-రాబోయే రోజుల్లో వైద్య ఆరోగ్యశాఖలో విప్లవాత్మక మార్పులు
-ప్రభుత్వ డాక్టర్ల హాజరుపై ప్రత్యేక నిఘా
-వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజని
విజయవాడ: ప్రజారోగ్యానికి సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి పెద్దపీట వేస్తున్నారని మంత్రి విడదల రజిని అన్నారు. రాబోయే రోజుల్లో వైద్యారోగ్యశాఖలో విప్లవాత్మక మార్పులు రాబోతున్నాయని వెల్లడించారు. జిల్లా అధికారులు క్షేత్రస్థాయిలో తప్పనిసరిగా పర్యటించాలని ఆమె ఆదేశించారు. దీనివల్ల పీహెచ్‌సీలు, యూపీహెచ్‌సీలు, సీహెచ్‌సీలు, డీహెచ్‌లు, ఏహెచ్‌లలో వైద్య సేవలు మెరుగవుతాయన్నారు. ప్రభుత్వ డాక్టర్ల హాజరుపై ప్రత్యేక నిఘా ఉంటుందని చెప్పారు.
సీజనల్ వ్యాధుల తీవ్రత ఎక్కువగా ఉన్న చోట్ల వెంటనే తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. వ్యాధుల వ్యాప్తిని గమనిస్తూ అవసరమైన చోట్ల వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలన్నారు. డెంగీ, మలేరియా వ్యాధి నిర్ధారణ కిట్లను అందుబాటులో ఉంచుకోవాలని చెప్పారు.
సీఎం వైయస్ జగన్ రూ.వేల కోట్లు వైద్య శాఖ కోసం ఖర్చు చేస్తున్నారని గుర్తు చేశారు. అన్ని విషజ్వరాలకు ఆరోగ్యశ్రీ కింద ఉచితంగా చికిత్స అందేలా చేస్తున్నారన్నారు. డెంగీ, మలేరియా, చికెన్‌గున్యాతోపాటు కలరా, డయేరియా నివారణకు కావాల్సిన మందులన్నీ ప్రభుత్వాస్పత్రుల్లో సరిపడా ఉన్నాయన్నారు. ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఇతర ప్రజాప్రతినిధుల నుంచి వచ్చే వినతులపై తక్షణమే స్పందించాలన్నారు.
ఈ విషయంలో స్పందించని అధికారులపై చర్యలు తప్పవని హెచ్చరించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఫ్రైడే డ్రైడే కార్యక్రమాన్ని మరింత చిత్తశుద్ధితో నిర్వహించాలని చెప్పారు. వెంటనే ఫీవర్ సర్వేను చేపట్టాలని, 15 రోజుల్లోగా ఇది పూర్తికావాలని ఆదేశించారు. ఈ సర్వేకు సంబంధించి ఏ రోజు వివరాలు ఆ రోజు తనకు నేరుగా పంపాలన్నారు.