Suryaa.co.in

Telangana

ఆల్బర్ట్టో లొంగో తో రేవంత్ భేటీ .. ఇదిగో సాక్ష్యం!

– డిసెంబర్ 13న లొంగో తో ముఖ్యమంత్రి సమావేశం
– 73 లక్షల రూపాయల రేసు ఫీజులను కూడా తిరిగి పంపించింది
– ఈ డబ్బులు తీసుకోమని చాలాసార్లు కోరినా ఇప్పటిదాకా రాష్ట్ర ప్రభుత్వం ఆ డబ్బులను తీసుకోలేదు
– ప్రభుత్వంతో పలుసార్లు లేఖల రూపంలో ఫార్ములా ఈ సంస్థ సంభాషణలు కొనసాగించింది
– హెచ్ఎండిఏ ఇండియన్ ఓవర్సీస్ ప్రభుత్వ బ్యాంకు నుంచి ఈ నిధులను ఆ సంస్థకు చెల్లించింది
– తనపై రాష్ట్ర ప్రభుత్వం అక్రమంగా నమోదు చేసిన ఫార్ములా ఈ కేసు పైన స్పందించిన కేటీఆర్
– ఇలాంటి అక్రమ కేసులకు అణిచివేతలకు కుట్రలకు భయపడకుండా కొట్లాడుతూనే ఉంటాం
– ఏసీబీ సంస్థ కేసు నమోదు చేసే పరిధి లేనేలేదు
– ఫార్ములా ఈ సహ వ్యవస్థాపకుడుతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భేటీ అయిన ఫొటో, డాక్యుమెంట్లను బయటపెట్టిన బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్

హైదరాబాద్: ఈరోజు నేను చెప్పిన ప్రతి మాటకి చూపించిన ప్రతి డాక్యుమెంట్ కి కట్టుబడి ఉన్నాను. కచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వానికి ఈ మొత్తం వ్యవహారంలో భంగపాటు తప్పదు. తెలంగాణ ప్రజలు రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి ఆధారాలు లేకుండా అడ్డగోలుగా చేస్తున్న దుష్ప్రచారాన్ని గమనించాలని… మమ్మల్ని ఎన్నుకొని ప్రధాన ప్రతిపక్షం పాత్ర ఇచ్చిన రాష్ట్ర ప్రజలకు నిజాలు తెలియజేయాల్సి ఉన్న నేపథ్యంలోనే, ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం యొక్క తీరును రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న మోసాన్ని కుట్రలను ప్రజల ముందు ఉంచాను.

ముఖ్యమంత్రి దివాలాకోరుతనం వల్లనే ఈ కేసు పెట్టాడు. రాష్ట్ర ప్రభుత్వం ఫార్ములా ఈ అంశంలో అవినీతి జరిగింది అని భావిస్తే అందుకు తగిన ఆధారాలు సాక్ష్యాలు ఉంటే ప్రస్తుతం జరుగుతున్న అసెంబ్లీలోనే చర్చ పెట్టమని సవాలు విసురుతున్న. కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఎలాంటి ఆధారాలు లేదు. కేవలం రాజకీయపరమైన దురుద్దేశంతోనే ఈ ఫార్ములా ఈ కేసు నమోదు చేయడం జరిగింది.

నిజంగానే ఈ రాష్ట్ర ప్రభుత్వం లో తెలివైన మంత్రులు కానీ, ముఖ్యమంత్రి కానీ ఉంటే అసెంబ్లీ సాక్షిగా రాష్ట్ర ప్రజల దృష్టికి ఇందులో జరిగిన అవినీతిని చెప్పాలి. కానీ అసెంబ్లీలో మాట్లాడలేని దద్దమ్మ మంత్రులు ముఖ్యమంత్రి కేవలం లీకులతో దుష్ప్రచారం చేస్తున్నారు. ఈ మొత్తం వ్యవహారంలో పైసా కూడా వృధా కాలేదు. ఈ నూతన కాంగ్రెస్ ప్రభుత్వం చేతగానితనం వల్లనే రేసులు రద్దు అయ్యాయి.

ఫార్ములా ఈ కేసు పైన లేవనెత్తిన కేటీఆర్ కీలకమైన ప్రశ్నలు

హైదరాబాద్ నగర అభివృద్ధి కోసం ప్రపంచవ్యాప్తంగా ప్రాచుర్యం పొందిన ఎలక్ట్రానిక్ వెహికల్స్ రంగా ప్రపంచ పటంలో హైదరాబాద్ను నిలిపేందుకు ఫార్ములా ఈ రేస్ ని నిర్వహించాలని ప్రయత్నం చేసాం. అందులో విజయవంతంగా మొదటి రేసును పూర్తి చేసాము. ఇందుకోసం తెలంగాణ ప్రభుత్వం తరఫున హెచ్ఎండిఏ సుమారు 30 కోట్లు.. ప్రైవేటు స్పాన్సర్ ace అర్బన్ మరో వంద పది కోట్లు ఖర్చు చేశాయి.

తెలంగాణ ప్రభుత్వం ఖర్చు చేసిన కేవలం 30 కోట్ల రూపాయల ఖర్చుతో, రేసు అనంతరం హైదరాబాద్ నగర ఆర్థిక వ్యవస్థకు 700 కోట్ల రూపాయల ప్రయోజనం కలిగిందని నీల్సన్ సంస్థ తెలిపింది. అయితే తొలి దఫా జరిగిన రేసు అనంతరం ప్రైవేట్ స్పాన్సర్ కి ఆర్థికపరమైన నష్టం రావడంతో, రెండవ రేసులో తాను పాల్గొన లేనట్లు తెలియజేశారు. దీంతో ఫార్ములా ఈ రేసు నిర్వాహక సంస్థ, తెలంగాణ ప్రభుత్వానికి కొనసాగించాలా లేదా ఆపివేయాలని అడిగింది.

అయితే వందల కోట్ల రూపాయల ఎలక్ట్రిక్ వాహన రంగ పెట్టుబడుల నేపథ్యంలో రానున్న మూడు సంవత్సరాల పాటు ముందస్తుగా చేసుకున్న ఒప్పందం మేరకు రేసులను నిర్వహించాలని ప్రభుత్వం తరఫున నిర్ణయం తీసుకున్నాము. అందులో భాగంగానే హెచ్ఎండిఏ చట్టంలో స్పష్టంగా ప్రస్తావించిన మేరకు, హైదరాబాద్ నగర అభివృద్ధి కోసం హైదరాబాద్ నగరానికి మరింత ప్రాచుర్యం తీసుకురావచ్చు అన్న నిబంధనల మేరకు రేసుని హెచ్ఎండిఏ ఆధ్వర్యంలో నిర్వహించాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది.

హెచ్ఎండిఏ వైస్ చైర్మన్ హోదాలో ప్రిన్సిపల్ సెక్రెటరీ తో కలిసి నిర్ణయం తీసుకొని, ఆ మేరకు నిబంధనల మేరకు ఫైల్ సర్కులేట్ చేసి ఫార్ములా ఈ నిర్వహణ సంస్థకు డబ్బులు చెల్లించేందుకు నిర్ణయం తీసుకున్నాము. అందులో భాగంగానే సుమారు 55 కోట్ల రూపాయలను రెండు విడతల్లో చెల్లించాము. అయితే తదుపరి చెల్లింపులు చేయాల్సిన అవసరం ఉన్నదని ఫార్ములా ఈ సంస్థ, డిసెంబర్ 7 నాడు ఏర్పాటు అయిన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కోరింది.

FIE సంస్థ ఫార్ములా ఈ సహ వ్యవస్థాపకుడు ఆల్బర్ట్టో లొంగో తో, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అప్పటి పురపాలక శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ దాన కిషోర్లు సమావేశం అయ్యారు. సమావేశం అత్యంత సానుకూలంగా జరిగిందని నూతన ప్రభుత్వం కూడా ఈ రేసులను నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నట్లు సంస్థ రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ కూడా రాసింది.
అయితే డిసెంబర్ 13న జరిగిన ముఖ్యమంత్రి సమావేశం అనంతరం డిసెంబర్ 19న మరొకసారి ఫార్ములా ఈ సంస్థ రానున్న రేసు నిర్వహణ కోసం ప్రభుత్వం చెల్లించాల్సిన కాంట్రాక్టు నిబంధనలను ఫీజుల గురించి ప్రస్తావించింది.

డిసెంబర్ 21 నాటికి రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాన్ని చెప్పాలని, లేకుంటే రేసును నిర్వహించే పరిస్థితి తమకు ఉండదని తెలిపింది. డిసెంబర్ 22వ తేదీన FIE సంస్థ లీగల్ డైరెక్టర్ దాన కిషోర్ కు తెలంగాణ ప్రభుత్వానికి లేఖ రాశారు. మరో నాలుగు రోజులపాటు అంటే డిసెంబర్ 26వ తేదీ నాటికి గడువు ఇచ్చి… తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము తమతో చేసుకున్న ఒప్పందాన్ని గౌరవించకపోవడం తో, హైదరాబాద్ నగరంలో రేసులు నిర్వహించలేమని స్పష్టంగా తెలియజేసింది.

అయితే అంతర్జాతీయ ఫార్ములా ఈ నిర్వాహక సంస్థ fie కి భారత దేశ విభాగం చెల్లించిన 73 లక్షల రూపాయల రేసు ఫీజులను కూడా తిరిగి పంపించింది. భారతదేశ విభాగమైన ఎఫ్ఎంఎస్సిఐ సంస్థ తెలంగాణ ప్రభుత్వానికి ఈ డబ్బులు తీసుకోమని చాలాసార్లు కోరి నా ఇప్పటిదాకా రాష్ట్ర ప్రభుత్వం ఆ డబ్బులను తీసుకోలేదు. 55 కోట్ల రూపాయల నిధులను రెండు వాయిదాలలో తమకు ముట్టిన విషయాన్ని స్పష్టంగా పేర్కొంటూ, తదుపరి మూడవ వాయిదా గురించి, స్పష్టంగా తెలంగాణ ప్రభుత్వంతో పలుసార్లు లేఖల రూపంలో ఫార్ములా ఈ సంస్థ సంభాషణలు కొనసాగించింది.

అత్యంత చట్టబద్ధంగా పారదర్శకంగా హెచ్ఎండిఏ ఇండియన్ ఓవర్సీస్ ప్రభుత్వ బ్యాంకు నుంచి ఈ నిధులను ఆ సంస్థకు చెల్లించింది. ఒక ప్రభుత్వ రంగ బ్యాంకు ఆర్బిఐ నిబంధనలను తుంగలో తొక్కి విదేశీ సంస్థకు నిధులు చెల్లించింది అని ఈ రాష్ట్ర ప్రభుత్వము మతిలేని మాటలను మాట్లాడుతుంది.

కేవలం కాంగ్రెస్ పార్టీకి ఈ క్రీడల వలన జరిగే ప్రయోజనాలను అర్థం చేసుకునే తెలివి లేకపోవడం వలనే కాంట్రాక్టును రద్దు చేసుకుంది. గతంలో ఫార్ములా ఈ ని మాంట్రియల్ అనే నగరంలో ఇదేవిధంగా అక్కడ స్థానిక పట్టణ ప్రభుత్వం మారడం వలన నూతన ప్రభుత్వం రద్దు చేసుకోవడం జరిగింది. ఫార్ములా ఈ సంస్థ మాంట్ర్యాల్ నగరం పైన నష్టపరిహారం కేసు వేసి సుమారు మూడు మిలియన్ డాలర్లను నష్టపరిహారంగా పొందింది.

అదేవిధంగా అంతర్జాతీయ ఆర్బిట్రేషన్ రంగంలో ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన హరీష్ సాల్వే అనే ప్రముఖ న్యాయవాదితో ఫార్ములా ఈ తెలంగాణ ప్రభుత్వం పైన వేసిన కేసును రాష్ట్ర ప్రభుత్వం దాచి పెట్టింది. ప్రభుత్వ డబ్బులు నేరుగా క్రీడా సంస్థ బ్యాంకులోకి ప్రభుత్వ రంగ బ్యాంకు ద్వారా చేరినప్పుడు అవినీతి అనే ప్రశ్నై ఉత్పన్నం కాదు.

కానీ తెలంగాణ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఏర్పడిన నూతన ప్రభుత్వం, ఫార్ములా ఈ సంస్థతో జరిపిన సంభాషణలు రేసు నిర్వహణ కోసం అంగీకరించిన నిర్ణయం.. ఆ తర్వాత కాంట్రాక్టు నిబంధనలను ఉల్లంఘించి రేసు నుంచి తప్పుకోవడం డబ్బులు చెల్లించకపోవడం, దాని ద్వారా రాష్ట్ర ప్రభుత్వం పైన ఫార్ములా ఈ నమోదు చేసిన కేసును… ఫార్ములా ఈ సంస్థ కాంట్రాక్టు ప్రకారం డబ్బులు వెనక్కి తీసుకోమని కోరిన స్పందించకపోవడం వంటి అంశాలు అన్నింటిని దాచి పెట్టింది.

అసలు అవినీతి అనేది జరగనే లేనప్పుడు… జరిగిన ప్రతి లావాదేవీ యొక్క వివరాలు చాలా స్పష్టంగా ఉన్నప్పుడు ఏసీబీ సంస్థ కేసు నమోదు చేసే పరిధి లేనేలేదు. అవినీతి జరగనే లేనప్పుడు అవినీతి నిరోధక చట్టం కింద కేసు నమోదు చేయడం అంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క దివాలా కోరుతనానికి నిదర్శనం.

LEAVE A RESPONSE