– సర్వాయి పాపన్న స్ఫూర్తితో బడుగులు కదం తొక్కాలని పిలుపు
– విద్యార్థుల ఫీజు రీయింబర్స్మెంట్ ఎందుకు ఇవ్వట్లేదు?
– బీఆర్ఎస్ ఎమ్మెల్సీ డాక్టర్ దాసోజు శ్రవణ్ ఫైర్
హైదరాబాద్: సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతి సందర్భంగా బహుజన గర్వవిభవానికి, తెలంగాణ భూమి గౌరవ చిహ్నానికి విప్లవ వందనాలు. బహుజన బిడ్డగా జన్మించి ఆత్మగౌరవం కోసం, ఆర్థిక దోపిడీకి వ్యతిరేకంగా పాలక వర్గాల అణచివేతకు ఎదురొడ్డి తెలంగాణ ప్రజల ఆస్థిత్వాన్ని కాపాడిన మహాయోధుడు పాపన్న గారి పోరాటం నేటికీ మార్గదర్శకంగా నిలుస్తోంది.
దురదృష్టవశాత్తు, నేటి తెలంగాణలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం బహుజన వర్గాలను మోసం చేస్తూ, నయవంచనకు గురి చేస్తోంది. 42% రిజర్వేషన్ వాగ్దానాన్ని ఎన్నికల ముందు చూపించి అధికారంలోకి వచ్చిన తర్వాత 20 నెలలుగా మోసపూరిత నాటకాలతో కాలయాపన చేస్తూ బహుజన సమాజాన్ని మభ్యపెట్టారు. కమిటీలు మీద కమిటీలు వేసినా ఒక్క స్పష్టమైన నివేదికను కూడా ఇవ్వకుండా రిజర్వేషన్లపై బీసీల ఆకాంక్షలను తుంగలో తొక్కారు.
బడ్జెట్ కేటాయింపుల విషయంలోనూ అన్యాయం జరుగుతోంది. 2023లో కేటాయించిన అరువేల కోట్లు పూర్తిగా ఖర్చు చేయలేదు. 2024లో కేటాయించిన 9,200 కోట్లలో సగం కూడా ఖర్చు పెట్టలేదు. 2025లో 11,000 కోట్లు కేటాయించినా అందులో ఎంత ఖర్చు పెడతారో స్పష్టత లేదు. మసి పూసి మారేడుకాయ చేసి బడ్జెట్ కేటాయింపుల్లోనూ బీసీలను మోసం చేస్తున్నారు.
ఫీజు రీయింబర్స్మెంట్ కోసం విద్యార్థులు రోడ్లపై ధర్నాలు చేస్తూ అవమానాలు ఎదుర్కొంటున్నారు. Dr. B.R. అంబేద్కర్ ఓవర్సీస్ స్కాలర్షిప్ కూడా అమలు చేయకపోవడం బహుజన యువతను నిరాశలోకి నెడుతోంది. కేసీఆర్ ప్రభుత్వం గౌడలు, ముదిరాజులు, గంగపుత్రులు, గొల్లకురుమలు, మున్నూరుకాపులు, పద్మశాలిల వంటి వృత్తి వర్గాలకు మేకల పంపిణీ, చేపల పంపిణీ, వృత్తి ఆధారిత పథకాల ద్వారా ఆర్థిక సహాయం అందించగా ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం వాటన్నింటినీ తుంగలో తొక్కుతోంది.
మా టాక్సులు వసూలు చేస్తూ బడ్జెట్ చూపిస్తుంటే విద్యార్థుల ఫీజు రీయింబర్స్మెంట్ ఎందుకు ఇవ్వట్లేదు? బీసీ డిక్లరేషన్, కేటగిరైజేషన్, రిజర్వేషన్ అన్న ప్రతి వాగ్దానమూ ఎందుకు మోసపూరితమయ్యాయి?
సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ ఆశయాలను నిలబెట్టుకోవాలంటే బహుజన వర్గాలపై జరుగుతున్న అన్యాయాలకు వ్యతిరేకంగా సంఘటితమై, సమన్వయంతో పోరాడాల్సిన సమయం ఇది. లేని పక్షంలో ఆయన ఆశయాలను మోసం చేసినట్టే అవుతుంది. సర్దార్ పాపన్న ఆశయాలు నెరవేర్చే వరకు మా పోరాటం కొనసాగుతుంది.