-చిమ్మటి చీకట్లను చీల్చుకుంటూ… దేదీప్యమాన వెలుగుల్లోకి
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలంగాణ ప్రాంతం పరిస్థితి అంధకార బందురం. కరెంటు రాకడ, ప్రాణం పోకడ ఎవరికీ తెలిసేది కాదు. ఆనాడు కరెంటు పోతే కాదు. వస్తే వార్త. పేరుకే కరెంటు… కరెంటు తీగల మీద బట్టలు ఆరేసుకునే పరిస్థితి. కోతలే కోతలు. పవర్ హాలీ డేలు. పరిశ్రమలకు ఏనాడూ సరి పడా కరెంటు ఇచ్చిన పాపాన పోలేదు. గృహావసారాలు అసలే తీరలేదు. రైతాంగం అరి గోస పడ్డది. కరెంటు కష్టాలు అన్నీ ఇన్నీ కావు. నాణ్యతలేని కరెంటుతో ఇంట్లో ఫ్యాన్లు, ఫ్రిజ్లు, టీవీలు కాలిపోయేది.
రైతాంగానికి పేరుకే 9 గంటల కరెంటు… అరకొరగా వచ్చే కరెంటు తక్కువలు ఎక్కువలతో… ట్రాన్స్ఫార్మార్లు, మోటార్లు కాలిపోయేది. ఫీజులు ఎగిరిపోయేవి. అవి బాగు కావడానికి రోజులు పట్టేది. దీంతో పంటలు ఎండేవి. రాత్రిళ్ళు ఇచ్చే కరెంటు కోసం రైతులు భార్యా బిడ్డలను వదిలి బావుల దగ్గర పడుకునేది. చీకట్లో కరెంటు షాక్ లు కొట్టి, పాములు, తేళ్ళు కుట్టి చనిపోయిన రైతులెందరో! ట్రాన్స్ ఫార్మర్ల మీద ఫీజులు వేయడానికని వెళ్ళి మృత్యువాత పడ్డ రైతులకు లెక్కలేదు. కరెంటు ఉండేది కాదు. ప్రజలకు మంచినీరు అందేది కాదు. ఎండా కాలం వస్తే ఉక్కపోతే. చెప్పుకునే దిక్కులేని దిక్కుమాలిన పరిస్థితులు ఆనాటివి.
ఈ కష్టాల కడలిని ఈదుతూనే ఈ బతుకులు మాకొద్దని ప్రజలంతా ఇప్పటి సిఎం అప కెసిఆర్ నేతృత్వంలో ఉద్యమించారు. 14 ఏండ్ల అవిశ్రాంత, శాంతియుత పోరాటం చేశారు. తెలంగాణ వస్తే ఏమొస్తది? అని వెక్కిరించారు. మీ తెలంగాణల కరెంటు ఉండదు. ఉత్పత్తి కేంద్రాలు లేవు. మీరంతా చీకట్లో మగ్గాలె. అవహేళన చేశారు.
తెలంగాణ వచ్చింది. 60 ఏండ్ల కల ఆవిష్కారమైంది. ఉద్యమ నేత కెసిఆర్, సీఎం అవడం అదృష్టంగా మారింది. పట్టుపట్టి సీఎం కెసిఆర్ విద్యుత్ రంగంపై దృష్టి పెట్టారు. అదే పనిగా పదే పదే సమీక్షిస్తూ, అతి తక్కువ కాలంలో అనుకున్నది సాధించారు. తెలంగాణలో విద్యుత్ వెలుగులు విరజిమ్మారు.
ఒకవైపు రాష్ట్రంలో అందుబాటులో ఉన్న వనరులను సద్వినియోగం చేసుకొంటూనే, అవసరమైన మేర కొనుగోలు చేస్తూ, ఇవ్వాళ కరెంటు మిగులు రాష్ట్రంగా తెలంగాణను తీర్చిదిద్దారు. ఎలాంటి విద్యుత్ కోతలు లేకుండా, పవర్ హాలీడేల స్వస్తి పలికి, నాణ్యమైన కరెంటును 24 గంటల పాటు నిరంతరాయంగా అందిస్తున్నారు. ఇవ్వాళ దేశంలో 24 గంటల కరెంటు అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ.
అన్నిరంగాలకు 24 గంటల నాణ్యమైన విద్యుత్ సరఫరాతో వెలుగు జిలుగుల రాష్ట్రంగా తెలంగాణ అవతరించింది. అంతులేని కరెంటు కోతలు, పవర్ హాలిడేల నుండి ఆనతి కాలంలోనే తెలంగాణ శాశ్వత విముక్తిని సాధించింది. తలసరి విద్యుత్తు వినియోగంలో తెలంగాణ దేశంలోనే నంబర్ 1 గా నిలిచింది.
తేదీ 02.06.2014లో రాష్ట్ర స్థాపిత విద్యుత్తు సామర్థ్యం 7,778 మెగావాట్లు కాగా, నేడు 01.04.2022 నాటికి 17,305 మెగావాట్లకు పెరిగింది.