-మీతో సహా, మీ ఎమ్మెల్యేలంతా రాజీనామా చేయాలి
-మళ్లీ ఎన్నికల్లోకి వెళ్లాలి. తాజాగా ప్రజాతీర్పు కోరాలి
-అలాగే ఆత్మకూరు ఉప ఎన్నికలోనూ పోటీ చేయాలి
-ఏడుపు టీడీపీ అధికార గీతం మాదిరిగా మారింది
-ప్రభుత్వం ప్రతి పైనా ఏడుపే! ఎందుకా ఏడుపు?
-దేనిపై ప్రశ్నించాలో తెలియక అడ్డగోలు విమర్శలు
-ఇష్టం వచ్చినట్లు తిట్ల పురాణం. ఇదేనా మీ రాజకీయం?
-ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి మాటా నిలబెట్టుకున్నాం
-అందుకే ధైర్యంగా ప్రజల్లోకి వెళ్తున్నాం. కలుస్తున్నాం
-దానిపైనా విమర్శలు. అసత్య ప్రచారాలు. ఏడుపులు
-సామాజిక న్యాయభేరి బస్సు యాత్రకు విశేష స్పందన
-మీ మహానాడుకూ ప్రజలు తరలి వచ్చారు
-ఏ పార్టీకైనా అభిమానులు ఉంటారు. వస్తారు
-అంత మాత్రాన అది ఎన్నికల విజయమా?
-మీకు మీరే గొప్పగా చెప్పుకుంటున్నారు
-ఇంతకన్నా దిగజారుడు ఇంకా ఏమైనా ఉంటుందా?
-ప్రెస్మీట్లో పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ సలహాదారు (ప్రజా వ్యవహారాలు) సజ్జల రామకృష్ణారెడ్డి ప్రశ్న
తాడేపల్లి: ప్రెస్మీట్లో సజ్జల రామకృష్ణారెడ్డి ఇంకా ఏం మాట్లాడారంటే..:
అది ప్రజా తీర్పా?:
మహానాడుకు పెద్ద సంఖ్యలో అభిమానులు రావడంతో, దాన్ని ఎన్నికల్లో ఘన విజయం మాదిరిగా, ప్రజల తీర్పు మాదిరిగా, వాళ్లకు వాళ్లే భుజాలు తడుముకోవడం.. ఒకవైపు ఏడుపుగొట్టుతనం. మరోవైపు ఘనకార్యం సాధించినట్లు.. ఈ విజయం కార్యకర్తలకే అంకితం అని చంద్రబాబు అన్నట్లు వారి అధికార పత్రిక ఈనాడు కూడా రాసింది. ఇవన్నీ చూస్తుంటే వారు ఇప్పుడు ఏ స్థాయిలో అంటే, డెత్ బెడ్ మీద ఉన్నామని వారు అనుకుంటున్నట్లు స్పష్టం అవుతోంది.
ఏడుపు టీడీపీ అధికారగీతం:
ఏడుపు అనేది తెలుగుదేశం పార్టీ అధికార గీతం మాదిరిగా అనిపిస్తోంది. ఏరోజు అయితే ఆయన అసెంబ్లీలో మొదలు పెట్టాడో.. అప్పటి నుంచి అది కొనసాగుతోంది.
ఆ ఏడుపు జగన్‌గారు సీఎం హోదాలో దావోస్ వెళ్లినా వస్తుంది. ఈ మూడేళ్లలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు అధికారంలో వాటా ఇస్తూ పూర్తి సామాజిక న్యాయం చేయడం.. దానికి కృతజ్ఞత చెబుతూ 17 మంది మంత్రులు బస్సు యాత్ర చేశారు. దానికి రాష్ట్రమంతా జేజేలు పలికితే దానికీ ఏడుపే.
ఇంకా పరిపాలనలో మూడేళ్లు పూర్తి చేసుకున్నాం. కోవిడ్ వల్ల రెండేళ్లు ఆర్థికంగా నష్టపోయినా, ఎక్కడా ఏ పథకాని ఆపకుండా అన్నీ అమలు చేయడంతో పాటు, విద్య, వైద్య రంగాల్లో అసాధారణ మార్పులు చేస్తున్న నేపథ్యంలో.. ఒకసారి ప్రజల్లోకి వెళ్లాలని నిర్ణయించి.. గడప గడపకూ మన ప్రభుత్వం కార్యక్రమం మొదలు పెడితే దానిపైనా ఏడుపు.
ఒకవైపు ఆ కార్యక్రమానికి స్పందనే లేదని ఒక ఏడుపు. మరోవైపు నిలదీస్తున్నారని మరో ఏడుపు.
ప్రతి ఇంటికీ వెళ్తూ, వారికి ఏమిచ్చామని చెబుతూ, సమస్యలు ఇంకా ఏమైనా ఉంటే తెలుసుకుంటుంటే, ప్రతి కుటుంబంలో ఎంతో స్పందన వస్తుంటే దానిపైనా ఏడుపు. ప్రజలు నిలదీస్తున్నారని భయపడి, పోలీసుల సహకారంతో వెళ్తున్నారన్న విమర్శలు. అది కూడా ఎవరో చిన్న నాయకులు కాదు. 40 ఏళ్ల రాజకీయ జీవితం అని చెప్పే చంద్రబాబు, మరోవైపు ఆయన కుమారుడు ఒకటే ఏడుపు. అడ్డగోలు విమర్శలు.
మీ మహానాడుకు ప్రజలు రారని ఎవరు అన్నారు. పార్టీ అభిమానులు ఉంటారు. వారంతా వస్తే, అది ప్రజా విజయం ఎలా అవుతుంది? మహానాడు గురించి ఎలా చంకలు గుద్దుకుంటున్నారు.
ఆ సమావేశాల్లో ఒకటే ఏడుపు. వారికి చెప్పుకోవడానికి ఏదీ లేదు. మరోవైపు మమ్మల్ని అనడానికి ఏమీ లేదు. అందుకే ఏం కనపడుతుంది?
ఆనాడు మీ బిల్డప్ చూస్తే..:
జగన్‌గారు హుందాగా దావోస్ వెళ్తుంటే, దానిపైనా ఏడుపే.
ఆయన దావోస్ వెళ్తూ.. అక్కడ తాను అన్నీ సాధిస్తానని చెబితే, మీరు ప్రశ్నించవచ్చు. నిజానికి అప్పుడు మీరు దావోస్ ఎప్పుడు వెళ్లినా, వారం ముందు నుంచే ప్రచార హోరు. ప్రపంచమంతా చంద్రబాబు కోసం ఎదురు చూస్తున్నట్లు బిల్డప్. నిన్న, ఈనాడులో రాశారు. దావోస్‌లో ఈ ప్రభుత్వం ఏమీ సాధించలేదని రాస్తున్నారు. మరి ఆనాడు ఇంతకన్నా ఏం జరిగింది?.
మీరు ఆనాడు ఎంత ౖహైప్ చేశారు. ‘దావోస్‌నే రాష్ట్రానికి తీసుకువస్తానని’.. ‘ఒలంపిక్స్‌ను కూడా అమరావతిలో జరుపుతామని’.. కూడా చంద్రబాబు అన్నారు. ఆ స్థాయిలో ప్రచారం చేసుకున్నారు.
హైదరాబాద్‌లో ఐఎస్బీ ఏర్పాటు కోసం తాను చాలా కష్టపడ్డానని, వారికి స్వయంగా టిఫిన్ వడ్డించానని మహానాడులో చంద్రబాబు చౌకబారు మాటలు మాట్లాడారు.
అదే జగన్‌గారు దావోస్ వెళ్లే ముందు కానీ, అక్కడ కానీ ఏ మాత్రం అనుచితంగా మాట్లాడలేదు. రెండు సదస్సుల్లో గ్రీన్ ఎనర్జీ, రాష్ట్రంలో వైద్య రంగంపై మాట్లాడారు.
మీవి నిజమైన ఒప్పందాలా?:
ప్రభుత్వం అక్కడ చేసుకున్న ఒప్పందాలపైనా ఏడుపే. అరవింద, అదానీ గ్రూప్‌లతో ఒప్పందాల కోసం దావోస్ వెళ్లాలా అని రాశారు.
మరి ఆనాడు చంద్రబాబు ఇక్కడ సదస్సులు నిర్వహించి, ఏకంగా రూ.16 లక్షల కోట్ల పెట్టుబడులకు ఒప్పందాలు చేసుకున్నారని ప్రగల్బాలు పలికారు. పొద్దుపోని మాటలు చెప్పారు.
నిజం చెప్పాలంటే ఎవరెవరికో కోట్లు తొడిగించి ఒప్పందాలు చేసుకున్నారు. కేంద్ర ప్రాయోజిత కార్యక్రమాలు, పథకాలను.. చివరకు జాతీయ రహదారులు, ఎన్‌ఆర్‌ఈజీపీ.. అన్నింటినీ ప్రాజెక్టులుగా చూపి ఏకంగా ఇక్కడ రూ.16 లక్షల కోట్ల పెట్టుబడులు వస్తున్నాయని ప్రచారం చేసుకున్నారు. అలా మీరు చేశారు కాబట్టే, ప్రశ్నించాల్సి వస్తుంది.
అందుకే గడప గడపకూ..:
అయితే మీకు ప్రశ్నించే హక్కు లేదు. ఎందుకంటే ఏనాడూ సీఎం శ్రీ వైయస్ జగన్ మీలా స్థాయి దిగి మాట్లాడలేదు. చిత్తశుద్ధితో పని చేసి, రాష్ట్రాన్ని అభివృద్ధి చేసి, అన్ని వర్గాలను బాగు చేయాలనుకుంటున్నారు. అదే విధంగా సామాజిక న్యాయం చేస్తున్నారు. అవన్నీ ప్రజలకు మరోసారి చెప్పడం కోసమే గడప గడపకూ ప్రభుత్వం కార్యక్రమం మొదలుపెట్టారు.
అందుకే స్వయంగా తన సంతకంతో ఇంటింటికీ లేఖ పంపిస్తున్నారు. మీకు ఈ పథకాలు అందాయి. అందాయా? లేదా? ఇంకా మీకు ఏమైనా రావాల్సి ఉందా? అని అడుగుతున్నారు.
కానీ చంద్రబాబు ఒక్కటంటే ఒక్కటీ చేయలేదు. నిజానికి ఆ అవకాశం వచ్చినా ఏమీ చేయలేదు. చివరకు వ్యవసాయ రుణాలు మాఫీ చేస్తానని చెప్పి కూడా ఆ మాట నిలబెట్టుకోలేదు. దాదాపు రూ.90 వేల కోట్ల రుణాలకు చివరకు రూ.15 వేల కోట్లు కూడా ఇవ్వలేదు. పైగా సిగ్గు లేకుండా జగన్ ఎందుకు ఇవ్వడం లేదని చంద్రబాబు ప్రశ్నిస్తున్నారు. జగన్‌గారు తాను అలా మాఫీ చేయలేనని చెప్పారు. తాను ఇచ్చిన ఇతర మాటలన్నింటినీ నిలబెట్టుకున్నారు. ఇంకా చెప్పాలంటే చెప్పనివి కూడా ఎన్నెన్నో అమలు చేసి చూపారు.
అప్పుడు మీరేం సాధించారు?:
మీరు గతంలో దావోస్ వెళ్లినప్పుడు ఏవేవో కంపెనీలు వస్తున్నాయని చెప్పారు. చంద్రబాబు స్వయంగా చెప్పారు తాను 14సార్లు దావోస్ వెళ్లానని. మరి అలా వెళ్లి ఆయన ఏం సాధించారు? నిజానికి దావోస్‌కు ఎవరు వెళ్లినా.. అక్కడికి పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తలు వస్తారు. వారితో మనం ఇక్కడ ఏమేం చేస్తున్నామని చెబుతారు. అవన్నీ వారికి వివరిస్తారు. దాంతో కొన్ని కంపెనీలు ఒప్పందాలు చేసుకుంటాయి. ఆ కోవలో చేసుకున్న ఒప్పందాలే అరవిందో కంపెనీ, అదానీ కంపెనీలు. వాటిని తాను మాత్రమే సాధించినట్లు జగన్ ఎక్కడా చెప్పలేదు. ఆయన చాలా హుందాగా వ్యవహరిస్తూ, పని చేసుకుంటూ పోతున్నారు. కానీ చంద్రబాబు మాత్రం నిస్సిగ్గుగా విమర్శలు చేస్తున్నారు.
జగన్ సామాజికన్యాయం:
ఇక సామాజికన్యాయం. నీ క్యాబినెట్లో చివరి ఆరు నెలల వరకు ఎస్టీ, మైనారిటీలకు స్థానం కల్పించలేదు. నిజానికి 19 పదవులు మాత్రమే ఇచ్చి, మిగతావి చాలా కాలం ఖాళీగా ఉంచారు. ఆ తర్వాత కూడా నీ కొడుకు కోసం బీజేపీ వారికి కూడా పదవులు ఇచ్చావు. కానీ సీఎం వైయస్ జగన్ , వాస్తవ సామాజిక న్యాయం చేసి చూపారు. గతంలో కంటే ఇంకా ఎక్కువ మంత్రి పదవులు ఇచ్చారు. కౌన్సిల్లో పదవులు కూడా ఇచ్చారు.
చంద్రబాబు తన హయాంలో 5 ఏళ్లలో బీసీ సబ్ ప్లాన్ కింద రూ.50 వేల కోట్లు పెట్టి, చివరకు రూ.20 వేల కోట్లకు మించి ఖర్చు చేయలేదు.
అదే సీఎం వైయస్ జగన్ , ఈ 35 నెలల్లోనే ఎస్సీలకు రూ.23 వేల కోట్లు, ఎస్టీలకు రూ.7 వేల కోట్లు, బీసీలకు రూ.66 వేల కోట్లు, మైనారిటీలకు రూ.6 వేల కోట్లు ఇచ్చారు. అవి కూడా ప్రత్యక్ష నగదు బదిలీ (డీబీటీ విధానం) ద్వారా ఇచ్చారు. నేరుగా ఆ మొత్తాలను లబ్ధిదారుల ఖాతాల్లో వేశారు.
మీకు చెప్పుకోవడానికి లేకనే..:
దీన్ని మేము చెప్పుకోకుండా ఉండలేం కదా? అలా మీరు ఏమైనా చేసి ఉంటే చెప్పండి. ఆదరణ కింద కత్తెరలు. అవి కూడా తుప్పు పట్టిపోయాయి. ఏమైనా అంటే చంద్రన్న కానుక అంటారు. అందులో సగం హెరిజేజ్కే పోయింది. ఒక్కటంటే ఒక్కటి కూడా చంద్రబాబు చిత్తశుద్ధితో అమలు చేయలేదు. అలా లేదు కాబట్టే, చెప్పుకోవడం లేదు.
కాకపోతే ఒక పని చేస్తున్నాడు. ఎవరెవరితోనో స్టేజ్ మీదకు ఎక్కించి తిట్టిస్తున్నాడు. బీసీలకు జగన్‌గారు సామాజిక న్యాయం చేస్తున్నారని చెబుతుంటే, బీసీ లేదా ఎస్సీలతో తిట్టించడం. అయ్యన్నపాత్రుడు వంటి వారితో ఆ నాకొడుకులు అని తిట్టించడం. ఇంకో మహిళతో ఏకంగా తొడ కొట్టించారు.
నిజంగా మేము అవన్నీ ఇచ్చాం. ఒకవేళ మీరు ఇచ్చి ఉంటే, ధైర్యంగా దాన్ని చెప్పండి. కానీ అలా చేయకపోగా, తిట్ల పురాణం. దాని వల్ల ఆయనకు కడుపు మంట, ఏడుపు కాస్త తగ్గుతుందేమో. కానీ ప్రజలకు మాత్రం మామూలు చులకన కాదు. నీ మహానాడు నీవు పెట్టుకుని, నీ సభలు నీవు జరుపుకున్నావు. వాటికి అభిమానులు రారని ఎవరన్నారు? ప్రజాస్వామ్యంలో ప్రతి పార్టీకి అభిమానులు ఉంటారు. వారు వస్తారు. దాంట్లో ఏం ప్రత్యేకత ఉంటుంది.
ఇదే మా సవాల్:
ఇప్పుడు కొత్తగా వార్ వన్‌సైడ్. ఎన్నికలు ఎప్పుడొచ్చినా ఎదుర్కొంటాం. విజయం తెలుగుదేశం పార్టీదే అని చంద్రబాబు ప్రకటించారు. ఆ విశ్వాసం మంచిదే. ఒంటరిగా ఎన్నికలకు రండి అంటే, ఆ ధైర్యం లేదు.
అవన్నీ ఎందుకు ఆత్మకూరు ఉప ఎన్నిక వచ్చింది. ధైర్యం ఉంటే పోటీ చేయండి. లేదా మీ కుప్పంతో సహా, మీకు మిగిలి ఉన్న ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి, మళ్లీ ఎన్నికల్లోకి రండి. గతంలో జగన్ ఆ పని చేశారు. తనతో వచ్చే వారు రాజీనామా చేసి రావాలన్నారు. అది విలువలతో కూడిన రాజకీయం అంటే.
మీకు అంత ధీమాగా ఉంటే, టెలి కాన్ఫరెన్స్ నిర్వహించి, ఏదేదో మాట్లాడి, మీ రెండు పత్రికల్లో వేయించి, మళ్లీ దానిపై టీవీల్లో చర్చలు పెట్టడం. మీకు మీరు స్వయంతృప్తి చెందడం ఎందుకు? ధైర్యం, నమ్మకం ఉంటే, కుప్పంతో సహా మీ పార్టీ ఎమ్మెల్యేలంతా రాజీనామా చేసి, తిరిగి ఎన్నికల్లో గెలవండి.
మీరు తిడుతున్నారు కాబట్టే..:
కానీ అవేమీ చేయకుండా, మేమే అధికారంలోకి వస్తాం అని పదే పదే చెబుతున్నారు. మీకు ఆ కోరిక బలంగా ఉంది. మరి దానికి తగిన ప్రయత్నాలు చేయాలి. అందుకే ఇప్పటికైనా వాస్తవాలు గుర్తించాలి. ప్రజల్లో ఉండాలి. ఆ పని చేయకుండా చివరి వరకు ఆశతో ఉండి, గుర్రం ఎగరావచ్చు. ఎగిరితే బాగుంటుంది అనుకుంటున్నారు. ఆ పని చేయకుండా మా మీద పడి ఏడవడం ఎందుకు? నోటికి వచ్చినట్లు తిట్టడం ఎందుకు?
మీరు అలా మాట్లాడుతున్నారు కాబట్టే, మావైపు నుంచి కూడా కొందరు కాస్త పరుషంగా మాట్లాడారు. టీడీపీ వైపు నుంచి తిట్లు లేకుండా, మావైపు నుంచి ఎవరూ అలా మాట్లాడలేదు. ఎందుకంటే మాకు ఆ సంస్కారం ఉంది. మా నాయకుడు కూడా అలా లేడు కాబట్టి.
దమ్ముంటే తప్పులు చూపండి:
మీరు నిజంగా మాలో తప్పులు చూపగలిగితే.. ఇప్పుడు కూడా సవాల్ చేస్తున్నాను. జగన్‌గారు మేనిఫెస్టోలో చెప్పిన దానికి భిన్నంగా ఏమైనా చేసి ఉంటే, చెప్పింది చేయకపోతే.. అలాగే చేయకుండా చేశామని చెప్పుకుంటే మమ్మల్ని ప్రశ్నించండి. మా తప్పు చూపండి.
కానీ అలా ప్రశ్నించే ధైర్యం మీకు లేదు కాబట్టి, తిడుతూ అర్దం లేని విమర్శలు చేస్తున్నారు. సూర్యుడిమీద ఉమ్మితే మీ ముఖం మీదే పడుతుంది. ఆ వాస్తవాని గుర్తించకుండా తెలుగుదేశం పార్టీ నాయకులు చేస్తున్న రాజకీయాలు చూస్తుంటే, వారితోనా మేము పోటీ పడుతోంది అనిపిస్తుంది.
అందుకే మీ బూతుల పురాణం:
మా వరకు మేము ఈ మూడేళ్లలో పరిమిత వనరులు ఉన్నా, వాటికి కూడా మీరు అడ్డంకులు కొట్టాలని చూస్తున్నా, కుట్రలు, కుతంత్రాలు చేస్తున్నా.. ఎక్కడా ధైర్యం కోల్పోకుండా నిబ్బంగా వ్యవహరిస్తున్న జగన్ , ఎక్కడా మాట తప్పకుండా అన్ని వర్గాల వారికి మేలు చేస్తున్నారు. అన్ని పథకాలు అమలు చేస్తున్నారు. అందుకే మా సామాజిక న్యాయభేరి బస్సు యాత్రకు ప్రజల్లో విశేష çస్పందన వచ్చింది. కానీ మీకు చెప్పుకోవడానికి ఏమీ లేదు కాబట్టే, బూతుల పురాణంతో రాజకీయాలు చేస్తున్నారు..
మీడియా ప్రశ్నలకు సమాధానంగా..
మద్యం అమ్మకాల్లో మేము అవినీతి చేశామంటున్నారు. ఆధారాలు ఉంటే చూపండి. నిజానికి బెల్టు షాపులు మొదలు పెట్టిందే మీరు. మేము అధికారంలోకి రాగానే బెల్టుషాపులు, పర్మిట్‌రూమ్‌లు పూర్తిగా తొలగించాం. మరోవైపు షాపులు తగ్గించాం. ఆ విధంగా మద్యం విక్రయాలు తగ్గించాం. ఈ విషయాన్ని ఎవరైనా ఒప్పుకుంటారు. మద్యం వినియోగాన్ని తగ్గించాం.
ఆరోజు మీరు ఇసుక ఉచితం అన్నారు. కానీ రవాణాకు ఎంత వసూలు చేశారు. ఆ లెక్కలు చెప్పండి.. అని సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు.