హీరోల ‘గిట్టుబాటు’ ఉద్యమం!

– తెరపై హీరోలయినా జగనన్న ముందు జీరోలే మరి
– ‘మెగా బెగ్గింగ్’ అంటూ వర్మ వ్యంగ్యాస్త్రం
( మార్తి సుబ్రహ్మణ్యం)

తాము పండించిన పంటలకు గిట్టుబాటు ధరల కోసం రైతులు ఉద్యమిస్తుంటారు. దానికోసం పాదయాత్రలు, ర్యాలీలు, నిరాహారదీక్షలు చేస్తుంటారు. వారి దగ్గర సిన్మా హీరోల మాదిరి డబ్బులుండవు కాబట్టి స్పెషల్ ఫ్లైట్లు వేసుకుని పాలకులను పలకరించలేరు. పాలకులు కూడా స్పెషల్ ఫ్లైట్లలో రాని ఉద్యమకారులకు అపాయింట్‌మెంట్లు ఇవ్వరు. అందుకే రైతులు నడకనే ఎంచుకుంటారు. చివరాఖరకు వారి గిట్టుబాటు ధరల ఉద్యమం సక్సెస్ అవుతుందా లేదా అన్నది, పాలకుడి మనస్తత్వం మీద ఆధారపడుతుంది.

సేమ్‌టు సేమ్ అలాంటి ‘గిట్టుబాటు’ ఉద్యమమే.. మన తెలుగు హీరోలు హైదరాబాద్ టు బెజవాడ స్పెషల్ ఫ్లైట్లేసుకుని వచ్చి చేసిన ముచ్చట ఇది. ఏపీ సీఎం జగనన్న ఎదుట ‘బైఠాయించి’ తమ డిమాండ్లను వినిపించి, చివరాఖరకు ‘అంతా జగనన్న దయ’ అంటూ ఆయనను పొగిడి వెళ్లిన ఆ సుందర, సుమధుర దృశ్యాల గురించి వర్ణించడానికి ఒక్క నోరు చాలదు. చెప్పడానికి పేజీలు చాలవు.

‘అంతకుమించి’.. సిన్మాలో పీఎం, సీఎంలను ఎదిరించి, ఒంటిచేత్తో వారి అనుచరులను మట్టికరిపించి, వారందరినీ తన దారికి తెచ్చుకునే మెగాస్టార్ చిరంజీవి అన్నయ్య, బాహుబలి, ఒక్కడు సీఎం ‘జగనన్నియ్య’ ముందు చేతులు జోడించి తమను కరుణించమని ప్రాధేయపడిన దృశ్యం… ఈ దశాబ్దపు

కరుణరసాత్మక, హృదయవిదారక సన్నివేశాల్లో ఒకటిగా.. బాలీవుడ్-టాలీవుడ్, కోలీవుడ్, చివరాఖరకు హాలీవుడ్ సిన్మాలోనూ అపురూప దృశ్యంగా నిలిచిపోతుందన్నది ఫిలింనగర్ టాక్.

సిన్మాల్లో ఎంతలావు మొనగాళ్లయినా వారి ముందుకెళ్లి, రొమ్ము విరిచి ఒంటిచేత్తో ఒక వందమందిని నేలకరిపించే తమ ఆరాధ్యహీరోలు.. జగనన్న ముందు అల్పుల్లా, మరీ కమెడియన్లకంటే అద్వానంగా దిగజారి మా సినిమా రేట్లు పెంచమని అర్ధించడం, అక్కడికి వెళ్లిన హీరో అభిమానులకు సుతరామూ నచ్చలేదట. ఈ జీరోలనా తాము హీరోలుగా మొక్కుతోంది అని తమలో తామే తిట్టుకుంటున్నారట.

మొన్నామధ్య సమ్మె చేస్తామన్న ఉద్యోగ సంఘాలను పిలిచి చర్చించిన జగనన్న.. ఇప్పుడు కూడా అదే పద్ధతిలో సిన్మాలకు పెట్టుబడి పెట్టి చేతులు కాల్చుకునే నిర్మాతల మండలిని కాకుండా, ఈ భజన బృందాన్ని పిలవడం ఏమిటన్నది చాలామంది సినిమాజీవులకు డౌటనుమానం.

అసలింతకూ సిన్మా హీరోలు స్పెషల్ ఫైటేసుకుని బెజవాడకు వెళ్లింది ఎందుకు? ‘టికెట్టు ధరల గిట్టుబాటు ఉద్యమం’ కోసమే కదా! మరి వెళ్లిన పనయిందా లేదా అన్నది ‘గిట్టుబాటు ధరల ఉద్యమం’ చేసిన హీరోలూ చెప్పకుండా, అటు చర్చించిన జగనన్నియ్యా చెప్పకపోతే.. బాలచందర్ సిన్మా మాదిరిగా, సర్కారు విడుదల చేసిన వీడియోలు చూసి, కథ క్లైమాక్సుకు వచ్చిందా లేదా అని చెప్పడానికి, ప్రేక్షకులు బాలచందర్ అంత తెలివిగ లవాళ్లు కాదు కదా?

ఇంతకూ హీరోల ‘గిట్టుబాటు ధరల ఉద్యమ’ చర్చల్లో తేలిన సారాంశమేమిటంటే.. ఒక ఎక్స్‌స్ట్రా ఆటకు జగనన్నియ్య దయదలచారట. అదొక్కటే కొత్త కబురు. ఇక వారంపాటు కొత్త సిన్మాల రేట్లు పెంచుకునే వెసులబాటుకూ, జగన్ సారు ఓకే అనేశారట. ఇది చాలాకాలం నుంచి జరుగుతున్నదే. కాకపోతే మల్టీఫ్లెక్స్ థియేటర్లలో టికెట్ల విషయంలోనే, హీరోల ‘గిట్టుబాటు ధరల ఉద్యమం’ కొంత సక్సెస్ అయినట్లు కనిపిస్తోంది. మరి ఇప్పటిదాకా సర్కారు వారు చెప్పిన ‘సామాన్య ప్రేక్షకుడికి గిట్టుబాటు’ కబుర్లన్నీ, కాకరకాయలేనా అన్నది తర్వాత చర్చిద్దాం. ఆ వ్యవహారం వేరు!

ఇంతకూ నిర్మాతల మండలి రాకుండా, వారిని పాలకులు కూడా పిలవకుండా కేవలం చిరంజీవి అన్నియ్యను మాత్రమే పిలిచి, మిగతా హీరోలను తీసుకువచ్చే బాధ్యతను కూడా అన్నియ్య భుజస్కంధాలపైనే వేస్తే.. అందుకాయన బహుదానందపడి, మహేషు-ప్రభాసు-రాజమౌళి అండ్‌కోతో స్పెషల్ ఫ్లైటు ఖర్చు పెట్టుకుని మరీ ఎందుకు ఎగేసుకొచ్చినట్లన్నది, ఫిలింనగర్ కేఫ్‌ల దగ్గర ఇప్పుడు జరుగుతున్న చర్చ. సరే పిలిస్తే పిలిచారు పో. మరి ‘మా’ అధ్యక్షుడు, జగనన్నకు వరసకు బామ్మర్దయ్యే మంచు విష్ణు, చిరంజీవి తనయుడు రాంచరణ్, నందమూరి అందగాడు బాలయ్య, ఆయన కొడుకు జూనియర్ ఎన్టీఆర్ ఎందుకు రాలేదన్నది ఇంకో చర్చ.

సరే.. మన పోసాని, అలీ ఎలాగూ సర్కారు వారి పార్టీ ఆస్థాన విద్వాంసులే కాబట్టి, వారొచ్చినా పెద్దగా ప్రాధన్యం ఉండదనుకోండి. అది వేరే విషయం. మహేష్, ప్రభాస్, రాజమౌళి అంటే తెలియనివారుండరు. కానీ వారిని కూడా చిరంజీవి, సీఎం జగనన్నియ్యకు పరిచయం చేయడమే కామెడీ లాంటి ట్రాజిడీ. తమ్ముడు పవన్ కల్యాణ్‌ను తిట్టినితిట్టు తిట్టకుండా తిట్టిపోసి, ఆ ఫ్లోలో తన తల్లినీ దూషించిన వైసీపీ సినిమా వింగ్ లీడరయిన పోసానిని పక్కనే పెట్టుకుని, అదే పవన్ అన్నయ్యతో చర్చించిన జగనన్నియ్య తెలివే తెలివి!

ఇక సీన్ కట్ చేస్తే.. ఇంతలావు హీరోలంతా జగనన్నియ్య దివ్యసముఖానికి వెళ్లింది… సిన్మా రేట్లు పెంచండి, పెద్ద సిన్మాలకు వారం పదిరోజుల ఎక్స్‌ట్రా టికెట్లతో నడిపించే వెసులుబాటు ఇవ్వండని
cinema-star-vja ప్రాధేయపడేందుకే గందా?! ఏం.. ఇప్పుడు తగ్గించిన టికెట్లతోనే సిన్మాలు రిలీజు చేస్తే నష్టమేమిటంట? ఆ నలుగురైదుగురు హీరోల రెమ్యూనరేషన్లకు గత్తర వస్తుందనే కదా ఇంత గాభరా? అన్నది సినిమా మ్యాగజైన్లు చదివే సినీమేధావుల కామెంట్.

ఆమాటకొస్తే మొన్నీమధ్య బాలకృష్ణ ‘అఖండ’ సిన్మా, తగ్గించిన రేట్లతోనే కదా హిట్టయ్యింది? మరి బాలకృష్ణ కూడా ఈ సూపర్ హీరోస్ మాదిరిగా సీఎం దగ్గరకు కాళ్లబేరానికి వెళ్లి, తన సిన్మాకు మినహాయింపు అడగలేదే? ఏదైతే అదే అవుతుందన్న మొండిధైర్యంతో రిలీజు చేశారు కదా? ఆపాటి దమ్ము, ధైర్యం ‘గిట్టుబాటు ధరల ఉద్యమం’ చేసిన హీరోలకు లేదా? ఆత్మాభిమానం అనే డైలాగు తెరపైకే పరిమితమా? ఇదేనా హీరోల అసలు ఆత్మాభిమానం అన్నది ఫిలింనగర్‌లో వినిపిస్తున్న ప్రశ్నలు. ‘కంటెంట్ ఉంటే కటౌట్లు లేకపోయినా సిన్మా హిట్టవుతుంది డ్యూడ్’ అన్నది సినీజీవుల ఉవాచ.

ఈ మొత్తం ‘గిట్టుబాటు ధరల ఉద్యమానికి’ నాయకత్వం వహించిన ‘చిరంజీవి అన్న’ ఇమేజ్.. తాజా బెజవాడ పర్యటన వల్ల టికెట్ల రేట్లు పెరిగి, కోరుకున్నది జరిగి ఉండవచ్చు. కానీ అన్నయ్య మాత్రం దారుణంగా డామేజీ అయ్యారన్నది అభిమానుల ‘మెగా ఆవేదన’. కేంద్రమంత్రిగా చేసి, ముఖ్యమంత్రుల
chiru-ysr వద్దకు వెళ్లకుండానే ఫోన్లమీదనే పనులు చేసుకున్న అంతలావు చిరంజీవి అన్నయ్య.. సీఎం జగనన్న దగ్గరకు వెళ్లి ‘‘ సినిమా ఇండస్ట్రీపై తమరి చల్లనిచూపు ఉండాలి. తల్లి లాంటి పొజిషన్‌లో మీరున్నారు కాబట్టి, మిమ్మల్ని చేతులు జోడించి అడుగుతున్నాం’’ అని చేతులు జోడించినట్లు అడుగుతుంటే.. పక్కనే ఉన్న జగనన్నయ్య మాత్రం చిద్విలాసంగా చేతులు కట్టుకుని, నవ్వుతున్న సీను సోషల్‌మీడియాలో వైరల్ కావటం.. సీమ యాసలో చెప్పాలంటే ‘మెగా హీరోకు ఎంత బైశాట్లూ’ అంట? టోటల్ బెజవాడ ఎపిసోడ్‌లో అన్నయ్య ఇమేజీ ఎంత డామేజీ అయిందో సోషల్ మీడియాలో వస్తున్న గ్రాఫిక్ సెటైర్లు చూస్తే చాలు.

సోషల్ మీడియా సంగతి పక్కనపెడితే.. చిరు ఫ్యామిలీని ‘విపరీతంగా ప్రేమించే’ రాంగోపాల్‌వర్మ చేసిన ట్వీట్ చూస్తే, చిరంజీవికి వచ్చిన కష్టం పగవాడికీ రాకూడదనిపించేలా ఉంది. ‘‘ఏపీ సీఎంతో సినీ ప్రముఖుల సమావేశానికి చిత్రపరిశ్రమ సమస్యలపై సీఎం సానుకూలంగా స్పందించడానికి సూపర్, మెగా,
rgv-tweets-on-ap-cm-and-cine-heros బాహుబలి లెవల్ బెగ్గింగ్ పనిచేసింది. ఒమెగాస్టార్ జగన్‌ను ఆశీర్వదించినందుకు నాకు సంతోషంగా ఉంది. సూపర్, మెగా, బాహుబలిని మించిన మహాబలి జగన్’ అని వెటకారంగా ట్వీట్ చేశారు. అంతకుముందు అదే వర్మ ‘మెగా అభిమానిగా ఈ మెగా బెగ్గింగ్‌ను చూసి చాలా హర్టయ్యాను’ అని సెటైర్ వేశారంటే.. అన్నయ్య ఇమేజీ ఏ స్థాయిలో డామేజీ అయిందో ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు.

మళ్లీ సీన్ కట్ చేస్తే.. ‘నేను సినిమాటోగ్రఫీ మంత్రిగా చేశాను. కానీ ఇలా కూడా చేయవచ్చా?’ అన్న చంద్రబాబు వాపోత ఇంకో వింత. తానంటే సిన్మావాళ్లకు భయపడి.. వాళ్లకు రెడ్ కార్పెట్ వేసి, అడిగిందే
chiru-babu తడవుగా సొంత పార్టీ ఎమ్మెల్యేలను కూడా పక్కనపెట్టి, యమర్జెంటుగా అపాయింట్‌మెంట్లు ఇచ్చాను కాబట్టి, జగనన్నయ్య కూడా అలాగే చేయాలనుకుంటే ఎలాగ బాబూ? ఎవరిని ఎక్కడ ఉంచాలో జగనన్నకు తెలుసు కాబట్టి ఆయనావిధంగా ముందుకెళుతున్నారు. బహుశా బాబుకు జగనన్న ట్రీట్‌మెంట్ తెలియక అలా అనేసి ఉండవచ్చేమో? ఎవరి స్కూలు వారిది. ఎవరి ఆనందం వారిది.

బడా హీరోలను జగనన్నయ్య ఓసారి చూడాలనుకున్నారు. పిలిపించుకున్నారు. వారిని వెయిట్ చేయించారు. అంతా తన దగ్గరకొచ్చారని ఆనందపడ్డారు. సింపుల్. అదొక ఆనందం. అదే చంద్రబాబయితే పవన్‌ను కలవాలనుకుని ఆయన ఇంటికే వెళ్లారు. అది బాబుకు ఆనందం. హీరోలకంటే ముందే బాబు అక్కడుంటారు. ఎవరి ఫిలాసఫీ వారిది, ఎవరి సైకాలజీ వారిది మరి! అయినా.. సినిమా వాళ్లంతా తనకు హ్యాండిచ్చి, తన అమరావతి ఉద్యమానికి ముఖం చాటేసినా.. పిచ్చిబాబుకు సిన్మావాళ్లంటే అంత పిచ్చ ఎందుకన్నది తమ్ళుళ ఉవాచ.

ఇక క్లైమాక్స్ సీన్ కట్ చేస్తే.. చిరు అండ్ కోతో కలసి స్పెషల్ ఫ్లైట్‌లో రాలేని మంచు మోహన్‌బాబన్నయ్య ఇంటికి సిన్మా మంత్రి పేర్ని నానిసారు వెళ్లారు. జరిగిన చర్చల వివరాలు చెప్పి, ఆయన సలహా
vishnu-tweet సూచనలూ తీసుకున్నారు. తప్పులేదు. మంచువారు ఇప్పుడు తన బాసు జగనన్న బంధువు కాబట్టి, చర్చల బ్రీఫింగ్ ఇచ్చి ఉండవచ్చు. దాన్ని తప్పుపట్టేదేముంది? సోషల్‌మీడియాలో అంటే ఏదో పనిలేక.. నానా రకాలుగా ట్రోల్ చేసినంత మాత్రాన నాని గారు ఉలిక్కిపడి, ‘కాఫీ తాగడానికే మంచు వారింటికి వెళ్లా. ప్రభుత్వం ఎవరికీ వివరణ ఇచ్చుకోవలసిన అవసరం లేదంటూ’నే, వివరణ ఇచ్చుకోవలసిన పనేమిటో అర్ధం కావడం లేదన్నది వైసీపేయుల ఆవేదన.

Leave a Reply