– పౌర సంస్థల విజ్ఞప్తి
గుంటూరు: తురకపాలెంలో ప్రభుత్వ వైఫల్యాలు, అధికారుల నిర్లక్ష్యం కారణంగా పరిశుభ్రమైన నీరు అందకపోవడం, పారిశుద్ధ్యం పడక వేయడం, బెల్టు షాపులు కొనసాగడం లాంటి కారణాలతో మూడు నెలలుగా 40 మందికి పైగా మరణించారని, వారి కుటుంబాలకు 10 లక్షల రూపాయల ఆర్థిక సాయం అందించాలని జనచైతన్య వేదిక, రేట్ పేయర్స్ అసోసియేషన్, అవగాహన, మానవత, నేస్తం, కోవిడ్ ఫైటర్స్, సర్వీస్ హెల్త్ ఆర్గనైజేషన్, మాదిగ ఎడ్యుకేషన్ ట్రస్ట్ తదితర పౌర సంస్థల ప్రతినిధులు రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.
పౌర సంస్థల ప్రతినిధులతో కూడిన నిజ నిర్ధారణ కమిటీ ఈనెల ఆరో తేదీ తురకపాలెం మృతుల కుటుంబాలను పరామర్శించి, మరణాలకు గల కారణాలు తెలుసుకొని, దళిత వాడలోని ప్రజలకు అవగాహన కల్పించారు. జనచైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు వల్లంరెడ్డి లక్ష్మణరెడ్డి ప్రసంగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే కులుషిత నీటి సమస్యను పరిష్కరించి, స్వచ్ఛమైన త్రాగునీటిని అందించాలని తురకపాలెంలో పెద్ద ఎత్తున భూగర్భ జలాలను తరలిస్తూ జరిగే నీటి వ్యాపారాన్ని వెంటనే అరికట్టాలని, అనధికారికంగా నడుస్తున్న బెల్టు షాపులను శాశ్వతంగా తొలగించాలని, పారిశుద్ధ్య కార్మికులకు ఇస్తున్న 6 వేల రూపాయలు వేతనాన్ని 10 వేల రూపాయలకు పెంచి రాష్ట్ర ప్రభుత్వమే నేరుగా చెల్లించాలని కోరారు.
ఈ కార్యక్రమంలో అవగాహన నేత రావి వెంకటరత్నం, కోవిడ్ ఫైటర్స్ వ్యవస్థాపకులు అల్లాబక్షు, సర్వీస్ హెల్త్ ఆర్గనైజేషన్ డాక్టర్ టి.సేవ కుమార్, మానవత కార్యదర్శి కె.సతీష్ తదితరులు ప్రసంగించారు.