– మీ రాహుల్ గాంధీ కూడా రావణాసురుడేనా ?
– ఉన్మాదంలో ఏం మాట్లాడుతున్నావో నీకు అర్ధం కాదు.
– రేవంత్.. నీది నోరా,మోరా?
– సచివాలయం ముందు సీఎం రేవంత్ రెడ్డి తన సంకుచిత మనస్తత్వాన్ని మరోసారి బయట పెట్టుకున్నాడు.
– మాజీ మంత్రి హరీశ్ రావు
హైదరాబాద్: ప్రభుత్వ కార్యక్రమం అని మరచి ప్రత్యేక రాష్ట్ర సాధకుడు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ పై సంస్కారం లేని విధంగా మాట్లాడి తన చిల్లర బుద్ధిని మరోసారి ప్రదర్శించాడు.
తెలంగాణ కు శనిలా ,శాపం లా మారిన రేవంత్ రెడ్డి ‘ఉల్టా చోర్ కొత్వాల్ కు డాంటే”అనే రీతిలో పదేళ్ల కేసీఆర్ పాలన లో సాధించిన అద్భుత ప్రగతిని తక్కువ చేసి చూపి రాష్ట్ర ప్రజలను అవమానించారు.
ఎన్నికల్లో అడ్డమైన హామీలు ఇచ్చి అధికారం లోకి వచ్చి వాటిని అమలు చేయలేక ,ప్రజల నుంచి వ్యతిరేకత వస్తుంటే ఎటూ పాలుపోక నిరాశ నిస్పృహలతో పాలనలో కూడా ప్రతి రోజూ అబద్దాలతో,బూతులతో నెట్టు కోస్తానంటే కుదరదు రేవంత్ రెడ్డి.
స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపు పై భరోసా లేక విధి లేని పరిస్థితుల్లో రైతు భరోసా వేసి తానే రైతులకు ఛాంపియన్ అనే బిల్డప్ ఇస్తే ఎవరు నమ్ముతారు రేవంత్ రెడ్డి ?
దేశంలోనే మొదటిసారిగా రైతులకు పెట్టుబడి సాయం చేయాలని ఆలోచించి రైతు బంధు మొదలు పెట్టి 80 వేల కోట్ల రూపాయలు అన్నదాతల అకౌంట్లలో వేసి వ్యవసాయాన్ని పండగ లా చేసిన కేసీఆర్ ను ఉరి తీయాలని ఉన్మాదిలా మాట్లాడుతావా ? తెలంగాణ నిన్ను క్షమించదు రేవంత్ రెడ్డి.
లక్ష కోట్లే ఖర్చుకాని కాళేశ్వరం ప్రాజెక్టు లో లక్ష కోట్ల అవినీతి జరిగిందంటే ప్రపంచం నవ్విపోతున్నది. పదేళ్ల కేసీఆర్ పాలన లో తెలంగాణ ఎడారి గా మారితే ధాన్యం ఉత్పత్తి లో రాష్ట్రం దేశం నెంబర్ వన్ ఎలా అవుతుంది రేవంత్ రెడ్డి ?
నీవు అధికారంలోకి వచ్చినాక కనీసం ఒక చెక్ డ్యామ్ కట్టావా?ఓ కాలువ తవ్వావా ధాన్యం ఉత్పత్తి పెరగటానికి రేవంత్ రెడ్డి ? పదేళ్ల కేసీఆర్ పాలనలో పెండింగ్ ప్రాజెక్టులను రన్నింగ్ ప్రాజెక్టులుగా మార్చి 2 లక్షల కోట్లు ఖర్చు పెట్టి 44 లక్షల ఎకరాలకు నీళ్లు ఇస్తేనే కదా ధాన్యం ఉత్పత్తి 3 కోట్ల టన్నులను తాకింది రేవంత్ రెడ్డి ?
కల్వకుర్తి ,నెట్టెం పాడు ,బీమా ,కోయిల్ సాగర్ ప్రాజెక్టులకు నాలుగు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఆరున్నర లక్షల ఎకరాలకు నీళ్ళిచ్చే పని చేశాం. ఇరిగేషన్ శాఖ లో ఈ వివరాలు ఉన్నాయి.
అధికారులను అడిగి తెలుసుకో రేవంత్ రెడ్డి ?
అధికారం లో ఉండి సీఎం స్థానం లో ఉండి,సభా నాయకుడిగా వ్యవహరిస్తున్న నీకు అసెంబ్లీ సమావేశాల ఏర్పాటు కు ప్రతిపక్షం డిమాండ్ చేయాల్సిన పని లేదని తెలియదా రేవంత్ రెడ్డి?
గోదావరి బనక చర్ల ప్రాజెక్టు పై ఏ వేదిక మీదనైనా చర్చించేందుకు సిద్ధంగా ఉన్నాం.నీ ద్రోహాన్ని గణాంకాలతో సహా నిరూపించి తెలంగాణ కు చేస్తున్న మోసాన్ని బట్టబయలు చేస్తాం.
కృష్ణా నదిపై సమైక్య పాలకులు 299 టీఎంసీ ల మేరకే ప్రాజెక్టులు ప్రతిపాదించినందుకే కదా ఆ మొత్తం లో నీటిని వాడుకునేందుకు తాత్కాలిక ఒప్పందం కుదిరింది అని ఎన్ని సార్లు వాస్తవాలు చెబుతున్నా పని గట్టుకుని బురద జల్లే నీ మూర్ఖత్వాన్ని అర్థం చేసుకోనంత అమాయకులు కాదు తెలంగాణ ప్రజలు రేవంత్ రెడ్డి.
మేడిగడ్డ లో కుంగిన రెండు పిల్లర్లకు మరమ్మత్తులు చేయని దద్దమ్మ వి నీవు.ఇపుడు అన్నారం,సుందిళ్ల కూడా కూలిందని అని అంటున్నావ్.
నీది నోరా,మోరా ? రేవంత్ రెడ్డి ?
మహిళలకు వడ్డీ లేని రుణాలపై అవే అబద్దాలు,ఉద్యోగ నియామకాల పై అదే పనిగా అబద్దాలు చెబితే అవి నిజాలై పోతాయా రేవంత్ రెడ్డి ?నీకు దమ్ముంటే,చిత్తశుద్ధి ఉంటే ఇసుమంతైనా నిజాయితీ ఉంటే
30 లక్షలు మంది కౌలు రైతులకు ఇస్తానన్న రైతు భరోసా ఇచ్చి మాట్లాడు రేవంత్ రెడ్డి ?
సన్న వడ్లకు బోనస్ ను రైతుల అకౌంట్లలో వేశానని బోగస్ మాటలు చెప్పకు రేవంత్ రెడ్డి,నిజాయతీ ఉంటె 1200 కోట్ల బోనస్ బకాయిలు అకౌంట్ల లో వేయి. నీ పిల్లి శాపాలకు ఉట్లు తెగయనే విషయాన్ని గ్రహించు రేవంత్ రెడ్డి.
గెలిచిన వాడు రాజు,ఓడిపోయిన వాడు రావణాసురుడు అంటున్నావు.మీ రాహుల్ గాంధీ కూడా రావణాసురుడేనా ? ఉన్మాదంలో ఏం మాట్లాడుతున్నావో నీకు అర్ధం కాదు.
హామీల గురించి ప్రశ్నిస్తున్నందుకు మాపై నీవు బూతులతో చెలరేగుతున్నా మేము సంయమనాన్ని కోల్పోము.మీరిచ్చిన హామీలు అమలయ్యేదాకా మీ వెంటపడుతూనే ఉంటాం.నీ అబద్దాల పుట్టను బద్దలు కొడతాం.