– ప్రభుత్వం కేవలం ఈవెంట్ మేనేజ్మెంట్ మీదే నడుస్తోంది
– రాహుల్ కి అశోక్ నగర్ తిరిగి విద్యార్థుల ముందుకు వెళ్లి మొహం చూపెట్టే ధైర్యముందా?
– సెమీకండక్టర్ ఫ్యాక్టరీ మరో రాష్ట్రానికి వెళ్లిపోయింది
– భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో పార్టీ రాష్ట్ర ముఖ్య అధికార ప్రతినిధి, మీడియా ఇంచార్జ్ ఎన్.వి.సుభాష్
హైదరాబాద్: గత 20 నెలల పాలనలో ప్రజాసమస్యలను పట్టించుకోకుండా 50 సార్లు ఢిల్లీతో పాటు బీహార్, కలకత్తా, విదేశాల టూర్లకు వెళ్లిన ఘనత కేవలం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కే దక్కింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 1978- 83 మధ్య ఐదు సంవత్సరాల్లో నలుగురు ముఖ్యమంత్రులు మారినా, ఒక ముఖ్యమంత్రి మాత్రమే 75 సార్లు ఢిల్లీకి వెళ్లాడు. కానీ రేవంత్ రెడ్డి కేవలం 20 నెలల్లోనే దాదాపు ఆ రికార్డుకు దగ్గరయ్యారు.
ప్రజలు అడుగుతున్నారు… “మేము ఎన్నుకున్న ముఖ్యమంత్రి ఎక్కడ? ఎప్పుడూ ఢిల్లీలోనా, బీహార్‌లోనా, లేక విదేశాల్లోనా?” అని. ఎప్పుడైనా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ని కలవాలనుకుంటే – వారు హైదరాబాద్‌లో ఉండరు. సెక్రటేరియట్‌కి రావడం లేదు. ప్రజలకు అసలు అందుబాటులో ఉండడం లేదు. ఎప్పుడూ ఒక రాష్ట్రం నుంచి మరొక రాష్ట్రానికి తిరుగుతూనే ఉన్నారు. అందుకే ఆయనకు సరిపోయే బిరుదు ఒకటే – “ది బెస్ట్ హాపింగ్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ది కంట్రీ”.
ఇటీవల సోనియా గాంధీ గారు రేవంత్ రెడ్డికి బాస్కర్ అవార్డు ఇచ్చినట్లే, ఇకపై ఈ “హాపింగ్ చీఫ్ మినిస్టర్ అవార్డు” కూడా ఆయనకే దక్కుతుంది. గ్యారెంటీలు అని చెప్పి, హామీలు అని చెప్పి, కొత్త కొత్త స్కీమ్స్ తెస్తామని పదే పదే చెబుతూ ప్రజలను మోసం చేశారు.
మా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు ఇటీవల వివిధ జిల్లాల పర్యటనలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రజలు పెద్ద సంఖ్యలో ఆయన వద్దకు వచ్చి పిటిషన్లు, మెమోరాండాలు ఇచ్చారు. “ముఖ్యమంత్రికి కనీసం ఒకసారి చెప్పండి. మా సమస్యలు విని పరిష్కరించేలా హితవు పలకండి” అని ప్రజలు వేడుకున్న సంఘటనలు అనేకం ఉన్నాయి.
సీఎం రేవంత్ రెడ్డి హోమ్ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నా, గత 20 నెలల్లో తెలంగాణ రాష్ట్రంలో అనేక ఘోరాలు జరిగాయి. విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్న సంఘటనలు పెరిగాయి. మహిళలపై అత్యాచారాలు భయంకరంగా పెరిగాయి.
ప్రజల సమస్యలను పక్కన పెట్టి, కేంద్రం నుంచి రాష్ట్రానికి వచ్చే నిధులను సక్రమంగా వినియోగించి ఉంటే, తెలంగాణ రాష్ట్రం ఈ రోజుకి మరింత అభివృద్ధి చెంది ఉండేది. పక్క రాష్ట్రాలతో పోటీపడే స్థాయిలో నిలిచేది. కానీ ఆ అవకాశాన్ని వినియోగించుకోలేక, ప్రజలను మోసం చేశారు.
కాంగ్రెస్ క్యాబినెట్ మంత్రులు కలిసి, ఎక్కడ ఎన్నికలు వస్తాయో అక్కడ కాంగ్రెస్ పార్టీ ప్రచారం కోసం నిధులను తరలిస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి. మొన్న ఒక హెలికాప్టర్లో కాంగ్రెస్ అధిష్టానం – మల్లికార్జున ఖర్గే , రాహుల్ గాంధీ కి – తెలంగాణ ప్రజల సొమ్ముతో హెలికాప్టర్ సౌకర్యాలు కల్పించినట్టు కూడా బయటపడింది.
ఈ విధంగా తెలంగాణ ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసి, కాంగ్రెస్ పార్టీ స్వలాభం కోసం ఖర్చుపెట్టడం అత్యంత దుర్మార్గం. ఈ వ్యవహారాన్ని భారతీయ జనతా పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉస్మానియా యూనివర్సిటీకి వెళ్లారు. 20 సంవత్సరాల తర్వాత ఒక ముఖ్యమంత్రి యూనివర్సిటీకి వస్తున్నారని విద్యార్థులు, ప్రజలు పెద్ద ఆశలు పెట్టుకున్నారు. “ఇక మాకు మంచి విద్యా వాతావరణం వస్తుంది” అని ఎదురుచూశారు. కానీ అక్కడ విద్యార్థుల కంటే ఎక్కువగా పోలీసులు, అధికారులు, కాంగ్రెస్ కార్యకర్తలే కనిపించారు.
విద్యాశాఖ పరిస్థితి చూస్తే మరింత దారుణంగా ఉంది. అనేక గురుకులాలు మూతపడ్డాయి. భవన యజమానులకు సకాలంలో అద్దె చెల్లించకపోవడంతో స్కూళ్లకు తాళాలు వేసిన ఘటనలు చోటుచేసుకున్నాయి. ఫలితంగా విద్యార్థులు ప్రైవేట్ స్కూళ్లకు వెళ్ళే పరిస్థితి ఏర్పడింది.
హోమ్ మినిస్టర్‌గా, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మినిస్టర్‌గా బాధ్యతలు ఉన్నా, ఈ రెండు శాఖల్లోనూ సమస్యలే ఎక్కువ. ప్రజలు ఎన్నో పిటిషన్లు ఇస్తే – అవి నామమాత్రంగానే తీసుకొని పక్కన పెడుతున్నారు.
ఇటీవల శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా ఆరుగురు ఎలక్ట్రిక్ షాక్‌తో మరణించారు. నిన్న కూకట్‌పల్లిలోనూ ఇలాంటి ఘటన జరిగింది. ఏ శాఖ చూసినా అభివృద్ధి కన్నా వైఫల్యాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి.
హోమ్ మినిస్టర్‌గా రేవంత్ రెడ్డి పూర్తిగా విఫలమయ్యారు. 2024 లోపు నేరాలు 22.4% పెరిగాయి – 1.38 లక్షల కేసులు → 1.69 లక్షలకి చేరాయి. మహిళలపై దాడులు 5% పెరిగాయి. అత్యాచార కేసులు 3,000కి చేరాయి. ప్రజల భద్రతలో ఇంతటి ఘోర వైఫల్యం రేవంత్ రెడ్డి పాలనలోనే జరిగింది.
యూనివర్సిటీలు అంతర్జాతీయ స్థాయి ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలా మారుస్తామని చెప్పారు. వాస్తవానికి 2,600 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. 75% ఫ్యాకల్టీ లేకుండా, ఉన్నవారికి కూడా సకాలంలో జీతాలు రావడం లేదు. బడ్జెట్లో 15% నిధులు విద్యాశాఖకు ఇస్తామని హామీ ఇచ్చారు. రూ.23,800 కోట్లతో విద్యారంగాన్ని గొప్పగా తీర్చిదిద్దుతామని హామీ ఇచ్చారు. కనీసంరూ.3,000 కోట్లు కూడా ఖర్చుచేయలే. ఇది విద్యార్థులకు చేసిన మోసం.
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారు. నిరుద్యోగ భృతి రూ.4వేలు ఇస్తామన్నారు. 20 నెలలు గడిచినా ఒక్కటీ అమలు కాలేదు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో అశోక్ నగర్ లో ఉన్న నిరుద్యోగులతో రాహుల్ గాంధీ సమావేశమై కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే రెండు లక్షల ఉద్యోగాలిస్తామని, రూ. 4 వేల నిరుద్యోగ భృతి ఇస్తామని హామీ ఇచ్చారు. ఏ ఒక్కటీ అమలు చేయలేదు.
రాహుల్ గాంధీ అశోక్ నగర్‌కి తిరిగి విద్యార్థుల ముందుకు వెళ్లి మొహం చూపెట్టే ధైర్యముందా? ఈ ప్రభుత్వం కేవలం ఈవెంట్ మేనేజ్మెంట్ మీదే నడుస్తోంది. విదేశాలకు వెళ్లి పెద్ద కంపెనీలతో ఒప్పందాలు చేసుకున్నా – ఒక్క పైసా ఇన్వెస్ట్మెంట్ కూడా తెలంగాణకు రాలేదు. దావోస్‌లో గొప్ప ప్రాజెక్టులు తెస్తామని చెప్పినా, చివరికి సెమీకండక్టర్ ఫ్యాక్టరీ మరో రాష్ట్రానికి వెళ్లిపోయింది.
కామారెడ్డి బీసీ డిక్లరేషన్‌లో భాగంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పిస్తామని కాంగ్రెస్ ప్రకటించింది. కానీ అమలు చేయలేక చివరికి చేతులెత్తేసింది. ఇప్పుడు మళ్లీ అదే మాటలు చెబుతూ పార్టీ పరంగా 42% బీసీ రిజర్వేషన్లు ఇస్తామని చెప్పడం, ప్రజలను మోసం చేసే మరో ప్రయత్నమే.
రేవంత్ రెడ్డి.. మీ పార్టీ తెలంగాణలో నిజంగా అధికారంలో ఉందా? లేక ప్రతిపక్షంలో ఉందా? ప్రజలు ఇచ్చిన ఓటు హామీలను నెరవేర్చమని మిమ్మల్ని అధికారంలోకి తీసుకొచ్చారు. కానీ మీరు అబద్ధపు మాటలతో, అసమర్థతతో పాలిస్తూ ప్రజలను నిరాశపరుస్తున్నారు.
ఉదయ్‌పూర్ డిక్లరేషన్‌లో ప్రతి పార్లమెంట్ నియోజకవర్గంలో కనీసం రెండు అసెంబ్లీ స్థానాలు బీసీలకు టిక్కెట్లు ఇస్తామని వాగ్దానం చేశారు. కానీ ఒక్క వాగ్దానం కూడా నిలబెట్టుకోలేదు. మా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు స్పష్టంగా ప్రకటించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 45% రిజర్వేషన్లు ఇస్తామని. ఇది బీజేపీ యొక్క నిజమైన చిత్తశుద్ధి, బీసీల పట్ల ఉన్న నిజమైన నిబద్ధత.
రేవంత్ రెడ్డి కేవలం ఇచ్చిన హామీలు అమలు చేయకుండా, మీ వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి ఢిల్లీలో, బీహార్‌లో పర్యటిస్తూ, బిజెపిని నిందించేలా దుష్ప్రచారం చేస్తున్నారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వ వైఫల్యాలను, మోసాలను ప్రజలు గమనిస్తున్నారు. రానున్న కాలంలో కాంగ్రెస్ పార్టీకి తప్పకుండా తగిన బుద్ధి చెబుతారు.