– తల తాకట్టు పెట్టయినా సరే ఇందిరమ్మ ఇండ్లను పూర్తిచేస్తాం
– నాలుగు సంవత్సరాలలో 20 లక్షల ఇండ్లు నిర్మిస్తాం
– ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం మా ప్రభుత్వానికి ప్రతిష్ఠాత్మకం
– మీడియాతో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చిట్ చాట్
హైదరాబాద్: మరో నాలుగేళ్లు తెలంగాణ సీఎంగా రేవంత్‌రెడ్డి కొనసాగుతారని, సీఎం మార్పు అంటూ ఉండదని సమాచారశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. సీఎంను మారుస్తారంటూ ప్రతిపక్షాలు చేస్తున్న ప్రచారంలో పస లేదన్నారు. ఆర్ధిక పరిస్థితి బాగోలేకున్నా తల తాకట్టుపెట్టయినా సరే ఇందిరమ్మ ఇళ్లు పూర్తి చేస్తామని, అది తమకు ప్రతిష్ఠాత్మకమని చెప్పారు.
మీడియా చిట్‌చాట్‌లో మంత్రి పొంగులేటి ఇంకా ఏమన్నారంటే…
మరో నాలుగేళ్లు రేవంత్ రెడ్డే ముఖ్యమంత్రి. రాష్ట్రంలో సిఎం మార్పు అనేది ఉండదు. మరో నాలుగు సంవత్సరాల ఒక నెల రేవంత్‌రెడ్డే ముఖ్యమంత్రిగా కొనసాగుతారు. కాంగ్రెస్ పార్టీ రెండవ సారి అధికారంలోకి వచ్చిన తర్వాత, ముఖ్యమంత్రి ఎవరనేది అధిష్టానం నిర్ణయిస్తుంది. ప్రతిపక్షం కాబట్టి ఏదో ఒకటి మాట్లాడాలని మాట్లాడుతోంది.
రాష్ట్రంలో ఈనెల 5, 6 తేదీల నుంచి ఇందిరమ్మ ఇండ్ల లబ్దిదారుల ఎంపిక
15రోజుల్లొ గ్రామ కమిటీల ద్వారా ఎంపిక పూర్తి చేసి ఆ వెంటనే జాబితాల ఖరారు.ఇది నిరంతర ప్రక్రియ. గ్రామాలలో ఇందిరమ్మ కమిటీల ఎంపికే ఫైనల్.
ఇండ్లు మహిళల పేరిటే మంజూరు. లబ్దిదారులే సొంతంగా ఇండ్లు నిర్మించుకునే అవకాశం కల్పిస్తున్నాం. ఎటువంటి రాజకీయ జోక్యం ఉండదు. నిరుపేదలకు తొలి ప్రాధాన్యత. పేదరికమే ప్రామాణికంగా లబ్దిదారుల ఎంపిక. లబ్దిదారుల ఎంపికలో ప్రత్యేక యాప్ దే కీలకపాత్ర, అందుకే ఇంత సమయం పట్టింది.
ఆధార్‌తో సహా అన్నివివరాలు యాప్ లో పొందుపరుస్తారు. 4 రాష్ట్రాలలోని ఇండ్ల నిర్మాణానికి సంబంధించి వివరాలు సేకరించి ముందుకు వెళ్తున్నాం.
ఇండ్ల నిర్మాణంలో ఎటువంటి డిజైన్లు ఉండవు. లబ్దిదారుల ఇష్టం మేరకు ఇల్లు నిర్మించుకోవచ్చు. కనీసం 400 చదరపు గజాలు తగ్గకుండా లబ్దిదారుడు ఇల్లు నిర్మించుకోవాలి.
నిర్మాణ దశల వారీగా లబ్దిదారులకు చెల్లింపులు. పునాదికి లక్ష, గోడలకు లక్షా 25వేలు, శ్లాబ్‌కు లక్షన్నర, పూర్తయితే లక్ష రూపాయిల చొప్పున చెల్లింపు. బ్యాంకు అకౌంట్ ద్వారానే చెల్లింపులు. కేంద్రం ఇచ్చే నిధులను తీసుకొని మిగిలిన మొత్తాన్ని రాష్ట్రం భరిస్తుంది. నాలుగు సంవత్సరాలలో 20 లక్షల ఇండ్లు నిర్మిస్తాం. ప్రతి నియోజకవర్గంలో కనీసం 3500 ఇండ్లు నిర్మించేలా చూస్తాం.
ఇండ్లలో తప్పనిసరిగా వంటగది, బాత్రూం నిర్మించుకోవాలి. ప్రతి మండలంలో కనీసం ఒకరు లేదా ఇద్దరు ఎఈ లు ఉండేలా చర్యలు.
16 శాఖలకు చెందిన వారిని సమీకరించి ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ బాధ్యతలు అప్పగిస్తాం.
ఒకే గొడుగు నీడన ఇంజనీర్ల పర్యవేక్షణలో ఇండ్ల నిర్మాణం జరిగేలా చర్యలు
ప్రభుత్వం తరపున 5 లక్షల సాయం ఇస్తాం, లబ్దిదారులు ఆర్ధిక పరిస్దితి బట్టి ఇంకా కట్టుకోవచ్చు. దేశంలో తెలంగాణ మాత్రమే ఇంతటి భారీ గృహ నిర్మాణం చేపట్టి, 5 లక్షల సాయం అందిస్తోంది.
గత ప్రభుత్వంలో నిలిచిపోయిన సుమారు 600 -800 ఇండ్ల నిర్మాణానికి కూడా సహకరిస్తాం. తొలి విడత గా సుమారు 28 వేల కోట్ల రూపాయిల వరకు కోట్లు ఖర్చు కావచ్చు. సుమారు 7,740 కోట్ల రూపాయిలను ఇందిరమ్మ ఇండ్లకు బడ్జెట్‌లో కేటాయించాం. అవసరమైన నిధుల కోసం కేంద్రాన్ని కోరుతాం, నిధులను వివిధ మార్గాలద్వారా సమీకరిస్తాం.
పునాది పూర్తయిన వెంటనే తొలివిడత నిధుల విడుదల. నిర్మాణాలు జరిగేలోగా మళ్లీ బడ్జెట్‌లో నిధుల కేటాయింపు జరుగుతుంది. స్మార్ట్ కార్డుల ఆధారంగా లబ్దిదారుల ఎంపిక. అర్హులైన వికలాంగులకు ప్రాధాన్యత ఇస్తే మంచిదే. గ్రామ కమిటీలదే తుది ఎంపిక. నందనవనం, మంకాల్ ఇండ్ల సమస్యకు త్వరలో పరిష్కారం.
ఇండ్ల స్ధలాలు లేనివారికి 2 వదశలో స్ధలంతో పాటు ఇల్లు నిర్మించి ఇస్తాం. కేంద్రప్రభుత్వ నిబంధనల ప్రకారం, 75 నుంచి 80 గజాల స్ధలాన్ని సమకూర్చి ఇస్తాం. ఎక్కడైనా కొత్తగా ఇందిరమ్మ కాలనీలు ఏర్పడితే కరెంట్, రోడ్లు , డ్రైనేజ్ తదితర మౌళిక వసతులను ప్రభుత్వమే సమకూరుస్తుంది.
గత ప్రభుత్వం మూసివేసిన హౌసింగ్ శాఖను పునరుద్దరించాము. ఎన్నికల వరకే రాజకీయాలు, ఎలాంటి భేషజాలకు పోవడంలేదు. కేంద్రం ఎంతిచ్చినా తీసుకుంటాం, ఏమీ ఇవ్వకపోయినా ఇందిరమ్మ ఇండ్లను నిర్మిస్తాం, మాకు ఇగోలు లేవు. గత ప్రభుత్వం ధనిక రాష్ట్రమని చెప్పి కేంద్రాన్ని ఇండ్లు అడగలేదు.
డబుల్ బెడ్ రూం ఇండ్లలో నీళ్లు, కరెంట్ , డ్రైనేజ్ వంటి వసతుల్లేవు. మేము అవన్నీ కల్పించి లబ్దిదారులకు అప్పగిస్తున్నాం. 2004 నుంచి 2014 వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో తెలంగాణ ప్రాంతంలో 19.36 లక్షల ఇందిరమ్మ ఇండ్లను నిర్మించడం జరిగింది.