Suryaa.co.in

Telangana

అర్హులకు మాత్రమే ‘రైతు భరోసా’

-పథకాల్లో ప్రజాధనం వృధాకానీయం
– వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు

హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 110 గ్రామీణ నియోజకవర్గాల్లో వున్న రైతువేదికలలో , నియోజకవర్గానికి ఒకటి చొప్పున ఏర్పాటుచేసిన వీడియో కాన్ఫరెన్సు ద్వారా వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు , ప్రతి మంగళవారం నిర్వహించే రైతునేస్తం కార్యక్రమంలో భాగంగా , ప్రభుత్వం ప్రవేశపెట్టే ‘రైతు భరోసా’ గురించి రైతుల అభిప్రాయాలు తెలుసుకున్నారు.

ముందుగా మంత్రి తుమ్మల మాట్లాడుతూ, తమ ప్రభుత్వం రైతుబంధు స్థానంలో రైతుభరోసా పథకాన్ని తీసుకొస్తుందని, పెట్టుబడి సహాయం కూడా 10000 నుండి ఎకరానికి 15000 రూపాయల పెంచుతున్నామని, ఐతే రైతుబంధు తరహాలో ప్రజాధనము వృధా కాకుండా ఉండేందుకు పటిష్ట విధానాలను రూపొందించుటకు తమ ప్రభుత్వము కసరత్తు చేస్తుందని తెలియచేశారు.

గతంలో సాగులో లేని భూములకు కూడా రైతుబంధు వర్తింపచేసి 12 విడతలలో దాదాపు 25,670 కోట్ల రూపాయల ప్రజాధనం వృధా చేశారని, 93శాతం వాటా ఉన్న సన్న, చిన్నకారు రైతుల వాటా రైతుబంధు మొత్తంలో 68 శాతం కూడా లేదని, అంతేకాకుండా 17.5శాతం ఉన్న కౌలు రైతులను పూర్తిగా నిర్లక్ష్యం చేసారని పేర్కొన్నారు.

మంత్రి మాట్లాడిన పిదప దాదాపు అన్ని జిల్లాలనుండి రైతులు, మంత్రి ఇలా ప్రత్యక్షంగా రైతుల అభిప్రాయాలు తీసుకోవడం శుభపరిణామం అని, రైతులకు వర్తింపచేసే పథకాలలో విధివిధానాలలో వారిని కూడా భాగస్వామ్యం చేయడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ వారివారి సూచనలు అందించారు.
చాలా మంది రైతులు పథకాన్ని సాగుచేసే వారికి, అదేవిధంగా సాగులో ఉన్న భూమికే పెట్టుబడి సహాయం అందించాలని, అంతేకాకుండా గరిష్ట పరిమితి విధించి రైతుభరోసా పథకాన్ని వర్తింపచేయాలని కోరారు.

రైతునేస్తం కార్యక్రమంలో వెల్లడించిన మరియు రాతపూర్వకంగా సేకరించిన సూచనలను అన్నిటిని క్రోడీకరించి, ఒక నివేదిక తయారుచేయవల్సిందిగా డైరెక్టర్ గోపి ని ఆదేశించారు.

తమ ప్రభుత్వం రైతుభరోసాకు సంబంధించి ఎటువంటి విధానపరమైన నిర్ణయాలు ఇంకా తీసుకోలేదని, పూర్తిగా అందరి అభిప్రాయాలు, శాసనసభలో సభ్యులతో చర్చించిన పిదప పథకాన్ని తీసుకొస్తామని, ఆలస్యమైన కూడా అర్హులకు మాత్రమే అందేవిధంగా రూపకల్పన చేస్తామని తెలియచేశారు.

రైతునేస్తం కార్యక్రమంలో ప్రణాళికసంఘ ఉప చైర్మన్ చిన్నారెడ్డి, అఖిలభారత కిసాన్ సెల్ ఉపాధ్యక్షులు కోదండరెడ్డి , రైతుసంఘ నాయకులు అన్వేష్ రెడ్డి వ్యవసాయశాఖ కార్యదర్శి రఘునందన్ రావు, వ్యవసాయ మరియు ఉద్యానశాఖ డైరెక్టర్లు, జిల్లాల నుండి కలెక్టర్లు, జిల్లా వ్యవసాయాధికారులు, రైతులు పాల్గొన్నారు.

LEAVE A RESPONSE