిఫికేషన్లకు నియామకపత్రాలు ఇచ్చి ఉద్యోగాలు నేనే ఇచ్చిన అంటడు. బనకచర్ల మీద జంగ్ సైరన్ ఊది, పోరాటానికి దిగింది మేం అయితే, ఆపింది తామని జబ్బలు చరుచుకున్నడు.
అసలు ఏం జరిగింది… పేరుకు మాత్రమే వాళ్లు ప్రాజెక్టు ఆపుతున్నం అని ప్రకటించారు. ఆపలేదు. పోలవరం నుంచి బనకచర్లలో కలపకుండా, పోలవరం నల్లమల సాగర్ కు లింకు చేశారు. ఎందుకంటే.. గోదావరి నీళ్లు కృష్ణా ద్వారా తరలిస్తే, గోదావరి అవార్డు ప్రకారం, 45:21:14 తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్రకు కృష్ణాలో నీటి వాటా ఇవ్వాల్సి ఉంటుంది. పోలవరం బనకచర్ల ప్రాజెక్టు విషయంలో ఈ రూల్ వర్తిస్తుంది.
ఈ విధంగా కూడా తెలంగాణకు నీటి వాటా దక్కకుండా ఉండేందుకు కృష్ణాలో కలుపకుండానే, పెన్నా బేసిన్ కు గోదావరి నీటిని తరలించే పెద్ద కుట్రకు తెరతీసిండు రేవంత్ రెడ్డి. నిజానికి పోలవరం బనకచర్ల విషయంలో కర్ణాటక, మహారాష్ట్రలు తీవ్ర అభ్యంతరాలు తెలుపుతూ లేఖలు రాశాయి. సెప్టెంబర్ 17, 2025 నాడు కర్ణాటక ప్రభుత్వం కేంద్ర జల శక్తి మంత్రిత్వ శాఖకు లేఖ రాసింది.
అందులో ఏముంది.. 80, 100, 243 మొత్తంగా 423 టీఎంసీలు ఏపీ తీసుకువెళ్తే మాకు 112 టీఎంసీల నీళ్లు కృష్ణాలో ఆపుకుంటాం అని రాసింది. ఇంటర్ స్టేట్ అగ్రిమెంట్ ప్రకారం, గోదావరి నీళ్లు తరలిస్తే.. మరుసటి రోజు నుంచి మీద నీళ్లు ఆపుతం అన్నరు మహారాష్ట్ర కూడా తను రాసిన లేఖలో అభ్యంతరాలను స్పష్టంగా చెప్పింది. అసలు ఫ్లడ్ వాటర్ మీద ముందుకు వెళ్ల కూడదు, ఒక వేళ వెళ్తే మహారాష్ట్ర వాట చెప్పండి అని డిమాండ్ చేసింది.
వరద జలాల మీద కట్టే ప్రాజెక్టు కట్టేందుకు ఏపీకి అవకాశం ఇస్తే అదేవిధంగా ప్రాజెక్టులు కట్టేందుకు డీపీఆర్లు పంపుతం అన్నరు. కృష్ణాలో 74 టీఎంసీలు మా వాటా నీళ్లు ఆపుకుంటం, వరద ప్రాజెక్టులు కడుతం విదర్భ కు నీళ్లు తీసుకుపోతం అన్నరు. కర్ణాటక 112 నీళ్లు ఆపుకుంటం అంటది. మహారాష్ట్ర నేమో కృష్ణాలో 74 టీఎంసీలు ఆపుకుంటం అన్నది.
మరో వైపు తెలంగాణకు 45 నిష్పత్తిలో వాటా దక్కుతుంది. ఈ వాటా తెలంగాణతో సహా ఏ రాష్ట్రానికి దక్కుండా చేసేందుకు గంపగుత్తగా నీళ్లు తరలించేందుకు పోలవరం నల్లమలసాగర్ ప్రాజెక్టుకు భారీ స్కెచ్ వేసింది ఏపీ. ఈ ప్లాన్ కర్ణాటక, మహారాష్ట్రకు అర్థం అయ్యింది, తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వానికి మాత్రం అర్థం కాలేదు.
అసలు రేవంత్ రెడ్డి ఏమన్నడు.. ఢిల్లీ మీటింగ్ కు పోను అన్నడు, చర్చే లేదన్నడు. కమిటీ లేదన్నడు. ఇప్పుడు ఏం చేసిండు కమిటీ వేసిండు. ఏపీ కమిటీ వేస్తే, రేవంత్ రెడ్డి కూడా కమిటీ వేసిండు. కేంద్ర ప్రభుత్వానికి పేర్లు కూడా సూచించిండు.
15.12.2025 నాడు చంద్రబాబు కమిటీ వస్తే, 23 నాడు రేవంతు రెడ్డి కూడా కమిటీ వేసిండు. ఆ కమిటీ ఎవరితో వేసిండు, చంద్రబాబు దాసుడు, చంద్రబాబు సూచించిన వ్యక్తి ఆదిత్యానాథ్ దాస్.
దోపిడీ దారుల ఏజెంటు, ఏపీకి నమ్మిన బంటు, ఇప్పుడు.. నీకు సలహాదారుడు, తెలంగాణకు వెన్నుపోటు దారుడు ఘనత వహించిన ఆదిత్యానాథ్ దాస్. అడుగడుగునా తెలంగాణ ఆకాంక్షలకు, నీటి హక్కులకు అడ్డంపడ్డ సైంధవుడు ఎవరు? ఇదే ఆదిత్యానాథ్ దాస్.
తెలంగాణ నీళ్లు తెలంగాణకు దక్కకుండా ఎట్లా చేయవచ్చో ఆంధ్రా ప్రభుత్వానికి నేర్పించింది ఎవరు? ఇదే ఆదిత్యానాథ్ దాస్. తెలంగాణ ప్రాజెక్టులను అడ్డుకోవడానికి ఏపీ ప్రభుత్వ పక్షాన అత్యంత శ్రద్దగా 100కి పైగా లేఖలు సంధించిందెవరు? ఇదే ఘనత వహించిన ఆదిత్యానాథ్ దాస్.
రాయలసీమ ఎత్తిపోతల పనులను ఏపీ వేగంగా పూర్తి చేసేందుకు తోడ్పాడు అందించింది ఇదే ఆదిత్యానాథ్ దాస్.
ఏపీ ప్రభుత్వానికి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఉన్న సమయంలో రాష్ట్ర విభజన చట్టానికి ట్రిబ్యునల్ అవార్డుకు వ్యతిరేకంగా పోలవరం విస్తరణ పనులు చేపట్టి, సామర్థ్యానికి మించి గోదావరి జలాలు తరలించే కుట్రలు చేసింది ఈ ఆదిత్యానాథ్ దాసే.
పోలవరం బనకచర్ల, పోలవరం నల్లమల సాగర్ లింకు ప్రాజెక్టులకు తెరవెనుక సూత్రధారి ఆయనే
చంద్రబాబు ఆదేశాలతోనే రేవంతు రెడ్డి ఈ ఆదిత్యానాథ్ దాసును నీటి పారుదల శాఖ సలహాదారుడిగా నియమించుకున్నారనేది స్పష్టం. ఆదిత్యానాథ్ దాస్ చంద్రబాబుకు దాసుడు అన్నది వాస్తవం. అసలు కమిటీనే వేయొద్దంటే, కమిటీ వేసినవు. ఆ కమిటీలో ఆదిత్యానాథ్ చైర్మన్? దొంగకు తాళం ఇచ్చినట్లే కదా? రేవంత్ కోవర్టు అనడానికి ఇంతకంటే సాక్షం ఏం కావాలి.
రేవంత్ రెడ్డి ఉద్యమ ద్రోహి మాత్రమే కాదు, జల ద్రోహి. ఏపీ ప్రభుత్వం 11.12.2025 చివరి తేదీతో టెండర్ వేస్తే, అది అయిపోయాక తెలంగాణ ప్రభుత్వం 16 తేదీ నాడు కోర్టుకు వెళ్లింది.ఈ కేసు నీరు కార్చేందుకు తెలంగాణ ప్రభుత్వం 23.12.2025 నాడు కమిటీ వేసింది. ఒక పక్క కేసు వేస్తారు, మరో పక్క కమిటీ వేసి కేసు వీగిపోయేందుకు మీరే మార్గం సృష్టిస్తారు.
రేపు కోర్టులో ఏపీ ఏమంటది? నీళ్ల వివాద పరిష్కారానికి మేం పరస్పరం చర్చించుకోవడానికి వీలుగా రెండు రాష్ట్రాల ప్రతినిధులతో కమిటీ వేసుకున్నం, మేమే పరిష్కరించుకుంటం అంటది.
ఇగ అప్పుడు ప్రభుత్వం వేసిన కేసులో బలం ఏముంటది, కోర్టు ఏం అంటది పరస్పర చర్చల్లో పరిష్కరించుకొని రండి అంటది. కేసు వేసినప్పుడు కోర్టులో తేల్చుకో.. మల్లా కమీటీ ఎందుకు, చర్చలెందుకు, అందులో ఆదిత్యానాథ్ దాస్ ఎందుకు? ఇదంతా డ్రామా? కొట్టినట్లు ఉండాలె దెబ్బ తాకద్దు. ఆపినట్లు ఉండాలె ప్రాజెక్టు ఆగొద్దు. ఏపీ జలదోపిడి సాగాలె, తెలంగాణ నిండ మునగాలె.
మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే.. బాధతో చెబుతున్నా. ఈ రాష్ట్ర ప్రభుత్వం వద్ద ఈ డాక్యుమెంట్ కూడా లేదు. నేను విడుదల చేస్తున్నా. తెలంగాణ మీద ప్రేమ ఉన్నోడు అయితే, కేంద్రం మీద యుద్దం చేయాలె. గోదావరి బనకచర్లకు అత్యంత కీలకమైన అనుమతి రానే వచ్చింది. ఈ ప్రభుత్వానికి సోయి లేదు, మొద్దు నిద్ర నటిస్తున్నది. ఇందులో ఏముంది.. 200 టీఎంసీలు తీసుకుపోయే అవకాశం ఉంది, వెసులుబాటు ఉందని క్లియర్ గా చెప్పింది. ఈ లెటర్ వచ్చింది మీకు తెలుసా, తెల్వదా మీ ప్రభుత్వం పని చేస్తున్నదా? ఢిల్లీ మీటింగ్ అయిన 15 రోజులకే బనకచర్లకు అనుమతి వచ్చింది. ఆ మీటింగ్ లో నువ్వు అంగీకరించినవు గనుకనే పర్మిషన్ వచ్చింది.
ధాన్యం కొనుగోలు చేయకుంటే మేం ఢిల్లీలో ధర్నా చేసినం. 940 టీఎంసీల అనుమతులు సాధించిండు కేసీఆర్; సెక్షన్ 3 సాధించిండు కేసీఆర్. నువ్వేమో ఆంధ్రాకు ఊడిగం చేస్తున్నవు, ఏపీ ముఖ్యమంత్రి చెప్పినట్లు చేస్తున్నవు. తెలంగాణకు ద్రోహం చేస్తున్నవు. 5 నెలల క్రితమే సెంట్రల్ వాటర్ కమిషన్ నుంచి అనుమతి వస్తే నువ్వే చేస్తున్నావు? ఉద్యమ ద్రోహివి, జల ద్రోహివి నువ్వు.
బనకచర్ల విషయంలో నిద్ర లేపినం, ఇప్పుడు కూడా లేపినం. కమిటీ వేయకు, ఆదిత్యానాథ్ దాసును తొలగించు. కమిటీలో ముగ్గురు ఆంధ్రా మూలాలు ఉన్న వాళ్లను పెట్టినవు.తెలంగాణకు ఎలా న్యాయం జరుగుతుంది? రేవంత్ రెడ్డి ప్రభుత్వం నోరు పారేసుకోవడం తప్ప చేసేదేం లేదు.
తెలంగాణ నీటి ప్రయోజనాలు కాపాడు.
అసెంబ్లీలో చిల్లర ప్రసంగం కాదు, గోదావరి నల్లమల సాగర్ కు వ్యతిరేకం అని తీర్మానం చెయ్యి.
ఢిల్లీకి కదులు. సిడబ్ల్యుసి ఆఫీస్ ముందు ధర్నా చేద్దాం పద. నీళ్ల బాధ నీకేం తెలుసు రేవంత్ రెడ్డి?
జూబ్లీహిల్స్ ప్యాలెస్ లో కూర్చొని ఆంధ్రాకు, బాబుకు దాసోహం చేయడం కాదు రేవంత్ రెడ్డి.