– అటకెక్కిన మేనిఫెస్టో హామీలు
-దేవుళ్లనూ మోసం చేసే స్థాయికి దిగజారారు
– ఆంధ్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు డాక్టర్ సాకే శైలజనాథ్
విజయవాడ : పాద యాత్ర సమయంలో దశలవారీగా మధ్య నిషేధం చేస్తామని మహిళలకు ముఖ్యమంత్రి జగన్ రెడ్డి ఇచ్చిన హామీలు ఏమయ్యాయని ఆంధ్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు డాక్టర్ సాకే శైలజనాథ్ ప్రశ్నించారు. మాట తప్పి..మడమ తిప్పిన జగన్ రెడ్డికి పధకాలను అమలు చేసేందుకు మద్యం అమ్మకాలే దిక్కుగా మారాయని ఎద్దేవా చేశారు. మేనిఫెస్టో హామీలు అటకెక్కించి దేవుళ్లనూ మోసం చేసే స్థాయికి దిగజారారని ఎద్దేవా చేశారు.
ప్రతిపక్ష నేతగా నాడు కాపురాల్లో మద్యం చిచ్చుపెడుతుందన్న జగన్ రెడ్డికి నేడు మద్యం ఆదాయంతోనే సంక్షేమం సాగుతోందని గుర్తించారా? అని ప్రశ్నించారు. నాడు మానవ సంబంధాలు ధ్వంసమైపోతున్నాయన్న సీఎం నేడు మానవ సంబంధాలు మాట అటుంచితే నాటు సారా తాగి పేదల ప్రాణాలు పోతున్నా అవి సహజ మరణాలుగా ప్రచారం చేయడం దారుణమని అన్నారు. ఈ సందర్భంగా శనివారం శైలజనాథ్ విజయవాడ ఆంధ్ర రత్న భవన్ నుండి ఒక ప్రకటన విడుదల చేసారు.
నాడు మూడు దశల్లో మధ్య నిషేధం అమలు చేస్తామన్న జగన్ రెడ్డి పిచ్చి బ్రాండ్లు అమ్ముతూ సొంత ఆదాయం పెంచుకుంటున్నారని విమర్శించారు. జగన్ అధికారంలోకి వచ్చేనాటికి మద్యం సంవత్సర ఆదాయం సుమారు 6,220 కోట్లు ఉండగా, మొదటి ఏడాది 6,915 కోట్లు, రెండవ ఏడాది 11, 575 కోట్లు, మూడవ ఏడాది 14,500 కోట్ల ఆదాయం పొందటమేనా మీ మూడు దశల్లో నిషేధం ? అని ప్రశ్నించారు.
ప్రభుత్వం 34 నెలల్లో సంక్షేమానికి 1.3 లక్షల కోట్లు ఖర్చు చేస్తే అందులో మద్యం అమ్మకాల విలువ 66,176 కోట్లు అని, పధకాల ఖర్చులో సగం వాటా మద్యం అమ్మకాల ద్వారానే వచ్చిందని అన్నారు. 2022-23 లక్ష్యం 16,500 కోట్లుగా ప్రకటించడాన్ని చూస్తే మీ భవిష్యత్తు మధ్య నిషేధ వసూళ్ల ప్రణాళికతో మహిళల జీవితాల్లో ఇక చీకట్లేనని ఆరోపించారు. మేనిఫెస్టో నే మా భగవద్గీత, బైబిల్, ఖురాన్ అన్న జగన్ రెడ్డి కల్లి బొల్లి కబుర్లు చెప్పి మద్యాన్ని ఆదాయ వనరుగా మార్చుకున్నారని శైలజనాథ్ ధ్వజమెత్తారు.
2022-23 వార్షిక బడ్జెట్లో ప్రభుత్వం అమ్మఒడి పథకానికి రూ.6,500 కోట్లు, చేయూతకు రూ.4,235 కోట్లు, ఆసరాకు రూ.6,400 కోట్లు కేటాయించిందని, అంటే మొత్తం రూ.17,135 కోట్లు ఈ మూడు పథకాల అమలు కోసం మద్యం అమ్మకాల ద్వారానే రాబట్టేందుకు సిద్దమయ్యారని శైలజనాథ్ విమర్శించారు. ఈ పథకాల అమలు బాధ్యత కాకపోయినా, ఆ పథకాలకు నగదు ఇచ్చే బాధ్యత ఇప్పుడు బేవరేజెస్ కార్పొరేషన్ తీసుకుందని, ఈ పథకాల అమలు స్థాయిలో ఆదాయం రాబట్టాల్సిన అవసరం కార్పొరేషన్కు ఏర్పడిందన్నారు.
వచ్చే ఆర్థిక సంవత్సరంలో ఎక్సైజ్ ద్వారా రూ.16,500 కోట్లు, లిక్కర్పై వ్యాట్ రూపంలో మరో రూ.2,061 కోట్లు వస్తాయని ప్రభుత్వం అంచనా వేయడాన్ని చూస్తే ఇక మధ్య నిషేధం ఎక్కడ అమలవుతుందని శైలజనాథ్ ప్రశ్నించారు.