– కేంద్రమంత్రి కిషన్రెడ్డి
గ్రామీణ ప్రాంతాలలో నిర్లక్ష్యానికి గురైన రోడ్ల నిర్మాణానికి ఏర్పాటు చేసిన సెంట్రల్ రోడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ (CRIF) నుండి 2021-22 సంవత్సరంలో తెలంగాణ రాష్ట్రానికి రు.878.55 కోట్లతో 48 రోడ్డు పనులను 24 జిల్లాలలో పక్కా రోడ్ల నిర్మాణానికి 9 ఫిబ్రవరి, 2022 నాడు కేంద్ర ప్రభుత్వ రోడ్డు రవాణా మరియు జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ మంజూరు చేయడం జరిగింది.
తెలంగాణ రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వ జాతీయ రహదారుల విభాగం మరియు కేంద్ర ప్రభుత్వ రోడ్డు రవాణా మంత్రిత్వ శాఖ ద్వారా వేలాది కోట్లతో రాష్ట్ర అభివృద్ధి ముఖచిత్రంలో కీలకమైన అనేక రోడ్లను నిర్మించడం మరియు కేంద్ర ప్రభుత్వ గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖల ద్వారా “ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన” ద్వారా మంజూరై నిర్మాణం జరుగుతున్న రహదారుల అభివృద్ధికి అదనంగా CRIF ద్వారా కూడా రోడ్ల అభివృద్ధి జరుగుచున్న విషయం అందరికీ తెలిసిందే.
గత సంవత్సరం 2020-21 లో సెంట్రల్ రోడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ (CRIF) ద్వారా రు.262 కోట్లు కేటాయింపులు జరిగింది. గత సం. తో పోల్చితే ఈ సంవత్సరం 2021-22 లో 225% ఎక్కువ నిధులు, అంటే దాదాపు 3 రెట్లు ఎక్కువ నిధులు మంజూరు కావడం చాలా సంతోషకరం.
ఈ సందర్భంగా తెలంగాణకు అనేక రకాలుగా జరుగుతున్న సహకారంలో భాగంగా CRIF నుండి ఈ సం. అధిక నిధులు మంజూరు చేసినందుకు ప్రధాని నరేంద్రమోదీకి, రోడ్లు మరియు జాతీయ రహదారుల మంత్రి శ్రీ నితిన్ గడ్కరీ గారికి తెలంగాణా ప్రజల తరపున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.తెలంగాణలోని 24 జిల్లాలలో 48 రోడ్డు పనులు, 611. 51 కి.మీ.ల రహదారులకు రూ.878.55 కోట్ల మంజూరు కావడం సంతోషకరం.
తెలంగాణలో వేలాది కోట్లతో జాతీయ రహదారుల కార్యక్రమం మరింత వేగవంతంగా కొనసాగించడానికి త్వరలో కేంద్ర ప్రభుత్వ రహదారుల మంత్రి నితిన్ గడ్కరీ తెలంగాణ రాష్ట్రానికి రానున్నారు. నితిన్ గడ్కరీ వేలాది కోట్ల రూపాయలతో నిర్మించిన జాతీయ రహదారి రోడ్లను ప్రారంభించడం మరియు నూతన రోడ్ల నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టడం జరుగనున్నది.“సెంట్రల్ రోడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ (CRIF )” ద్వారా మంజూరైన రోడ్లను 24 నెలల వ్యవధిలో నిర్మాణం పూర్తిచేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది.