Suryaa.co.in

Telangana

రైతులను అప్పుల ఊబి నుంచి బయటపడేసేందుకే రైతు దీక్ష

– రైతన్నలకు నష్టం చేస్తే మంచిది కాదనే సోయి రేవంత్ రెడ్డికి లేదు
– ఎంపీ ఈటల రాజేందర్

హైదరాబాద్: సోమవారం ఉదయం 11 గంటల నుంచి మంగళవారం ఉదయం 11 గంటల వరకు 24 గంటలపాటు ఇందిరాపార్క్ దగ్గర రైతు దీక్ష కార్యక్రమం నిర్వహిస్తున్నాం. ఇందులో పెద్ద ఎత్తున రైతులతో పాటు ఎంపీలు, ఎమ్మెల్యేలు, నాయకులందరూ పాల్గొంటారు. రైతులకిచ్చిన హామీలను నెరవేర్చేలా.. ప్రభుత్వం మెడలు వంచి ఒత్తిడి తీసుకురావటమే రైతు దీక్ష లక్ష్యం.

ఎన్నికల ముందు రేవంత్ రెడ్డి, సోనియాగాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీ, ఖర్గే సమక్షంలో 6 గ్యారంటీల పేరుతో ప్రజలకు హామీలు ఇచ్చారు. అందులో రైతుల కోసం రైతు రుణమాఫీ, రైతుబంధు, రైతు బీమా, వడ్లకు రూ.500బోనస్, కౌలు రైతులకు రైతుబంధు, రైతుకూలీలకు సంవత్సరానికి రూ.12వేలు ఇస్తామని హామీ ఇచ్చారు.

ఇంకా ఒక అడుగు ముందుకు వేసి ఎవరైనా లోన్ లేని వాళ్ళు ఉంటే వెంటనే బ్యాంకుకు వెళ్లి రుణం తీసుకోండి.. కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే రుణమాఫీ చేస్తానని చెప్పారు.ప్రస్తుతం రేవంత్ రెడ్డి పిల్లి గంతులు వేస్తూ దిక్కులు చూస్తున్నాడే తప్ప చప్పుడు చేయడం లేదు. పార్లమెంట్ ఎన్నికల సమయంలో దేవుళ్ళ మీద ఒట్లు పెట్టి ప్రజల్లో నమ్మకం కలిగించే ప్రయత్నం చేశారు. నమ్మకం పోతుందన్న క్రమంలో అన్ని రకాల నిధులు ఆపి రైతు రుణమాఫీ మొదలుపెట్టారు.

బ్యాంకులు 73 లక్షల రైతులని చెప్తే.. రేవంత్ రెడ్డి 65 లక్షలని, చివరికి 48 లక్షల మంది రైతులకు రూ.34 వేల కోట్లు ఏకకాలంలో రుణమాఫీ చేస్తామన్నారు.రకరకాల నిబంధనలతో దాన్ని తగ్గించే ప్రయత్నం చేయబోతే రైతుల ఆగ్రహానికి తోక ముడిచి అందరికీ ఇస్తామని హామీ ఇచ్చారు.

ముఖ్యమంత్రి కార్యాలయం నుండి రాష్ట్రంలో 17వేల కోట్ల రూపాయల రుణమాఫీ చేశామని ఒక ప్రకటన చేశారు. కానీ, ఇప్పటివరకు ఎంత రుణమాఫీ అయిందనేది అధికారుల దగ్గర కూడా లెక్కలేదు. రుణమాఫీ జరగలేదని మేడ్చల్ ఎంపీడీవో ఆఫీసులో ఒక రైతు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు.

రేవంత్ రెడ్డి మోసపు మాటలకు మారు పేరుగా నిలిచారు. అబద్దాలే ఆయన జీవితం కాబట్టి మేమంతా ఐక్యమై సర్కారు మెడలు వంచే ఆందోళన చేస్తేనే రుణమాఫీ అవుతుందని రేపు ఇందిరాపార్క్ దగ్గర చేస్తున్న దీక్ష చేపడుతున్నాం. రైతులు పెద్దఎత్తున పాల్గొనవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం.

రేపు ఉదయం 11 గంటలకు మొదలై ఎల్లుండి ఉదయం 11 గంటల వరకు 24 గంటల పాటు ఈ రైతు దీక్ష జరగబోతుంది. రైతులందరూ పాల్గొని విజయవంతం చేయాలని కోరుతున్నాము.
రైతన్నలకు నష్టం చేస్తే మంచిది కాదనే సోయి రేవంత్ రెడ్డికి లేదు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, రేవంత్ రెడ్డి మాటలు చూస్తే ఇచ్చిన హామీలు అమలు చేసే విధంగా కనిపించడం లేదు. ప్రభుత్వం మెడలు వంచడానికి మీ పక్షాన మేము చేస్తున్న దీక్షకు తరలిరావాలని రైతన్నలకు పిలుపునిస్తున్నాం.

ఘట్ కేసర్ లో 1,206 మంది రుణం తీసుకుంటే ఇంకా 1,006 మందికి రుణమాఫీ కాలేదు. పూడూరు సొసైటీలో కూడా రుణమాఫీ కాలేదు. రైతులను అప్పుల ఊబి నుంచి బయటపడేసేందుకే ఈ దీక్ష చేస్తున్నాం. రైతులకు భరోసా కల్పించేందుకు భారతీయ జనతా పార్టీ ప్రజాప్రతినిధులందరం ఇందిరాపార్క్ దగ్గర రేపు దీక్ష చేస్తున్నాము. రేపు జరగబోయే దీక్షలో రైతులు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని కోరుతున్నాం.

LEAVE A RESPONSE