– 50% రిజర్వేషన్లు మహిళలకు కూడా ఘోర అన్యాయం
– రాజ్యాంగాన్ని కాలరాస్తున్న తెలంగాణ ప్రభుత్వం
హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో బీసీలు, మహిళల హక్కులను క్రమపద్ధతిగా హరించేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం బహిరంగంగా కుట్రకు పాల్పడుతోందని బీఆర్ఎస్ తీవ్రంగా ఖండిస్తోంది. కులగణన పేరిట సుమారు రూ.200 కోట్లు ప్రజాధనాన్ని ఖర్చు పెట్టి, బుసాని వెంకటేశ్వర్లు కమిషన్, జస్టిస్ సుదర్శన్ రెడ్డి కమిషన్ అంటూ బూటకపు కమిటీల పేరుతో రెండు సంవత్సరాలు ప్రజలను మభ్యపెట్టిన ప్రభుత్వం, చివరికి జీవో ఎంఎస్ నెం.46ను తెచ్చి బీసీలకు రావాల్సిన రాజ్యాంగబద్ధ రిజర్వేషన్లను కత్తిరించిందని బీఆర్ ఎస్ ఎమ్మెల్సీ డాక్టర్ దాసోజు శ్రావణ్ విమర్శించారు. ఈ మేరకు ఆయన బుధవారం విలేఖర్లతో మాట్లాడారు.
ఈ జీవో ఆధారంగా రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని పూర్తిగా ప్రభుత్వానికి లోబడి పనిచేసే సంస్థగా మార్చి, ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధంగా స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ను ప్రకటించడం అత్యంత ప్రమాదకర పరిణామమన్నారు.
జిల్లావారీగా బీసీలకు జరిగిన ఘోర అన్యాయం:
•ఆదిలాబాద్ – కేవలం 4.8%
•జనగాం – 16%
•ఖమ్మం – 9.45%
•మంచిర్యాల – 7.5%
•ములుగు – 3.5%
ఇలా అనేక జిల్లాల్లో బీసీలు లేనట్టుగా వ్యవహరిస్తూ, వారికి రావాల్సిన న్యాయమైన రిజర్వేషన్లను కొల్లగొట్టడం స్పష్టమైన సామాజిక ద్రోహమన్నారు. .
మహిళలకు 50 శాతం రిజర్వేషన్ అన్యాయం
ఇక, మహిళా రిజర్వేషన్లు కూడా ఏ జిల్లాలో, ఏ మండలంలో, ఏ గ్రామ పంచాయతీలోనూ 50% దాటని విధంగా కేటాయించడం ద్వారా మహిళా శక్తిని అపహాస్యానికి గురిచేశారు. ఇది రేవంత్ రెడ్డి జేబు నుంచి ఇవ్వాల్సిన భిక్ష కాదు — ఇది రాజ్యాంగం కల్పించిన హక్కు. ఆ హక్కులను కాలరాస్తూ, రాజ్యాంగ దినోత్సవం నాడే స్థానిక ఎన్నికల పేరిట అంబేద్కర్ రాజ్యాంగాన్ని అవమానించడం తెలంగాణ ప్రజల పట్ల చేసిన ఘోర అపరాధమని ఆందోళన వ్యక్తం చేశారు.
ఈ పరిస్థితుల్లో బీసీలు, మహిళలు, ప్రజాస్వామ్యాన్ని విశ్వసించే పౌరులు అందరూ దీనిని గుర్తించి, ఈ ప్రభుత్వానికి తగిన ప్రజాస్వామ్య సమాధానం ఇవ్వాల్సిన అవసరం ఉంది. నేడు తెలంగాణలో అమల్లో ఉన్నది అంబేద్కర్ రాజ్యాంగం కాదు, అనుముల రాజ్యాంగమని ప్రజలు తగిన గుణపాఠం చెప్పాలని శ్రావణ్ పిలుపునిచ్చారు.