-రాష్ట్రాభివృద్ధికి కేంద్రం ముందుకొచ్చినా రాష్ట్ర ప్రభుత్వ సహాయ నిరాకరణను ఆధారాలతోసహా ఎండగట్టండి
-కేసీఆర్ పాలనలో తెలంగాణకు జరిగిన ద్రోహంపై ఎలుగెత్తి చాటండి
-కేంద్ర ప్రభుత్వ విజయాలను విస్త్రతంగా ప్రజల్లోకి తీసుకెళ్లండి
-తెలంగాణకు కేంద్రం ఇచ్చిన నిధుల వివరాలను బయటపెట్టండి
-డబుల్ ఇంజిన్ సర్కార్ వస్తే తెలంగాణకు కలిగే ప్రయోజనాలను వివరించండి
-రాష్ట్ర అధికార ప్రతినిధుల, తెలంగాణ ఉద్యమ కారుల సమావేశంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్
-జూన్ 2న తెలంగాణ ఉద్యమకారులు, కవులు, కళాకారులు, అమరవీరుల కుటుంబాలతో సభ నిర్వహించాలని నిర్ణయం
తెలంగాణ రాష్ట్ర అభివ్రుద్ధికి కేంద్ర ప్రభుత్వం అన్ని విధాలుగా చేయూతనందిస్తున్నా…. కేసీఆర్ ప్రభుత్వం సహాయ నిరాకరణ చేస్తూ కేంద్రాన్ని బదనాం చేస్తున్న తీరును ఆధారాలతోసహా ప్రజల ముందుంచి టీఆర్ఎస్ ను ఎండగట్టాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ కోరారు. ఏ ఆశయాలు, ఆకాంక్షల కోసం తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నామో.. ఆ ఆకాంక్షలకు భిన్నంగా కేసీఆర్ కుటుంబం సాగిస్తున్న పాలనను, కొనసాగిస్తున్న దాష్టీకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు.
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని జూన్ 2న బీజేపీ ఆధ్వర్యంలో హైదరాబాద్ లో తెలంగాణ ఉద్యమకారులతో సభను నిర్వహించి కేసీఆర్ పాలనలో నిజమైన తెలంగాణ ఉద్యమకారులు, అమరవీరుల కుటుంబాలతోపాటు ప్రజలకు జరుగుతున్న అన్యాయాన్ని ప్రజలకు వివరిస్తామన్నారు. కేంద్రంతోపాటు రాష్ట్రంలోనూ డబుల్ ఇంజిన్ సర్కార్ ఉండటంవల్ల తెలంగాణకు కలిగే ప్రయోజనాలను ప్రజలకు వివరించాలని సూచించారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఈరోజు పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధులు, కేసీఆర్ తో కలిసి తెలంగాణ ఉద్యమంలో పాల్గొని మోసపోయిన సీనియర్ నేతలతో బండి సంజయ్ కుమార్ వేర్వేరుగా సమావేశమయ్యారు.
తొలుత రాష్ట్ర అధికార ప్రతినిధులతో జరిగిన సమావేశంలో బండి సంజయ్ తోపాటు రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్, కార్యదర్శి డాక్టర్ ఎస్.ప్రకాశ్ రెడ్డి, అధికార ప్రతినిధులు క్రిష్ణసాగర్ రావు, ఎన్వీ సుభాష్, పాల్వాయి రజనీకుమారి, జె.సంగప్ప, రాకేశ్ రెడ్డి, రాణి రుద్రమాదేవి, పోరెడ్డతి కిశోర్ రెడ్డి, టి.వీరేందర్ గౌడ్, సీహెచ్.విఠల్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ రాష్ట్రానికి కేంద్రం గత ఏడేళ్లలో పెద్ద ఎత్తున నిధులిచ్చినా టీఆర్ఎస్ ప్రభుత్వం, మంత్రులు మాత్రం కేంద్రం ఏమీ ఇవ్వడం లేదని దుష్ప్రచారం చేస్తోందని, ఈ నేపథ్యంలో కేంద్రం ఇచ్చిన నిధుల వివరాలను ప్రజలకు వెల్లడించి టీఆర్ఎస్ తీరును ఎండగట్టాలని సూచించారు. ఏపీ, తెలంగాణ ముఖ్యమంత్రులు జగన్ మోహన్ రెడ్డి, కేసీఆర్ కుమ్కక్కై విభజన చట్టంలోని అంశాలు పరిష్కారం కాకుండా వ్యూహాత్మకంగా జాప్యం చేస్తూ కేంద్రంపై నెపం నెట్టేందుకు చేస్తున్న కుట్రలను కూడా బయటపెట్టాలన్నారు. కేంద్రంలోని నరేంద్రమోదీ ప్రభుత్వం 8 ఏళ్ల పాలనలో సాధించిన విజయాలను, భారత్ ను అన్ని రంగాల్లో అభివ్రుద్ధి పథంలోకి తీసుకెళుతున్న విషయాన్ని విస్త్రంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని పేర్కొన్నారు.
అనంతరం తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలకంగా పాల్గొన్న పార్టీ సీనియర్ నేతలు, శాసనమండలి మాజీ ఛైర్మన్ స్వామిగౌడ్, మాజీమంత్రి డాక్టర్ ఏ.చంద్రశేఖర్, టీఎస్పీఎస్సీ మాజీ సభ్యులు సీహెచ్.విఠల్, జిట్టా బాలక్రిష్ణారెడ్డి, రాణి రుద్రమాదేవి, దరువు ఎల్లన్నతోపాటు పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు దుగ్యాల ప్రదీప్ కుమార్, బంగారు శ్రుతి, ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ తదితరులతో బండి సంజయ్ సమావేశమయ్యారు. జూన్ 2న తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం దినోత్సవాన్ని పురస్కరించుకుని చేపట్టాల్సిన కార్యక్రమాలపై చర్చించారు.
ఏ ఆశయం, ఏ ఆకాంక్షల సాకారం కోసం తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నామో… అందుకు భిన్నంగా కేసీఆర్ పాలన కొనసాగుతున్న నేపథ్యంలో జూన్ 2న తెలంగాణ ఉద్యమ కారులు, కవులు, కళాకారులు, అమరవీరుల కుటుంబాలతో సభ నిర్వహించేందుకు సిద్ధమయ్యారు. తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలకంగా పాల్గొని కేసీఆర్ చేతిలో మోసపోయిన వారందరినీ ఆ సభకు రప్పించి కేసీఆర్ కుటుంబ పాలనలో జరుగుతున్న అరాచకాలు, తెలంగాణ రాష్ట్రానికి జరుగుతున్న ద్రోహాన్ని ఎండగట్టాలని నిర్ణయించారు. నీళ్లు-నిధులు-నియామకాల నినాదం కేసీఆర్ పాలనలో పూర్తిగా ఫెయిలైందని… బీజేపీ అధికారంలోకి వస్తేనే తెలంగాణకు పూర్తిగా న్యాయం జరుగుతుందనే సంకేతాలను ఈ సభ ద్వారా ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని భావిస్తున్నారు.