– భవిష్యత్ అవసరాల కోసం 14 ప్రాంతాల్లో సబ్ స్టేషన్ల నిర్మాణం
– పారిశ్రామిక అవసరాల కోసం ఐటీ, ఇండస్ట్రీ, ఎనర్జీ శాఖల సంయుక్త కార్యాచరణ
-ఇంధన శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్
అమరావతి: గృహ, పారిశ్రామిక, వ్యవసాయ అవసరాల భవిష్యత్ డిమాండ్ తీర్చడానికి ట్రాన్స్ కో పరిధిలోని 68 ప్రాంతాల్లో రూ.5,500 కోట్లతో వివిధ అభివృద్ధి పనులు చేపట్టామని ఇంధన శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ వెల్లడించారు. విద్యుత్ సబ్ స్టేషన్లకు సంబంధించి ఎమ్మెల్సీలు బీదా రవిచంద్ర యాదవ్, పేరాబత్తుల రాజశేఖర్, బీటీ నాయుడులు అడిగిన ప్రశ్నకు మంగళవారం శాసన మండలిలో మంత్రి గొట్టిపాటి సమధానం చెప్పారు.
ట్రాన్స్ కో చేపట్టే వివిధ పనులతో నెట్ వర్క్ ఓవర్ లోడ్ తగ్గడంతో పాటు లో ఓల్టేజ్ సమస్యలను తగ్గించడానికి అవకాశం ఉందని మంత్రి తెలిపారు. రాష్ట్రంలో 6 నుంచి 8 శాతం విద్యుత్ వినియోగం పెరుగుతుందన్నారు. పెరుగుతున్న విద్యుత్ వినియోగానికి అనుగుణంగా, భవిష్యత్ అవసరాల కోసం 14 ప్రాంతాల్లో సబ్ స్టేషన్ల నిర్మాణాలను చేపడుతున్నామని స్పష్టం చేశారు. పనులన్నీ పూర్తయితే లో ఓల్టేజ్ సమస్య కూడా తగ్గుతుందని మంత్రి వెల్లడించారు.
ప్రస్తుతం రాష్ట్రంలో 400 కేవీ సబ్ స్టేషన్లు 18, 220 కేవీ సబ్ స్టేషన్లు 113తో పాటు 132 కేవీ సబ్ స్టేషన్లు 244 ఉన్నాయని మంత్రి గొట్టిపాటి పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం తీసుకున్న చర్యలతో రాష్ట్రంలో అత్యధిక విద్యుత్ డిమాండ్ అందుకోగలుగుతున్నామని చెప్పారు. కూటమి ప్రభుత్వం తీసుకొచ్చిన ఇంటిగ్రేటెడ్ క్లీన్ ఎనర్జీ పాలసీ, ఇండస్ట్రియల్ పాలసీలతో రాష్ట్రాంలో పెద్ద ఎత్తున పరిశ్రమలు ఎంఓయులు చేసుకుంటున్నాయన్నారు.
పరిశ్రమల విద్యుత్ వినియోగానికి పూర్తి స్థాయిలో సిద్ధంగా ఉండాలని ఐటీ, పరిశ్రమలు, విద్యుత్ శాఖ సంయుక్త కార్యాచరణతో పని చేస్తున్నాయని తెలిపారు. భవిష్యత్ అవసరాల కోసం అవసరమైన చోట సబ్ స్టేషన్ల నిర్మాణం చేపట్టామని చెప్పారు. 63 ప్రాంతాల్లో 33 కేవీ సబ్ స్టేషన్ల నిర్మాణం చేపట్టామని మంత్రి స్పష్టం చేశారు.
విశాఖపట్నం వంటి పట్టణాలలో వర్షాలు పడేప్పుడు, ఇతర సమయాల్లోనూ విద్యుత్ అంతరాయాల సమస్యలను పరిష్కరించడానికి స్కాడా సెంటర్ ను ఏర్పాటు చేశామని మంత్రి గొట్టిపాటి సభ్యులకు వివరించారు. స్కాడా సెంటర్ వేదికగా విశాఖ నగర పరిధిలోని సుమారు 110 సబ్ స్టేషన్ పనితీరు పర్యవేక్షణ జరుగుతుందని తెలిపారు.
స్కాడా సెంటర్ వేదికగా ఎక్కడ సమస్య ఉందో వెంటనే గుర్తించి పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఏ సమస్య అయినా ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తే వెంటనే పరిష్కారానికి కృషి చేస్తామని మంత్రి గొట్టిపాటి శాసనమండలి సాక్షిగా సభ్యులకు హామీ ఇచ్చారు