– సీపీఎస్ పై మాట ఇచ్చి మడమ తిప్పిన జగన్ రెడ్డి
– రాజ్యాంగం కల్పించిన హక్కులను కాల రాస్తారా?
– ఆంధ్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు డాక్టర్ సాకే శైలజనాథ్
విజయవాడ : అధికారంలోకి వచ్చిన వారం రోజుల్లో సీపీఎస్ రద్దు చేస్తానని హామీ ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి మడమ తిప్పారని ఆంధ్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు డాక్టర్ సాకే శైలజనాథ్ విమర్శించారు. వైసీపీ ప్రభుత్వం ఉద్యోగులు, ఉపాధ్యాయులపై ఉక్కుపాదం మోపడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ఇది ప్రజా ప్రభుత్వమా? పోలీస్ రాజ్యమా? అని ప్రశ్నించారు.
ఉపాధ్యాయులు, ఉద్యోగుల పోరాటానికి అండగా ఉంటామని ఆంధ్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు డాక్టర్ సాకే శైలజానాథ్ అన్నారు. ముఖ్యమంత్రి పీఠంపై కూర్చోవాలన్న దాహంతో జగన్ ఇబ్బడిముబ్బడిగా హామీలిచ్చారని మండిపడ్డారు. ప్రచారంలో చిటికెలేసి మరీ వారంలో సీపీఎస్ రద్దు చేస్తామన్నారని గుర్తుచేశారు.
ఇచ్చిన హామీని ముఖ్యమంత్రి మర్చిపోయినా నమ్మిన ఉద్యోగులు మర్చిపోలేదని అన్నారు. ప్రజలకు రాజ్యాంగం కల్పించిన హక్కుల్ని కాలరాస్తూ సీఎం జగన్ బుల్డోజర్ వ్యవస్థను రాష్ట్రంపై రుద్దేందుకు యత్నిస్తున్నారని ఆరోపించారు. జగన్ ఇచ్చిన హామీని ఉపాధ్యాయులు నెరవేర్చాలంటున్నారే తప్ప గొంతెమ్మ కోరికలు కోరడం లేదని పేర్కొన్నారు.
శాంతియుతంగా నిరసన తెలపడమే నేరమంటూ యూటీఎఫ్ నేతలను, సిపిఎస్ ఉద్యోగుల సంఘం నాయకులను, ఉపాధ్యాయులను అక్రమంగా నిర్బంధించారని అన్నారు. ‘‘మరి వారం రోజుల్లో సిపిఎస్ రద్దని మాట తప్పి మడమ తిప్పిన మిమ్మల్ని నిలదీయొద్దా జగన్ రెడ్డి గారు? ఉపాధ్యాయుల పట్ల వైసిపి ప్రభుత్వ నిర్బంధకాండ తగదన్నారు. కాకమ్మ కబుర్లతో మూడేళ్లు గడిపేశారు. ఇప్పటికైనా ఇచ్చిన హామీ ప్రకారం సిపిఎస్ రద్దు చేయాలని శైలజనాథ్ డిమాండ్ చేశారు.