రైతుల కళ్లల్లో ముందే దీపావళి చూడాలని:వైయస్‌.జగన్‌

వైయస్‌ఆర్‌ రైతు భరోసా పీఎం కిసాన్, వైయస్‌ఆర్‌ సున్నా వడ్డీ పంట రుణాలు, వైయస్‌ఆర్‌ యంత్రసేవా పథకాలకు సంబంధించి లబ్ధిదారుల ఖాతాల్లో నగదును కంప్యూటర్‌లో బటన్‌ నొక్కి క్యాంప్‌ కార్యాలయం నుంచి జమ చేసిన సీఎంవైయస్‌.జగన్‌.ఈ సందర్భంగా సీఎం వైయస్‌.జగన్‌ ఏమన్నారంటే….:
ఈ రోజు దేవుడి దయతో మరో మంచి కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నాం. నిండు మనస్సుతో వ్యవసాయానికి దన్నుగా, రైతులకు సంబంధించి వందకు వంద శాతం మేనిఫెస్టోలో ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తూ వచ్చామని రైతు బిడ్డగా, మీ బిడ్డగా సగర్వంగా తెలియజేస్తున్నాను.
రైతుల కళ్లల్లో ముందే దీపావళి చూడాలని..
రైతు పక్షపపాత ప్రభుత్వంగా ఈ రోజు రైతు భరోసా, వైయస్సార్‌ సున్నావడ్డీ, వైయస్సార్‌ యంత్రసేవా పథకం ఈ మూడింటికి సంబంధించి రూ.2190 కోట్ల లబ్దిని రైతుల కళ్లల్లో వారం ముందే దీపావళి కాంతులు చూడాలని విడుదల చేస్తున్నాం.
ఇందులో భాగంగా రైతు భరోసా ద్వారా దాదాపు 50 లక్షల మంది పై చిలుకు రైతు కుటుంబాలకు వరుసగా మూడో సంవత్సరం రెండోవిడత కింద అక్టోబరులో ఇవ్వాల్సిన రూ.2052 కోట్లు ఈ రోజు జమ చేస్తున్నాం. ఇప్పటికే రైతు భరోసా కింద రెండో విడత ఆగష్టులో విడుదల చేసిన రూ.972 కోట్లు కలుపుకుని ఇప్పుడు అందిస్తున్న ఈ సాయంతో అక్షరాలా రైతు భరోసాకు రూ.2052 కోట్లు రెండో విడతగా మూడో సంవత్సరం అందిస్తున్నాం.
కౌలు రైతులకు సైతం రైతు భరోసా..
ఈ రెండున్నర సంవత్సరాల కాలంలో కేవలం ఈ ఒక్క రైతు భరోసా పథకానికి మాత్రమే దాదాపుగా రూ.18,777 కోట్లు ఇవ్వగలిగాం. దేశంలో ఎక్కడా లేని విధంగా సొంత భూమి సాగు చేస్తున్న రైతులతో పాటు అర్హులైన ప్రతి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ కౌలు రైతులు, అటవీ, దేవాదాయ భూములు సాగుచేస్తున్న రైతులకు కూడా ప్రతి ఏటా రూ.13,500 రైతుభరోసా కింద అందిస్తున్న ఏకైక ప్రభుత్వం మనది.
వైయస్సార్‌ సున్నా వడ్డీ…
వైయస్సార్‌ సున్నావడ్డీ పథకం కింద 6.67లక్షల మంది రైతన్నల ఖాతాల్లో ఈ రోజు రూ.112 కోట్ల 70 లక్షల రూపాయలు సున్నా వడ్డీ రాయితీని కూడా బటన్‌ నొక్కి వారి ఖాతాల్లో జమ చేస్తున్నాం.
ఇ–క్రాప్‌ డేటా ఆధారంగా రూ.1లక్షలోపు పంట రుణం తీసుకుని సకాలంలో అంటే సంవత్సరం లోపు తిరిగి చెల్లించిన రైతులకు, కౌలు రైతులకు వైయస్సార్‌ సున్నా వడ్డీ పంట రుణాల పథకం కింద వారు కట్టిన మొత్తం వడ్డీని తిరిగి వారి ఖాతాల్లోకి వడ్డీని జమ చేస్తున్నాం.
దేవుడి దయతో మన ప్రభుత్వం అధికారం చేపట్టిన నాటినుంచి కేవలం సున్నా వడ్డీ కింద రూ.1674 కోట్ల రూపాయలు జమ చేశాం. ఇందులో దాదాపుగా రూ.382 కోట్లు వైయస్సార్‌ సున్నావడ్డీ కింద చెల్లించాం. ఇప్పుడు మరో రూ.112 కోట్ల వడ్డీ రాయితీ ఇస్తున్నాం. ఇక మిగిలినది గత ప్రభుత్వం సున్నా వడ్డీ కింద బకాయిలుగా పెట్టి, ఎగ్గొట్టిన రూ.1180 కోట్లు కూడా రైతుల కోసం మనమే చిరునవ్వుతో చెల్లించాం.
బ్యాంకింగ్‌ కరస్పాండెంట్లు….
రైతులకు మరింత సులభంగా పంట రుణాలు అందించేందుకు వీలుగా 10,778 రైతు భరోసా కేంద్రాలను ఇప్పటికే ఏర్పాటు చేశాం. ఇందులో 9160 మంది బ్యాంకింగ్‌ కరస్పాండెంట్లును కూడా బ్యాంకింగ్‌ సేవలు రైతులకు అందుబాటులోకి తెచ్చేందుకు ఆర్బీకేల్లో కూర్చొబెట్టాం.
మిగిలిన ఆర్బీకేల్లో కూడా బ్యాంకింగ్‌ కరస్పాండెంట్ల సేవలు అందుబాటులోకి తీసుకొచ్చేందుకు బ్యాంకులతో చర్చలు జరుగుతున్నాయి. అతి త్వరలో ఈ కార్యక్రమం కూడా జరుగుతుంది.
కౌలు రైతులుతో సహా రైతులందరికీ కూడా బ్యాంక్‌ లావాదేవీలు జరుపుకునేందుకు, రైతుల పంట రుణాలు అందుకునేందుకు ఈ బ్యాంకింగ్‌ కరస్పాండెంట్ల సేవలు ఆర్బీకేల్లో ఎంతో ఉపయోగపడతాయి.
కమ్యూనిటీ హైరింగ్‌ సెంటర్లు…
వైయస్సార్‌ రైతు భరోసా, సున్నావడ్డీతో పాటు వైయస్సార్‌ యంత్రసేవా పథకం కింద ఈ రోజు 1720 రైతు గ్రూపులకు అంటే ఒక్కోక్క కమ్యూనిటీ హైరింగ్‌ సెంటర్‌కు వారు కొన్న యంత్రాలకు రూ.25.55 కోట్ల సబ్సిడీని కూడా వారి ఖాతాల్లోకి జమ చేస్తున్నాం. రైతులకు సరసమైనఅద్దెకే, రైతులు నిర్దేశించిన అద్దెకే ఈ యంత్రసేవలు వారికి అందుబాటులోకి తీసుకొచ్చే కార్యక్రమం దీని ద్వారా జరుగుతుంది.
రాష్ట్రవ్యాప్తంగా రూ. 2134 కోట్ల వ్యయంతో రైతు భరోసా కేంద్రాలకు అనుసంధానంగా గ్రామ స్ధాయిలో ఈ 10,750 కమ్యూనిటీ హైరింగ్‌ సెంటర్లను ఏర్పాటు చేస్తున్నాం. వరి ఎక్కువగా సాగయ్యే గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో మండలానికి అదనంగా 5 చొప్పున 1035 కంబైన్డ్‌ హార్వెస్టర్లతో కూడిన క్లస్టర్‌ స్టాయి కమ్యూనిటీ హైరింగ్‌ సెంటర్లను ( సీహెచ్‌సీలను) అందుబాటులోకి తీసుకువస్తున్నాం.
29 నెలల్లో గణనీయమైన మార్పులు..
ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే… ఈ 29 నెలల పాలనలో ఎన్ని మార్పులు తీసుకొచ్చామన్నది.. ఒక్కసారి ఈ సందర్భంగా మనందరం గుర్తు తెచ్చుకోవాల్సిన అవసరం ఉంది.
నాలుగు మాటల్లో చెప్పాలంటే… ఈ 29 నెలల్లో
దేవుడి దయతో ఎలాంటి మార్పులు జరిగాయని ఆలోచన చేస్తే…
కరువుసీమలో సైతం నీరు పుష్కలం
వాతావరణం అనుకూలించి కరువుసీమ సైతం ఈరోజు నీరు పుష్కలంగా అందుబాటులో ఉన్న పరిస్థితులు చూస్తున్నాం. రైతుకు ఇంతకముందు కరువు, కాటకాలు మాత్రమే తెలిసిన పరిస్థితులు నుంచి ఈసారి కరోనా కూడా సవాల్‌ విసిరింది. ఇలాంటి సమయంలో కూడా రైతుల పట్ల మరింత బాధ్యతగా అడుగులు ముందుకు వేస్తున్న రైతు పక్షపాత ప్రభుత్వమిది.
గత ప్రభుత్వం ఎగ్గొట్టిన బకాయిలును సైతం చెల్లించుకుంటూ వస్తున్నాం.
మార్కెటింగ్‌ పై ప్రత్యేక దృష్టి..
వ్యవస్ధలను ఎక్కడికక్కడ సరిదిద్దుకుంటూ మార్కెటింగ్‌ మీద విపరీతమైన దృష్టి పెట్టాం. రైతు నష్టపోకూడదని చెప్పి మార్కెట్‌ ఇంటర్‌వెన్షన్‌ ఫండ్‌ కూడా తీసుకురావడం జరిగింది. మార్కెట్‌ ఇంటర్‌ వెన్షన్‌ ఫండ్‌ ఏ స్ధాయిలో పనిచేస్తుందంటే.. కనీస గిట్టుబాటు ధర రాని పరిస్థితుల్లో పొగాకురైతులు ఇబ్బంది పడుతుంటే… పొగాకు కొనుగోళ్లులో సైతం జోక్యం చేసుకుని రైతులకు బాసటగా నిల్చాం.
జే ఎఫ్‌ కెన్నడీ ఏమన్నారంటే…
ఎక్కడైనా కూడా ఏ దేశంలోనైనా కూడా రైతు తాను పండించడానికి కావాల్సిన అన్నింటినీ కూడా ఎక్కువ ఖరీదు పెట్టి రీటైల్‌గా కొనుగోలు చేసి, తాను పండించిన పంటను మాత్రం తక్కువ ధరకు మాత్రం హోల్‌సేల్‌గా అమ్మే పరిస్ధితే ఉంటుందని చెప్పి సాక్షాత్తూ అమెరికన్‌ ప్రెసిడెంట్‌ జే ఎఫ్‌ కెన్నడీ అప్పట్లో ప్రపంచం గురించి, రైతులు గురించి చెప్పిన మాటలు.. ఈ రోజు మనం ఒక్కసారి గమనించినట్లయితే మన రాష్ట్రంలో కూడా మనం అధికారంలోకి రాకమునుపు ఇంచుమించి ఇదే పరిస్థితులు ఉన్నాయి.
ఆర్బీకేలు వన్‌ స్టాప్‌ సెంటర్లు
వాటిని మారుస్తూ… ఈ రోజు మన గ్రామంలోనే మన కళ్లెదుటనే రైతు భరోసా కేంద్రాలను వన్‌ స్టాప్‌ సెంటర్లగా రైతుకు సంబంధించిన ప్రతి అవసరం కూడా ఏకంగా నాణ్యతతో కూడిన గ్యారంటీ ఇస్తూ విత్తనాలు, ఫెస్టిసైడ్స్, ఫెర్టిలైజర్స్‌ సరఫరా చేయడమే కాకుండా రైతులకు అందరికీ కూడా తగు సూచనలు, సలహాలు ఇస్తున్నాం. విత్తనం నుంచి పంట అమ్మకం వరకూ కూడా రైతులను చేయి పట్టుకుని నడిపించే ఒక గొప్ప వ్యవస్దను ఆర్బీకేల రూపంలో మన గ్రామంలోనే తీసుకువచ్చాం.
వ్యవసాయ సలహా మండళ్లు…
వ్యవసాయ సలహా మండళ్లను ఏర్పాటు చేయడమే కాకుండా ఆర్బీకే స్ధాయి, మండల స్ధాయి, జిల్లా స్ధాయి, రాష్ట్ర స్ధాయి అని నాలుగు అంచెలుగా ఏర్పాటు చేశాం. నెలలో ప్రతి మొదటి శుక్రవారం ఆర్బీకే స్ధాయిలోనూ సమావేశం జరిగేటట్టుగా, నెలలో రెండో శుక్రవారం మండల స్ధాయిలో, మూడో శుక్రవారం జిల్లా స్ధాయిలో కలెక్టర్లు ఆధ్వరంలో మూడో మీటింగ్‌ జిల్లా అగ్రికల్చర్‌ అడ్వయిజరీ కమిటీ ఆధ్వర్యంలో జరుగుతుంది. ఆ సమావేశంలో సూచనలు, సలహాలు కొన్ని కలెక్టర్లు స్ధాయిలో పరిష్కరించి మిగిలినవన్నీ ఆ విభాగాధిపతులకు, వ్యవసాయశాఖ కార్యదర్శికి పంపించి పరిష్కరించాలి. రైతులు ఏ పంటలు వేయాలి, రైతులకు ఎలాంటి సహాయ, సహకారాలు అందాలి, ఆర్బీకేలలో పరిస్థితి ఎలా ఉంది, దాన్ని ఎలా మెరుగుపర్చాలి అని చెప్పి రియల్‌ టైం సలహాలు, సూచనలతో మార్పులు చేసుకుంటూ అడుగులు ముందు వేస్తున్న గొప్ప వ్యవస్ధ ఈరోజు గ్రామస్దాయిలోనే అందుబాటులోకి వచ్చింది.
ఇ– క్రాపింగ్‌….
ఇ– క్రాపింగ్‌ అన్నది ప్రతి రైతుకు, ప్రతి పంటకు ఆర్బీకేలలో నమోదు చేసుకోవడం ద్వారా పంటలబీమా, పంట రుణాలపై సున్నా వడ్డీ, పంట కొనుగోళ్లు ఇవన్నీ కూడా పారదర్శకంగా, లబ్దిదారులు ఎవరనేది గ్రామస్ధాయిలోనే ఆర్బీకేల్లో జాబితా పెట్టి, సోషల్‌ ఆడిట్‌ చేసి, ధైర్యంగా ఎటువంటి అవకతవకలకు తావే లేకుండా చేస్తున్నాం. ఇ– క్రాపింగ్‌ ద్వారా ప్రతి పథకాన్ని అనుసంధానం చేసే గొప్ప మార్పు ఈ రోజు గ్రామ స్ధాయిలో జరుగుతుంది.
కస్టమ్‌ హైరింగ్‌ సెంటర్ల ఏర్పాట్లు ముమ్మరంగా జరుగుతుంది. వీటి ద్వారా వ్యవసాయ యంత్రీకరణ మొత్తం కూడా గ్రామస్ధాయిలోకే అందుబాటులోకి తీసుకువస్తున్నాం. ఖరీదైన పరికరాలను మండల స్దాయిలోకి అందుబాటులోకి తీసుకువచ్చి, యంత్రీకరణ ద్వారా వ్యవసాయం మెరుగుపరుస్తున్నాం. ఇవన్నీ కూడా రైతులకు ఉపయోగపడేలా ఆర్బీకేల ద్వారా అనుసంధానం చేస్తున్నాం.
ప్రతి గ్రామంలోనూ ఆర్బీకేలో అగ్రికల్చర్‌అసిస్టెంట్, యానిమల్‌ హజ్బెండరీ అసిస్టెంట్‌, ఆక్వా పంటలు సాగుచేసేచోట ఆక్వా అసిస్టెంట్లు కూడా అందుబాటులో ఉండి సేవలందిస్తున్నారు.
సహకార వ్యవస్ధ బలోపేతం…
సహకార వ్యవస్ధలో పీఏసీ నుంచి ఆప్కాబ్‌ వరకు కూడా అన్నింటినీ పూర్తిగా ఆధునీకరిస్తున్నాం. అన్నింట్లో కంప్యూటరీకరణ జరుగుతుంది. సహకార వ్యవస్ధలో హెచ్‌ఆర్‌ వ్యవస్ధ కూడా తీసుకొచ్చే విప్లవాత్మకమైన మార్పులు కూడా జరుగుతున్నాయి.
ఈ రోజు ఆర్బీకే స్ధాయిలోనే సీఎం యాప్‌ అంటే కంటిన్యూస్‌ మానిటరింగ్‌ ఆఫ్‌ అగ్రికల్చర్‌ ప్రైస్‌ అండ్‌ ప్రొడ్యూస్‌ను అందుబాటులోకి తీసుకువచ్చాం. దాని ద్వారా ఆర్బీకే పరిధిలో వ్యవసాయ ధరలు ఎక్కడైనా కూడా బాగాలేని పరిస్థితి, రైతు ఇబ్బంది పడే పరిస్థితి ఉంటే వెంటనే ఆర్బీకేల్లో ఉన్న అగ్రికల్చర్‌ అసిస్టెంట్‌ అప్రమత్తమై జాయింట్‌ కలెక్టర్‌కు, మార్కెటింగ్‌ శాఖకు సమాచారం ఇస్తారు. వెంటనే ప్రభుత్వం ధరల స్ధిరీకరణ నిధి ద్వారా రైతన్నను ఆదుకునేందుకు అడుగులు ముందుకు వేసే స్ధాయిలోకి ఆర్బీకేలను బలోపేతం చేశాం.
కేంద్రం పరిధిలో లేని పంటలకూ ఎంఎస్‌పీ….
దీని ద్వారా వ్యవసాయ ధరలు బాగాలేక రైతులు ఇబ్బంది పడే పరిస్థితి ఉంటే మార్కెటింగ్‌ శాఖ జోక్యం చేసుకుంటుంది. ఈరోజు ఆర్బీకేల ద్వారా కేంద్రం ప్రకటించిన 17 పంటలకు ఎంఎస్‌పీ అందుబాటులోకి తీసుకురావడమే కాకుండా కేంద్రం పరిధిలో లేని మరో 7 పంటలకు కూడా రైతన్నలకు కనీస గిట్టుబాటు ధర అందుబాటులోకి తీసుకొచ్చాం. దీనికి సంబంధించి ఆర్బీకేలలో పోస్టర్లను పెట్టాం. రైతులకు ఫలానా రేటు కన్నా ధర పడిపోతే ప్రభుత్వం తోడుగా ఉంటుందని చెప్పే పరిస్థితి గ్రామస్ధాయిలోనే ఆర్బీకేల్లోనే ఉంది.
మార్కెటింగ్‌ శాఖలో నాడు–నేడు
కొత్తగా వ్యవసాయ కళాశాలలు, వ్యవసాయ పాలిటెక్నిక్‌ కళాశాలలు మంజూరు చేస్తూ… మార్కెటింగ్‌ వ్యవస్ధలో ఏఎంసీలను కూడా ఆధునీకరణ చేస్తున్నాం. వాటిలో కూడా నాడు–నేడు తీసుకువచ్చి మార్పులు తీసుకొచ్చే దిశగా అడుగులు వేస్తున్నాం.
కల్తీ నివారణపై ప్రత్యేక దృష్టి….
కల్తీ నివారణ మీద మన ప్రభుత్వం దృష్టిపెట్టినట్లుగా గతంలో ఏ ప్రభుత్వం కూడా దృష్టి పెట్టలేదు. మన ఆర్బీకేలల్లో నాణ్యతతో కూడిన విత్తనాలు, ఫెస్టిసైడ్స్, ఫెస్టిలైజర్స్‌ సరఫరా చేస్తూ… వాటికి ప్రభుత్వమే కచ్చితంగా గ్యారంటీ ఇస్తుందని భరోసా కల్పిస్తున్నాం. అంతే కాకుండా ప్రైవేటు రంగంలో కూడా కల్తీ పురుగు మందులు, ఎరువులు, విత్తనాలు ఎక్కడైనా కూడా అమ్మనీయకూడదని తపనపడుతూ ఎస్పీలను, కలెక్టర్లను ముమ్మరంగా తనిఖీలు చేయాలని ఆదేశాలు ఇచ్చాం. ఇలా ప్రతి అడుగులోనూ రైతులకు నష్టం జరగకూడదని తపన పడుతున్న ప్రభుత్వం మనదే.
పగటిపూటే నాణ్యమైన విద్యుత్‌….
రాష్ట్రంలో దాదాపు 18.7 లక్షల మంది రైతులకు పగటి పూటే 9 గంటలపాటు నాణ్యమైన విద్యుత్‌ అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ఈ రెండేళ్లలోనే దాదాపుగా రూ.18వేల కోట్ల రూపాయలు ఖర్చు చేశాం. ఇవి కాక గత ప్రభుత్వం కట్టకుండా వదిలేసి పోయిన మరో రూ.10వేల కోట్ల రూపాయలు రైతులకు సంబంధించిన బకాయిలను సైతం చిరునవ్వుతో మన ప్రభుత్వమే కట్టింది.
నాణ్యమైన కరెంటు అందుబాటులో తెచ్చేందుకు ఫీడర్ల మార్పు చేస్తేనే ఇది జరుగుతుందని చెపితే దాని కోసం రూ.1700 కోట్లు చిరునవ్వుతో ఖర్చు చేశాం. ఈ 29 నెలల కాలంలో వైయస్సార్‌ ఉచిత పంటల భీమా ద్వారా 31.07 లక్షల మంది రైతులకు రూ.3716 కోట్లు అందించగలిగాం.
ఈ రోజు రూ.2వేల కోట్లతో ప్రకృతి వైపరీత్యాల నిధి, రూ.3 వేల కోట్లతో ధరల స్ధిరీకరణ నిధిని అందుబాటులోకి తేగలిగాం.
ఇవి కాక 2 యేళ్లలో రూ.35 వేల కోట్ల పై చిలుకు ధాన్యం సేకరణకోసం ఖర్చు పెట్టాం. మరో రూ.1800 కోట్లు పత్తిపంట కోసం కేటాయించాం. ఇతర పంటల కోసం సుమారు రూ.6400 కోట్లు ఖర్చు చేశాం.
గత ప్రభుత్వ ధాన్యం బకాయిలూ చెల్లించాం….
ఏ రోజూ ధరలు పడిపోకూడదు, రైతు నష్టపోకూడదని ఈ కార్యక్రమాలు చేశాం. రూ.960 కోట్ల రూపాయలు గత ప్రభుత్వం ఎగ్గొట్టిన ధాన్యం సేకరణ బకాయలు కూడా రైతుల కోసం మన ప్రభుత్వం కట్టింది. గత ప్రభుత్వం వదిలేసిన రూ. 384 కోట్ల విత్తన బకాయిలునూ మనమే చెల్లించాం.
ఇన్‌పుట్‌ సబ్సిడీ…
ఏ సీజన్లో పంట నష్టం జరిగితే ఆ సీజన్‌లో ఆ పంట నష్టం అందించే విధంగా ఆ డబ్బు రైతుల చేతుల్లోకి వచ్చి, వచ్చే పంటకు ఉపయోగపడే విధంగా మొట్టమొదటసారి ఇన్‌పుట్‌ సబ్సిడీని పంట నష్టం జరిగిన అదే సీజన్‌లో ఇచ్చే కొత్త వరవడిని తీసుకొచ్చాం.
రైతన్నలకు దన్నుగా నిల్చేందుకు ఏపీ అమూల్‌ పాలవెల్లువను తీసుకురాగలిగాం. వైయస్సార్‌ జలకళ ద్వారా ఉచిత బోర్లు వేయించి తోడుగా నిలబడగలిగాం. ఆక్వా రైతులకు కరెంటు సబ్సిడీ కింద సంవత్సరానికి రూ.780 కోట్లు చెల్లించాం. ఆక్వా రైతులకు సబ్సిడీ కింద కరెంటు యూనిట్‌ రూ.1.5 కే అందిస్తున్నాం. దాదాపుగా ఈ రెండేళ్లలో రూ.1560 కోట్లు కరెంటు సబ్సిడీ రూపంలో ఆక్వా రైతులకు తోడుగా నిలబడగలిగాం.
ఆత్మహత్యలకు బదులు ఆర్బీకేలను చూడడానికి…..
కాబట్టే ఒకప్పుడు మన రైతన్నల ఆత్మహత్యలను చూడడానికే ఈ రాష్ట్రానికి బృందాలు వస్తే ఈ రోజు మన రైతు భరోసా కేంద్రాలను చూడ్డానికి ఇతర రాష్ట్రాల నుంచి, కేంద్రం నుంచి బృందాలు వచ్చి తిలకిస్తున్నారని సగర్వంగా తెలియజేస్తున్నాను.
దేవుడి దయతో…..
దేవుడి దయతో ఇక మీదట కూడా సకాలంలో మంచి వర్షాలు పడాలని, మంచి పంటలు పండాలని వ్యవసాయం పండగగా కొనసాగాలని ఈ రాష్ట్రం బాగుండాలని, ప్రతి రైతన్న మొహంలో చిరునవ్వు కనిపించాలని మనసారా కోరుకుంటున్నాను. దేవుడి చల్లని దీవెన లు మీ అందరి చల్లని ఆశీస్సులు ఎల్లవేలలా మన ప్రభుత్వానికి ఉండాలని మనసారా కోరుకుంటున్నాను అని సీఎం వైయస్‌.జగన్‌ తన ప్రసంగం ముగించారు.
ఈ కార్యక్రమంలో ఉపముఖ్యమంత్రి (గిరిజన సంక్షేమశాఖ) పాముల పుష్పశ్రీవాణి, వ్యవసాయ, సహాకార, మార్కెటింగ్‌ శాఖ మంత్రి కురసాల కన్నబాబు, పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, పర్యాటకశాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాస్, ఏపీ అగ్రిమిషన్‌ వైస్‌ ఛైర్మన్‌ ఎం వి యస్‌ నాగిరెడ్డి, వ్యవసాయశాఖ సలహాదారు అంబటి కృష్ణారెడ్డి, సీఎస్‌ డాక్టర్‌ సమీర్‌ శర్మ, వ్యవసాయశాఖ స్పెషల్‌ సీఎస్‌ పూనం మాలకొండయ్య, వ్యవసాయశాఖ కమిషనర్‌ హెచ్‌ అరుణ్‌కుమార్, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.