*కార్మికుల ప్రాణ రక్షణ, కనీస వసతుల కల్పనకు పెద్దపీట వేయాలి
*నిబంధనలకు తూట్లు పొడుస్తూ ఎంవీవీ బిల్డర్స్ సంస్థ కార్యకలాపాలు
*ఈ సంస్థ గత ప్రభుత్వ హయాం నుంచి ఇప్పటి వరకు రూ.11 కోట్ల బకాయిలు చెల్లించాలి
*విశాఖలో పలు నిర్మాణ దశ భవనాలను పరిశీలించిన కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్
విశాఖపట్టణం: భవన నిర్మాణాల వద్ద అన్ని రకాల భద్రతా ప్రమాణాలు పాటించాల్సిందేనని, దీనిపై అధికారుల పూర్తిస్థాయి పర్యవేక్షణ ఉండాలని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ అన్నారు. కార్మికుల ప్రాణాలకు రక్షణ ఉండేలా, పనిచేసే చోట కనీస వసతులు ఉండేలా పక్కా చర్యలు చేపట్టాలని సూచించారు. ఫస్ట్ ఎయిడ్ కిట్లు, టాయిలెట్లు, విశ్రాంతి గదులు తప్పకుండా ఉండాలని, కార్మికులకు హెల్మెట్లు, మాస్కులు, బూట్లు, చేతులకు తొడుగులు ఇవ్వాలని సంబంధిత నిర్మాణ సంస్థల ప్రతినిధులను ఆదేశించారు. విశాఖపట్టణం నగర పరిధిలో జరుగుతున్న పలు భవన నిర్మాణ పనులను ఏపీ బిల్డింగ్ అండ్ అదర్ కన్స్ట్రక్షన్స్ వర్కర్స్ వెల్ఫేర్ బోర్డు ఛైర్మన్ వలవాల మల్లికార్జున రావు (బాబ్జీ), కార్మిక శాఖ అదనపు కార్యదర్శి గంధం చంద్రుడు ఇతర అధికారులతో కలిసి శుక్రవారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు.
ఈ క్రమంలో ముందుగా మధురవాడ ఐకానికా గ్రాండే వద్ద జరుగుతున్న విల్లాల నిర్మాణ పనులను పరిశీలించారు. ప్లాన్ ప్రకారం కడుతున్న సెస్ ఛార్జీలు, కార్మికుల రక్షణ కోసం తీసుకున్న చర్యలపై ఆరా తీశారు. ఇక్కడ సుమారు 15 ఎకరాల స్థలంలో 125 వరకు విల్లాలు నిర్మితమవుతుండగా, సుమారు 300 వరకు కార్మికులు పని చేస్తున్నారని స్థానిక నిర్మాణ సంస్థ ప్రతినిధులు మంత్రికి వివరించారు. అయితే వారందరికీ సరిపడా టాయిలెట్లు, ఫస్ట్ ఎయిడ్ కిట్లు లేకపోవడంపై మంత్రి అసంతృప్తి వ్యక్తం చేశారు. కార్మికులకు అన్ని రకాల వసతులు కల్పించాలని, సరిపడా టాయిలెట్లు, ఫస్ట్ ఎయిడ్ కిట్స్, ఉండటానికి వసతి సదుపాయం కల్పించాలని, పని చేసే సమయంలో హెల్మెట్లు, గ్లౌజులు అందించాలని నిర్మాణ సంస్థల ప్రతినిధులను ఈ క్రమంలో ఆదేశించారు. తర్వాత సమీపంలో ఉన్న వైశాఖి స్కైలాంజ్ సంస్థ ఆధ్వర్యంలో జరుగుతున్న ఇళ్ల నిర్మాణాలను పరిశీలించిన అక్కడి పనిచేసే కార్మికులు, ఇంజనీర్లు, నిర్మాణ సంస్థ ప్రతినిధులతో మాట్లాడారు. అక్కడ సేవలపై మంత్రి సంతృప్తి వ్యక్తం చేశారు. ఎంవీవీ బిల్డర్స్ సంస్థలో నిబంధనలకు తూట్లు అనంతరం బక్కన్నపాలెం రోడ్డులో సాయిప్రియ ఎస్టేట్ పరిధిలో ఎంవీవీ జీవీ ది గ్రాండ్ సంస్థ ఆధ్వర్యంలో జరుగుతున్న ఇళ్ల నిర్మాణ పనులను మంత్రి పరిశీలించారు.
ఇక్కడ 9.1 ఎకరాల స్థలంలో ఐదు బ్లాకుల్లో సుమారు 1,900 ఇళ్ల నిర్మాణాలు జరుగుతుండగా అక్కడి కార్మికులు, ఇంజనీర్లతో పలు అంశాలపై మాట్లాడారు. వారికి అందుతున్న సౌకర్యాలు, సంస్థ కల్పిస్తున్న వసతుల గురించి ఆరా తీశారు. నిర్మాణాలు జరుగుతున్న ప్రాంతంలో చుట్టూ బురద, పై భాగంలో ఎలాంటి భద్రతా ప్రమాణాలు పాటించకుండా జరుగుతున్న తీరును గమనించిన ఆయన అక్కడి నిర్మాణ సంస్థ ప్రతినిధులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సెస్ ఛార్జీలు, ఇప్పటి వరకు ఉన్న బకాయిల గురించి నిర్మాణ సంస్థ ప్రతినిధులను, కార్మిక శాఖ అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఇక్కడ నిబంధనలకు విరుద్ధంగా కార్యకలాపాలు జరుగుతున్నాయని, కార్మికుల రక్షణ చర్యలు ఏమాత్రం తీసుకోలేదని, కార్మికులకు హెల్మెట్లు, బూట్లు లేకపోవటం శోచనీయమన్నారు.
నిబంధనల ప్రకారం చెల్లించాల్సిన సెస్ ఛార్జీలు కట్టలేదని, సుమారు రూ.11 కోట్ల వరకు ఎంవీవీ జీవీ ది గ్రాండ్ సంస్థ బకాయిలు ఉందని, తక్షణమే నోటీసులు జారీ చేయాలని కార్మిక శాఖ అధికారులను ఆదేశించామని మంత్రి మీడియాతో మాట్లాడినప్పుడు చెప్పారు. ఎంవీవీ సత్యనారాయణ ఒక ప్రజాప్రతినిధి అయి ఉండి కనీస నిబంధనలు పాటించకపోవడం, ప్రభుత్వానికి కట్టాల్సిన సెస్ కట్టకపోవటం శోచనీయమని పేర్కొన్నారు. నగర పరిధిలో జరుగుతున్న అన్ని నిర్మాణాలను తనిఖీ చేస్తామని, అధికారులను అప్రమత్తం చేస్తామని ఈ సందర్భంగా మంత్రి చెప్పారు. క్షేత్రస్థాయి పర్యటనలో మంత్రితో పాటు కార్మిక శాఖ జాయింట్ కమిషనర్ రామారావు, విశాఖపట్నం జిల్లా కార్మిక శాఖ డిప్యూటీ కమిషనర్ సునీత, పలువురు అసిస్టెంట్ కమిషనర్లు, ఇతర అధికారులు తదితరులు ఉన్నారు.


