Suryaa.co.in

Andhra Pradesh

రెడ్ క్రాస్, గ్రీన్ క్రాప్ లను రివైజ్ చేయండి..

  • గత ప్రభుత్వంలో మొక్కలు నరికిన వారిపై చర్యలేవి?
  • స్పీకర్ అయ్యన్న పాత్రుడు

అధికారులు నాటిన 60 లక్షల మొక్కలు పూర్తిస్థాయిలో ఉన్నాయంటే నేను నా పదవికి రాజీనామా చేస్తానని స్పీకర్ అయ్యన్నపాత్రుడు స్పష్టం చేశారు. వనమహోత్సవంలో భాగంగా అనకాపల్లి, ఎన్టీఆర్ మార్కెట్లో మొక్కలు నాటే కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.

ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ఇటీవల కాలంలో 60 లక్షల మొక్కలు నాటినట్టు అధికారులు చెబుతున్నారని, క్షేత్రస్థాయిలో చూస్తే దీనికి భిన్నమైన పరిస్థితులుంటున్నాయన్నారు. మొక్కలు నాటడం అనే కార్యక్రమం కేవలం కాగితాలకే పరిమితమౌతోందన్నారు. గతంలో తాను అటవీ మంత్రిగా ఉన్న సమయంలో రెడ్ క్రాస్, గ్రీన్ క్రాప్, ఎన్సీసీ వంటి విద్యార్థి విభాగాలతో ప్రత్యేకంగా ఒకే రొజు లక్షల మొక్కలు నాటేలా చర్యలు తీసుకునేవారమన్నారు. ప్రస్తుతం వాటన్నింటినీ పటిష్టం చేసేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ను ఆదేశించారు.

జిల్లాలో నాలుగు లక్షల మంది డ్వాక్రా మహిళలను మొక్కల పెంపకంలో భాగస్వామ్యం చేయాలని సూచించారు. శాస్త్రవేత్తలు వద్దన కొన్ని జాతుల మొక్కలను నాటవద్దన్నారు. అన్ని కళాశాలల్లో మొక్కలు పెంచేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. . గత ప్రభుత్వ హయాంలో రోడ్డు మీద చెట్లను ఇష్టారాజ్యంగా నరికేవారని, దీనిపై ఉన్నతాధికారులు ఏం చర్యలు తీసుకున్నారో? సభకు చెప్పాలని డిమాండ్ చేశారు. సామాన్య రైతు తన పొలంలో వేప, టేకు చెట్టు పెంచుకుంటే నరికేందుకు అనుమతి కోసం అటవీ అధికారులు నానా ఇబ్బందులు పెడుతున్నారన్నారు.

ఒకవేళ అటవీ అధికారులు చెప్పకుండా నరికితే ఎక్కువ ఫైన్ వేసి ఇబ్బందులు పెడుతున్నారని గుర్తు చేశారు. రోడ్డు వెడల్పు చేసినప్పుడు చెట్లు నరికితే.. వాటిని తిరిగి పెంచేందుకు ప్రత్యేకంగా పనిలోనే నిధుల కేటాయింపు జరిగేలా అనకాపల్లి జిల్లా నుంచే శ్రీకారం చుట్టాలని కోరారు. వన మహోత్సవంలో భాగంగా మెడిసిన్ ప్లాంట్ తో పాటు వెదురు వనాలు పెంచేలా చర్యలు తీసుకోవాలన్నారు.

ఇంటికొక మొక్క పెంచేలా ప్రతి ఒక్కరూ చర్యలు తీసుకోవాలని కోరారు. . ఏడాదికి పది శాతం మొక్కలు పెంచేలా చర్యలు తీసుకుంటే, ఐదేళ్లలో ఆంధ్ర రాష్ట్రం పచ్చగా మారుతుందని పేర్కొన్నారు.ప్రతీ ఒక్క విద్యార్థి వారి ఇంటి పరిసర ప్రాంతాలలో ఒక మొక్కను నాటి వాటి సంరక్షణ వారే తీసుకోవాలని విద్యార్థులకు సూచించారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ లు చాలా పట్టుదలతో ఉన్నారని, దానికి అనుగుణంగా క్షేత్రస్థాయిలో చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

టింబర్ డిపోల్లో స్మగ్లింగ్

నర్సీపట్నం అటవీ అధికారుల సహకారంతో టింబర్ డిపోల్లో పెద్ద ఎత్తున స్మగ్లింగ్ జరుగుతోందని ఆరోపించారు. దీనికి సంబందించిన వివరాలతో పాటు అవినీతికి పాల్పడే అధికారుల జాబితాను డీఎప్ఓకు అందించారు. దీనిపై వెంటనే విచారణ చేసి, చర్యలు తీసుకోవాలని స్పీకర్ అయ్యన్నపాత్రుడు ఆదేశించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేలు కొణతాల రామకృష్ణ, సుందరపు విజయ్ కుమార్, కలెక్టర్ విజయ కృష్ణన్, డీఎఫ్వో ఇతర అధికారులు పాల్గొన్నారు.

ఈ కార్యక్రమంలో అనకాపల్లి ఎమ్మెల్యే కొనతాల రామకృష్ణ, యలమంచిలి వారి సందేశం ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్, జిల్లాకలెక్టర్ విజయ క్రిష్ణనన్ , డి ఎఫ్ ఓ జగన్నాద్ సింగ్ తదితరులు పాల్గొన్నారు.

LEAVE A RESPONSE