– మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ వెల్లడి
హైదరాబాద్: రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరంలో అంగరంగ వైభవంగా జరిగే ఆషాఢ బోనాల ఉత్సవాలకు ముఖ్యమంత్రి కేసీఆర్ రూ. 15 కోట్లు కేటాయించినట్లు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ వెల్లడించారు. బోనాల ఉత్సవాల కోసం ప్రభుత్వం అందించే ఆర్థిక సహాయం కోసం వారం రోజుల్లో ఆలయ కమిటీలు దరఖాస్తులు అందజేయాలని ఆయన సూచించారు.
బోనాల ఉత్సవాల కోసం దేవాదాయ శాఖ పరిధిలో లేని దేవాలయాలకు ప్రభుత్వం ఆర్థిక సహాయం అందజేస్తుందని తెలిపారు. బోనాల నిర్వహణ కోసం ప్రతి ఏటా దేవాదాయ శాఖ పరిధిలోని లేని దేవాలయాలకు ఆర్థిక సహాయం అందిస్తున్న విషయాన్ని మంత్రి గుర్తు చేశారు. బోనాల పండుగకు ముందే ఆర్థిక సహాయం అందించాలని ప్రభుత్వం నిర్ణయించిందని స్పష్టం చేశారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత బోనాలను రాష్ట్ర పండుగగా కేసీఆర్ ప్రకటించారని తెలిపారు.
రాష్ట్రంలో గోల్కొండ బోనాలతో ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. జూన్ 22న గోలొండలో బోనాలు ప్రారంభం అవుతుండగా, జులై 9న సికింద్రాబాద్ మహంకాళి బోనాలు, 16న ఓల్డ్ సిటీ బోనాలు జరుగుతాయని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ వివరించారు. ప్రతి ఏటా తరహాలో ఈ ఏడాది కూడా ఆషాఢ బోనాల ఉత్సవాలను అత్యంత ఘనంగా నిర్వహించేలా ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తుందని మంత్రి పేర్కొన్నారు.