-ఆక్వా రైతుల బతుకులను సజ్జల, అప్పలరాజు, బొత్స రివర్స్ చేశారు
-మొన్న కేజి ధర రూ.240 గా నిర్ణయించి నిన్న రూ.210 అని చెబుతున్నారు
-మంత్రుల కమిటీ ఏర్పాటయ్యాక ఆక్వా రైతులు పంట విరామం ప్రకటించే పరిస్థితి వచ్చింది
-టమాట రైతులు కేజీ 50 పైసలకు అమ్ముకుంటుంటే పట్టించుకోవట్లేదు
-మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి
రాష్ట్రంలో రొయ్యల రైతులు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆక్వా సేద్యం కుదేలైంది. జగన్ రెడ్డి ఆక్వా కల్చర్ పై కొత్త చట్టాలు తీసుకురాక ముందు పరిస్థితి బాగుంది. అక్టోబర్ 17 న సజ్జల, బొత్స సత్యనారాయణ, సీదిరి అప్పలరాజు లు కలిసి రొయ్యలకు రేట్లు నిర్ణయించారు. నాటి నుంచి రొయ్యల రైతుల పరిస్థితి రివర్స్ అయింది. ఏపీ స్టేట్ ఆక్వాకల్చర్ డెవలప్ మెంట్ యాక్ట్ (యాక్ట్ ఆఫ్ 29/2020), సీడ్ యాక్ట్ నం.36/2020 లను తీసుకొచ్చారు. రొయ్యల పండించే రైతులపై, సీడ్ తయారుచేసే హేచరీలపై, ఫీడ్ తయారుచేసే పరిశ్రమలపై, ప్రాసెసింగ్ యూనిట్లపై, ఎగుమతులు చేసే కంపెనీలపై చట్టం తీసుకొచ్చి తమ చేతుల్లో పెట్టుకోవాలని చూశారు.
దీని కారణంగా రొయ్యల రైతులు తీవ్రమైన నష్టాలు చవిచూస్తున్నారు. రొయ్యల రైతులు విజయవాడలో సమావేశమై మేం క్రాప్ హాలిడే ప్రకటిస్తామని రెండు నెలల క్రితం ప్రకటించారు. అయినా పట్టించుకోలేదు. అక్టోబర్ 17 న వంద కౌంట్ మార్కెట్ లో రూ.220 ఉంటే మంత్రుల కమిటీ రూ.240 మద్దతు ధర ప్రకటించింది. అప్పటి నుంచి వంద కౌంట్ మార్కెట్ లో రూ.190 కి పడిపోయింది.
మరలా ఈరోజు మద్దతు ధర కుదింపు చేసి రూ.210 కి కొని తీరాలని మంత్రిగారు సెలవిస్తున్నారు. చట్టం తీసుకొచ్చి, మంత్రులు, సలహాదారులు మీటింగ్ పెట్టిన తర్వాత రొయ్యల ధర రూ.190 కి పడిపోతే ఏం చేశారు? చట్టం దేనికి తీసుకొచ్చారు.? మీరు ఇందులో ప్రమేయం చేసుకోవాల్సి అవసరం ఏమొచ్చింది? మార్కెట్ లో కిలో సోయాబీన్ ధర రూ.50 నుంచి రూ.90 కి పెరిగిందని టన్ను ఫీడ్ ధర రూ.65,000 నుంచి రూ.85000 కు పెంచారు. నేడు అదే సోయాబీన్ ధర రూ.90 నుంచి రూ.50కి పడిపోయినా రొయ్యల ఫీడ్ కాస్ట్ మాత్రం ఎందుకు తగ్గడం లేదు? ఫీడ్ పరిశ్రమల నుంచి కేజీకి రూ.5 లెక్కన టన్నుకు రూ.5000 వసూళ్లు మొదలుపెట్టారు. అందుకే సోయాబీన్ ధర తగ్గినా ఫీడ్ రేటు తగ్గడం లేదు.
పరిస్థితి ఇలా ఉంటే మీరు చేసే చట్టాలు ఎందుకు? మొత్తం వ్యవసాయం చేసే రైతుల నుంచి హేచరీలు, ప్రాసెసింగ్ యూనిట్లపై చట్టం తెచ్చి ఉపయోగం ఏంటి? మార్కెట్ లో రొయ్యలు కొనే వాళ్లు లేని పరిస్థితి నెలకొంది. ఇటీవల గోదావరి జిల్లాలో ఒక రైతు నా రొయ్యలు కొనేవాళ్లు లేరంటూ గ్రామంలో పంచిపెట్టిన దృశ్యాలు చూస్తుంటే రొయ్యల రైతుకు ఎంత కష్టం వచ్చిందో అర్ధమౌతుంది. నిల్వ చేయడానికి ఇది ధాన్యం కాదు. రెండు, మూడు రోజులు ఆలస్యమైతే మోర్టాలిటీ రేటు పెరుగుతుంది. కమిటీ అసలు దేనికి?
చంద్రబాబు హయాంలో విద్యుత్ సరఫరా షరతులు లేకుండా యూనిట్ రూ.2 చేయడం జరిగింది. జగన్ రెడ్డి వచ్చిన తర్వాత రూ.4.50 వరకు వసూలు చేస్తున్నారు. రొయ్యల రైతులకు ట్రాన్స్ ఫార్మార్లు పెట్టాలంటే రూ.2 లక్షలు వసూలు చేస్తున్నారు. టీడీపీ హయాంలో ఉచితంగా ఇవ్వడం జరిగింది. ఏరియేటర్లు సబ్సీడీపై రూ.12వేలకు మేం ఇచ్చాం, మోటార్లు సబ్సీడీపై ఇచ్చాం. రొయ్యల రైతుకు రోజూ నరకం చూపిస్తున్నారు. జగన్ రెడ్డి నియమించిన కమిటీ రైతులకు నష్టం చేకూరుస్తోంది. ఒక్క రైతు వద్దనైనా రూ.210కి కొనుగోలు చేయించగలరా? ప్రతి ఒక్కరి దగ్గరి నుంచి లంచాలు వసూలు చేయడానికే ఇదంతా చేస్తున్నారు.
క్రాప్ హాలిడేకు వెళ్తామని విజయవాడలో రైతులు ప్రకటిస్తే.. ఇప్పటి వరకు ఎందుకు చర్యలు తీసుకోలేదు? ధాన్యం రైతులు కుదేలవుతున్నారు. టమోట కేజీ 50 పైసలకు అమ్ముకునే పరిస్థితి ఉంది. రూ.3 వేల కోట్లతో ఏర్పాటుచేస్తామన్న ధరల స్థిరీకరణ నిధి ఏమైంది? రొయ్యల రైతులను ఆదుకోవాల్సిన అవసరం ఉంది. రొయ్య వంద కౌంట్ రూ.240 నుంచి ఇప్పుడు రూ.210 చేశారు. మీ నోటి నుంచే రూ.30 తగ్గించారు.
జగన్ రెడ్డి చర్యలు దురదృష్టకరం. వ్యవసాయరంగం తీవ్ర సంక్షోభంలో ఉంది. రైతులు అప్పులపాలవుతున్నారు. ఫీడ్ కాస్ట్ ఎందుకు తగ్గించరు, మద్దతు ధర ఎందుకు ఇవ్వరు, అవసరమైతే ప్రభుత్వమే కొనుగోలు చేయాలి. కేవలం ప్రకటనలకే పరిమితం కాకూడదు. ఆర్బీకేల్లో ధాన్యం కొనేది లేదు, వారంలో డబ్బులు వేసేది లేదు.