-సెటిలర్స్ కూడా సెక్షన్ 8 కు శాశ్వత హోదాను కల్పించాలి
-ప్రభుత్వ కార్యాలయాల్లో సెటిలర్స్ పట్ల చూపుతున్న వివక్షతను సెక్షన్ 8 కిందకు తీసుకురావాలి
గతంలో ఆంధ్రప్రదేశ్ విభజన చట్టం చేసే సందర్భంలో సీమాంధ్ర నాయకులు చేసిన ద్రోహం అంతా , ఇంతా కాదు. ఒక పక్క కె.సి.ఆర్ రాష్ట్ర విభజన అనేది ఖాయం , బి.జె.పి , కాంగ్రెస్ రెండూ ఆమోదించాయి , బిల్ కూడా తయారవుతోంది , మీకు కావలసినవి అడుక్కోండి అని సభాముఖంగా ఎంత చెప్పినా దివాళాకోరు ఎ.పి నాయకులు పట్టించుకోలేదు. యధారాజా , తధాప్రజ అన్నట్లు ఎ.పి జనులు పూనకం వచ్చిన వారిలాగా ఊగిపోయారు.
పోనీ తాడో , పేడో తేల్చుకుందామని చివరి కంటా పోరాడారా ! అదీ లేదు. ఆంధ్రులు ఆరంభసూరులనే నానుడి ఊరికే రాలేదు. దాన్ని సార్ధకం చేసుకుని ఉద్యమాన్ని తుస్సు మనిపించారు. నాయకులకు ఏమి పోయింది ? చక్కగా హైదరాబాద్ లో తమ ఆస్తులను కాపాడుకుంటూ రాజకీయాలు చేస్తున్నారు. అదే పరిస్థితి మరలా నేడు తెలంగాణా లో సీమాంధ్ర సెటిలర్స్ ఎదుర్కొంటున్నారు. ఏ ఒక్క తెలంగాణా పార్టీలు గానీ , కేంద్ర పార్టీలు గానీ సెటిలర్స్ సమస్యల మీద స్పందించడం లేదు . విభజన హామీల్లో హైద్రాబాద్ లో సీమాంధ్ర మూలాలున్న సెటిలర్స్ భద్రతకు కొన్ని ప్రత్యేక చట్టాలు సెక్షన్ 8 ద్వారా , 10 సం.ల వరకు ఏర్పాటు చేయడం జరిగింది .
అయితే ఆ చట్టంలో ధన , మాన, ప్రాణాల రక్షణలు మాత్రమే సెక్షన్ 8 లో చేర్చడం జరిగింది . ఎలాంటి ఆస్తులు లేని పేదవారికి ఈ చట్టం వల్ల పాక్షిక ప్రయోజనం మాత్రమే వనగూడుతోంది . సెటిలర్స్ లోని పేద వర్గాల ప్రజలకు ప్రభుత్వం కల్పించే సంక్షేమ పథకాల అవసరం , ఆసరా ఎంతో ఉంది. ఫీజు రీఎంబర్స్ మెంట్ , రేషన్ కార్డులు , కుల ధృవీకరణ పత్రాలు , ఆరోగ్య పథకం , వృద్ధాప్య పెన్షన్ , ఇళ్ల నిర్మాణ అనుమతుల్లో తీవ్ర ఇబ్బందులకు గురికావాల్సి వస్తోంది . సంబంధిత కార్యా లయాలకు వెళితే ఆంధ్రా సిటిలర్స్ అనే వివక్షతకు గురికావాల్సి వస్తోంది .
మధ్య తరగతి సెటిలర్స్ కు ప్రభుత్వ కార్యాలయాల్లో , పోలీస్ కేసుల్లో ఫిర్యాదులు స్వీకరించే వ్యవస్థే లేదు . ఇక ప్రైవేటు వ్యక్తులతో ఏమైనా సమస్యలు వస్తే వినిపించుకునే నాథుడే లేడు. ఏ చిన్న సర్టిఫికేట్ కావాలన్నా ఎ.పి కి వెళ్లి తీసుకువచ్చి ఇక్కడ చూపించవల్సి వస్తోంది . ఇది ఆర్ధికంగా ఖర్చుతో కూడుకున్నదే కాక , చేస్తున్న పనికి సెలవు పెట్టి వెళ్లి రావాల్సి వస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో సెక్షన్ 8 నీ బలోపేతం చేసి , దాని కాల పరిమితిని పొడిగించ వలసిందిగా సెటిలర్స్ కోరుచున్నారు.
ముస్లింలకు శాశ్వత మైనారిటీ హోదాను ఇచ్చినట్లుగా. సెటిలర్స్ కూడా సెక్షన్ 8 కు శాశ్వత హోదాను కల్పించాలి . ప్రభుత్వ కార్యాలయాల్లో సెటిలర్స్ పట్ల చూపుతున్న వివక్షతను సెక్షన్ 8 కిందకు తీసుకురావాలి. పేద ప్రజల పట్ల ప్రభుత్వ కార్య లయాల్లో చూపే వివక్షతను కూడా సెక్షన్ 8 పరిధిలోకి తీసుకు రావాలి. హైద్రాబాద్ శివారుల్లో ఎక్కువుగా సెటిలర్స్ ఉన్నారు కాబట్టి.. hmda పరిధి వరకు సెక్షన్ 8 పరిధిని విస్తరిం చాలి . సెక్షన్ 8 అమలుకు ఒక ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చెయ్యాలి .
సెటిలర్స్ గా ఉన్న తెలుగు భాషా మాట్లాడే ఒక్క సీమాంధ్రుల పట్ల మాత్రమే వివక్షతకు గురవుతున్నారని చెబుతున్నారు . ఇతర భాషలు మాట్లాడే , ఇతర రాష్ట్రాల జనులు లక్షల్లో ఉన్నా, వారిపట్ల ఉదారంగా వ్యవహరిస్తూ , సీమాంధ్రులను చిన్నచూపు చూస్తున్నారని వాపోతున్నారు. టీ బంక్ లు , మిర్చి – సమోసా బళ్ళు , హార్డ్ వేర్ – పెయింట్స్ షాపులు , ఎలక్ట్రికల్ షాపులు, బంగారు షాపులు , మాల్స్ , ఫాన్సీ – నిత్యావసర దుకాణాలు , హోటల్స్ ఇలా ఒక్కొక్కటిగా ఇతర రాష్ట్రాల వారు గుత్తాధిపత్యంగా వందల , వేల సంఖ్యల్లో ఎక్కడ పడితే అక్కడ షాపులు తెరుస్తుంటే , వారిని ఏమీ అనకుండా , సీమాంధ్ర సెటిలర్స్ ఏమైనా దుకాణం గానీ , హోటల్ గానీ ప్రారంభిస్తుంటే , వారు నానా విధాలుగా అనేక ఇబ్బందులకు గురికావాల్సి వస్తోందనీ ఆవేదన చెందుతున్నారు .
గతంలో ఏనాడూ లేని కుల వివాదాలను తీసుకు వచ్చే ప్రయత్నాలు జరుగుతున్నవని , దీనివల్ల అప్పటి వరకూ సఖ్యతతో ఉండే ఇరుగు , పొరుగువారు సైతం ఆంధ్రా సెటిలర్స్ పట్ల వివక్షతతో చిన్నచూపు చూస్తున్నారని పలువురు వాపోతున్నారు. అంతర్జాతీయంగా విశ్వనగరంగా విస్తరిస్తున్న హైదరాబాద్ కి ఒక బ్రాండ్ ఇమేజ్ కావాలి . అది కావాలంటే రాజకీయ సుస్థిరత , మత సామరస్యత , ప్రాంతాల పట్ల – కులాల పట్ల సమతుల్యత ఎంతో అవసరం. హైద్రాబాద్ నగరం ఏ ఒక్క పార్టీకో , ఏ కులానికో – మతానికో చెందినది కాదని , హైదరాబాద్ మనందరిదనీ అని అనుకున్నప్పుడు మాత్రమే అది విశ్వనగరం అవుతుందనే విషయాన్ని గుర్తించాలని మేధావులు , విద్యావంతులు అంటున్నారు.
హక్కులు అడిగేడప్పుడు బాధ్యతలు కూడా కొన్ని ఉంటాయనీ , హక్కుల మాటున అధికారం చలాయించాలని చూస్తే కథ మరలా మొదటికి వస్తుందనీ కూడా హెచ్చరిస్తున్నారు . అన్ని రాష్ట్రాల సెటిలర్స్ కూడా ఎవరి పరిధిలో వారుండి, ముఖ్యంగా సీమాంధ్ర సెటిలర్స్ అత్యుత్సాహం చూపకుండా ఎవరి పనులు వారు చేసుకుంటే , ఎవరి ఓటు వారు వేసుకుంటే అందరికీ శ్రేయస్కరం. సీమాంధ్రులు తెలివి తక్కువ వారేమీ కాదు. వారి ఖ్యాతి ఇప్పటికే విశ్వవ్యాప్త మయ్యింది. విశ్వమంతా తిరిగి , ఇంటివెనక చచ్చినట్లు , మీ తెలివి తేటలను వెకిలి తనంగా ఓటు రూపంలో వృధా చెయ్య వద్దని , సరైన సమయంలో , వివేకంతో ఆలోచించి అడుగులు వెయ్యాలని రాజకీయ అనుభవజ్ఞులు చెబుతున్నారు .
ఇప్పటికే ఓటు ఎవరికి వెయ్యాలో దాదాపుగా ఒక నిర్ణయానికి వచ్చినట్లుగా వార్తలు అందుతున్నాయి. ఆంధ్రులు ఆరంభసూరులని ఒక నానుడి ఉందని ఇంతక ముందు చెప్పుకున్నాం. గత 2,3 ఎన్నికల్లో హైదరాబాద్ లో ఓట్లు వేసిన ఆంధ్రా ప్రాంతపు వారిని కొంతమంది ఉద్యోగులు , వివిధ మార్గాల ద్వారా సెటిలర్స్ గా గుర్తించి , ఓట్లను తొలిగిస్తున్నారని చాలామంది అంటున్నారు. నెట్ లో చూసుకుని ఓటు తొలగింపు జరిగిందని గుర్తించి , మరలా దరఖాస్తు పెట్టుకుని ఓటు పొందిన వారు అనేక మంది ఉన్నారు . ఇంకా ఈ రోజుకీ ఎలక్షన్ కమిషన్ ఓట్లను పునరుద్దిస్తూనే ఉంది.
కొందరు తెలంగాణాలో ఓటు లేని సీమాంధ్ర వారు , ప్రసార మాధ్యమాలలో ఎక్కువ హడావుడి చేస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. శుభ కార్యాల్లో బహుమతి స్వీకరించి నప్పుడు తిరిగి రిటన్ గ్విఫ్ట్ ఇవ్వడం మనకు ఆచారంగా , సాంప్రదాయంగా వస్తోందనీ , ఇప్పుడు ఆ అవకాశాన్ని వాడి తగిన బుద్ధి చెప్పాలని కొందరు ఫేక్ వార్తలను సోషల్ మీడియా ద్వారా ప్రసారం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఎక్కడా తొందర పడగుండా , అత్యుత్సాహం ప్రదర్శించ కుండా , ఎగతాళి మాటలు – వెకిలి చేష్టలు చేయకుండా , సంయమనంతో, రాబోయే రోజులను ఊహించి , సమయ స్ఫూర్తితో , వివేకంతో ఓటు హక్కును వినియోగించు కోవాలని , ముఖ్యంగా సెటిలర్స్ సమస్యల పట్ల స్పందించే నాయకులకు , పార్టీలకు ఓట్లు వేయాలని మేధావులు , రాజకీయ విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు.
ఇక్కడొక రాజనీతి కాదు కాదు ప్రజాతీర్పు దాగివుంది. అన్ని పార్టీల రాజకీయ నాయకుల రాజనీతి ఇంచుమించుగా ఒకటేగా వుంటుంది. కాకపోతే ఇందులో ఎవరు తక్కువ హానికారులో , ఏ పార్టీ తక్కువ హానికరమో గుర్తించి ఓటు వేయాలి. అదే ఇప్పటి ట్విస్ట్. ఏ నాయకుడూ , ఏ పార్టీ 100% పూర్తిగా ప్రజలను మెప్పించ లేదు . ఇప్పటి తెలంగాణా ఎన్నికల ప్రభావం , రేపు 2024 ఎ.పి ఎన్నికలపై తప్పకుండా పడుతుందని కొందరు ప్రచారం చేస్తున్నారు . ఇలాంటి మాటలను పట్టించుకో వలదు. ఒక్కోసారి ఎండమావుల్ని చూసి నీటి మడుగులుగా భ్రమిస్తాం.
రాచరిక వ్యవస్థ నుండి ప్రజాస్వామ్యంలోకి అడుగు పెట్టాం కాబట్టి , పాత తరపు బానిస మూలాలు మనలో అంతో ఇంతో ఇంకా మిగిలే ఉన్నాయి. తాత , తండ్రుల చరిత్రను బట్టో , రాజకీయ వారసత్వమనో ఒక్కోసారి బోల్తాపడి అసమర్థులకు ఓట్లు వేసి అందలం ఎక్కిస్తాం. మంచి పాలనా దక్షుణ్ణి తిరస్కరిస్తాం. చేతులు కాలాక ఆకులు పట్టుకుంటాం. సమాచార వ్యవస్థ యింట్లోకి , చేతిలోకి వచ్చిన పిదప ప్రతిదీ మనం చూడగల్గుతున్నాం , వినగల్గు తున్నాం . అభివృద్ధి అనేది ఒక వ్యూహాత్మక దీర్ఘకాలిక ప్రణాళిక . ఎవరు అధికారం లోకి వచ్చినా గత ప్రభుత్వాల అభివృద్ధి కార్యక్రమాలను ముందుకు తీసుకు వెళితే రాష్ట్రం అభివృద్ధి బాట పడుతుంది.
ఇప్పటి కాల, మాన పరిస్థితిలో ఒకే ఒక్కసారి ఓటు వేస్తే 5 సం. ల్లో రాష్ట్రాన్ని దివాళా అంచున నిలబెట్ట వచ్చు. జరిగిన నష్టాన్ని పూడ్చాలంటే 10 , 15 సం.లు పడుతుంది. పెనం మీద నుండి పొయ్యలో పడ్డట్లు కాకుండా , రాబోయే పరిస్థితులను బేరీజు వేసుకుని తెలంగాణా లోని సీమాంధ్ర సెటిలర్స్ విజ్ఞతతో ఆలోచించి ఓటు వెయ్యాలి. తెలంగాణా బాగుంటేనే సెటిలర్స్ కూడా వృద్ధిలోకి వస్తారు . తప్పటడుగు వేస్తే మధ్య తరగతి , దిగువ మధ్య తరగతి సెటిలర్స్ తీవ్రంగా నలిగిపోయే అవకాశం ఉంది. రియల్ ఎస్టేట్ రంగంలోనూ , భావన కార్మికులుగానూ , రవాణా రంగంలోనూ , హోటల్ రంగం లోనూ , పరిశ్రమల్లో కార్మికులుగానూ , ఐ. టి రంగం లోనూ లక్షల మంది సెటిలర్స్ పనిచేస్తున్నారు.
ముందు సెటిలర్స్ హక్కులు పరిరక్షించే వారికి ప్రాధాన్యత ఇవ్వగలగాలి. సమస్య వచ్చినప్పుడు , అవసరమైనప్పుడు సెటిలర్స్ తరుపున నిలబడ గలిగే నాయకుణ్ణి , హక్కుల రక్షణకు కొమ్ముకాసే వ్యక్తిని ఎన్నుకుంటే , అన్ని విధాల , అందరికీ శుభం కల్గు తుందని , శాంతి భద్రతలు నెలకొని ప్రశాంత జీవనం కొన సాగుతుందని విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు. మాంసం తింటే బొమికలు మెడలో వేసుకుని తిరగవలసిన అవసరం లేదు. ఎదిగే కొలదీ ఒదిగి ఉండాలనేది మన పూర్వీకుల సామెత.
పలానా వారికి ఓటేసానోచ్ అని డప్పు కొట్టుకోవాల్సిన అవసరం లేదు. కొందరు ఉత్సాహవంతుల అత్యుత్సాహం వల్ల , ఎన్నికల్లో అనుకోని ఫలితాలు వస్తే అప్పుడు లక్షలాదిగా ఉన్న సెటిలర్స్ పరిస్థితి అస్తవ్యస్థ మవుతుంది. హడావుడి రాయుళ్ల మాటలకు మోసపోకుండా , పువ్వు పూస్తే కాయి కాచింది అనే పోసుకోలు రాయుళ్ల మాటలను నమ్మకుండా విజ్ఞతతో సెటిలర్స్ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని విజ్ఞుల ఆలోచనగా ఉంది .
– వి . యల్ . ప్రసాద్
( సేకరణ: సాయిసుధ)