Suryaa.co.in

Features

కలియుగంలో ఫలితాన్ని ఆశించకుండా కర్మ చేసే జ్ఞాని రమణ మహర్షి

– ఆత్మ చైతన్యమని తెలుసుకున్న తరువాత వేరొక జ్ఞానం అవసరం లేదు

యోగి పుంగవులు, అవధూతలు, జ్ఞానులు వంటి ఎందరో మహానుభావులకు పుట్టినిల్లు మన వేద భూమి. అటువంటి వారిలో దేహాత్మ భావనను జయించిన వారి కోవకు చెందిన వారు రమణ మహర్షి. అరుణాలచలం పేరు వినగానే తన జన్మకు విడిది అదేనని పులకించి, భవ బంధములు తెంచుకుని వెంటనే అరుణాచలేశ్వరుని సన్నిధికి చేరిన మహనీయుడు. ఈ సమస్తమూ ఆత్మ స్వరూపమని తెలుసుకున్నారు.

అందువల్లనే రమణాశ్రమంలోని జీవులన్నీ ఆయన తో ఎంతో స్నేహంగా సంభాషించేవి. ఆయన పాదస్పర్శతో ఆ దివ్య క్షేత్రం ప్రకాశం మరింత పెరిగింది. పదకొండు సంవత్సరాల మౌన దీఓతో ఆత్మసాక్షాత్కారాన్ని పొందిన మహర్షిని నదీనాం సాగరో గతిః అన్నట్టు మరొక పండితుడైన శ్రీకావ్యకంఠ గణపతి ముని వెతుక్కుంటూ వచ్చారు. ఆంధ్రప్రాంతం నుంచి అరుణాచలం వచ్చి వేంకటరామన్ అనే పూర్వ నామధేయుణ్ణి ఆయన మొట్టమొదట ‘రమణ మహర్షి’ అని సంబోధించారు. మౌన దీక్షను వీడి మొదట కావ్య కంఠ గణపతి మునితో సంభాషించేరు రమణ మహర్షి. సాధనతో పూర్ణత్వం సిద్దించదని, ‘నేను’ అనే దానిని తెలుసుకుంటే పూర్ణత్వంతో పనిలేదని ఉద్బోధించారు.

మానవుని అంతిమ లక్ష్యం ఆనందంగా ఉండడం. అలాగే జీవరాశులన్నీ ఆనందంగా బతకాలని తపన పడతాయి. పక్షులు తమ అనురాగాన్ని పంచుకుంటాయి. శునకాలు తమ చెలగాటాలతో ఆనందాన్ని పంచుకుంటాయి. క్రిమికీటకాలు కూడా పరస్పరం తమ సుఖమయజీవన లాలిత్యాన్ని రుచి చూస్తాయి. కాని మానవుని కున్న గొప్ప వరం చింతన. శాశ్వతమైన నిత్యానందాన్ని పొందడానికి నిరంతరం చింతన చేయాలి.

సకర్మలు కూడా శాశ్వతమైన ఆనందాన్ని ఇవ్వలేవు. అప్పుడే పుట్టిన శిశువు తన యదార్థ స్థితిలో నుంచి నిత్యానందంలో రమిస్తుంది. ఆకలి వేసినపుడు రోదిస్తుంది. తల్లిపాలతో ఆకలి తీరగానే తిరిగి ఆనంతలోకంలో విహరిస్తుం ది. కానీ అన్నం రుచి చూసిన తక్షణం అజ్ఞానపు పొర ఆవహించి భ్రమలో బతకడం ప్రారంభిస్తుంది. షడ్వికారములతో యాత్ర చేసిన జీవుడు తుదకు మరొక యోని కోసం ఎదురు చూడక తప్పని పరిస్థితి. జనన మరణ చక్రం అనివార్యం. దీనికి కారణం అజ్ఞానం. దీనిని ఛేదించే మార్గం ఆత్మతత్త్వ విచారణ. ఇది కర్మల వల్ల సాధించలేమని రమణ మహర్షి తమ ఉపదేశసారంలో ఉద్ఘాటించారు.

కలియుగంలో ఫలితాన్ని ఆశించకుండా కర్మ చేసే జ్ఞాని అరుదు. ‘కర్మలు చేయడం వరకే నీ వంతు, ఫలితం నా చేతుల్లో ఉంది’ అన్న గీతాచార్యుని శాసనం అజ్ఞానంలో ఉన్నవారు గ్రహించడం కష్టం. ప్రకృతి నియమాన్ని ఉల్లంఘించి ఎవరూ మనుగడ సాగించలేరు. జనన మరణ చక్రాన్ని పరమాత్మ తన అధీనంలో ఉంచుకొని ఉన్నాడు అనేది భ్రమ. ఆత్మజ్ఞానం పొందలేక కర్మలతో ఫలితాలను ఆశించి తిరిగి ఆ చక్రంలో పడేది జీవుడు మాత్రమే!

మానవ దేహంలోని అంతర్గత అవయవాలు వాటంతట ఆవే పనిచేస్తున్నాయి. కాని అవి నా వల్లనే పనిచేస్తున్నాయి అనే అహమే ‘నేను’. ఈ నేనును కర్తగా భావించి ఎన్నో సకర్మలు, అకర్మలు చేయబడుతున్నాయి. మనం నివసించే ఆ భూగోళం గంటకు వెయ్యి మైళ్ల వేగంతో పరిభ్రమిస్తూ, సూర్యుని చుట్టూ తిరుగుతోంది. కాని మనం ఈ భూమి మీద ఎంతో స్థిరంగా ఉన్నట్టు భ్రమిస్తున్నాము. ఇదే నేను అనే అహం, అజ్ఞానం.

ఫలితాన్ని ఆశించకుండా కర్మ చేయడం అల్ప మానవునికి సాధ్యం కాదు. మరి కర్మలను త్యాగం చేసి, సోమరిగా ఉండవచ్చా? ఉండకూడదని శ్రుతి గట్టిగా చెబుతోంది. తమ విధ్యుక్త ధర్మాలను, విధులను ఒక్క క్షణమైనా విడువకూడదని హెచ్చరిస్తోంది మన సనా తనం. ఇటువంటి క్లిష్టమైన సందేహాలకు చక్కటి పరిష్కారాలు తెలియజేశారు రమణులు. అవి:

సకర్మలు చేస్తూ చిత్తశుద్ధితో ఫలితాలను ఈశ్వరునికి అర్పించాలి.నిత్యం మనో వాక్కాయ కర్మలతో పరమాత్మను ధ్యానం చేయుట ఉత్తమ మార్గం.మౌనమే తపస్సుగా మనసుతో చేసే జప ధ్యానం ఉత్తమమైనది. అన్నిటా ఏకాగ్రత చాలా ముఖ్యమైనది. ధ్యానంలో ఎటువంటి ఇతర ఆలోచనలు పనికిరావు. నీవు చేసే నామ చింతన ఒక్కటే ధ్యాతవ్యం కావాలి.ఆడంబర పూజ కంటె మౌన జప ధ్యానమే శ్రేష్ఠమైనది.

అణువు నుంచి బ్రహ్మాండం వరకు నిండి ఉన్న ఆ పరమాత్మను ఆత్మతో మౌన ధ్యానం చేయటం ఉత్తమోత్తమం.అద్వైత భావనతో ‘అహం బ్రహ్మాస్మి’గా ధ్యానం చేయటం సరైనది.ధ్యానం శూన్యభావనతో చేయడం కంటె ఆ పరమాత్మయే ‘నేను’గా భావించుట సరైన ధ్యాన మార్గం.
నేను’ అనేది ఆత్మ చైతన్యం. అది దేహం కాదు.ఈ చైతన్యం పొందేందుకు ప్రాణాయామం ఒక మార్గం. ఇది గురు ముఖతః మాత్రమే సాధన చేయాలి.
ప్రాణాయామం కూడ కర్మే. కాని దీని మూలములైన చిత్తము,
ప్రాణము ఒకే మూల శక్తి నుంచి ఉద్భవించాయి.
లయము చెందిన మనసు తిరిగి కర్మను కోరదు.ప్రాణాయామం తాత్కాలిక ఉపశమనం. అద్వైత ఆత్మ చింతనలో మనసనేది నాశనమవుతుంది.మనసు నశించిన వాడే ఉత్కృష్టమైన యోగి. అటువంటి యోగికి ఫలితాన్ని ఆశించి చేసే కర్మ అసలు ఏదీ ఉండదు.మనస్సును దృశ్యాదృశ్యముల నుంచి మరలిసే ఆత్మచైతన్యానుభూతి కలుగుతుంది. నేను అని తలచే మూలమే మనస్సు. ఆ నేను ఆత్మలో లీనమవడమే ఆత్మ సాక్షాత్కారం.

నేను అనే అహంకారం నుంచే అనేక తలంపులు పుడుతున్నాయి. అవే మనో వికల్పములు. ఆ నేను అనే అహం ఎక్కడ జనిస్తుందో, ఎక్కడ పడిపోతుందో గమనించేదే ఆత్మ.అజ్ఞానానికి మూలం నేను అనే మూల తలంపు. ఆ తలంపు మనసుతో బాటు నాశనమయితే మిగిలేది పరిపూర్ణమైన ఆత్మ.

నిత్యమూ గాఢ నిద్ర నుంచి మేల్కొలిపేది నేను అనే అహం కాదు. నేనుకు అతీతమైన ఆత్మ చైతన్యమని తెలుసుకోవాలి.దేహం ఒక ఉపాధి మాత్రమే అని గ్రహించాలి. ఇది నశించిపోయేది. నేను అనేది అహం నుంచి వెలువడితే అదే ఆత్మ. స్వరూపం. అపుడు నేనుగా భాసించేది ఆత్మ చైతన్యం.

దేహాత్మ భావన వల్ల పరమాత్మ, జీవాత్మలు వేరు అనే భేదం ఉత్పన్నమవుతోంది. అజ్ఞానం పొర తొలగినపుడు అంతటా వ్యాపించి ఉన్నది పరమాత్మేనని అవగతమవుతుంది. భేద భావంతో కలిగిన ఆత్మ ఆజ్ఞానం తొలగినపుడు స్వాత్మానుభవం కలుగుతుంది. అదియే ‘తత్త్వమసి’.

ఆత్మ ద్వైతం కాదు. అద్వైతమనే తలంపు కలిగిన వెంటనే నేను ఆత్మయందు స్థితి కలిగి నిలిచిపోవును. అజ్ఞానం వల్ల ఏర్పడిన నేను అనే తలంపును ఆత్మ చైతన్యమని తెలుసుకున్న తరువాత వేరొక జ్ఞానం అవసరం లేదు. ఆత్మ వ్యయరహితం, జనన మరణాలు లేనిది, అనంతమైన సచ్చిదానందాన్ని కలిగి ఉన్నది.

బంధ మోక్షాలకు అతీతమైనది ఆత్మ. నేను ఆత్మగా వెలుగొందుతుంది.నేను అనేది లేకుండా తనకు తానుగా విచారిస్తే సర్వ సందేహాలు తొలగి ఆత్మతత్త్వము బోధపడుతుంది. అదే తపస్సు. శాశ్వతానంద తత్త్వము. ఫలాపేక్షరహిత కర్మయోగం. అదియే పూర్ణత్వమని రమణ మహర్షి మానవాళికి తెలిపారు. ఇదియే ఆయన అనుభవ సారము.

LEAVE A RESPONSE