Suryaa.co.in

Features National

ఆర్ఎస్ఎస్ ఏ మతానికి వ్యతిరేకం కాదు…

-మనదంతా ఒకటే వారసత్వం… పూర్వీకులు ఒక్కరే
-దేవాల‌యాల ఉద్య‌మాలు ఆర్ఎస్ఎస్ లక్ష్యం కాదు
-చారిత్రాత్మక నేపథ్యంతో అయోధ్య ఉద్యమంలో పాల్గొన్నాం
-ఉక్రెయిన్ యుద్ధంలో భారత్ విధానం సబబే
-తృతీయ వర్గ శిక్షణ ముగింపులో ఆర్ఎస్ఎస్ స‌ర్ సంఘచాలక్ మోహన్ భాగ‌వ‌త్

నాగపూర్‌: వారు ముస్లింలుగా ఉండాలనుకుంటే మంచిదే. మాకు ఎటువంటి ఇబ్బంది లేదు. ఏ మతానికి మేం వ్యతిరేకం కాదు. ప్రతి ఒక్కరికీ తమకంటూ సొంత నమ్మకాలు, విశ్వాసాలుంటాయి. కానీ, మనదంతా ఒకటే వారసత్వం. మీకు, మాకు పూర్వీకులు ఒకరే. మన సంప్రదాయాలు ఒకటే అని రాష్ట్రీయ స్వ‌యంసేవ‌క సంఘ‌(ఆర్ఎస్ఎస్‌) స‌ర్ సంఘచాలక్ మోహన్ భాగవత్ అన్నారు. నాగపూర్‌లో ఆర్ఎస్ఎస్ తృతీయ వర్గ శిక్షణ ముగింపు కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.

దాడులు, దండయాత్రల ద్వారా ఇస్లాం బయటి నుంచి వచ్చింది. ఆ రోజుల్లో భారతదేశ స్వాతంత్ర్యం కోసం పోరాడిన వారిని మానసికంగా దెబ్బతీసేందుకు హిందూ దేవాలయాలను కూలగొట్టారు. తమకు ప్రత్యేక అనుబంధం ఉన్న కొన్ని ప్రాంతాల గురించి హిందువులు మాట్లాడుతున్నారు కానీ ముస్లింలకు వ్యతిరేకంగా వారు ఆలోచించడం లేదు. నేటి ముస్లింల పూర్వీకులు నాడు హిందువులే కదా.

‘హిందువులు అందుకే అలా కోరుకుంటున్నారు’
హిందువులను ఎప్పటికీ స్వాతంత్ర్యానికి దూరంగా ఉంచేందుకు వారి ఆలయాలను ధ్వంసం చేశారు. అందువల్లే నాడు కూల్చిన ఆలయాలను తిరిగి పునరుద్ధరించాలని హిందువులు కోరుకుంటున్నారు. మరి ఇందుకు మార్గం ఏంటి? పరస్పర అంగీకారంతో ముందుకు వెళ్ళ‌డమే. కానీ ప్రతిసారి ఇది సాధ్యం కాకపోవచ్చు.

హిందూ ఆలయాల పునరుద్ధరణ కోసం కోర్టుకు వెళ్ళొచ్చు. కానీ కోర్టులు ఇచ్చే తీర్పును మనం స్వాగతించాలి. రాజ్యాంగం ఆధారంగా పనిచేసే మన న్యాయవ్యవస్థ చాలా గొప్పది. అవి ఇచ్చే తీర్పులను మనం పాటించాలి. వాటిని ప్రశ్నించకూడదు.

కొన్ని ప్రాంతాలంటే మనకు చాలా గౌరవం ఉంది. వాటితో ప్రత్యేక అనుబంధం ఉంది. వాటి గురించి మనం మాట్లాడొచ్చు. కానీ రోజుకో కొత్త వివాదం తీసుకురాకూడదు అన్నారు మోహన్ భాగవత్.‘జ్ఞానవాపీ అంటే మనకు ప్రత్యేకమైన భక్తిశ్రద్ధలు ఉన్నాయి. ఇది తరతరాల నుంచి వస్తోంది. కానీ, ప్రతి మసీదులో శివలింగం కోసం ఎందుకు చూస్తున్నారు? బయటి నుంచి వచ్చిన మతమైనా అది కూడా ఒక పూజా విధానమే. ఆ భక్తి మార్గాన్ని ఎంచుకున్న వారు ముస్లింలు అయ్యారు. అంతేకానీ వారేమీ బయటి వారు కాదు. ఈ విషయాన్ని ముస్లింలు కూడా అర్థం చేసుకోవాలి’ అన్నారు ఆయన.

ఇప్పుడు మాకు దేవాలయాల కోసం ఉద్యమాలు చేపట్టాల్సిన అవసరం లేదు. భవిష్యత్తులోనూ హిందూ దేవాలయాల ఉద్యమాల్లో ఆర్‌ఎస్‌ఎస్ పాల్గొనదు అని చెప్పారు భాగవత్.

ఆలయాల కోసం ఉద్యమించడం తమ వైఖరి కాదు.. అయినా కొన్ని చారిత్రక కారణాల వల్ల రామ జన్మభూమి ఉద్యమంలో నాడు పాల్గొన్నామని, ఆ పనిని విజయవంతంగా పూర్తి చేశామని భాగవత్ వివ‌రించారు.

ఉక్రెయిన్ యుద్ధంలో భారత్ విధానం సబబే…
‘‘యుక్రెయిన్ మీద రష్యా దాడికి దిగింది. కానీ, యుక్రెయిన్‌తో వెళ్ళి రష్యాతో పోరాడటానికి ఏ దేశమూ సిద్ధంగా లేదు. రష్యా దగ్గర దమ్ము ఉంది. దాన్ని ఢీ కొట్టడం సులభం కాదు. ఎవరైనా వస్తే అణుబాంబులు వేస్తామంటోంది. అలాంటప్పుడు ఎవరైనా భయపడాల్సిందే’’ అంటూ యుక్రెయిన్, రష్యా యుద్ధంపై స్పందించారాయన.

‘‘మరొకవైపు యుక్రెయిన్‌కు అనేక రకాల ఆయుధాలు, యుద్ధసామ‌గ్రి ఇచ్చే వారు ఇస్తున్నారు. గతంలో భారత్, పాకిస్తాన్ కొట్టుకుంటూ ఉంటే రెండు దేశాలకు ఆయుధాలను ఇచ్చి వాటి పనితీరును పశ్చిమ దేశాలు పరీక్షించుకుంటూ ఉండేవి. యుక్రెయిన్, రష్యా యుద్ధం విషయంలో భారత్ ఆచితూచి వ్యవహరించింది. అటు యుక్రెయిన్ మీద దాడిని సమర్థించలేదు. అలాగని రష్యాను వ్యతిరేకించలేదు.

భారతదేశానికి అంత శక్తి ఉండి ఉంటే యుద్ధాన్ని ఆపి ఉండేది. కానీ, భారత్ ఇంకా ఆ స్థాయికి రాలేదు. శక్తివంతమైన చైనా కూడా యుక్రెయిన్, రష్యా యుద్ధాన్ని ఆపేందుకు ప్రయత్నించలేదు. యుక్రెయిన్, రష్యా యుద్ధం వల్ల మనల్ని ఆర్థిక కష్టాలు చుట్టుముట్టాయి. మనం శక్తిమంతులుగా మారాలి. అప్పుడే ఇలాంటి పరిస్థితులు మళ్ళీ తలెత్తకుండా ఉంటాయి’’ అన్నారాయన.

LEAVE A RESPONSE