Suryaa.co.in

Andhra Pradesh

అత్యంత నాణ్య‌తా ప్ర‌మాణాల‌తో ర‌హ‌దారుల ప‌నులు

– రివ‌ర్స్ టెండ‌రింగ్ విధానంతో పార‌ద‌ర్శ‌క విధానాల అమ‌లు
– రూ. 2,205 కోట్ల‌తో ముమ్మ‌రంగా జ‌రుగుతున్న అభివృద్ధి ప‌నులు
– యుద్ధ ప్రాతిప‌దిక‌న పూర్తిచేసేందుకు చ‌ర్య‌లు
– రాష్ట్ర ర‌హ‌దారులు, భ‌వ‌నాల శాఖ మంత్రి దాడిశెట్టి రాజా
– పాత ఫొటోల‌తో కొంద‌రు దుష్ప్ర‌చారం చేస్తున్నార‌ని వ్యాఖ్య‌
– ఒక్కో వ్య‌వ‌స్థ‌నూ ప్ర‌ణాళికాయుతంగా బాగుచేసుకుంటూ వ‌స్తున్నామ‌ని మంత్రి రాజా స్ప‌ష్టీక‌ర‌ణ‌

రాష్ట్రంలో అత్యంత నాణ్య‌తా ప్ర‌మాణాల‌తో, పార‌ద‌ర్శ‌క విధానాల‌తో ర‌హ‌దారుల అభివృద్ధి ప‌నులు జ‌రుగుతున్న‌ట్లు రాష్ట్ర ర‌హ‌దారులు, భ‌వ‌నాల శాఖ మంత్రి దాడిశెట్టి రాజా వెల్ల‌డించారు. శ‌నివారం కాకినాడ జిల్లా, తుని మునిసిప‌ల్ కార్యాల‌యంలో మంత్రి దాడిశెట్టి రాజా.. ఆర్ అండ్ బీ అధికారుల‌తో ర‌హ‌దారుల ప‌నుల‌పై స‌మీక్షా స‌మావేశం నిర్వ‌హించారు.

అనంత‌రం మీడియా స‌మావేశంలో మాట్లాడారు. రాష్ట్ర ప్ర‌భుత్వం అత్యంత ప్రాధాన్య‌త‌నిస్తూ ర‌హ‌దారుల ఆధునికీక‌ర‌ణ‌, అభివృద్ధి ప‌నులు చేప‌డుతున్న‌ట్లు వెల్ల‌డించారు. ప్ర‌స్తుతం రూ. 2,205 కోట్ల‌తో ప‌నులు జ‌రుగుతున్నాయ‌ని.. వీటిలో కొన్ని పూర్తికాగా, మ‌రికొన్ని వివిధ ద‌శ‌ల్లో ఉన్నాయ‌న్నారు. కాంట్రాక్ట‌ర్ల‌కు రూ. 705 కోట్ల మేర బిల్లుల చెల్లింపు జ‌రిగింద‌ని వివ‌రించారు. వ‌ర్షాలు మొద‌ల‌య్యే నాటికి ప‌నుల పూర్తికి చ‌ర్య‌లు తీసుకున్న‌ట్లు వెల్ల‌డించారు. అత్యంత పార‌ద‌ర్శ‌కంగా అవినీతికి తావులేకుండా రివ‌ర్స్ టెండ‌రింగ్ విధానంలో ప‌నులు చేప‌డుతున్న‌ట్లు మంత్రి వివ‌రించారు. గ‌తంలో జ‌రిగిన నిర్ల‌క్ష్యం కార‌ణంగా ర‌హ‌దారులు దెబ్బ‌తిన్నాయ‌ని.. ప్ర‌స్తుత ప్ర‌భుత్వం ఆ ర‌హ‌దారుల‌న్నింటినీ అభివృద్ధి చేసేందుకు కంక‌ణం క‌ట్టుకొని, ప‌నులు చేప‌డుతోంద‌న్నారు.

ఒక‌ప్పుడు ర‌హ‌దారులు ఎలా ఉండేవి? ప్ర‌స్తుతం అభివృద్ధి చేసిన ర‌హ‌దారులు ఎలా ఉన్నాయి? అనే విష‌యాల‌ను అంద‌రికీ తెలియ‌జేసేలా నాడు-నేడు ఫొటో ప్ర‌ద‌ర్శ‌న‌ను రాష్ట్రంలోని అన్ని క‌లెక్ట‌రేట్ల‌లో ఏర్పాటు చేసిన‌ట్లు తెలిపారు. ఓ వ‌ర్గం మీడియా ప‌ని గ‌ట్టుకొని పాత ఫొటోలు చూపించి, దుష్ప్ర‌చారం చేస్తోంద‌ని పేర్కొన్నారు. గ‌త పాల‌కుల చ‌ర్య‌ల‌తో పాడైన ఒక్కో వ్య‌వ‌స్థ‌ను క‌చ్చిత‌మైన ప్ర‌ణాళికల‌తో స‌రిదిద్దుకుంటూ వ‌స్తున్నామ‌ని మంత్రి వివ‌రించారు. రాష్ట్రంలో ముఖ్య‌మంత్రి వైఎస్ జగ‌న్ మోహ‌న్‌రెడ్డి ప‌రిపాల‌న‌కు మెచ్చి ఏ రాష్ట్రానికి ఇవ్వ‌నన్ని జాతీయ ర‌హ‌దారుల ప్రాజెక్టుల‌ను కేంద్ర రోడ్డు ర‌వాణా, హైవేల శాఖా మంత్రి నితిన్ గ‌డ్క‌రీ మ‌న రాష్ట్రానికి మంజూరు చేసిన‌ట్లు మంత్రి దాడిశెట్టి రాజా వివ‌రించారు.

రాష్ట్రంలో రూ. 2,205 కోట్లతో 8,268 కి.మీ. మేర రాష్ట్ర హైవేలు, మేజ‌ర్ జిల్లా ర‌హ‌దారుల అభివృద్ధికి సంబంధించి 1,167 ప‌నులు చేప‌ట్టేందుకు బ్యాంక్ ఆఫ్ బ‌రోడా రుణ స‌హాయం తీసుకోవ‌డం జ‌రిగింద‌న్నారు. 438 ప‌నులు ఇప్ప‌టికే పూర్త‌య్యాయ‌ని.. మిగిలిన ప‌నులు జ‌రుగుతున్నాయ‌న్నారు. వీటిని జూన్ చివ‌రినాటికి పూర్తిచేసేందుకు చ‌ర్య‌లు తీసుకుంటున్న‌ట్లు వెల్ల‌డించారు. పూర్త‌యిన ప‌నుల నిడివి 2,756 కి.మీ.కు సంబంధించి దాదాపు రూ. 700 కోట్ల మేర కాంట్రాక్ట‌ర్ల‌కు చెల్లింపులు జ‌రిగిన‌ట్లు వివ‌రించారు.

ఇంకా ఏమ‌న్నారంటే:
– గ‌త ప్ర‌భుత్వ హ‌యాంలో మంజూరై ఆగిపోయిన 233 ప్లాన్ ప‌నుల (99-స్టేట్ హైవేలు, 93 మేజ‌ర్ జిల్లా ర‌హ‌దారులు, 41 జిల్లా ర‌హ‌దారులు)ను చేప‌ట్టేందుకు ఎన్ఐడీఏ ప‌థ‌కం కింద రూ. 1,158 కోట్లు నాబార్డు రుణం ల‌భించింది. ఈ ప‌నుల్లో 182 ప‌నులు ఇప్ప‌టికే పూర్త‌య్యాయి. మ‌రో 51 ప‌నులు ఈ నెల చివ‌రినాటికి పూర్తికానున్నాయి. వీటికి సంబంధించి రూ. 667 కోట్లు మేర కాంట్రాక్ట‌ర్ల‌కు చెల్లింపులు జ‌రిగాయి.
– ఏటా గుంతలు పూడ్చ‌డానికి, అదే విధంగా యుద్ధ‌ప్రాతిప‌దిక‌న మ‌ర‌మ్మ‌తులు చేప‌ట్టేందుకు, వ‌ర‌ద‌ల వ‌ల్ల పాడైన ర‌హ‌దారుల మ‌ర‌మ్మ‌తుల‌కు 2019-20లో రూ. 105 కోట్లు, 2020-21లో రూ. 237 కోట్లు, 2021-22లో రూ. 86 కోట్లు మంజూరు చేశాం.
2019-20కు సంబంధించి కాంట్రాక్ట‌ర్ల‌కు రూ. 124 కోట్ల చెల్లింపులు జ‌రిగాయి. అదే విధంగా 2020-21కు సంబంధించి రూ. 245 కోట్లు, 2021-22కు సంబంధించి రూ. 266 కోట్ల మేర చెల్లింపులు జ‌రిగాయి.
– న్యూ డెవ‌ల‌ప్‌మెంట్ బ్యాంకు (ఎన్‌డీబీ) స‌హాయంతో 2,600 కి.మీ. మేర ర‌హ‌దారులను రెండు ద‌శ‌ల్లో అభివృద్ధి చేయ‌డం జ‌రుగుతుంది. రూ. 4,480 కోట్ల ఎన్‌డీబీ రుణంతో పాటు రాష్ట్ర ప్ర‌భుత్వం రూ. 1,920 కోట్లు ఖ‌ర్చు చేస్తోంది. ఈ ప‌నుల‌కు సంబంధించి తొలిద‌శ‌లో రూ. 3,014 కోట్ల‌తో 1,260 కి.మీ. మేర ప‌నులు జ‌రుగుతున్నాయి. ఈ ప‌నుల‌న్నీ ప్ర‌స్తుతం వివిధ ద‌శ‌ల్లో ఉన్నాయి. వ‌చ్చే మార్చి చివ‌రినాటికి తొలిద‌శ పూర్తిచేయాల‌ని ల‌క్ష్యంగా నిర్దేశించుకున్నాం. రెండో ద‌శ‌లో రూ. 3,386 కోట్ల‌తో 1,268 కి.మీ. రాష్ట్ర ర‌హ‌దారుల విస్త‌ర‌ణ ప‌నుల‌కు టెండ‌ర్లు పిల‌వాల్సి ఉంది.

స‌మావేశంలో పాల్గొన్న కాకినాడ పార్లమెంటు సభ్యులు వంగాగీత విశ్వనాథ్ మాట్లాడుతూ రాష్ట్రంలో రహదార్ల అభివృద్దికి అమల‌వుతున్న పనులు, కార్యక్రమాల పట్ల కేంద్ర ఉపరితల రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ హర్షం వ్యక్తంచేసి మరిన్ని నిధుల విడుదలకు పరిశీలిస్తామన్నారని తెలిపారు. గడచిన 3 సంవత్సరాల్లో కరోనా, లాక్ డౌన్ వంటి అవరోధాలు, గత ప్రభుత్వం పెండింగ్ పెట్టిన చెల్లింపులు, కోర్టు కేసుల వల్ల రోడ్ల అభివృద్ది పనులు కొంత జాప్యమైయ్యాయని, ప్రస్తుతం రాష్ట్రంలో ఆర్ అండ్ బి, పంచాయితీరాజ్, మున్సిపల్, స్మార్ట్ సిటీ రోడ్ల అభివృద్ధికి పెద్ద మొత్తంలో నిధులతో పనులు చేపట్టడం జరిగిందన్నారు.

ఇందులో భాగంగా కాకినాడ‌ జిల్లాలో 38 కోట్ల నిధులతో 142 కి.మీ. నిడివిన 63 పంచాయితీ రాజ్ రోడ్ల అభివృద్ది పనులు మంజూరు చేసారన్నారు. అలాగే 270 కోట్ల నిధులతో ఆర్ అండ్ బి అభివృద్దికి 39 పనులు చేపట్టగా, ఇప్పటికే 100 కోట్ల నిధుల వ్యయంతో 20 పనులు పూర్తయ్యాయన్నారు. కాకినాడ సిటీ, పరివృత ప్రాంతంలో 250 కిమీల రహదార్ల అభివృద్దికి 500 కోట్ల నిధులతో 260 పనులు జరుగుతున్నాయన్నారు. 14వ, 15వ ఆర్ధిక సంఘం నిధులతో మున్సిపల్ రహదారుల అభివృద్ది పనులు పెద్ద ఎత్తున చేపట్టడం జరిగిందన్నారు. రహదార్ల అభివృద్ధితో రాష్ట్రాభివృద్ది వేగం పుంజుకోనుందని, ఇందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్‌మోహ‌న్‌రెడ్డి, ఆర్.అండ్.బి.శాఖ మంత్రి దాడిశెట్టి రాజా అంకిత భావంతో కృషి చేస్తున్నారని కొనియాడారు.

జిల్లా కలెక్టర్ డా. కృతికా శుక్లా మాట్లాడుతూ జిల్లాలో వివిధ పథ‌కాల క్రింద ఆయా శాఖల ద్వారా చేపట్టిన పనులను యుద్దప్రాతిపదికన ప్రణాళికాబద్దంగా పూర్తి చేస్తున్నామని, 170 కోట్ల నిధులతో 19 ఆర్ అండ్ బి రోడ్లు పనులు పురోగతిలో ఉన్నాయని, 39 కోట్ల అంచనాతో ప్రతిపాదించిన మరో 69 పనులు టెండర్ల ఖరారు దశలో ఉన్నాయని తెలియజేశారు. పనులన్నిటిని నాణ్యతా ప్రమాణాలతో త్వరితగతిన నిర్వహించడం జరుగుతోందన్నారు.ఈ సమావేశంలో ఆర్ అండ్ బి ఎస్ఈ కె.హరిప్రసాద్‌బాబు, పంచాయితీరాజ్ ఎస్ఈ ఎం.శ్రీనివాస్, కాకినాడ మున్సిపల్ కమిష‌న‌ర్ కె.రమేష్ తదితరులు పాల్గొన్నారు.

LEAVE A RESPONSE