- ప్రాథమిక వైద్య విభాగంలో పెనుమార్పులు
- సీఎం జగనన్న పాలనలో ప్రజలందరికీ మెరుగైన వైద్యం
- వైఎస్సార్ హెల్త్ క్లినిక్‌లు, యూహెచ్‌సీలు, పీహెచ్‌సీల నిర్మాణానికి రూ.2532 కోట్లు కేటాయింపు
- ఈ ఏడాది చివరి కల్లా అందుబాటులోకి నూతన భవనాలు
- ఫ్యామిలీ డాక్టర్ వైద్య విధానానికి కీలకం కొత్త భవనాలే
- గడువులోగా భవనాల నిర్మాణం పూర్తవ్వాల్సిందే
- పనుల పురోగతిపై ప్రతి నెలా సమీక్ష
- భవనాలు రాష్ట్ర వ్యాప్తంగా ఒకే రూపుతో ఉండాలి
- రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి విడదల రజిని
- వైఎస్సార్ హెల్త్ క్లినిక్‌లు, యూహెచ్‌సీలు, పీహెచ్‌సీల నిర్మాణంపై సమీక్ష
ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మార్గదర్శకత్వంలో రాష్ట్రంలో వైద్య ఆరోగ్య రంగం పటిష్టంగా మారిపోతోందని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి విడదల రజిని తెలిపారు. వైఎస్సార్ హెల్త్ క్లినిక్‌లు, యూహెచ్‌సీలు, పీహెచ్‌సీల నిర్మాణంపై మంత్రి విడదల రజిని సోమవారం ఆయా విభాగాల అధికారులందరితో కలిసి రాష్ట్ర సచివాలయం ఐదో బ్లాక్‌లో సోమవారం సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఫ్యామిలీ డాక్టర్ విధానాన్ని అమల్లోకి తీసుకొస్తున్నామని, దేశ చరిత్రలోనే వైద్య ఆరోగ్యశాఖలో ఇది సరికొత్త విప్లవమని చెప్పారు. రాష్ట్రంలో నిర్మాణంలో ఉన్న అన్ని వైఎస్సార్ విలేజ్ హెల్త్ క్లినిక్‌లు, అర్బన్ హెల్త్ సెంటర్లు, ప్రాథమిక వైద్యశాలలన్నింటినీ వెంటనే పూర్తిచేయాలని తెలిపారు. ఫ్యామిలీ డాక్టర్ వైద్య విధానానికి వైఎస్సార్ హెల్త్ క్లినిక్‌లు, యూహెచ్‌సీలు, పీహెచ్‌సీలు కీలకమని చెప్పారు. తమ ప్రభుత్వం ప్రాథమిక వైద్య విభాగాన్ని పూర్తిగా మార్చేస్తోందన్నారు. ఈ విభాగంలో ఆస్పత్రుల నిర్మాణం కోసమే ఏకంగా రూ.2532 కోట్ల రూపాయలను ముఖ్యమంత్రి జగనన్న ఖర్చు చేస్తున్నారని తెలిపారు.
పేదలందరికీ ఉచితంగా ఆధునిక వైద్యం
పేద ప్రజలందరికీ ఆధునిక వైద్యాన్ని ఉచితంగా అందించే దిశగా కృషి చేస్తున్నామని తెలిపారు. గ్రామగ్రామాన వైఎస్సార్ విలేజ్ క్లినిక్‌లను నిర్మిస్తున్నామని, రూ.1500 కోట్లతో 1032 విలేజ్ క్లినిక్‌ల నిర్మాణం చేపట్టామని చెప్పారు. 184 యూహెచ్‌సీల ఆధునికీకరణ, 344 కొత్త యూహెచ్‌సీల నిర్మాణం కోసం ప్రభుత్వం రూ.665 కోట్లు కేటాయించిందని, ఈ పనులు దాదాపు పూర్తికావచ్చాయని తెలిపారు. 976 పీహెచ్‌సీల ఆధునికీకరణ, 150 కొత్త పీహెచ్‌సీల నిర్మాణం కోసం రూ.367 కోట్లు వెచ్చిస్తున్నామన్నారు.
ఏడాది చివరికల్లా నిర్మాణం పూర్తికావాలి
ఆయా భవనాల నిర్మాణం ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ ఏడాది చివరి కల్లా పూర్తి కావాలని మంత్రి విడదల రజిని ఆదేశాలు జారీ చేశారు. పనుల పురోగతిపై ఇకపై ప్రతి నెలా తానే స్వయంగా సమీక్ష నిర్వహిస్తానని చెప్పారు. అన్ని భవనాల నిర్మాణం, రూపు ఏకరీతిగా ఉండాలని తెలిపారు. ఆయా భవనాల నిర్మాణం కోసం బిల్లుల చెల్లింపుల్లోనూ ఎలాంటి ఇబ్బందులు లేవని చెప్పారు. ఒకవేళ ఎక్కడైనా ఇబ్బందులు ఎదురైతే తన దృష్టికి తీసుకురావాలని సూచించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి ఆశయాలకు అనుగుణంగా అధికారులంతా పనిచేయాలని చెప్పారు. సమావేశానికి వైద్య ఆరోగ్యశాఖ ప్రధాన కార్యదర్శి ఎం.టి.కృష్ణబాబు, వైద్య ఆరోగ్యశాఖ, పంచాయతీరాజ్, ఆర్అండ్‌బీ, మున్సిపల్ శాఖ ఉన్నతాధికారులు హాజరయ్యారు.