– రాష్ట్రంలో కరువు విలయతాండవం చేస్తుంటే.. జగన్ కరువు నివారణకు ఎలాంటి చర్యలు తీసుకోవడంలేదు
– పక్క రాష్ట్రాలతో దోస్తీ.. కేంద్రానికి దాసోహం ఇదే జగన్ నైజం
-తెలుగు రైతు రాష్ట్ర అధ్యక్షులు మర్రెడ్డి శ్రీనివాసరెడ్డి
రాష్ట్రంలో కరువు విలయతాండవం చేస్తుంటే.. జగన్ కరువు నివారణకు ఎలాంటి చర్యలు తీసుకోవడంలేదని తెలుగు రైతు రాష్ట్ర అధ్యక్షులు మర్రెడ్డి శ్రీనివాసరెడ్డి మండిపడ్డారు. గురువారం మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడిన మాటలు ..
రైతుల విషయంలో జగన్ బాధ్యతా రాహిత్యంగా వ్యవహరిస్తున్నారు. ప్రతిపక్షాలపై అక్రమ కేసులలు బనాయించడంలో చూపిస్తున్న శ్రద్ధ రైతుల పట్ల చూపడంలేదు. వ్యవసాయాన్ని అటకెక్కించారు. రైతు వ్యతిరేక విధానాల పట్ల నిరసన తెలుపుతున్న వారిని అక్రమంగా నిర్బందిస్తున్నారు. రాష్ట్ర అవసరాలను మరిచారు. రైతుల ఖాతాల్లో ఇవ్వని డబ్బులు ఇచ్చినట్లు బటన్లు కొక్కడాలే తప్ప ఇవ్వడం అంటూ లేదు. ఎప్పుడు చూసినా ప్రపంచ బ్యాంకు వద్ద అప్పు కోసం ఆలోచనలే తప్ప రైతు బాగు గురించి ఆలోచించరు.
ఎప్పుడు చూసినా ప్రజా ధనాన్ని దోచుకోవడానికి మార్గాన్వేషణలు చేస్తుంటారు. ఇలా ఈ నాలుగున్నర సంవత్సరాలు కాలక్షేపం చేశారు. రాష్ట్రాన్ని ముంచే పనిలో జగన్ ఉన్నారు. ఈ యేడాది రాష్ట్రంలో సాధారణ వర్షపాతం కన్నా తక్కువ వర్షపాతం నమోదైంది. నష్టపోయిన రైతుల వద్దకు ప్రభుత్వాధికారులు వెళ్లి భరోసా కల్పించిన దాఖలాలు ఏమాత్రం లేవు. రాష్ట్రంలో వరి ధాన్యం పొట్ట దశలో ఉంది. ఇలాంటి సమయంలో వరికి నీరు అవసరం.
నీటి కొరతతో వరి ఎండిపోతోంది. తాము పిలిస్తే వరుణదేవుడు పలుకుతాడన్న సజ్జల.. ప్రస్తుతం వరుణ దేవుడిని పిలిచి వర్షం కురిపిస్తే రైతులు ఆనందిస్తారు కదా!. గతంలో చంద్రబాబు కరువులో పశువులను కాపాడటానికి క్యాటిల్ క్యాంపులు నిర్వహించారు. నేడు జగన్ కు అవేమీ పట్టవు. పంట నష్టపరిహారం ఇచ్చి మరో పంట వేసుకోవడానికి ప్రభుత్వం ఏమాత్రం సహకరించడంలేదు.
పంటలు పండని ప్రాంతాలలో మిరప, పసుపు, అరటి తదితర పంటలు వేసినట్లు దొంగ రికార్డులు సృష్టించి నిధులు కాజేయడమే వారి పని. పంటలు పెట్టుకుని కష్టపడ్డ, నష్టపడ్డ రైతులకు డబ్బులిచ్చిన దాఖలాలు ఎక్కడా లేవు. రాష్ట్రంలో ముఖ్యంగా రాయలసీమలో సాగు, తాగు నీటికి ఇబ్బందులు పడే పరిస్థితులొస్తున్నాయి.
జగన్ చేతకానితనంతో నదీజలాలన్నీ సముద్రం పాలయ్యాయి
జగన్ చేతకానితనంతో దిగువ ప్రాంతంలో ఉన్న రాష్ట్రంలోని నదుల నీరంతా సముద్రం పాలౌతోంది. చంద్రబాబు హయాంలో నదులు, కుంటలు, వాగులు, వంకలు జలాశయాలు కళకళలాడేవి. నేడు అవి అన్యాక్రాంతమయ్యాయి. రాయలసీమ వాసులకు ముఖ్యమైన ఆధార పంట అయిన వేరుశెనగ సాగు కావడంలేదు. రాష్ట్రంలో పప్పుధాన్యాల పంట ఆశించిన దిశగా లేదు. రాష్ట్రంలో వేరుశెనగ పంట 40 శాతం మాత్రమే పెట్టారు.
18 లక్షల ఎకరాల్లో వేరుశెనగ పంట పెట్టాల్సి ఉండగా ఈ యేడాది ఆరేడు లక్షల ఎకరాల్లో మాత్రమే పంట పెట్టడం జరిగింది. పంట దిగుబడి తగ్గిపోయింది. నేడు ఎకరా పొలంలో పత్తి పంట పెట్టడానికి దాదాపు 40 వేలు పెట్టి పంట ఎండిపోవడంతో రైతులు నష్టపోయారు. లక్ష రూపాయలు పెట్టి మిరప పంట వేస్తే ఆ పంట కూడా ఎండిపోతోంది. ఆరుతడి పంటలకు కూడా ప్రభుత్వం నీరివ్వడంలేదు. చంద్రబాబు రైతులకు కష్టం వచ్చినప్పుడు ఆదుకునేవారు. ప్రకృతి సహకరించనప్పుడు ప్రభుత్వం ఆదుకోవాలి.
బటన్ నొక్కినా డబ్బులు పడవు
ప్రస్తుతం డబ్బులు రావు, ఆర్బీకేల్లో లిస్టు వేలాడుతుంటుంది కానీ డబ్బులు రావు. డబ్బులు వేసినట్లు జగన్ బటన్ నొక్కుతాడు కానీ డబ్బులు రావు. వైసీపీలో ఎవరు మేనేజ్ చేసుకోగలుగుతారో వారికే డబ్బులొస్తాయి. వర్షాధార పంటలు నష్టపోయిన వివరాలు సేకరిచి నష్టపరిహారమివ్వాల్సిన అవసరం చాలా ఉంది.
రైతులు పంట నష్టపోయి దిగాలుగా ఉన్నారు
వాణిజ్య పంటలు వేసిన రైతులు నష్టపోయి దిగాలుగా ఉన్నారు. జగన్ తన అసమర్థతను కప్పి పుచ్చుకోవడానికి నానా తంటాలు పడుతుంటాడు తప్ప నష్టపోయినవారి గురించి పట్టించుకోడు. పక్క రాష్ట్రాల్లో వారికి ఉపయోగపడుతుంటాడు. తన సంపాదనను కాపాడుకోవడానికే తిప్పలు పడుతుంటాడు. అవినీతిని దాచిపెట్టుకోవడానికి అష్ట కష్టాలు పడుతుంటాడు. కేసుల నుండి విముక్తి పొందడానికి కేంద్రం కింద మోకరిల్లుతాడు. పక్క రాష్ట్రాలతో దోస్తీ, దాసోహం. వెరసి కృష్ణా ట్రిబ్యునల్ ను తిరిగి పొడిగించి రాష్ట్రానికి నష్టం వాటిల్లేలా చేశాడు.
రాష్ట్రానికి ఉన్న కృష్ణా జలాల వాటాని కోల్పోయే పరిస్థితిని రాష్ట్రానికి తీసుకొచ్చారు. నీటి సౌలభ్యత లేనందున దాదాపు 35 లక్షల ఎకరాల్లో రైతులు పంటలు వేయలేకపోయారు. జగన్ రాష్ట్రంలో ఫ్యాక్షన్ సంస్కృతిని పెంచి పోషిస్తున్నాడు. ప్రజానీకం జగన్ నైజాన్ని అంగీకరించే పరిస్థితుల్లో లేరు. తిప్పి కొడతారు. ఇప్పటికైనా జగన్ తన ఉన్మాద చర్యలు మానుకోవాలి.
ప్రజాస్వామ్యాన్ని కాపాడాలనే ఉద్దేశంతోనే చంద్రబాబునాయుడు జైల్లో ఉన్నారు. ఇప్పటికైనా జగన్ తన దుర్మార్గపు ఆలోచనలను పక్కన పెట్టాలి. ఈ నెల 25 లోపు రైతుల డిమాండ్లు పరిష్కరించకపోతే ఆ తర్వాత ఉద్యమం ఉధృతం చేస్తామని తెలుగు రైతు విభాగం నుండి హెచ్చరిస్తున్నామని తెలుగు రైతు రాష్ట్ర అధ్యక్షులు మర్రెడ్డి శ్రీనివాసరెడ్డి ప్రభుత్వాన్ని హెచ్చరించారు.