Suryaa.co.in

Telangana

ప్రజలారా…. మీ ఆయుధం మేమవుతాం

-మీ ఇండ్లపై బుల్డోజర్ దిగాలంటే… ముందు బీజేపీ కార్యకర్తలను తాకాలి
-మీ ఆస్తులకు మేం రక్షణగా ఉంటాం
-తెగించి కొట్లాడేందుకు బీజేపీ సిద్ధం
-పేదల ఇండ్లను కూల్చడమే ఇందిరమ్మ రాజ్యమా?
-6 గ్యారంటీలు అమలు చేయకుండా మోసం చేయడమే ఇందిరమ్మ పాలనా?
-మూసీ ప్రక్షాళన పేరుతో పేదల ఇండ్లపై హైడ్రా దాడులు
-హామీల అమలు, మాజీ సర్పంచుల బిల్లుల విషయంలో బీఆర్ఎస్, కాంగ్రెస్ దొందూ దొందే
-హైడ్రా దాడులు, కాంగ్రెస్, బీఆర్ఎస్ మోసాలపై నిప్పులు చెరిగిన కేంద్ర మంత్రి బండి సంజయ్
– హైదరాబాద్ బర్కత్ పురాలో ఎంపీ లక్ష్మణ్ తో సేవా పక్వాడ్ ఫోటో ఎగ్జిబిషన్ ను ప్రారంభించిన బండి సంజయ్

హైదరాబాద్ : హైడ్రా దాడుల విషయంలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ మరోసారి ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. హైడ్రా దాడులపై ప్రభుత్వం పున: సమీక్షించుకోకుంటే బీజేపీ తెగించి కొట్లాడేందుకు సిద్దంగా ఉందని హెచ్చరించారు.

ఈ సందర్భంగా ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ ‘‘ప్రజాలరా…. మీకు అండగా బీజేపీ ఉంది. మీ ఆస్తులను రక్షించే బాధ్యత తీసుకుంటాం. మీ ఆయుధం మేమవుతాం. పేదలకు ఆయుధంగా బీజేపీ మారబోతోంది. మీ ఇండ్లపై హైడ్రా బుల్డోజర్లు దిగాలంటే… ముందు బీజేపీ కార్యకర్తలపైన, మాపైన బుల్డోజర్లపై దిగిన తరువాతే మీ ఇండ్లను తాకాలి. అందుకు పూర్తిగా సన్నద్ధమై ఉన్నం. ప్రభుత్వం కూడా పేదల ఇండ్ల కూల్చే ముందు దానికి సిద్ధం కండి. ఈ విషయంలో ఎందాకైనా తెగించి కొట్లాడేందుకు రడీగా ఉన్నం’’అని స్పష్టం చేశారు.

హైదరాబాద్ బర్కత్ పురాలోని బీజేపీ సిటీ సెంట్రల్ జిల్లా కార్యాలయంలో పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు డాక్టర్ గంగిడి మనోహర్ రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సేవా పక్వాడ ఫోటో ఎగ్జిబిషన్ ను రాజ్యసభ సభ్యులు డాక్టర్ కె.లక్ష్మణ్, ఉపాధ్యక్షులు చింతల రామచంద్రారెడ్డి, జిల్లా అధ్యక్షులు గౌతమ్ రావు తదితరులతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారితో కలిసి మీడియాతో మాట్లాడుతూ హైడ్రా దాడులు, కాంగ్రెస్ 6 గ్యారంటీల అమలు, బీఆర్ఎస్, కాంగ్రెస్ చేసిన మోసాలపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.

బండి సంజయ్ఏమన్నారంటే…. ఈరోజు ఫోటో ఎగ్జిబిషన్ ను ప్రతి ఒక్కరూ వీక్షించాలి. మహాత్మాగాంధీ జయంతిని పురస్కరించుకుని అక్టోబర్ 2న విస్త్రతంగా సేవా కార్యక్రమాలు నిర్వహించాలని కోరుతున్నా. తెలంగాణలోని ఏ మారుమూల గ్రామానికి వెళ్లినా, ఏ వ్యక్తిని కదిలించినా హైడ్రా దాడులపైనే చర్చ జరుగుతోంది. హైడ్రా దాడులను చూసి బాధపడనోడు పాపాత్ముడు. మరి ప్రభుత్వం ఎందుకు పున: సమీక్షించుకోవడం లేదో అర్ధం కావడం లేదు. పైగా ప్రజలను భయభ్రాంతులకు గురిచేసేలా ప్రచారం చేయిస్తున్నారు.

సర్కార్ తీరు డామిట్ కథ అడ్డం తిరిగినట్లుగా ఉంది. పెద్దలు ఆక్రమించిన భవనాలను కూలగొడతారని మేం మొదట భావించాం. కానీ పేదల ఇండ్లు కూలుస్తున్నారు. పేద ప్రజలకు చుక్కలు చూపిస్తున్నారు. కొత్ల ఇల్లు కట్టుకుని గ్రుహ ప్రవేశం చేస్తే… ఆ ఇంటి తోరణాలు వాడకముందే వచ్చి కూల్చేస్తున్నారు. అన్ని అనుమతులు తీసుకుని, బ్యాంకు రుణాలు తీసుకుని ఇండ్లు కట్టుకుంటే.. వాటిని కూల్చడం ఎంత వరకు న్యాయం? వాళ్లంతా చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకుని బతుకుతున్న కుటుంబాలు.

ఆ ఇండ్లపై దాడులు చేస్తే వాళ్లకు దిక్కెవరు? వాళ్లు ఎట్లా బతకాలి? కాంగ్రెస్ తీరువల్ల హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ వ్యాపారం దెబ్బతిన్నది. తెలంగాణలో ఆర్ధిక పరిస్థితి పూర్తిగా దెబ్బతిన్నది. దీనిపై ఆలోచించకుండా ప్రభుత్వం మొండి వైఖరి ఆవలంబించడం సరికాదు. బీజేపీ పూర్తిగా ఈ విధానాన్ని వ్యతిరేకిస్తోంది. ప్రభుత్వ దాడులకు వ్యతిరేకంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రణాళిక రూపొందిస్తున్నాం. పేదలకు ఆయుధంగా బీజేపీ మారబోతోంది. ప్రభుత్వం దిగొచ్చేదాకా పోరాడుతుంది.

పేద ప్రజాలరా…. మీకు అండగా బీజేపీ ఉంది. పేదలకు ఆయుధంగా బీజేపీ మారబోతోంది. మీ ఇండ్లపై బుల్డోజర్లు దిగాలంటే… ముందు బీజేపీ కార్యకర్తలపైన,మాపైన బుల్డోజర్లపై దిగిన తరువాత మీ ఇండ్లను తాకాలి. అందుకు పూర్తిగా సన్నద్ధమై ఉన్నం. ప్రభుత్వం కూడా పేదల ఇండ్ల కూల్చే ముందు దానికి సిద్ధం కండి.

సిగ్గుండాలే.. పేదల ఇండ్లు కూల్చడమే ఇందిరమ్మ రాజ్యమా? పేదల ఉసురు తీసుకోవడమే ఇందిరమ్మ రాజ్యమా? 6 గ్యారంటీలను అమలు చేయకుండా మోసం చేయడమే ఇందిరమ్మ రాజ్యమా?..పేదలు కన్నీళ్లు పెడుతుంటే మీకు కన్పించడం లేదా? బీఆర్ఎస్ కు, మీకు తేడా ఏముంది? గతంలో బీఆర్ఎస్ కూడా ఇట్లనే చేసింది. మీరు అదే పంథా కొనసాగుతున్నరు. మాజీ సర్పంచులకు బిల్లులు చెల్లించకుండా బీఆర్ఎస్ మోసం చేసింది.. ఇప్పుడు కాంగ్రెస్ కూడా వాళ్లను మోసం చేస్తూనే ఉంది. ఇచ్చిన హామీలను అమలు చేయకుండా బీఆర్ఎస్ మోసం చేసింది… కాంగ్రెస్ సైతం 6 గ్యారంటీల అమలు పేరుతో ఓట్లు దండుకుని ప్రజలను నిండా మోసం చేసింది.

పేదల స్థల్లాల్లోనే కలెక్టరేట్లు, పైర్ స్టేషన్ల నిర్మాణం పేరుతో పేదల స్థలాలను బీఆర్ఎస్ ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. ఇప్పుడు మూసీ సుందరీకరణ పేరుతో పేదల ఇండ్లను కూల్చేస్తోంది. అందుకే పేదలకు అండగా ఉండటానికి, ప్రజల ఆస్తులు కాపాడటానికి బీజేపీ తెగించి కొట్లాడేందుకు సిద్ధమైంది. కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో త్వరలోనే ప్రణాళిక రూపొందించి అమలు చేయబోతున్నాం.

LEAVE A RESPONSE