- 17 నెలల వ్యవధిలో రూ.వేల కోట్ల లెక్కలు మారిపోయాయి
- భూ సేకరణ పేరుతో వేల కోట్ల అవినీతి
- పేదల పేరుతో పెద్దల లూటీ… రాష్ట్రమంతటా వైసీపీ ప్రజా ప్రతినిధులు, నాయకులకే లబ్ధి
- నాయకుల మధ్య వాటాల పంపిణీలో తేడాలు… స్కామ్ స్టోరీలు బయటకు వస్తున్నాయి
- గుంటూరు జిల్లాలో భూ సేకరణలో భయంకర దోపిడీ
- వైసీపీ ఎమ్మెల్యేలు, నేతలు, అధికారులు, చివరకు కలెక్టర్ కూడా
- ఇచ్చిన పట్టాలు.. కట్టించిన ఇళ్లు లెక్కలూ తప్పే
- పేదలను బాహాటంగా మభ్యపెట్టడమే ధ్యేయం
- భూసేకరణ వివరాలను జగనన్న కాలనీల వారీగా బయటపెట్టాలి
- రోజుకో వైసీపీ అవినీతి బట్టబయలులో భాగంగా జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో జనసేన పార్టీ
- పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్
‘జగనన్న ఇళ్ల నిర్మాణం కోసం రాష్ట్ర ప్రభుత్వం సేకరించిన ప్రభుత్వ భూమి 28,554 ఎకరాలు… ప్రైవేటు భూమి 25,374 ఎకరాలు, ల్యాండ్ పూలింగ్ (విశాఖపట్నంలోనే) ద్వారా 4,455 ఎకరాలను తీసుకున్నారు. కేవలం భూ సేకరణ కోసం ప్రభుత్వం వెచ్చించిన సొమ్ము అక్షరాలా రూ. 56,102 కోట్లు. దీనిలో మౌలిక వసతులు, సౌకర్యాలు కల్పన ఊసు లేదు. కేవలం భూసేకరణ కోసమో రాష్ట్ర ప్రభుత్వం ఇంత మొత్తం వెచ్చించిందని ప్రభుత్వమే ఈ లెక్కలను బయటపెట్టింది.
మరి ఈ లెక్కలు 17 నెలల్లో ఎందుకు అన్నిసార్లు మారాయి..? శాసనసభలో ప్రకటించిన లెక్కలకు, మంత్రులు చెప్పిన లెక్కలకు, ముఖ్యమంత్రి వినిపించే మరో లెక్కలకు తేడా ఎందుకొచ్చింది..? ఏకంగా నీతి ఆయోగ్ కు పంపిన లెక్కల్లో కూడా తేడా ఎందుకు కనిపిస్తోంది..? కేవలం 17 నెలల్లోనే రూ. 35,141 కోట్ల మేర తేడా చూపించడం వెనుక అసలు మతలబు ఏమిటి..? దీన్ని అవినీతి అనక ఏమని పిలుస్తారు..? మీరు చెప్పే లెక్కల్లో మీకే పొంతన లేకపోతే స్కాండల్ అనక ఇంకేమని అంటార’ని జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ వైసీపీ నాయకులను ప్రశ్నించారు. ‘వైసీపీ పాలన – అవినీతి జమానా’లో భాగంగా వైసీపీ పాలనలో జరిగిన అవినీతి తతంగాన్ని రోజుకొకటి బయటపెట్టే కార్యక్రమంలో మూడో రోజు గృహ నిర్మాణ శాఖలో జగనన్న కాలనీల పేరుతో చేసిన అవినీతి వ్యవహారాలను బయటపెట్టారు. గురువారం జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో మనోహర్ మీడియాతో మాట్లాడారు.
ఈ సందర్భంగా మనోహర్ మాట్లాడుతూ ‘‘2021, జూన్ 10న నీతి ఆయోగ్ కి రాష్ట్ర ప్రభుత్వం అందించిన నివేదిక అందించింది. దానిలో 30,76,000 ఇళ్ల పట్టాలు ఇచ్చామని, 28,30,000 గృహాలు కట్టిస్తున్నాం అని, దీని కోసం 68,381 ఎకరాలు భూసేకరణ చేశాం అని చెప్పారు.
- మార్చి 17, 2022న శాసనసభలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ 30,76,000 మందికి ఇంటి పట్టాలు ఇచ్చామని, 71,811 ఎకరాలు అని ముఖ్యమంత్రి సభా సాక్షిగా చెప్పారు. రూ.25వేల కోట్లు ఖర్చు చేశామన్నారు.
అంటే నీతి ఆయోగ్ కి ప్రభుత్వం చెప్పిన లెక్కకు, ముఖ్యమంత్రి శాసనసభలో ప్రకటించిన అంకెలకు సుమారు 3 వేల ఎకరాల తేడా వచ్చింది. ఈ భూసేకరణ నిమిత్తం రూ.25 వేల కోట్లు వెచ్చిస్తున్నట్లు సీఎం తెలియజేశారు.
- డిసెంబరు 20, 2022న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జగనన్న ఇళ్ల నిర్మాణంపై స్పందిస్తూ ఇళ్ల కోసం ఏకంగా 75,670 ఎకరాలు సేకరించామని మరో లెక్క బయటపెట్టింది. అంటే ఇది శాసనసభలో ముఖ్యమంత్రి చెప్పిన లెక్క కంటే అధికం. అదే రోజు శాసనసభలో గృహ నిర్మాణశాఖ మంత్రి ఇళ్ల నిర్మాణం నిమిత్తం ప్రభుత్వం రూ.20,961 కోట్లను ఖర్చు చేసినట్లు, దీనిలో భూ సేకరణ కోసం రూ.9,517 కోట్లు మాత్రమే ఖర్చు పెట్టినట్లు చెప్పారు.
- అక్టోబరు 12, 2023న ముఖ్యమంత్రి తన అలవాటుగా ఉన్న బటన్ నొక్కి 5 లక్షల ఇళ్లు గృహ ప్రవేశాలు జరిగిపోయాయని చెప్పారు. అదే రోజున ముఖ్యమంత్రి జగనన్న ఇళ్లలో భూసేకరణ కోసం రూ.56,102 కోట్లను ప్రభుత్వం ఖర్చు చేసినట్లు వివరించారు.
అంటే మొత్తంగా 17 నెలల్లో ప్రభుత్వం, ప్రభుత్వ పెద్దలు చెప్పిన లెక్కలు ప్రకారం జగనన్న పేదలందరికీ ఇళ్లు పథకంలో రూ.35,141 కోట్లు తేడా వచ్చింది. ఇంతటి తేడా లెక్కలను శాసనసభలో, ప్రజలకు బాహాటంగా చెబుతుంటే ఈ పథకంలో స్కాండల్ జరగలేదని ఎలా చెప్పగలరు? అవినీతి లేదని ఎలా సమాధానం చెబుతారు..? మీరు చెప్పే లెక్కలే మీ అవినీతిని బయటపెడుతున్నాయి. దీనికి బాధ్యులు ఎవరనేది ప్రభుత్వమే సమాధానం చెప్పాలి.
భూసేకరణ వివరాలను బయటపెట్టాలి
జగనన్న ఇళ్ల పథకం పేదల కోసం కాదు. కేవలం వైసీపీ నాయకులు, వారి అనుచరుల జేబులు నింపుకోవడం కోసమే అనేది ఇప్పటికే జనసేన పార్టీ ప్రజలకు చెబుతూ వచ్చింది. జగనన్న ఇళ్ల కాలనీల్లో జరిగిన అవినీతి తంతుపై జనసేన రాష్ట్రవ్యాప్తంగానూ కార్యక్రమాలు చేపట్టింది. 2022, నవంబరు 13వ తేదీన రాష్ట్రంలోనే అతిపెద్ద కాలనీ అయిన విజయనగరం జిల్లా, గుంకలాం ప్రాంతాన్ని జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ సందర్శించి వాస్తవ పరిస్థితులను తెలుసుకున్నారు.
జగనన్న కాలనీల్లో భారీగా జరిగిన భూసేకరణలో కొండంత అవినీతి దాగి ఉందని, ఆధారాలతో సహా అప్పట్లోనే బయటపెట్టాం. అసలు మొత్తం ఎన్ని కాలనీలు నిర్మించారు..? దీని కోసం ప్రైవేటు భూమి ఎంత సేకరించారు.. ఎవరి వద్ద సేకరించారు… ఏ ధరకు సేకరించారు..? అనే అంశాలను ప్రభుత్వం స్పష్టంగా బయటపెట్టాలి. కొండల్లో, గుట్టల్లో, బురదలో, శ్మశానం దగ్గర్లో ఉన్న భూములను ముందుగానే ఎంపిక చేసుకొని, రైతుల వద్ద వాటిని అత్యంత చవకధరలకు కొని, వైసీపీ నేతలు వాటికి భూసేకరణ పరిహారం ఎలా పొందారో బయటపడుతుంది. జగనన్న కాలనీల మాటున జరిగిన భూసేకరణలో అధికారగణం అంతా కూడా వైసీపీ నేతలకు ఏ మేరకు సేకరించారో, ఎంత మేర వారి అవినీతిని అడ్డుకోవాలని చూశారో కూడా బహిర్గతం అవుతుంది. దీనిపై ప్రభుత్వానికి ఏ మాత్రం చిత్తశుద్ధి ఉన్నా, జగనన్న కాలనీలను ఒక్కో కాలనీను ఒక్కో యూనిట్ గా తీసుకొని వివరాలను బయటపెట్టాల్సిన అవసరం ఉంది.
ఇచ్చిన పట్టాలు వాస్తవం కాదు
పేదలకు ఇచ్చినట్లుగా చెబుతున్న పట్టాలు కూడా వాస్తవం కాదు. అసలు అవి ఇంటి పట్టాలే కాదు. పొసిషన్ ధ్రువపత్రాలు మాత్రమే. మొత్తం 30 లక్షల పట్టాలు అని డప్పు కొట్టుకుంటున్న వైసీపీ నేతలు గతంలో ఆయా ప్రాంతాల్లో ఉన్న 5 లక్షల మందిని కూడా తమ లెక్కల్లో చూపారు. అంటే 25 లక్షల మందికి పట్టాలు ఇచ్చినట్లు లెక్క. దీనిలోనూ మరో 95,106 మంది మాకు పట్టాలు వద్దు అని, ప్రభుత్వం చూపించిన కొండల్లో గుట్టల్లో ఉండలేమని చెప్పి పట్టాలు తీసుకునేందుకు ముందుకు రాలేదు. అంటే దాదాపు 6 లక్షల మంది ఈ లెక్కలో లేరు. ఇక వైసీపీ నేతలు జగనన్న కాలనీల్లో 22 లక్షల మందికి ఇళ్లు కట్టించాం అని చెబుతున్నారు. లే అవుట్ కు రోడ్లు వేసి, గ్రౌండింగ్ చేసిన ఇళ్లను కూడా ఈ లెక్కలో పెడుతున్నారు. కేవలం 12,09,022 ఇళ్లు మాత్రమే జగనన్న కాలనీల్లో నిర్మాణంలో ఉన్నాయి. 2,62,216 టిడ్కో గృహాలు మాత్రమే ఇళ్లు ఉన్నాయి. ఇది అసలు లెక్క.
నామ మాత్రపు బడ్జెట్… అందులోనూ సగమే వ్యయం
రాష్ట్రమంతటా పేదలందరికీ ఇళ్లు ఇచ్చేశాం… గూడు కల్పించాం అంటూ బూటకపు మాటలు చెబుతున్న వైసీపీ నేతలు క్షేత్రస్థాయిలో పేదలను ఇళ్లు కట్టుకోవాలని, లేకుండా పట్టాలు తీసుకుంటామని బెదిరిస్తున్నారు. అధిక వడ్డీలకు అప్పులు తెచ్చుకొని మరీ పేదలు ఎలాగోలా ఇంటి నిర్మాణం చేస్తుంటే, వాటిని కూడా ప్రభుత్వం కట్టిస్తున్నట్లు లెక్కలు వేసుకుంటున్నారు. పేదలకు ఇళ్లు కట్టించాలనే చిత్తశుద్ధి నిజంగా ఉంటే… వైసీపీ 4 ఏళ్ల తన పాలనలో కేవలం గృహ నిర్మాణశాఖకు బడ్జెట్లో కేటాయించిన నిధులు రూ.16,815 కోట్లు అయితే ఖర్చు చేసింది కేవలం రూ. 8,258 కోట్లు. అంటే కేటాయించిన నామ మాత్రపు బడ్జెట్ లోనూ సాగమే వ్యయం చేశారు. 2023-24 బడ్జెట్ లో రూ.6,291 కోట్లు కేటాయిస్తే, కేవలం రూ.3 వేల కోట్లు ఖర్చు పెట్టారు. ఇదీ పేదల ఇళ్లపై పాలకులకు ఉన్న చిత్తశుద్ధి. పేద ప్రజలను అన్ని విధాలుగా మోసం చేసి, వారి పేరుతో సంపద దోచుకుంటున్న వైసీపీ నేతల అవినీతి మాత్రం వేల కోట్లు దాటింది.
భూముల కొనుగోలులో భారీ స్కాం
జగనన్న ఇళ్ల నిర్మాణం విషయంలో భూ సేకరణ అంశంలో లబ్ధిదారుకు, రైతుకు అపార నష్టం కలిగితే లాభపడింది మాత్రం మధ్యవర్తులుగా వ్యవహరించిన వైసీపీ నేతలు. పనికిరాని ప్రాంతాల్లో, సుదూర ప్రాంతాల్లో విలువ లేని భూములను తక్కువ ధరకు తీసుకొని, ప్రజాధనాన్ని సేకరణ పేరుతో లూటీ చేశారు. జగనన్న కాలనీల్లో మౌలిక సదుపాయాలు, సౌకర్యాల కోసం ఖర్చు పెట్టడం పక్కన పెట్టి, భూమి కొనుగోలుకు మాత్రం 100 శాతం నిధులు వెచ్చించడం వెనుక అసలు ఉద్దేశ్యం వైసీపీ దోపిడీ మాత్రమే. ముఖ్యమంత్రి శాసనసభలో చెబుతున్న లెక్కలకు చాలా విలువ ఉంటుంది. అలాగే కేంద్రానికి పంపే లెక్కలకు ప్రాధాన్యం ఉంటుంది. ఇవన్నీ విచిత్రంగా మారిపోతుంటే దీనిలో ఏం జరుగుతుందో సామాన్యుడికి ఎలా తెలుస్తుంది..? ప్రజాధనం ఎటు వెళ్తుందో వారికి ఎలా అర్ధం అవుతుంది..?
ఈ అవినీతి స్కాండల్ బయటపడటానికి కూడా వైసీపీ నాయకులే కారణం. వాటాల పంపిణీలో తేడాలొచ్చి వారే దీనిలో జరుగుతున్న అవినీతి తతంగాన్ని బయటకు చెప్పడంతోనే దీనిలో అసలు మతలబు బయటకు వచ్చింది. గుంటూరు జిల్లాలో చేపట్టిన భూసేకరణలో భయంకరమైన అవినీతి చోటు చేసుకొంది. భూసేకరణ ప్రకటనకు రెండు రోజుల ముందు కొనుగోలు అగ్రిమెంట్ చేసుకుంటారు… ఆ మర్నాడు రిజిస్ట్రేషన్ చేస్తారు.. ఆ సర్వే నెంబర్ ను భూసేకరణలో పెడతారు. ఆ తరవాత ప్రకటన ఇస్తారు. వెంటనే సేకరించడం, మర్నాడే పరిహారం ఖాతాలో వేసేస్తారు. ఈ వ్యవహారంలో వైసీపీ ప్రజా ప్రతినిధులు, నేతలు, అధికారులు… చివరకు కలెక్టర్ కూడా బాధ్యుడే. అవినీతి చేసిన ఎవర్నీ వదిలేది లేదు. అధికార పార్టీకి చెందిన ఓ శాసనసభ్యుడే ఏకంగా భూముల సేకరణపై విజిలెన్స్ విచారణ కోరారు అంటే దీనిలో జరిగిన అవినీతి తంతును అర్ధం చేసుకోవచ్చు.
ప్రభుత్వానికి దీనిపై చిత్తశుద్ధి ఉంటే లెక్కలను బయటపెట్టాలి. రాజకీయ, వ్యక్తిగత విమర్శలు మాని భూములు ఎవరి వద్ద.. ఎంతకు కొన్నారు అనేది ప్రజలకు తెలియజేయాలి. వాస్తవ ధర ఎంత.. ప్రభుత్వం కొన్న ధర ఎంత అనేది చెప్పాలి. అలాకాకుంటే క్షేత్రస్థాయిలో అవినీతిని తేల్చుకుందాం అంటే జనసేన పార్టీ సిద్ధంగా ఉంది. వాస్తవంగా జగనన్న గృహాలకో, కాలనీలకో వెళ్దాం అక్కడ పరిస్థితిపై బహిరంగంగా చర్చకు సిద్ధంగా ఉన్నాం.
శ్రీకాకుళం నుంచి అనంతపురం వరకు దోచుకున్నారు
అక్కడ.. ఇక్కడా అని కాదు.. రాష్ట్రంలోని ప్రతి ప్రాంతంలో, ప్రతి నియోజకవర్గంలోని వైసీపీ నాయకులు జగనన్న ఇళ్ల కాలనీల పేరుతో అందినకాడికి అందినంత దోచేసుకున్నారు. శ్రీకాకుళం నుంచి అనంతపురం వరకు భూ సేకరణలో అంతులేని అవినీతి దాగుంది. గుంటూరు జిల్లాలోని ఓ నియోజకవర్గంలో 10వ తేదీన భూ రిజిస్ట్రేషన్ జరిగింది.. 11వ తేదీన పట్టాలు ఇచ్చారు..14వ తేదీన భూ పరిహారం డబ్బులు ఇచ్చేశారు. అసలు ఇంత వేగంగా భూ లావాదేవీలు జరగడం ఆశ్చర్యం అయితే… అసలు ఎందుకింత వేగంగా అవినీతికి ద్వారాలు తెరిచారన్నది అమితాశ్చర్యంగా ఉంది. మేం చెబుతున్న లెక్కలు.. మీ ప్రభుత్వంలో అధికారికంగా, చట్టసభల సాక్షిగా చెప్పిన లెక్కలే. దీనిలో ఎందుకు తేడా వస్తాయి..? అసలు ఏం జరిగింది అనేది చెప్పండి.
సమాధానం చెప్పలేక వ్యక్తిగత విమర్శలు చేస్తున్నారు
సమగ్ర విచారణ చేస్తే అసలు నిజాలు బయటపడతాయి. ముందుగా గుంటూరు జిల్లాలో జరిగిన అవినీతిపై విచారణ చేస్తే, మేమంతా సహకరించడానికి సిద్ధంగా ఉన్నాం. సమాధానం చెప్పకుండా మంత్రులు వ్యక్తిగత విమర్శలకు పరిమితం అవడం బాధాకరం…? పరిశ్రమల శాఖలో జరిగిన అవినీతి ఇంకా చాలా ఉంది. దాన్ని విడతలవారీగా బయటపెడతాం. కచ్చితంగా ఆధారాలతో సహా మేం ప్రజల ముందుకు వస్తాం. వ్యక్తిగత విమర్శలకు భయపడేది లేదు. జనసేన – తెలుగుదేశం కలవకూడదని బలంగా వైసీపీ భావించింది. ప్రయత్నించింది. అయితే ఇప్పుడు ఇంకా చురుగ్గా రెండు పార్టీలు ప్రజల్లోకి వెళ్లేసరికి వైసీపీ ముఖ్యమంత్రి, మంత్రులకు ఏం చేయాలో తెలియక వ్యక్తిగత విమర్శలకు దిగుతున్నారు. దీనిపై చలించేది లేదు. వైసీపీ అవినీతిని రోజుకొకటి బయటపెట్టి, ప్రజాక్షేత్రంలో వారిని నిలబెడతాం’’ అన్నారు.
ఈ సమావేశంలో పార్టీ ఉమ్మడి గుంటూరు, కృష్ణా జిల్లాల అధ్యక్షులు గాదె వెంకటేశ్వరరావు, బండ్రెడ్డి రామకృష్ణ, విజయవాడ నగర అధ్యక్షులు పోతిన వెంకట మహేష్, పార్టీ నాయకులు చిల్లపల్లి శ్రీనివాస్, నయూబ్ కమాల్, అమ్మిశెట్టి వాసు, డా. పి.గౌతమ్ రాజ్, దాసరి కిరణ్ తదితరులు పాల్గొన్నారు.