-విద్యుత్తు ఛార్జీల పెంపుపై గిడుగు రుద్రరాజు ఆగ్రహం
విజయవాడ: ఒక్క ఛాన్స్ పేరుతో అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం వివిధ పన్నుల పేరుతో ప్రజల రక్తాన్ని జలగలా పీలుస్తోందని ఏఐసీసీ కార్యదర్శి, మాజీ ఎమ్మెల్సీ గిడుగు రుద్రరాజు అన్నారు. ఈ మేరకు ఆయన బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. గిడుగు రుద్రరాజు మాట్లాడుతూ.. ఇప్పటికే చెత్తపన్ను, ఆస్థిపన్ను, మున్సిపల్, రిజస్ట్రేషన్ శాఖల్లో ఏవీ వదలకుండా అన్ని పన్నులను పెంచుకుంటూ పోతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రస్తుతం సాధారణ, మధ్యతరగతి వర్గీయులను సైతం వదలకుండా విద్యుత్తు ఛార్జీలు పెంచడం దుర్మార్గం అన్నారు. పన్నుల వడ్డింపులో కేంద్రం, రాష్ట్రం పోటీలు పడుతున్నాయన్నారు. రాష్ట్రంలో అభివృద్ధి అంటే పన్ను వసూళ్లలోనే కనిపిస్తోందని ఎద్దేవా చేశారు. విద్యుత్తు ఛార్జీల అంశంలో వివరణ ఇస్తూ వంద యూనిట్లు వాడే పేదలు, 200-300 మధ్య యూనిట్లు వినియోగించే మధ్యతరగతి వర్గ ప్రజలు గౌరవప్రధంగా జీవించే హక్కును ఈ ప్రభుత్వం కాలరాస్తోందని గిడుగు రుద్రరాజు పేర్కొన్నారు.