-మంత్రి తలసాని సమీక్ష
తెలంగాణ సంస్కృతిని చాటిచెప్పే బోనాల ఉత్సవాలను అత్యంత ఘనంగా నిర్వహించేలా ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తుందని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ చెప్పారు. మంగళవారం మాసాబ్ ట్యాంక్ లోని తన కార్యాలయం నుండి బోనాల ఉత్సవాల ఏర్పాట్ల పై మంత్రి శ్రీనివాస్ యాదవ్ టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ టెలి కాన్ఫరెన్స్ లో నగరానికి చెందిన మంత్రులు మహమూద్ అలీ, సబితా ఇంద్రారెడ్డి, MLC లు సురభి వాణిదేవి, ప్రభాకర్ రావు, MLA లు మాగంటి గోపినాద్, దానం నాగేందర్, కాలేరు వెంకటేష్, ముఠా గోపాల్, సుభాష్ రెడ్డి, అరికేపూడి గాంధీ, ప్రకాష్ గౌడ్, మైనంపల్లి హన్మంతరావు, కలెక్టర్ లు అమయ్ కుమార్, హరీష్, దేవాదాయ శాఖ కమిషనర్ అనిల్ కుమార్, సాంస్కృతిక శాఖ డైరెక్టర్ మామిడి హరికృష్ణ ఇతర అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత బోనాల ఉత్సవాలను రాష్ట్ర పండుగగా ప్రకటించి ఎంతో ఘనంగా నిర్వహిస్తున్న విషయాన్ని గుర్తుచేశారు.
ఈ సంవత్సరం కూడా బోనాల ఉత్సవాలను అత్యంత ఘనంగా నిర్వహించేందుకు ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఆదేశాల మేరకు ప్రభుత్వం 15 కోట్ల రూపాయలను విడుదల చేసిందని పేర్కొన్నారు. సుమారు 3500 కు పైగా ప్రభుత్వం ప్రైవేట్ దేవాలయాలకు ఆర్ధిక సహాయం చెక్కులను అందిస్తున్నట్లు తెలిపారు. వివిధ దేవాలయాలకు ప్రభుత్వం అందించే ఆర్ధిక సహాయాన్ని బోనాలకు ముందే అందించడం జరుగుతుందని తెలిపారు. ఈ నెల 17 న బోనాల ఉత్సవాలు నిర్వహించే సికింద్రాబాద్ పరిధిలోని ఆలయాలకు రెండు రోజులలో MLA ల ఆధ్వర్యంలో ఆయా నియోజకవర్గాల పరిధిలోని దేవాలయాల నిర్వహకులకు ప్రత్యేక కార్యక్రమం ఏర్పాటు చేసి చెక్కులను పంపిణీ చేయడం జరుగుతుందని వివరించారు. అదేవిధంగా 24 వ తేదీన బోనాలు నిర్వహించే హైదరాబాద్ పరిధిలోని ఆలయాలకు 18 వ తేదీన చెక్కుల పంపిణీకి ఏర్పాట్లు చేయాలని దేవాదాయ శాఖ అధికారులను మంత్రి శ్రీనివాస్ యాదవ్ ఆదేశించారు.
బోనాల ఉత్సవాల సందర్భంగా ఆలయాలకు వచ్చే భక్తులను అలరించే విధంగా సందర్భంగా సాంస్కృతిక శాఖ కళాకారులచే ప్రతి నియోజకవర్గ పరిధిలో 4 ప్రాంతాలలో సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు. పాతబస్తీ లోని 25 ప్రాంతాలలో సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణ కోసం ఆర్ అండ్ బి శాఖ ఆధ్వర్యంలో వేదికలను ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. భారీ వర్షాలు, ఈదురు గాలుల నేపధ్యంలో అధికారులు, ప్రజాప్రతినిధులు అప్రమత్తంగా ఉండాలని, ప్రజలు ఎలాంటి ఇబ్బందులకు గురికాకుండా చూడాలని కోరారు. అత్యవసరమైతే తప్ప ప్రజలు బయటకు రావద్దని మంత్రి సూచించారు. అత్యవసర సేవల కోసం అత్యవసర సేవల కోసం GHMC కార్యాలయంలో కంట్రోల్ రూమ్ TOLL FREE 21111111 ను ఏర్పాటు చేయడం జరిగిందని, వినియోగించుకోవాలని కోరారు.